216 అడుగుల శ్రీరామానుజాచార్య విగ్రహం

By: తాళ్ళపల్లి యాదగిరిగౌడ్‌

రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌ మండలం, ముచ్చింతల్‌ శివారు శ్రీరామనగరంలో 2022 ఫిబ్రవరి 3 నుంచి 14 వరకు జరుగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా 5వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడి శ్రీరామానుజుల 216 అడుగుల మహా పంచలోహ భారీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 13న రాష్ట్రపతి కోవింద్‌ మహా విగ్రహం కింద గర్భగుడిలోని శ్రీరామానుజాచార్యుల బంగారపు నిత్యపూజా మూర్తి మహా విగ్రహాన్ని (రెండో విగ్రహాన్ని) తొలి పూజతో ఆవిష్కరణ చేస్తారు.

శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి సంకల్ప బలంతో శ్రీరామనగర్‌ (ముచ్చింతల్‌) దివ్యక్షేత్ర పనులు 2016 నుంచి 45 ఎకరాల్లో రూ.1000 కోట్లతో శరవేగంగా జరిగాయి. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర ప్రాచీనవాస్తు, శిల్పనిర్మాణ శైలులను మేళవించి వివిధ నిర్మాణాలు ఆధ్యాత్మిక కళతో జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన 2700 మంది శిల్పులు తమ అపూర్వ కళా నైపుణ్యంతో వైభవోపేతంగా నిర్మించారు. ముఖ్యంగా శ్రీరామానుజాచార్య 216 అడుగుల మహా పంచలోహ విగ్రహాన్ని వాతావరణ మార్పుల్ని తట్టుకొని వెయ్యేళ్ళ పాటు చెక్కు చెదరకుండా ఉండేలా చైనాలో తయారు చేయించారు. దీని బరువు 1800 కిలోలు. 9 నెలల పాటు 1600 భాగాలుగా విగ్రహాన్ని తయారు చేశారు. ఆ భాగాలను మన దేశానికి తీసుకొచ్చిన తర్వాత చైనాకు చెందిన 60 మంది నిపుణులు వచ్చి విగ్రహాన్ని అమర్చారు.

ప్రపంచంలో రెండోది

`ప్రపంచ వ్యాప్తంగా కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత ఎత్తైన విగ్రహాలలో శ్రీరామానుజాచార్య విగ్రహం రెండోది. ఈ క్రమంలో మొత్తం విగ్రహ స్వరూపం ఇలా ఉంది…. దిగువన భద్రవేదిక 54 అడుగులు, పద్మపీఠం 27 అడుగులు, శ్రీరామానుజుల విగ్రహం 108 అడుగులు, స్వామి చేతిలోని త్రిదండం 27 అడుగుల ఎత్తుతో కూడుకొని ఉంది. కాగా సమతామూర్తి మహావిగ్రహం చుట్టూ శ్రీవైష్ణవంలో దివ్య దేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాలు, గర్భాలయాల ఆకృతిలో 108 ఆలయాలను నిర్మించారు.