రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతు కుటుంబాలకు 3లక్షల ఆర్థిక సహాయం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని దేశంలోని  రైతులు గత సంవత్సర కాలంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమంలో అసువులు బాసిన రైతులకు, ఒక్కో రైతు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 3 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అలాగే కేంద్రం కూడా ఒక్కో మృతిచెందిన రైతు కుటుంబానికి రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసు కోవడం రైతులు పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించుకున్న అద్భుత విజయమని కె.సి.ఆర్‌. కొనియాడారు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం దేశ రైతులు సుమారు 13 మాసాలుగా అవిశ్రాంతంగా ప్రకృతి వైపరీత్యాలను, ప్రభుత్వ అణచివేతను తట్టుకుని రాజధాని ఢిల్లీ సరిహద్దులో నిలిచి గెలిచారన్నారు. రైతులపై కేంద్ర ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ బేషరతుగా ఎత్తివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా కేంద్ర పాలకులు వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ ఎలాగో ‘ఆత్మ నిర్భర్‌ క్రిషక్‌’ అవసరమని తాను ఎప్పుడో ప్రధాని మోదీకి చెప్పానని అన్నారు. 140 కోట్ల జనాభా  ఉన్న దేశంలో వ్యవసాయం సంక్షోభంలో పడితే ప్రజలకు ఆహారాన్ని సమకూర్చే శక్తి ప్రపంచంలో ఏ దేశానికి లేదని ఆయన అన్నారు. అందుకే దేశ ప్రధాని మోదీని మరోసారి వినమ్రంగా కోరుతున్నానని, వ్యవసాయానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.