| |

నాలుగు రోజుల్లో 21 వేల కోట్లు

రాష్ట్రంగా ఏర్పడ్డ అనతికాలంలోనే సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక, సంక్షేమ రంగాల్లో దేశంలోనే నెంబర్‌ వన్‌ గా నిలిచింది తెలంగాణ. కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచస్థాయిలో కూడా తన ప్రతిభను చాటుకుంటున్నది. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల పెట్టుబడి, విస్తరణ ప్రణాళికల లిస్ట్‌ లో తెలంగాణ పేరే ముందు వరుసలో నిలిచింది. తెలంగాణ యువతకు అపార ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండాలన్న సంకల్పం సాకారం అయింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు మార్గదర్శనంలో, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు నాయకత్వ ప్రతిభ, చొరవ, నిరంతర సమన్వయం, అలుపెరగని కృషితో దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సమావేశాల్లో తెలంగాణ పేరు మారుమోగింది. కొత్త పెట్టుబడులతో పాటు, భవిష్యత్తు పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా మార్చడంలో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంను మంత్రి కేటీఆర్‌ సద్వినియోగం చేసుకున్నారు.

తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణం, సమర్థ నాయకత్వం, పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే ప్రభుత్వ విధానాల ఫలితంగా నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 21వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయి. ఈ సందర్భంగా దావోస్‌ పర్యటనను విజయవంతం చేసిన అధికారులకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ సాధించిన పెట్టుబడులు కంపెనీల వారిగా..

దావోస్‌లో నాలుగురోజుల పాటు జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కేటీఆర్‌ చొరవతో 21 వేలకోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి సమకూరనున్నాయి.

  • రెండు వేల కోట్ల రూపాయలతో ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్‌ ఫీల్డ్‌ డేటాసెంటర్‌ను తెలంగాణలో ఏర్పాటుచేస్తున్నట్లు భారతీ ఏయిర్‌ టెల్‌ గ్రూప్‌ ప్రకటించింది.
  • హైదరాబాద్‌ కేంద్రంగా భారతీయ మార్కెట్‌లో విస్తరిస్తామని ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత ఔషధ పరిశోధన, తయారీ సంస్థ యూరోఫిన్స్‌ ప్రకటించింది.
  • లండన్‌ తరువాత హైదరాబాద్‌లో డిజిటల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించనున్న అపోలో టైర్స్‌.
  • 210 కోట్ల రూపాయల పెట్టుబడితో అలాక్స్‌ అడ్వాన్స్‌ మెటీరియల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. తెలంగాణలో మల్టీ గిగా వాట్‌ లిథియం క్యాథోడ్‌ మెటీరియల్‌ తయారీ కేంద్రం.
  • తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించిన పెప్సికో.
  • నాలుగో పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన కేంద్రాన్ని హైదరాబాదులో ప్రారంభించనున్న ప్రపంచ ఆర్థిక వేదిక.
  • రీహాబిలిటేషన్‌ థెరపీలో రోగులు, వైద్య సంస్థలకు అవసరమయ్యే డిజిటల్‌ సేవలను అందించే వెబ్‌ పీటీ, 150 కోట్లతో హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేపబిలిటీస్‌ సెంటర్‌.

