| |

బాలల చలన చిత్రోత్సవానికి సర్వ సన్నాహాలు

బాలల చలన చిత్రోత్సవానికి సర్వ సన్నాహాలుతెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నాహాలు చేస్తోంది. నవంబరు 14 నుంచి 20వ తేదీ వరకూ నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదేశాలమేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తోంది. ప్రభుత్వం ఈ వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించింది.

ఈ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను చిల్డ్రన్‌ ఫిలిం సొసైటీ ఆఫ్‌ ఇండియా (సి.ఎఫ్‌.ఎస్‌.ఐ) ముంబై, భారత ప్రభుత్వానికి చెందిన ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ విభాగం, మన రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ చలన చిత్రోత్సవాలకు సంబంధించిన ప్రత్యేక వెబ్‌ సైట్‌ను, స్వాగతగీతం సి.డి.ని అక్టోబర్‌ 16న సచివాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ, వాణిజ్యపన్నుల శాఖా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ ఆవిష్కరించారు. ఈ చిత్రోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను www.19icff.com అనే వెబ్‌ సైట్లో చూడవచ్చు.

బాలల అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు హైదరాబాద్‌ ను శాశ్వత వేదికగా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస యాదవ్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఈ చలన చిత్రోత్సవాలకు 1,204 ఎంట్రీలు వచ్చాయని, వీటిని చిల్డ్రన్‌ ఫిలిం సొసైటీ ఆఫ్‌ ఇండియా వారికి పంపామని, వారు ఎంపిక చేసిన చిత్రాలను ఉత్సవాల సందర్భంగా ప్రదర్శిస్తారని మంత్రి తెలిపారు. ఈ వేడుకలలో దేశ, విదేశాల నుంచి 450 మంది బాలలు, సినిమా రంగానికి చెందిన 75 మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఈ ఉత్సవాల ప్రారంభ, ముగింపు వేడుకలు శిల్పారామంలోని శిల్పకళా వేదికలో నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. చిత్రాల ప్రదర్శనకు హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమాక్స్‌ థియేటర్‌ ప్రధాన వేదికగా, నగరంలోని మరో 13 థియేటర్లను ఎంపిక చేశారు. ప్రసాద్‌ ఐమాక్స్‌ లో మీడియా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

మొట్టమొదటి సారిగా, ఈ బాలల చలన చిత్రాల ప్రదర్శనను హైదరాబాద్‌ జంట నగరాలలోనే కాకుండా, అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ప్రదర్శించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

ఈ వేడుకలను సమర్ధవంతంగా నిర్వ హించేందుకు వివిధ రంగాలకు చెందిన 42 మంది ప్రముఖులతో ఆర్గనైజింగ్‌ కమిటీని నియమించారు. అలాగే, స్కూల్‌ కమిటీ, ట్రాన్స్‌ పోర్టు కమిటీ, థియేటర్ల కమిటీ, సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ, మీడియా కమిటీ, సెక్యూరిటీ కమిటీ, నగర సుందరీ కరణ కమిటీ, హాస్పిటాలిటీ కమిటీ వంటి ఎనిమిది సబ్‌ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. సమాచార , పౌర సంబంధాల శాఖ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ బి.పి. ఆచార్య అధ్యక్షతన, శిల్పారామం స్పెషల్‌ ఆఫీసర్‌ కిషన్‌ రావు ఉపాధ్యక్షుడుగా ఎగ్జిక్యూటివ్‌ కమిటీని ఏర్పాటు చేశారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆకాంక్షలకు, ఆదేశాలకు అనుగుణంగా, ఈ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ వెల్లడించారు. ఈ సమావేశంలో సమాచార శాఖ సంచాలకులు వి. సుభాష్‌, చలన చిత్రోత్సవ వేడుకల ఓ.ఎస్‌.డి, పూర్వ సంచాలకులు ఏ. సుభాష్‌ గౌడ్‌, కిషన్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.