శతాబ్దివృద్ధి ఎనిమిదేండ్లలో…

By ఎ. శశిధర్

ఏ అంకెలో లేని నిండుదనం ఎనిమిదిలో ఉంది.

మేలి మలుపులు తిరిగి వలపులు కుమ్మరిస్తూ కనిపిస్తుందా సంఖ్య.

ఆ మలుపులను సమర్థవంతంగా దాటి గెలుపు సాధిస్తేనే వాహనం నడిపే అర్హత.

ఎనిమిది దిక్కులు అభివృద్ధి చెందితేనే సమగ్రత.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అచ్చంగా ఎనిమిదేండ్లు నిండాయి.

అష్టదిగ్బంధనంతో ఎందరో దుష్టులు ఉద్యమాన్ని ఉక్కిరిబిక్కిరి చేసినా, కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకున్నం. ఇష్టపడి అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈ ఎనిమిదేండ్ల అభివృద్ధి రాబోయే దశ దశాబ్దాల ఉజ్వల భవిష్యత్తుకు పునాదిగా నిలిచింది.

ఆ పునాదిని నిర్మించింది ఒక్కడే!

దానిపై అభివృద్ధి సౌధాలను నిర్మించిందీ ఒక్కడే!

ఆ ఒక్కడే మన కేసీఆర్‌.

ఎన్ని మాటలన్నరు..

కరెంట్‌ ఎట్లిస్తరు?

ప్రాజెక్టులు యాడ్నుంచి కడతరు?

నీళ్లు ఎక్కడ్నుంచి తెస్తరు?

పంటలు ఎట్ల పండిస్తరు?

అసలు మీకు పాలించుడు వస్తదా?

ఎన్ని మాటలు అన్నరో! అన్నిటికీ ఒకే సమాధానం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి రూపంలో కనిపిస్తున్నది. ఎనిమిదేండ్ల ధాన్యగర్భ తెలంగాణ. పాలబుగ్గల జలదృశ్యం తెలంగాణ. ఈ పసితల్లి తెలంగాణ చూపుల్లో జిలుగు వెలుగులు ఇరవైనాలుగు గంటలూ ప్రకాశిస్తున్నాయి.

పుట్టిన ఆరు నెలలకే బాలారిష్ఠాలు దాటుకొని అష్టలక్ష్ములు కొలువుదీరడానికి అందమైన వేదికను నిర్మించారు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌. రాష్ట్రం సాధించిన సంబరంలో నుంచి తేరుకోకముందే, అడ్డంకులు. కాళ్లల్ల కట్టె పెట్టుడు మొదలుపెట్టినరు. పోలవరం పేరు మీద ఏడు మండలాలు గుంజుకున్నరు. సీలేరు పవర్‌ ప్రాజెక్టును లాక్కుపోయినరు. తెలంగాణలో కారుచీకట్లు కమ్ముకుంటాయని భ్రమపడ్డారు కొందరు. ఆ మాటలు అన్నోళ్లే కుళ్లుకునేలా నేడు రాష్ట్రంలో విద్యుత్‌ వెలుగుల జిగేలుమంటున్నాయి. ఒకటేమిటి అన్ని రంగాల్లో అద్వితీయమైన అభివృద్ధి అప్రతిహతంగా కొనసాగుతున్నది. మూడు ప్రాజెక్టులు ఆరు పథకాలతో రాష్ట్రం కళకళలాడుతున్నది. సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి, రక్షణ కాదేదీ అభివృద్ధికి అనర్హం అని నిరూపించారు కేసీఆర్‌. తరచి చూస్తే ఆయన దృష్టి సారించని రంగం లేదు. నిధుల అమలుచేయని పథకం లేదు.