దావోస్‌ వేదికగా నాలుగురోజుల్లో జరిగిన కార్యకలాపాలు

నాలుగు రోజుల్లో అంతర్జాతీయ, దేశీయ దిగ్గజ కంపెనీ అగ్రనాయకత్వాలతో 52 సమావేశాలు.. ఆరు రౌండ్‌ టేబుల్‌ మీటింగ్స్‌, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థిక వేత్తలతో 2 చర్చా గోష్ఠులు జరిగాయి. మొత్తంగా 21 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రం సాధించగలిగింది.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌ ఈసారి కూడా దావోస్‌లో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. మల్టీనేషనల్‌ కంపెనీల ప్రతినిధులు, వివిధ దేశాల వ్యాపార వాణిజ్య సంస్థల నాయకత్వం, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో భాగం పంచుకునే మేధావులు, ఆర్థిక నిపుణులు ఎంతో మంది తెలంగాణ పెవిలియన్‌ను సందర్శించారు. తెలంగాణ భౌగోళిక స్వరూపంతో పాటు ఎనిమిది సంవత్సరాల్లో వివిధ రంగాల్లో సాధించిన పెట్టుబడులు, పారిశ్రామిక, ఐటి దాని అనుబంధ రంగాల్లో చేపట్టిన టీ హబ్‌, టీ వర్క్స్‌ కార్యక్రమాల సమాచారాన్ని ఆసక్తిగా తెలుసుకున్నారు. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం భారీ ప్రాజెక్టు, ఇతర మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ విధానాలపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను చూశారు.

దావోస్‌లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచే పెట్టుబడుల వేట మొదలుపెట్టిన తెలంగాణ టీం, అనుకున్న లక్ష్యాన్ని అందుకుంది. ఐదోసారి వరల్డ్‌ ఎకానమీ ఫోరం సమావేశాలకు హాజరైన మంత్రి కేటీఆర్‌ ఎప్పటిలాగే తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకురావడంలో విజయవంతం అయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు వరుసగా వివిధ దిగ్గజ కంపెనీల అగ్రనాయకత్వాలతో ఓవైపు ముఖాముఖి చర్చలు నిర్వహిస్తూనే, మరోవైపు ప్రఖ్యాత ఆర్థిక సంస్థల సమావేశాలకు హాజరై తెలంగాణ విజయగాథను వివరిస్తూ కేటీఆర్‌ బీజీబిజీగా గడిపారు. ఏ దేశం వెళ్లినా అక్కడి తెలంగాణ ఎన్నారైలను ఆత్మీయంగా కలుసుకునే కేటీఆర్‌, ఈసారి కూడా స్విట్జర్లాండ్‌ జూరిక్‌ లో ఉంటున్న మన మట్టి బిడ్డలతో సమావేశమై తెలంగాణ ప్రగతిని వివరించారు.

అద్భుతమైన పారిశ్రామిక విధానాలతో పాటు మౌలిక వసతులు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపైన పరిచయం చేసేందుకు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశాలు సరైనవని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అందుకే ప్రతిసారి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కేంద్రంగా వివిధ దేశాల వ్యాపార, వాణిజ్య సంస్థలతో తన సంబంధాలను తెలంగాణ బలోపేతం చేసుకుంటూ వస్తున్నదన్నారు. ఈసారి సమావేశాల్లోనూ తమ ఈ లక్ష్యం విజయవంతం అయిందన్నారు. నాలుగు రోజుల ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో దాదాపు 21 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయన్న కేటీఆర్‌, భవిష్యత్తు పెట్టుబడులకు సంబంధించి వివిధ వ్యాపార వాణిజ్య సంస్థలతో జరిపిన చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనే నిరంతరం తమను నడిపిస్తున్నదని కేటీఆర్‌ చెప్పారు.

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల ఏర్పాట్ల నుంచి మొదలుకొని పర్యటన విజయవంతంగా ముగిసేదాకా శ్రమించిన పరిశ్రమల, ఐటీ ,ఇతర శాఖల ఉన్నతాధికారులకు, ముఖ్యంగా తన పర్యటన లో భాగంగా ఉన్న బృందానికి ఈ సందర్భంగా కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఆకాంక్షించారు.

