|

హైదరాబాద్‌ కొహినూర్‌ వజ్రం నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహాదూర్‌

– శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే


ఇది తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న రోజుల నాటి ముచ్చట. ప్రభుత్వంలో పనిచేస్తున్న అన్ని ఇంజనీరింగ్‌ శాఖల ఇంజనీర్లు సంఘటితమై తెలంగాణ ఇంజనీర్స్‌ జెఎసి ని ఏర్పాటు చేసుకున్నారు. అంతకు ముందే తెలంగాణ రిటైర్డ్‌ ఇంజనీర్ల ఫోరం ఏర్పాటై పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండీ ఎత్తిపోతల పథకాల కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ లెజెండరీ ఇంజనీర్‌ నవాబ్‌ అలీ నవాజ్‌ బహాదూర్‌ గురించి ఆయన జన్మదినం 11 జూలై న తెలంగాణ ఇంజనీర్స్‌ డే గా, ఆయన వర్ధంతి రోజు 6 డిసెంబరున తెలంగాణ ఇంజనీర్ల సంస్మరణ దినం జరుపుకోవడం ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో తెలంగాణ ఇంజనీర్ల ఫోరం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌ రెడ్డి ఒక ఇంజనీరింగ్‌ కాలేజికి వక్తగా వెళ్ళినారు. ఆయన తన ప్రసంగం ప్రారంభించే ముందు విద్యార్థులని, అధ్యాపకులని కొన్ని ప్రశ్నలు వేసినారు.

”మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎవరో తెలియని వారు చేతులు ఎత్తండి ?” ఒక్కరు కూడా చేయి ఎత్త లేదు. మరో ప్రశ్న. ”సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ఎవరో తెలియని వారు చేతులు ఎత్తండి?” ఈ సారి కూడా ఎవరూ చేతులు ఎత్తలేదు. (వీరిద్దరు తెలుగు తేజో మూర్తుల్లో హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ పై కొలువుదీరి ఉన్నారు) మరో ప్రశ్న. ”నిజాంసాగర్‌ ప్రాజెక్టును నిర్మించిన ఇంజనీర్‌ ఎవరో తెలిసినవారు చేతులు ఎత్తండి?” మూడోసారి కూడా ఎవరూ చేతులు ఎత్తలేదు. మరో ప్రశ్న. ”నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ ఎవరో తెలిసిన వారు చేతులు ఎత్తండి?” ఈసారి కూడా ఎవరూ చేతులు ఎత్తలేదు. మొదటి రెండు ప్రశ్నలకు జవాబులు తెలియని వారు ఎవరూ లేరని, చివరి రెండు ప్రశ్నలకు జవాబులు తెలిసిన వారు ఎవరూ లేరని మనకు అర్థం అవుతున్నది. మన చరిత్ర మనకు కాకుండా పోయింది. మనవాళ్ళు ఎవరో, మన జాతి నిర్మాతలు, మన వైతాళికులు ఎవరో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. మన చరిత్ర మనకు అందకుండాపోయింది. అందుకే తెలంగాణ కావాలి అని చెబుతూ సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, ఆంధ్రా వలస పాలకుల వివక్షని, స్వాతంత్య్రాయానికి పూర్వం హైదరాబాద్‌ రాజ్యంలో అలీ నవాజ్‌ జంగ్‌ కృషిని వివరిస్తూ శ్యాం ప్రసాద్‌ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించినారు.