సంక్షేమానికి పెద్ద పీట

తెలంగాణ వచ్చేనాటికి రాష్ట్రమంతటా క్షామం. సంక్షేమం అంటే తెలియని పల్లెలు. పొక్కిళ్ల వాకిల్లల్లో దిక్కులేక బిక్క చూపులు చూసే అవ్వలు. విధి దూరం చేసిన పెనిమిటిని తలుచుకొని బిక్కచచ్చిన ఆడకూతుళ్లు, పెళ్లీడొచ్చిన కూతురుని ఒక అయ్య చేతిలో పెట్టలేని తన దుస్థితికి దుఃఖిస్తున్న తండ్రులు.. ఇలా ప్రతి పల్లెలోనూ పుట్టెడు సమస్యలు. ఆశలన్నీ రాల్చిన శిశిరాన్ని రాత్రికి రాత్రి తోకముడిచేలా చేసే వసంతంలా.. ఒక్క పూటలో పల్లె తెలంగాణకు సంతసాన్ని పంచారు ముఖ్యమంత్రి. సొంత రాష్ట్రంలో సొంత ప్రభుత్వం ఏర్పాటు కావడంతోనే సంక్షేమంపై దృష్టి నిలిపారు. వరుస పథకాలతో అవ్వలను ఆదుకున్నారు. వందో, రెండొందలో కాదు.. రెండువేల పదహారు రూపాయలు పెన్షన్‌ ప్రకటించి అవ్వలకు పెద్ద కొడుకు అయ్యారు. ‘ఆసరా’ పెన్షన్‌ ఇచ్చి వితంతువులకు ఒక అన్నగా అండగా నిలిచారు. ‘కల్యాణలక్ష్మి- షాదీ ముబారక్‌’తో ఆడకూతుళ్లకు మేనమామ అనిపించుకున్నారు. బీడీ కార్మికులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు ఇలా అవసరార్థులు అందరికీ గౌరవప్రదమైన పెన్షన్‌ అందించి తల్లి తెలంగాణ పెద్ద కొడుకు అనిపించుకున్నారు.

‘మిషన్‌ భగీరథ’ ఒక భగీరథ ప్రయత్నమే! కొండల్లో ఉన్న గూడెం నుంచి మైదానంలో ఉన్న పల్లె వరకు ఇంటింటికీ నల్లా ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపారు ముఖ్యమంత్రి. నిరుపేదలు గౌరవంగా బతకాలని, ప్రభుత్వం డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లు కట్టిస్తున్నది. నియోజకవర్గాల వారీగా గేటెడ్‌ కమ్యూనిటీని తలపించే విధంగా ఇవి రూపుదిద్దుకున్నాయి. ఇప్పటికే దాదాపు మూడు లక్షల కుటుంబాలు తెలంగాణ ప్రభుత్వం అందించిన సొంతింట్లో సగౌరవంగా, సంతోషంగా జీవనం గడుపుతున్నాయి. తాజాగా ‘దళిత బంధు’ పథకంతో తన దార్శనికతను మరోసారి నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి. శతాబ్దాలుగా అణగారిన దళితవర్గాన్ని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే సంకల్పంతో ప్రతిష్ఠాత్మక పథకాన్ని ప్రారంభించారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి, సొంతకాళ్లపై నిలబడేలా ప్రత్యేక కార్యాచరణ అమలుపరుస్తున్నారు. ఒక్కసారి దళిత కుటుంబం ఆర్థికంగా కుదురుకుంటే, రాబోయే తరాల తలరాతలు మారిపోతాయని విశ్వాసంతో ఈ పథకాన్ని దేశమంతా ఆశ్చర్యపోయే విధంగా నిర్వహిస్తున్నారు. ‘దళితబంధు’ కోసం ఈ బడ్జెట్లో రూ.17,700 కోట్ల నిధులు కేటాయించారు. మాత-శిశు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి పథకాలతో తెలంగాణ ఆడపడుచులు మాతృత్వపు మాధుర్యాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్నారు.

సర్కార్‌ బడి ముద్దు

అన్ని సమస్యలకూ చదువు ఒక్కటే పరిష్కారం. ఉమ్మడి పాలకులు నిర్లక్ష్యం చేసిన రంగాల్లో విద్యావ్యవస్థ కూడా ఒకటి. తెలంగాణ ఏర్పడిన తరువాత విద్యారంగం బలోపేతానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా తాజాగా ‘మనఊరు- మనబడి’ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నది ప్రభుత్వం. తాజా బడ్జెట్లో ఏకంగా రూ.7,289 కోట్లతో దశలవారీగా పాఠశాలల అభివృద్ధి చేపట్టనుంది. మొదటి దశలో భాగంగా మండలాన్ని యూనిట్‌గా రాష్ట్రవ్యాప్తంగా 9,123 పాఠశాలల రూపురేఖలు మార్చే యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. అంతేకాదు రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వ విద్యాలయ ఏర్పాటుకూ సన్నాహాలు చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల దశ మార్చేలా రాష్ట్రం ఏర్పటిన నాటి నుంచి అన్ని కేటగిరీల్లో దాదాపు 981 గురుకులాలు ఏర్పాటు చేసి ఇంటర్‌ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నది ప్రభుత్వం. ఈ గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులు వివిధ రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. గురుకుల విద్యార్థుల్లో దాదాపు 550 మంది ఎంబీబీఎస్‌లో సీటు సాధించి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇంజినీరింగ్‌ విద్యార్థుల సంఖ్య వేలల్లో ఉంది. ఇలా సర్కార్‌ బడిని బలోపేతం చేస్తూ, నిరుపేదలకు నాణ్యమైన చదువును అందిస్తు ఆదర్శంగా నిలుస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.