హైదరాబాద్‌ నగరంలో తమ కార్యకలాపాలను విస్తరించనున్న మైక్రోసాఫ్ట్‌

16 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో మరో మూడు డేటా సెంటర్‌లను ఏర్పాటుచేస్తామని మైక్రోసాఫ్ట్‌ సంస్థ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ప్రకటించింది. ఇప్పటికే 16 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో 3 డేటా సెంటర్‌ లను ఏర్పాటుచేస్తామని 2022 లో మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. తాజా నిర్ణయంతో మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడి రెట్టింపు కానున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పెట్టుబడి అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సంఖ్యను రెట్టింపు చేస్తూ ఆరు డేటా సెంటర్‌లను 100 మెగావాట్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాబోయే పది-పదిహేను సంవత్సరాల కాలంలో ఈ ఆరు డేటా సెంటర్‌లు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తాయంది. క్లౌడ్‌ ఆధారిత మౌలిక వసతులను పెంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించాలన్న మైక్రోసాఫ్ట్‌ లక్ష్యంలో భాగంగా ఇంత భారీ పెట్టుబడిని పెడుతున్నామంది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావుతో జరిగిన సమావేశంలో ఈ మేరకు మైక్రోసాఫ్ట్‌ తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వంతో అనేక రంగాల్లో మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌. తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్‌ మధ్య ఉన్న బంధం తాజా పెట్టుబడితో మరింత బలోపేతం అవుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ, క్లౌడ్‌ అడాప్షన్‌ వంటి అంశాల్లో ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ తో కలిసి పని చేస్తున్నామని కేటీఆర్‌ గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆరు డేటాసెంటర్‌ లు హైదరాబాద్‌ లోనే కేంద్రీకృతం కావడం ఎంతో సంతోషకరం అన్నారు. తెలంగాణ కేంద్రంగా మైక్రోసాఫ్ట్‌ మరింత అభివృద్ధి చెందాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు. ఇంత భారీ పెట్టుబడితో హైదరాబాద్‌లో కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు మైక్రోసాఫ్ట్‌ సంస్థకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్‌ నగరంతో మైక్రోసాఫ్ట్‌ అనుబంధం అద్భుతంగా కొనసాగుతున్నదన్నారు మైక్రోసాఫ్ట్‌ ఆసియా హెడ్‌ అహ్మద్‌ మజారీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మార్కెట్‌ లో హైదరాబాదే కీలకం అన్న అహ్మద్‌, భవిష్యత్తులోనూ ఈ నగరంలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. ఇండియా కేంద్రంగా మైక్రోసాఫ్ట్‌ చేపట్టే పలు ప్రాజెక్టులకు హైదరాబాద్‌లో ఏర్పాటుచేయబోయే డేటాసెంటర్‌ లు అత్యంత కీలకంగా మారుతాయన్నారు. డేటా సెంటర్లతో పాటు భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టుల కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఉన్న అవకాశాలను తమ సంస్థ సానుకూలంగా పరిశీలిస్తుందని అహ్మద్‌ మజారీ తెలిపారు.

హైదరాబాద్‌ లోని వెబ్‌ సర్వీసెస్‌ డేటా సెంటర్‌లలో అమెజాన్‌ భారీ పెట్టుబడులు

2030 నాటికి 36 వేల 300 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడతామని అమెజాన్‌ ప్రకటించింది. అమేజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఎంపవర్‌ ఇండియా ఈవెంట్‌లో దావోస్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. అమెజాన్‌ అదనపు పెట్టుబడి, విస్తరణ ప్రణాళికలపై కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఎంపవర్‌ ఇండియా ఈవెంట్‌లో దావోస్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. అమెజాన్‌ సంస్థ భారీ పెట్టుబడులతో డేటా సెంటర్‌ ప్రధాన కేంద్రంగా తెలంగాణ మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమెజాన్‌, తెలంగాణ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్న కేటీఆర్‌, సంస్థ విస్తరణ ప్రణాళికలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు.

ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అత్యుత్తమ క్లౌడ్‌ సేవలను అందించాలన్న లక్ష్యంలో భాగంగా హైదరాబాద్‌ చందన్‌వెల్లి, ఫ్యాబ్‌ సిటీ, ఫార్మా సిటీలో మూడు డేటా సెంటర్‌లను అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఏర్పాటుచేసింది. ఈ మూడు డేటా సెంటర్‌ల మొదటి దశ పూర్తై వినియోగదారులకు పూర్తిస్థాయిలో క్లౌడ్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మూడు డేటా సెంటర్లలో మొదట (2020 సంవత్సరంలో) 20 వేల 96 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టాలనుకుంది అమెజాన్‌. అయితే విస్తరణ ప్రణాళికలు, వ్యాపార వ్యూహాల్లో భాగంగా దశల వారీగా 36 వేల 300 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టాలని అమేజాన్‌ తాజాగా నిర్ణయించుకుంది. అమేజాన్‌ సంస్థకు పెట్టుబడుల గమ్యస్థానంగా ముందు నుంచి హైదరాబాద్‌ ఉంది. ప్రపంచంలోనే తన అతిపెద్ద వెబ్‌ సర్వీసెస్‌ క్యాంపస్‌తో పాటు ఫుల్‌ఫిల్మెంట్‌ సెంటర్‌లు రెండింటిని హైదరాబాద్‌లోనే అమెజాన్‌ ఏర్పాటుచేసింది. ఇక అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ అందించే క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలను తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది.

ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మంత్రి కేటీఆర్‌.. హైదరాబాద్‌ డేటా సెంటర్లలో పెట్టుబడులను అమెజాన్‌ విస్తరిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోకి వస్తున్న అతిపెద్ద ఎఫ్‌.డి.ఐ లలో ఇదొకటన్నారు. ఇ-గవర్నెన్స్‌, హెల్త్‌కేర్‌, పురపాలక కార్యకలాపాలను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. హైదరాబాద్‌లోని అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ క్యాంపస్‌లతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు స్టార్టప్‌లకు ప్రయోజనం కలుగుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు కేటీఆర్‌.

బయోటెక్‌ విప్లవంపై ప్యానెల్‌ చర్చ

ప్రపంచవ్యాప్తంగా హెల్త్‌ కేర్‌ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరస్పర సహకారంతో పరిష్కరించుకోవచ్చునని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దావోస్‌ లోని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బయోటెక్‌ విప్లవంపై జరిగిన ప్యానెల్‌ డిస్కషన్‌లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. అత్యాధునిక సాంకేతికత శక్తి, ఉద్యోగ కల్పనలో దాని సామర్థ్యంపై బయోటెక్నాలజీ దృక్కోణంలో ఈ చర్చా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ తన ఆలోచనలను పంచుకున్నారు.

సాంకేతిక పరిజ్ఞానం అసలు శక్తి సామర్థ్యాలు ఇంకా పూర్తిస్థాయిలో బయటకు రాలేదని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. సైన్స్‌కు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తోడైతే ఎన్నో సమస్యలకు సులువైన పరిష్కారం దొరుకుతుందన్నారు. మెరుగైన, కచ్చితమైన ఔషధాల తయారీతో పాటు ఆరోగ్య సంరక్షణలో మరిన్ని సురక్షిత పద్ధతులు అందుబాటులోకి వస్తాయన్నారు. సైన్స్‌, టెక్నాలజీలు కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన పురోగతి సాధించినప్పటికీ వాతావరణ మార్పులను గుర్తించడంలో బయోటెక్నాలజీని ఉపయోగించుకోలేకపోతున్న విషయాన్ని తాను గమనించినట్టు కేటీఆర్‌ తెలిపారు. వాతావరణ మార్పులకు కచ్చితమైన పరిష్కారాన్ని చూపే విషయంలో పారిశ్రామిక బయో టెక్నాలజీ శక్తిని తక్కువ అంచనా వేస్తున్నామన్నారు. జీవశాస్త్రాన్ని సాంకేతికతతో లైఫ్‌ సైన్స్‌ ను డేటా సైన్స్‌ తో సమ్మిళితపరిచి ప్రపంచానికి మెరుగైన ఫలితాలను అందించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేటీఆర్‌ వివరించారు.

