31 జిల్లాల సమాచార దీపిక ‘ఆలోకనం’

tsmagazine

ప్రపంచ తెలుగు మహాసభల ప్రభావం వల్ల తెలుగు సాహిత్యంలో ఎన్నో కొత్త పుస్తకాలు పురుడు పోసుకున్నాయి. మాస పత్రికలు రంగులు మార్చుకుని, పేజీలు పెంచుకుని నిత్యంకంటే కొత్తగా సాహిత్యం, భాష మూలలను వెలికితీసి ప్రత్యేక సంచికలుగా పరిఢవిల్లాయి. వీటిలో తెలంగాణ సాహిత్య అకాడమి సహాయం పొందినవి కొన్ని. అందులో ఒకటి ‘మూసీ’ మాస పత్రిక. ఈ పత్రిక ‘ఆలోకనం’ (31 జిల్లాల సాహిత్యం, చరిత్ర, సంస్కృతీ సమాహారం) పేరుతో బృహత్‌ గ్రంథాన్ని వెలువరించింది.

ఇన్ని రోజులు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యాలకు రావలసిన గుర్తింపు రాని విషయం మనకు తెలిసిందే. రాష్ట్రం సాధించుకున్నాక మూలాలను తవ్వుతూపోతే చరిత్ర, సాహిత్యాలకు సంబంధించిన కొత్తవిషయాలు ఎన్ని బయల్పడుతున్నాయో. వీటన్నిటిని గ్రంథరూపంలో భద్రపరచుకోడానికి ఎవరో సాహసం చేస్తే తప్ప సాధ్యంకాదు. ఈ పనిని మూసీ ప్రారంభించింది. ప్రతి జిల్లా నుండి ఒక రచయితను ఎంచుకుని ‘ఆలోకనం’కోసం అన్ని అంశాలతో కూడిన ఒక వ్యాసాన్ని రాయించింది. ఆ 31 వ్యాసాల సమాహారమే ఈ గ్రంథం. ఇందులో అన్ని జిల్లాలకు ‘ఈ పేరెందుకు?’తో మొదలుపెట్టి జిల్లా పరిధి, వనరులు, నేలలు, అడవులు, నదులు, ప్రాజెక్టులు, జనాభా, అక్షరాస్యత, జిల్లా చరిత్ర, సంస్కృతి, ఆచారాలు, పండగలు, కళలు, జాతరలు, సాహిత్యం, సాహిత్య సంస్థలు, దర్శణీయ ప్రదేశాలు, ముఖ్య దేవాలయాలు మొదలైన అంశాలను సమకూర్చి ఒక గ్రంథంగా వెలువరించింది. ఈ పుస్తకం పుటలు తిప్పితే తెలంగాణ ఇంతమంది రచయితలకు, కవులకు, కళాకారులకు, చారిత్రక ప్రదేశాలకు, కట్టడాలకు ఆలవాలమా? అని ఆశ్చర్యపోనివారుండరు. ఇంకా సంపాదకుల ముందుమాట ప్రకారం ”జిల్లాల సర్వస్వాలు తయారు చేయడానికి ముందుగా అక్కడ మనకు లభించే సమాచారాన్ని గమనించాలంటే ఒక ముందు చూపు అవసరంగా భావించి తలపెట్టిన గ్రంథము మాత్రమే…” అని రాసారు. అంటే ఇవి పూర్తి సమగ్రమని కాదు. కాని ఈ వ్యాసాల ఆధారంగా ఆయా వ్యాసరచయితల సహాయాలతో 31 జిల్లాల సర్వస్వాలకు, సాహిత్య సంచికలకు శ్రీకారం చుట్టినట్లు ఈ మాటల వల్ల తెలుస్తుంది. ఈ ‘మూసీ’ మానపత్రిక వ్యవస్థాపకులు బి.ఎన్‌.శాస్త్రి మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఆదిలాబాద్‌ వంటి జిల్లాల సర్వస్వాలు తీసిన పరిశోధకులు. వారి బాటలోనే అన్ని జిల్లాల సర్వస్వాలు తీయడానికి అడుగులు వేయబోతున్నందుకు సంతోషం.

ఈ గ్రంథం అంతా ఏకరూపతను సంతరించుకుంది. ఏ జిల్లా వ్యాసాన్ని తీసినా ఒకే రూపంగా కనిపిస్తుంది. రచయితలు అందరు ఒకే విధంగా రాయడం అనేది అసాధ్యం. అంటే సంపాదకుల శ్రమ స్పష్టంగా వ్యక్తమౌతుంది. ప్రతి జిల్లాకు మ్యాపు, చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు, కొంతమంది వ్యక్తుల చిత్రాలు రంగుల కాగితాలతో వేయడం వల్ల ‘ఆలోకనం’ చదువరులను మరింత అలరిస్తుందని అనిపిస్తుంది.

ఈ ఆలోకనం రచయితలలో అన్ని రకాలవారున్నారు. చరిత్రకారులు, పరిశో ధకులు, పండితులు మొదలైనవారు. ఆదిలాబాదు- సామల రాజవర్ధన్‌, జగిత్యాల – సంగనభట్ల నర్సయ్య, జయశంకర్‌ భూపాలపల్లి-పల్లేరు వీరస్వామి, నిర్మల్‌ – మడిపల్లి భద్రయ్య, రంగారెడ్డి-కసిరెడ్డి వెంకటరెడ్డి, మేడ్చల్‌ – ఎం.శ్రీకాంత్‌ వంటి ఎందరో వారి వారి జిల్లాల చరిత్ర, సంస్కృతి, సాహిత్యాలను ప్రాచీనం నుండి ఆధునికం వరకు ఏ అంశాన్ని వదలకుండా సూచన ప్రాయంగా సమకూర్చిన ఈ గ్రంథం అన్ని రకాల వారికి కరదీపికగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాము.

ఆలోకనం
(31 తెలంగాణ జిల్లాల సాహిత్యం, చరిత్ర, సంస్కృతీ సమాహారం)
సం. డా|| సాగి కమలాకర శర్మ
పుటలు : 392
వెల: 500

ప్రతులకు
మూసీ మాస పత్రిక
2-2-1109/బికె-ఎల్‌ఐజి-10,
బతుకమ్మకుంట, బాగ్‌ అంబర్‌పేట,
హైదరాబాదు -13
9347971177