వ్యవసాయం పండుగ

‘తెలంగాణలో నీళ్లు లేవు. ఇక్కడోళ్లకు సాగు తెలియదు..’ ఇలా అవాకులు చెవాకులు పేలిన నోళ్లన్నీ ఇప్పుడు పసిడి పంటల తెలంగాణను చూసి నోరెళ్ల పెడుతున్నారు. అందుకు కారణం ముఖ్యమంత్రి దూరదృష్టే. తెలంగాణను ఒరుసుకుంటూ గోదావరి పరవళ్లు తొక్కుతున్నా.. ఇక్కడ పల్లె నేలల్లో పల్లేరు కాయలు వెక్కిరిస్తున్నాయంటే అందుకు గత పాలకుల వైఫల్యమే కారణం. నీటి వసతి కల్పిస్తే మన మాగాణం మురిసి, ధాన్యసిరులు కురిపిస్తుందని యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు ముఖ్యమంత్రి. కాళేశ్వరం ప్రాజెక్టుతో పల్లం ఎరిగిన నీటిని కొండలెక్కించి.. తెలంగాణ నేలతల్లి దాహం తీర్చారు. మిషన్‌ కాకతీయతో వేలాది చెరువులకు మళ్లీ జీవం పోశారు. పూడుకుపోయిన చెరువులను తవ్వించి అక్షయ జల పాత్రలుగా మలిచారు. గోదావరి జలాలతో చెరువులకు జలకళ తీసుకొచ్చారు. మండువేసవిలోనూ చెరువులు అలుగు పారుతున్న దృశ్యం మన రాష్ట్రంలోనే సాధ్యం అనడంలో అతిశయోక్తి లేదు. పాలకుడు దార్శనికుడైతే, ధార్మికుడైతే, ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాడైతే ప్రకృతి కూడా సహకరిస్తుందని పురాణ వచనం. అందుకే కాబోలు, గడిచిన ఎనిమిదేండ్లు వర్షాలు సమృద్ధిగా కురిశాయి. కుంభవృష్టి వానలు కురిసినా.. మిషన్‌ కాకతీయలో నిర్మించిన ఒక్క చెరువూ కట్ట తెగలేదంటే.. తెలంగాణ ప్రభుత్వం కమిట్మెంట్‌ ఎంత పక్కాగా ఉందో తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ఇంత కచ్చితంగా ఉండబట్టే తెలంగాణ నేలంతా బంగారం ఈనింది. సాగు విస్తీర్ణం ఊహించనంత పెరిగింది. పంట దిగుబడి అంచనాలకు అందనంత వస్తున్నది.