ఇక్కడ ఆ ముచ్చటని ఎందుకు ప్రస్తావించవలసి వస్తున్నదంటే … ఆనాడు నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ గురించి ఎవరికీ తెలియక పోయినా, ఇప్పుడు తెలంగాణ యువతకి ఆయన గురించి బాగా తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జి.ఒ. నంబరు 18 తేదీ 10.7.2014 ని జారీ చేసి అలీ నవాజ్‌ జంగ్‌ బహాదూర్‌ జన్మ దినం జూలై 11ని ‘తెలంగాణ ఇంజనీర్స్‌ డే’గా ప్రకటించింది. తెలంగాణ సభ్య సమాజం పులకించిపోయింది. ఐదు సంవత్సరాలుగా జూలై 11 న అధికారికంగా రాష్ట్ర వ్యాపితంగా తెలంగాణ ఇంజనీర్స్‌ డే జరుపుకుంటున్నారు. ఆయన స్మారక చిహ్నాలు వెలుస్తున్నాయి. సాగునీటి శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో ఆయన విగ్రహాన్ని ఆనాటి సాగునీటి మంత్రి హరీష్‌ రావు 11 జూలై 2014 న ఆవిష్కరించినారు. మహబూబ్‌ నగర్‌లో ఇరిగేషన్‌ శాఖ కొత్త భవనంలో ఆయన విగ్రహం ప్రతిష్టించబడింది. ఆయన పేరు మీద వివిధ శాఖల్లో విశిష్ట సేవలు అందించిన వెటరన్‌ ఇంజనీర్లకు ”నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహాదూర్‌ మెమోరియల్‌ లైఫ్‌ టైం అవార్డు” 2015 సంవత్సరం నుంచి ప్రదానం చెయ్యడం ప్రారంభమయ్యింది. హిమాయత్‌ సాగర్‌ లో ఉన్న వాలంతరీ ఇంజనీర్లు, ఉద్యోగులు కలిసి ప్రాంగణంలో ఆయన విగ్రహ ప్రతిష్టాపన చేసి 2016 జూలై 11 ఆవిష్కరించినారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఆయనకు దక్కిన ఒకే ఒక గౌరవం ఖైరతాబాద్‌లోని ఇన్సిటిట్యుషన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో ఆయన చిత్రపటం వేలాడదియ్యడం. 2013లో తెలంగాణ ఇంజనీర్స్‌ చొరవ, కృషి వలన నిజాంసాగర్‌ డ్యాం వద్ద గుల్దస్త్‌ గార్డెన్‌లో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించడం. రెండేండ్లుగా పత్రికల్లో, టీవీల్లో ఆయనపై అనేక ప్రత్యేక కథనాలు ప్రచురించి, ప్రసారం చేసి అలి నవాజ్‌ జంగ్‌కి విస్తృత ప్రచారాన్ని కల్పించినారు. ఈనాటి తరానికి ఆయన గురించి తెలియజెప్పినారు. ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందు వలన సాధ్యం అయ్యింది. మన అస్తిత్వాన్ని, మన చరిత్రని పునరుద్ధరించుకోవడం సాధ్యం అవుతున్నది. మన పాఠ్య పుస్తకాల్లో మన చరిత్ర, సంస్కృతి, మన వైతాళికుల జీవిత చరిత్రలు, మన రచయితల, కవుల రచనలని విస్తృతంగా పొందుపర్చగలుగుతున్నాము. దేశ వ్యాప్తంగా మన కళా వైభవాన్ని సూరజ్‌ కుండ్‌ మేళాలో చాటి చెప్పగలిగినాము. ఘనమైన తెలంగాణ చరిత్రను పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్ష సిలబస్‌లో అనివార్యం చెయ్యగలిగినాము. మన చరిత్ర అన్వేషణ వేగవంతమయ్యింది.

గత 15 ఏండ్లుగా మన అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకునే క్రమంలో భాగంగా తెలంగాణ చరిత్ర పరిశోధకులు పలుగూ పారా పట్టుకోని చరిత్ర పురాతన తవ్వకాలు జరిపినారు. కాలం మట్టి దిబ్బల కింద కప్పెట్టబడిన మన చరిత్రని తవ్వి తీసి ప్రపంచానికి తెలియజెప్పినారు. మన జాతి నిర్మాతలని, మన వైతాళికులను ఎందరినో వెలుగులోనికి తీసుకురాగలిగినారు. ఆ తవ్వకాల్లో బయటపడిన కోహినూర్‌ వజ్రమే అలీ నవాజ్‌ జంగ్‌ బహాదూర్‌. ”తెలంగాణ సాగునీటి రంగ పితామహుడు -నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహాదూర్‌” పేరుతో ఒక చిన్న పుస్తకాన్ని 2013 జూలైలో అచ్చువేసినాము. ఆ తర్వాత 2015 జూలైలో మరికొంత సమాచారాన్ని, ఫోటోలని చేర్చి రెండో ప్రచురణ వెలువరించినాము. పుస్తకానికి అధ్బుతమైన ప్రజాదరణ లభించింది. 2014 లో ఉర్దూలోకి అనువాదమై ఉర్దూ పాఠకులకు కూడా అందింది. 2017 లో తెలంగాణా ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా తెలుగు అకాడెమి వందకు పైగా తెలంగాణా మహనీయుల మోనోగ్రాఫ్‌ లు ప్రచురించింది. అందులో అలీ నవాజ్‌ బహాదూర్‌ మోనోగ్రాఫ్‌ కూడా ఉండడం తెలంగాణా ఇంజనీర్లు అందరికీ గర్వకారణం.