బయోటెక్‌ రంగంలో ఉద్యోగాల కల్పనపై మాట్లాడిన మంత్రి కేటీఆర్‌

27 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న జనాభా 50శాతం, 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు 65శాతం మంది ఇండియాలో ఉన్నారన్నారు. ఉరకలెత్తే ఉత్సాహవంతమైన యువతతో భారతదేశం ఉందన్నారు. అయితే ఈ యువత తీసుకురాగలిగే మార్పును చాలా మంది తక్కువ అంచనా వేస్తున్నారని చెప్పారు. దేశంలోని చాలా పరిశోధనా సంస్థలు వాస్తవ ప్రపంచంలోని సమస్యలు, అంశాలపై కాకుండా సైంటిఫిక్‌ జర్నల్స్‌ లో వచ్చే విషయాలపై మాత్రమే దృష్టి పెడుతున్నట్టు కేటీఆర్‌ చెప్పారు. వాస్తవ ప్రపంచం అవసరాలను సైంటిఫిక్‌ ల్యాబ్‌లలో జరిగే పరిశోధనలతో అనుసంధానించినప్పుడే ఉద్యోగ కల్పనకు అవకాశం ఉంటుందన్నారు. పరిశోధనలు జరిగే విధానాన్ని, దాని ఫలితాన్ని మార్కెట్‌లోకి తీసుకెళ్లే క్రమాన్ని అనుసంధానించినప్పుడు తన సమస్యలను మాత్రమే కాకుండా ప్రపంచ అవసరాలు, సమస్యలను తీర్చే శక్తిగా భారతదేశం ఎదుగుతుందన్న ధీమాను కేటీఆర్‌ వ్యక్తం చేశారు.

అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, రెగ్యులేషన్‌ల విషయంలో భారతదేశ భాగస్వామ్యానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన కేటీఆర్‌, వైద్యరంగంలో ఉన్న మౌలిక సదుపాయాల లోపాలు కోవిడ్‌ తో బయటపడ్డాయన్నారు. అయితే ప్రజల ప్రాణాలే ముఖ్యమన్న విషయాన్ని తేల్చి చెప్పిన కేటీఆర్‌, ఔషధాలు, వ్యాక్సిన్‌ల అనుమతులను వేగంగా ట్రాక్‌ చేసిన సంగతిని ప్రస్తావించారు. ఇంతేకాదు పరస్పర సహకారం లేకుంటే ఎలాంటి సమస్య కూడా పరిష్కారం కాదన్న సత్యాన్ని కోవిడ్‌ తెలియచేసిందన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా లైఫ్‌ సైన్సెస్‌, హెల్త్‌ కేర్‌ రంగాలపై ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆర్థిక వేదికతో కలిసి తెలంగాణ ప్రభుత్వం చేతులు కలిపిందన్నారు.

పరస్పర సహకారం పై మరింత వివరంగా మాట్లాడిన కేటీఆర్‌, నాన్‌-కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సిడి) నుండి వచ్చే ముప్పును పరిష్కరించడానికి కోవిడ్‌ మంచి అవకాశం కల్పించిందన్నారు.

ప్రభుత్వ విధానాలు రూపొందించే నాయకత్వం, ప్రముఖ బయోటెక్నాలజిస్టులు, సాంకేతిక సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాన్ని ప్రపంచ ఆర్థికవేదిక కల్పిస్తుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. ఫలితంగా ప్రపంచానికి ప్రయోజనం కలుగుతుందన్న ఆశాభావాన్ని కేటీఆర్‌ వ్యక్తం చేశారు.

నేచర్‌ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ మాగ్డలీనా స్కిప్పర్‌ నేతృత్వంలో ఈ ప్యానల్‌ డిస్కషన్‌ కొనసాగింది. జాసన్‌ కెల్లీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌- జింగో బయోవర్క్స్‌, జోవన్నా షీల్డ్స్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ – బెనెవోలెంట్‌ఏఐ, నోవో నార్డిస్క్‌ ఫౌండేషన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మాడ్స్‌ క్రోగ్స్‌గార్డ్‌ థామ్‌సెన్‌ వంటి ప్రముఖులు ఈ చర్చా గోష్టిలో పాల్గొన్నారు.