రైతన్నకు దన్నుగా

దేశానికే అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ రైతు ఎదిగాడంటే.. అందుకు మన ప్రభుత్వం రైతును కడుపులో పెట్టుకొని చూసుకోవడమే కారణం. రైతు గోస గతంలో ఎవరూ పట్టించుకున్నది లేదు. రైతుకే రైతు కష్టం తెలుసు. తాను కూడా కాపునే (రైతునే) అని సగర్వంగా చెప్పే ముఖ్యమంత్రి తెలంగాణ రైతును రాజుగా నిలబెట్టాడు. ఎన్ని కోట్లు ఖర్చుపెట్టి సాగునీరు అందించినా.. పెట్టుబడి లేకపోతే రైతుకు ప్రయోజనం చేకూరదు. ఈ పరిస్థితిని గుర్తించి 2018 యాసంగిలో ‘రైతుబంధు’ పథకాన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి. పంటకు ఎకరానికి నాలుగువేల రూపాయల పెట్టుబడి సాయం అందించడం ప్రారంభించారు. రెండేండ్ల కిందటి నుంచి పెట్టుబడి సాయాన్ని ఎకరానికి నాలుగు వేల నుంచి ఐదు వేలకు పెంచారు. అంటే, రెండు పంటలకు కలిపి ఏడాదికి 10వేలు నేరుగా రైతు బ్యాంకుఖాతాలో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతుబంధు కింద దాదాపు 63.50 లక్షల మంది రైతులకు సుమారు రూ.50వేల కోట్లు జమచేశారు. ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడి పొందిన రైతులు సాగుబడిలో రౌతుల్లా దూసుకుపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కర్షకుల కష్టాలను అర్థం చేసుకొని ప్రవేశపెట్టిన మరో పథకం ‘రైతు బీమా’. ఏ కారణంగా అయినా రైతు కన్నుమూస్తే.. ఆ కుటుంబం రోడ్డున పడొద్దని రూ.5 లక్షలు సాయం అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. బీమాతో రైతు కుటుంబాలకు ధీమా కల్పించారు కేసీఆర్‌. గుంట భూమున్న రైతును కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది.

అంధకారం మాయం

తెలంగాణ వచ్చేనాటికి విద్యుత్‌ వినియోగం, ఉత్పత్తికి మధ్య అంతరం ఊహించనంత! దాదాపు 2700 మెగావాట్ల లోటుతో తిమిరంతో సమరం చేస్తున్న సందర్భం. ఈ పరిస్థితులను ఆరునెలల్లోనే చక్కబెట్టారు ముఖ్యమంత్రి. ఒక దేశం, రాష్ట్రం అభివృద్ధిని ఆ ప్రాంతంలో విద్యుత్‌ వినియోగాన్ని ఆధారంగా అంచనా వేస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్‌ రంగంపై దృష్టి సారించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ‘మీకు కరెంట్‌ ఉండదు’ అని గేలి చేసిన వాళ్లే ముక్కున వేలు వేసుకునేలా రాష్ట్రంలో కరెంట్‌ సరఫరా అవుతున్నది. రాష్ట్రం సాకారమై ఆరు నెలలు నిండకముందే నవంబర్లో గృహ, వాణిజ్య, వ్యాపార, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి. అన్నమాట ప్రకారం ఆనాడు మొదలైన నిరంతర విద్యుత్‌ ప్రవాహం నేటికీ కొనసాగుతున్నది. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిది నెలలకే వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్‌ ఇవ్వడం మొదలుపెట్టారు. 2018 జనవరి 1 నుంచి కొత్త సంవత్సరం కానుకగా వ్యవసాయరంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌ సరఫరా మొదలైంది. ఒకవైపు విద్యుత్‌ సంస్కరణల పేరిట మోటర్లకు మీటర్లు బిగించాలని కేంద్రం చేసిన ఒత్తిళ్లను తొక్కిపెట్టి.. ఉచిత విద్యుత్‌ సరఫరా నిలిపేది లేదని తేల్చి చెప్పిన రైతు పక్షపాతి మన ముఖ్యమంత్రి. కరెంట్‌ లేని స్థితి నుంచి ఇప్పుడు దేశంలోనే తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణను నంబర్‌ వన్‌గా నిలబెట్టిన తీరు అద్భుతం.

పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్‌ ఉత్పత్తిలోనూ మెరుపు వేగంతో దూసుకుపోతున్నది తెలంగాణ. పులిచింతలలో 30 మెగావాట్ల యూనిట్‌ను నెలకొల్పారు. కొత్తగూడెం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో 800 మెగావాట్ల సూపర్‌ పవర్‌ స్టేషన్‌ను 48 నెలల్లోనే పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేశారు. తెలంగాణ ఏర్పడిన ఆరేండ్లలోనే రాష్ట్రంలో స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం రెట్టింపు అయింది. దీనికితోడు భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నది. మరోవైపు రెన్యూవబుల్‌ ఎనర్జీ (సౌర, పవన విద్యుత్‌) స్థాపిత సామర్థ్యంలోనూ తెలంగాణ దేశానికి తలమానికంగా ఉంది. కేంద్రం నిర్దేశించిన దానికన్నా 248 శాతం ఎక్కువగా స్థాపిత విద్యుత్‌ సామర్థ్యాన్ని సాధించింది. 2022 డిసెంబర్‌ నాటికి 2,000 మెగావాట్ల సామర్థ్యాన్ని చేరుకోవాలని నిర్దేశించగా.. ఈ ఏడాది మార్చి నాటికే సుమారు 4,960 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని సాధించి తన ప్రత్యేకతను చాటుకుంది తెలంగాణ.