ఏ జాతికైనా వైతాళికులు ఉంటారు. తమ జాతి ఔన్నత్యం కోసం, వికాసం కోసం అహర్నిశలు కృషి చేసిన ఉద్ధారకులు, మేధావులు ఉంటారు. అయితే వలసవాదానికి బలి అయిన తెలంగాణ వంటి ప్రాంతాల్లో ఈ చరిత్ర అంతా మరుగున పడిపోతుంది. చరిత్ర వక్రీకరణకు గురి అవుతుంది. విజేతల చరిత్రే చరిత్ర అన్నట్లు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు రూపొందుతాయి. అట్లా 1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణ చరిత్ర ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనుంచి లేదా తెలుగువారి చరిత్రలో నుంచి తొలగిపోయి మరుగున పడిపోయింది. తెలంగాణ నేలమీద తెలుగు సామ్రాజ్యాలు విలసిల్లినాయి. ఘనమైన చరిత్ర ఈ నేలకు ఉన్నది. ప్రత్యేకమైన భాషా సాంస్కృతిక అస్తిత్వం ఉన్నది. తెలంగాణ అనేక రాజకీయ, సామాజిక ఉద్యమాలకు ఊతమిచ్చిన నేల. 1857 లో తుర్రేబాజ్‌ ఖాన్‌, మౌల్వీ అల్లావుద్దీన్‌ బ్రిటిష్‌ వారిపై చేసిన పోరాటం ఎవరికీ తెలియకుండా పోయింది. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి అమరుడైన రాంజీ గోండు పోరాటం, గ్రామాలపై, అడవిపై హక్కుల కోసం నిజాం ప్రభుత్వం పై పోరు సలిపి అమరుడైన కొమురం భీం బాబేఝరి పోరాటం ఇటీవలిదాకా ఎవరికీ తెలియనే తెలియదు. భూస్వామ్య వ్యతిరేక మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని మెయిన్‌ స్ట్రీం చరిత్రకారులు గుర్తించనే లేదు. తెలంగాణలో భాషా సాంస్కృతిక వికాసం కోసం కృషి చేసిన అనేక మంది వైతాళికులను మన చరిత్రకారులు వెలికితీసేదాకా ఎవరికీ తెలియనే తెలియదు. అట్లా మరుగున పడిపోయిన వైతాళికుల్లో నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహాదూర్‌ ఒకరు. హైదరాబాద్‌ రాజ్యంలో పుట్టి భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన ఇంజనీర్‌గా ప్రఖ్యాతిగాంచినాడు.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి దేశ వ్యాప్తంగా తెలియని వారు ఉండరు. భారత దేశం గర్వించదగిన ఇంజనీరు, దార్శనికుడు, పరిపాలనాదక్షుడు, భారతరత్న బిరుదాంకితుడు, దేశంలో సాగునీటి రంగానికి పునాదులు వేసిన తొలితరం మేధావి విశ్వేశ్వరయ్య. అటువంటి మేధావికి సమకాలికుడు, అంతే స్థాయికలిగిన ప్రతిభావంతుడైన ఇంజనీర్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహాదూర్‌. అయితే ఆంధ్రప్రదేశ్‌ సాగునీటి రంగ చరిత్రలో సర్‌ ఆర్థర్‌ కాటన్‌కు, డా. కె.ఎల్‌. రావుకు దక్కిన స్థానం, ఖ్యాతి అలీ నవాజ్‌ జంగ్‌కు దక్కలేదు. ఇది యాదృచ్ఛికం కానే కాదు. ఆ మరుపు అంతర్గత వలసవాదం యొక్క ప్రభావ ఫలితమే. కృష్ణా, గోదావరి, కావేరీ డెల్టాలకు సాగునీటి సౌకర్యాలని ఏర్పరచి డెల్టా ప్రాంతాల ఆర్థిక స్థితిగతులని గుణాత్మకంగా మార్చివేసిన కాటన్‌కు ఆ ఖ్యాతి దక్కవలసిందే. అయితే కాటన్‌ మహాశయుడి తరహాలోనే దక్కన్‌ పీఠ భూమిలో భాగమైన హైదరాబాద్‌ రాజ్యంలో ఈ ప్రాంత భౌగోళిక స్థితిగతులకు అనుగుణంగా సమగ్ర సాగునీటి ప్రణాళికలు రచించి అనేక భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులని, అనేక చారిత్రిక భవనాలని, వంతెనలని, రోడ్లని నిర్మించిన వాడు అలీ నవాజ్‌ జంగ్‌ బహాదూర్‌కు అటువంటి ఖ్యాతి దక్కవలసింది. ఆయన మహోన్నత కృషిని స్మరించుకున్న సందర్భాలు ఇటీవలి దాకా లేనే లేవు. తెలంగాణ ఉద్యమ చైతన్యంలో తెలంగాణ ఇంజనీర్లు తమ ఘనమైన చరిత్రని తెలుసుకున్నారు. ఆ ఎరుకలో నుంచే జూలై 11న తెలంగాణ ఇంజనీర్స్‌ డే జరుపుకొనే సాంప్రదాయాన్ని నెలకొల్పినారు.

