|

హూంగార్డులకు ఐదంకెల జీతం

homeచెయ్యవలసిన కష్టం దినమంత, చేతికందే రొక్కం చాలనంత. ఇది మన హోంగార్డుల విషయంలో సరిపోయే సరయిన మాట. అయితే ఇది నిన్నటిమాట, ఇప్పటిమాట. కాని రాబోయే ఏప్రిల్‌నుండి మారబోతున్నాయి హోం గార్డుల జీవితాలు. డిసెంబర్‌ 6న హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డీజీపీ అనురాగ్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డితో హోంగార్డుల సమస్యలపై సీఎం సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న 16వేలమంది హోంగార్డుల జీతాలను 9వేలనుంచి 12వేల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

జీతాలను పెంచడంతోపాటు వారందరికీ మెడికల్‌ ఇన్సూరెన్స్‌, బస్‌పాస్‌, అదనంగా యూనిఫాం కూడా ఇవ్వాలని ఆదేశించారు సీఎం కె. చంద్రశేఖరరావు. ఇది కాక అలవెన్సుల విషయంలోకూడా ప్రస్తుతం అందజేసే 28 రూపాయల పరేడ్‌ అలవెన్స్‌ను 100 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు కేసీఆర్‌. దీంతోపాటు రెండు జతల బట్టలు ఒక ఏడాదికి అందించే ఏర్పాటు చెయ్యాలన్నారు. అలాగే హైదరాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలో పనిచేసే హోంగార్డులకు ఉచిత బస్‌పాస్‌ ఇప్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల జీత భత్యాల్లో కొంత పొదుపు జరిగే అవకాశం వుంటుందని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

మా జీతభత్యాలను పెంచాలని ఐదేండ్లు తిప్పలుపడ్డాం బతిమిలాడుకున్నాం. అయినా ఫలితం సున్నా. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ఆపతిలున్నోళ్ళందరినీ ఆదుకుంటుందని అన్నారు. మా హోంగార్డుల కుటుంబాలన్నీ బతికున్నంతకాలం కేసీఆర్‌కి రుణపడి ఉంటాయని ఆనందోద్వేగాలతో కృతజ్ఞతాపూర్వక మాటలలో తమ అభిప్రాయాన్ని తెలియపరిచారు హోంగార్డ్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రాజేందర్‌.