వైద్య, ఆరోగ్యశాఖలో 1,147 పోస్టులు

వైద్య, ఆరోగ్య శాఖలో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 34 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలన్నీ డీఎంఈ పరిధిలో ఉంటాయి. ఉద్యోగాలకు ఎంపికైన వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయరాదని నిబంధన విధించారు. ఇప్పటివరకు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న అభ్యర్ధులకు 20శాతం వెయిటేజీ ఉంటుందని తెలిపారు. ఈ పోస్టుల భర్తీతో రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలు బలోపేతం కానున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీతో ఆరోగ్య తెలంగాణ సాధనలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకుపోతున్నది. ఈ పోస్టులన్నీ వైద్యవిద్య విభాగం పరిధిలోనే వస్తున్నాయి. ఇవన్నీ మల్టీజోనల్ స్థాయి పోస్టులు. నూతన జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత విడుదలైన మొదటి నోటిఫికేషన్ కావడం విశేషం. మల్టీజోన్-1లో 574 పోస్టులు, మల్టీజోన్-2లో 573 పోస్టులు ఉన్నాయి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి 2022 డిసెంబరు 20 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. తుది గడువును 5, జనవరి, 2023 సాయంత్రం 5 గంటలుగా నిర్ధారించారు. ఆయా విభాగాల్లో పీజీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పీజీలో వచ్చిన మార్కులను బట్టి గరిష్టంగా 80 పాయింట్లు కేటాయిస్తారు. మార్కులు కాకుండా గ్రేడింగ్ ఇచ్చే వర్సిటీల్లో చదివినవారికి.. ఏ గ్రేడ్/ఎక్సలెంట్/ఉన్నత శ్రేణి గ్రేడ్ సాధిస్తే 60 శాతంగా, బీ గ్రేడ్/గుడ్/మధ్యమ శ్రేణి గ్రేడ్ సాధిస్తే 55 శాతంగా, చివరి గ్రేడ్ సాధిస్తే 50 శాతం మార్కులుగా పరిగణిస్తారు.
ఇప్పటికే ప్రభుత్వ దవఖానలు, పథకాల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నవారికి 20 పాయింట్లు వెయిటేజీ ఇవ్వనున్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వైద్యులకు ప్రతి ఆరు నెలలకు 2.5 పాయింట్లు, ఇతర ప్రాంతాల్లో పనిచేసినవారికి ప్రతి ఆరు నెలలకు 2 పాయింట్లు కేటాయిస్తారు. కచ్చితంగా 6 నెలలు పూర్తయితేనే పాయింట్లు వస్తాయి. నోటిఫికేషన్ తేదీని కటాఫ్‌గా నిర్ణయించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అనుభవ ధృవీకరణ పత్రం కోసం సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. ధృవీకరణ పత్రం వచ్చిన తర్వాతే ఉద్యోగం కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుతో పాటు సంబంధిత ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత, ఎంపికైన అభ్యర్ధుల తుది జాబితాను బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల అభ్యర్ధులు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200 చెల్లించాలి.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి : మంత్రి హరీశ్‌రావు
ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల వర్షం కురుస్తున్నదని మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అర్హులైన అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