ఇంతకూ ఆయన హైదరాబాద్‌ రాజ్యానికి, తెలంగాణ సమాజానికి, దేశానికి అందించిన సేవలు ఏమిటి? సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే హైదరాబాద్‌ రాజ్యం భారత దేశంలో విలీనం జరిగేనాటికి ఇక్కడ నిర్మాణం అయిన భారీ మధ్యతరహా ప్రాజెక్టులు అన్నీ అలి నవాజ్‌ జంగ్‌ రూపకల్పన చేసి నిర్మించినవే. నిజామాబాద్‌ జిల్లాలో నిజాంసాగర్‌, పోచారం ప్రాజెక్టులు, ఖమ్మం జిల్లాలో వైరా, పాలేరు ప్రాజెక్టులు, కరీంనగర్‌ జిల్లాలో అప్పర్‌ మానేరు ప్రాజెక్టు, మహబూబ్‌ నగర్‌ జిల్లాలో డిండీ, సింగభూపాలెం, రాయనిపల్లి, కోయిల్‌ సాగర్‌, తుంగభద్ర ప్రాజెక్టులు, ఆదిలాబాద్‌ జిల్లాలో కడెం ప్రాజెక్టులు, హైదరాబాద్‌లో ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ జంట జలాశయాలు ఆయన జీవించిన కాలంలో నిర్మాణం అయినాయి. ఆయన మరణానంతరం ఆయన రూపకల్పన చేసిన ప్రాజెక్టులు నిర్మాణానికి నోచుకున్నవి… నల్లగొండ జిల్లాలో మూసీ ప్రాజెక్టు, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు (నందికొండ), పెండ్లిపాకల ప్రాజెక్టు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో రాజోలి బండ డైవర్షన్‌ స్కీం, సరళాసాగర్‌ ప్రాజెక్టులు, నిజామాబాద్‌ ఆదిలాబాద్‌ జిల్లాల సరిహద్దులో గోదావరి నదిపై పోచంపాడ్‌ ప్రాజెక్టు, మరాఠ్వాడాలో పూర్ణా ప్రాజెక్టు, మెదక్‌ జిల్లాలో ఘన్‌పూర్‌ ఆనకట్ట మొదలైనవి అలీ నవాజ్‌ జంగ్‌ రూపకల్పన చేసినవే.