దూసుకుపోతున్న ఐటి రంగం

ఆకాశమే హద్దుగా ఐటీ రంగం దూసుకుపోతున్నది. ఏటికేడూ ఐటీ ఎగుమతుల్లో అంచనాలకు మించిన వృద్ధి చోటుచేసుకుంటున్నది. 2019-20లో 1.28 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు సాధించగా, తాజాగా ఇది 1.50 లక్షల కోట్లకు చేరింది. ప్రపంచ నగరాలతో పోటీపడుతున్న హైదరాబాద్‌. అందుబాటులో ఉన్న ప్రకృతి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే దార్శనికత తెలంగాణను అన్నిటా మేటిగా నిలబెడుతున్నది. టీఎస్‌-ఐపాస్‌ ద్వారా పరిశ్రమలకు పారదర్శకంగా అనుమతులు ఇస్తుండటంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు తెలంగాణవైపు చూస్తున్నాయి. మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి దాదాపు 20వేల పరిశ్రమలు తెలంగాణలో ఏర్పాటయ్యాయి. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమందికి ఉపాధి లభిస్తున్నది. గ్రామీణాభివృద్ధి, పట్టణాల పురోగతి, హరితహారం, మౌలిక వసతుల కల్పన ఇలా ఏ రంగంలో చూసినా తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో తెలంగాణ వేగం మందగించినా, కష్టకాలాన్ని దాటుకొని దేశాన్ని మించిన ఆర్థికవృద్ధి రేటు సాధించింది తెలంగాణ. దేశ జీడీపీ వృద్ధిరేటును మించి రికార్డు జీఎస్డీపీ వృద్ధి సాధించి యావద్భారతానికి ఆదర్శంగా నిలిచింది తెలంగాణ.

అంకెలకు అందని అంశాలు కొన్ని ఉంటాయి. ప్రశాంత జీవనం, భద్రత, భవిష్యత్‌పై భరోసా. ఈ మూడు విషయాల్లో తెలంగాణ ప్రజలకు రందిలేదు. సార్‌ చూసుకుంటాడన్న నమ్మకం వాళ్లది. తెలంగాణ ఏర్పడితే మత విద్వేషాలు చెలరేగుతాయని వాదించారు. వారి వాదనలను ఖండిస్తూ మత సామరస్యంలో తెలంగాణ అఖండ భారతానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో మత ఘర్షణలు లేవు, దొమ్మీల్లేవు, కర్ఫ్యూలు లేవు, అభద్రత అస్సలు లేదు. తెలంగాణ సంస్కృతి ‘గంగా-జమునా తెహజీబ్‌’. విభిన్న మతాలు, వివిధ రాష్ట్రవాసులతో మినీ ఇండియాగా పేరొందిన హైదరాబాద్‌ మునుపెన్నడూ లేనంత ప్రశాంతంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విధానాలు, బలమైన పోలీస్‌ వ్యవస్థ, రక్షణ చర్యలు, తెలంగాణవాసుల స్వచ్ఛమైన మనసు, రాష్ట్ర పాలకుడి దూరదృష్టి తెలంగాణను కలకాలం సురక్షితంగా ఉంచుతాయి.

చివరగా.. తెలంగాణ ఉద్యమ నినాదం

‘నీళ్లు.. నిధులు.. నియామకాలు’.

స్వరాష్ట్ర సాధన నినాదం ఇప్పుడు విధానమైంది.

ప్రకృతి ధర్మాన్ని కాదని పైకి ప్రవహించిన నీళ్లు..

నీళ్లలా ఉప్పొంగిన నిధులు ..

నిధుల వరదలా ఉద్యోగ నియామకాలు..

ఇప్పుడు మన తెలంగాణ సంపూర్ణ రాష్ట్రం.

శతాబ్దకాలం అభివృద్ధిని ఎమినిదేండ్లలోనే సాకారం చేసుకున్న బంగారు తల్లి.

జై తెలంగాణ.. జైజై తెలంగాణ.