ఇచ్చంపల్లి, పెన్‌గంగ ప్రాజెక్టులని ఆయనే రూపకల్పన చేసినప్పటికీ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అవి సాకారం కాలేదు. అవి రెండూ పర్యావరణ, ముంపు సమస్యలతో సతమతమవుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల సంగతి అట్లా ఉంచితే, ఆయన అనేక చారిత్రిక భవనాలని నిర్మించినాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ, హాస్టల్‌ భవనాలు, ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి, ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌ లోని జూబిలీ హాల్‌, అఫ్జల్‌ గంజ్‌లో స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ, మహబూబియా బాలికల పాఠశాల, నాందేడ్‌ సివిల్‌ ఆసుపత్రి, చార్మినార్‌ వద్ద యునానీ ఆసుపత్రి ఆయన నిర్మించినవే. హైదరాబాద్‌ రాజ్యంలో పెద్ద నదులపై రాతివంతెనలు నిర్మించినాడు. ఆదిలాబాద్‌ జిల్లా సోన్‌ గ్రామం వద్ద గోదావరిపై రాతి వంతెన, గుల్బర్గ జిల్లా యాద్గిర్‌ వద్ద భీమా నదిపై రాతివంతెన, నిజామాబాద్‌ జిల్లా బండపల్లి వద్ద మంజీరా నదిపై రాతి వంతెన, ఖమ్మం జిల్లా మున్నేరు నదిపై రాతి వంతెన, ఔరంగాబాద్‌ వద్ద శాఘడ్‌ వద్ద ఆర్‌ సి సి వంతెన, మహబూబ్‌ నగర్‌ జిల్లాలో అనగండ వద్ద కృష్ణా నదిపై రాతి వంతెన, రాయచూర్‌ జిల్లాలో తుంగభద్ర నదిపై రాతివంతెన వీటిలో కొన్ని.

ఈ కట్టడాల సంగతి అటుంచితే, ఇంజనీరింగ్‌ మేధావిగా ఆయన రూపొందించిన ఇంజనీరింగ్‌ నివేదికలు అపురూపమైనవి. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు భారత జాతీయ కాంగ్రేస్‌ దేశ అభివృద్ది పథకాలపై నివేదికలు తయారు చేయడానికి జవహర్‌ లాల్‌ నెహ్రూ అధ్యక్షతన 1938 లో నేషనల్‌ ప్లానింగ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వివిధ అంశాలపై నిపుణులతో సబ్‌ కమిటీలు ఏర్పాటు చేసింది. అటువంటి సబ్‌ కమిటీల్లో సాగునీటి రంగంలో సమగ్ర నివేదికను తయారు చెయ్యడానికి అలీ నవాజ్‌ జంగ్‌నే నెహ్రూ ఎన్నుకున్నాడు. అప్పటికి హైదరాబాద్‌ రాజ్యం ఇంకా భారత్‌లో విలీనం కానే లేదు. అప్పటికే ఆయన ప్రతిభావంతుడైన ఇంజనీర్‌గా దేశంలో గుర్తింపు పొందినాడు. ”రివర్‌ ట్రైనింగ్‌ & ఇరిగేషన్‌” పేరుతో ఆయన సిఫారసులతో కూడిన సమగ్ర నివేదికను రెండేండ్లలోనే సమర్పించినాడు. స్వాతంత్య్రానంతరం దేశ ప్రధాన మంత్రిగా నెహ్రూ ఆ సిఫారసులను అమలు చేసినాడు. ఆయన సిఫారసుల మేరకే ఢిల్లీలో సెంట్రల్‌ వాటర్‌ కమీషన్‌, సెంట్రల్‌ ఎలెక్ట్రిసిటీ అథారిటీ, పూణేలో సెంట్రల్‌ వాటర్‌ & పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ ఏర్పాటు అయినాయి. దేశంలో అన్ని నదులపై గేజింగ్‌ స్టేషన్‌లు, దేశ వ్యాప్తంగా వర్షపాతాన్ని నమోదు చెయ్యడానికి రెయిన్‌ గేజ్‌ స్టేషన్‌లు ఏర్పాటు అయినాయి. అన్ని ప్రధాన నదులపై భాక్రానంగల్‌, హీరాకుడ్‌, దామోదర్‌ వ్యాలీ ప్రాజెక్టు, నాగార్జునసాగర్‌ లాంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం జరిగినాయి. అలీ నవాజ్‌ జంగ్‌ కలలు ఆయన మరణానంతరం నిజమయినాయి.

సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు హైడ్రాలజీ ఒక ప్రధానమైన సబ్జెక్టు. గరిష్ట వరద పరిమాణాన్ని లెక్క గట్టడానికి యూరోపియన్‌ ఇంజనీర్లు రూపొందించిన ఎంపెరికల్‌ ఫార్ములాలు ఒక పాఠంలో బోధిస్తారు. డికెన్స్‌ ఫార్ములా, రైవ్స్‌ ఫార్ములా, గేగ్స్‌ ఫార్ములా, ఇంగ్లిస్‌ ఫార్ములా.. ఇట్లా కొన్ని ఫార్ములాలు ఉన్నాయి. వీటి సరసన అలీ నవాజ్‌ జంగ్‌ రూపొందించిన ఫార్ములా ఆయన పేరు మీద చోటు చేసుకున్నది. హైడ్రాలజీ, హైడ్రాలిక్స్‌లో అలీ నవాజ్‌ జంగ్‌కు శాస్త్ర జ్ఞానంతో పాటు అనుభవ జ్ఞానం కూడా ఉన్నది. హైదరాబాద్‌ రాజ్యంలో అన్ని నదులపై, వాగులపై హైడ్రాలాజికల్‌ సర్వేలు చేసి ఉన్నాడు. ఆ అనుభవంతో సాంప్రదాయికంగా ఉపయోగించే డికెన్స్‌, రైవ్స్‌ ఫార్ములాలతో గరిష్ట వరద పరిమాణాన్ని అంచనా కట్టినప్పుడు వాస్తవ వరద పరిమాణంతో పోల్చి చూస్తే పెద్ద అంతరం ఆయన గమనించినాడు. ఇది డ్యాం నిర్మాణ ఖర్చును పెంచుతుంది. దక్కన్‌ పీఠ భూమిలో ఉన్న నదులపై వాటి పరీవాహక ప్రాంత స్థితిగతులకు సరిపోయే విధంగా ఫార్ములాను అలీ నవాజ్‌ జంగ్‌ రూపొందించినాడు. తను రూపొందించిన ఫార్ములా యొక్క సమర్థతను డిండీ ప్రాజెక్టులో ప్రయోగించి నిరూపించినాడు. సివిల్‌ ఇంజనీరింగ్‌ సైన్స్‌కు ఈ ఫార్ములా అలీ నవాజ్‌ జంగ్‌ ఇచ్చిన గొప్ప బహుమానంగా నిపుణులు భావిస్తారు.

అయితే గరిష్ట వరద ప్రవాహాన్ని లెక్క గట్టడానికి యూరోపియన్‌ ఇంజనీర్లు రూపొందించిన ఫార్ములాలనే ముఖ్యంగా డికెన్స్‌ ఫార్ములాని బహుశా ఖర్చు ఎక్కువైనా సురక్షితంగా ఉంటుందని అనుకోవడం వలన భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అలీ నవాజ్‌ జంగ్‌ రూపొందించిన ఫార్ములాను కాలానుగుణంగా అభివృద్ధి చేసే పరిశోధనలు ఏవీ జరగకపోవడం అలీ నవాజ్‌ జంగ్‌కి అన్యాయం చేసినట్లేనని భావించాలి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని నదులపై విస్తృతంగా హైడ్రాలాజికల్‌ డాటా.. అనగా వర్షపాతం, వరద ప్రవాహం తదితర సమాచారం లభ్యమవుతున్నది. ఈ డాటా అధారంగా అలీ నవాజ్‌ జంగ్‌ ఫార్ములాను మరింత సమగ్రంగా రూపొందించే కృషి జరగాల్సి ఉన్నది. ముఖ్యంగా దక్కన్‌ పీఠభూమిలో ఉన్న తెలంగాణలో ఉన్న ఉస్మానియా, కాకతీయ, జె.ఎన్‌.టి.యు. (హెచ్‌), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ అఫ్‌ టెక్నాలజీ వరంగల్‌, ఐ ఐ టి హైదరాబాద్‌ వారు ఇప్పటికైనా ఈ ఫార్ములాను అభివృద్ధి చేసే పరిశోధనలకు పూనుకోవాలి. అలీ నవాజ్‌ జంగ్‌ ఫార్ములా యొక్క విశ్వసనీయతను స్థిరపర్చాలి.

హైదరాబాద్‌ ప్రజా పనుల శాఖకు చీఫ్‌ ఇంజనీర్‌ – సెక్రటరిగా ఎంపిక అయినప్పుడు ఆయనకు చార్జి అప్ప జెప్పిన హైదరాబాద్‌ రాజ్య చివరి బ్రీటిష్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఎ.టి. మెకంజీ అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం సముచితం. ”నేను నా భాధ్యతలను నాకంటే ప్రతిభావంతుడైన, నా కంటే గొప్ప పరిపాలనాదక్షుడికి అప్పజెపుతున్నాను”. యూరో పియన్‌ చీఫ్‌ ఇంజనీర్ల గౌరవాన్ని, అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి అలీ నవాజ్‌ జంగ్‌. 1947లో నవాబ్‌ చత్తారీ హైదరాబాద్‌ రాజ్య ప్రధానమంత్రి పదవికి రాజీనామా సమర్పించినప్పుడు కొత్త ప్రధాన మంత్రి పదవికి అలీ నవాజ్‌ జంగ్‌ పేరుని కూడా నిజాం మీర్‌ ఉస్మాన్‌ ఖాన్‌ పరిశీలించినట్లు హైదరాబాద్‌ రాజ్య చివరి ప్రధానమంత్రి మీర్‌ లాయక్‌ అలీ ”ట్రాజెడీ ఆఫ్‌ హైదరాబాద్‌ ” పుస్తకంలో పేర్కొన్నాడు. అయితే ఆ పదవికి మీర్‌ లాయక్‌ అలీ ఎంపిక అయినందున హైదరాబాద్‌ రాజ్యానికి చివరి ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచిపోయే ఒక విషాదం నుంచి అలీ నవాజ్‌ జంగ్‌ తప్పించుకున్నాడు.

తెలంగాణా రాష్ట్రంలో అలీ నవాజ్‌ జంగ్‌ బహాదూర్‌ వారసత్వం సమున్నతంగా అమలు అవుతున్నది. తెలంగాణా ఇంజనీర్లు తమ ప్రతిభా పాటవాలను, శక్తియుక్తులను ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రదర్శిస్తున్నారు. వారి కఠోర పరిశ్రమ కారణంగా ప్రపంచంలో అతిపెద్ద మల్టీ స్టేజ్‌ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లలోనే నీటిని ఎత్తిపోసే దశకు చేరుకున్నది. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, ఆర్‌ విద్యాసాగర్‌ రావు డిండీ, చనాక కొరాట, శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవన పథకం, తుపాకులగూడెం తదితర ప్రతిష్ఠాత్మక సాగునీటి ప్రాజెక్టులు, ప్రగతి భవన్‌, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ లాంటి భవనాలు, రహదారులు, గ్రామీణ రోడ్లు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణాలు, గోదావరి కృష్ణా నదులపై వంతెనలు, 24 గంటలు విద్యుత్‌ సరఫరా, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలు .. ఇట్లా అనేక నిర్మాణాలలో ఇంజనీర్లు అలీ నవాజ్‌ జంగ్‌ స్ఫూర్తిని, వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అందుకు తెలంగాణా ప్రభుత్వం అందిస్తున్న సహకారం అపూర్వం.

(డిసెంబర్‌ 6న నవాజ్‌ జంగ్‌ వర్ధంతి)