|

5 బిల్లులకు ఆమోదం

assemblyశాసనసభ బడ్జెట్‌ సమావేశాలు 13 రోజులు జరిగాయి. ప్రతిపక్షాలు లేవనెత్తిన పలు అంశాలకు ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు సరైన సమాధానాలు ఇచ్చి సభను సక్రమంగా నడిపించారు. ఈ సమావేశాల్లో పలు కీలకమైన బిల్లులు ఆమోదం పొందాయి. మార్చి 10వ తేదీన ప్రారంభమైన సమావేశాలు మార్చి 27 వరకు జరిగాయి. ఇందులో 13 పనిదినాలు శాసనసభ నిర్వహించబడింది. ఈ సమావేశాలలో అయిదు బిల్లులు ఆమోదం పొందాయి.

కీలకమైన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లుతో పాటు భూదాన్‌ చట్ట సవరణ బిల్లు, ప్రజాప్రతినిధుల జీతాలు, అలవెన్సుల చట్ట సవరణ బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లులు ఆమోదం పొందాయి. సమావేశంలో మొత్తం 72 గంటల 33 నిమిషాలు వివిధ పార్టీలకు చెందిన శాసనసభ్యులు, ఫ్లోర్‌ లీడర్లు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగించారు. పద్దులపై చర్చలు జరపడం, సభ్యుల ప్రశ్నలు, మంత్రుల ధీటుగా జవాబులు ఇవ్వడం జరిగాయి. సమావేశాలలో కాంగ్రెస్‌పార్టీ వైపున 15.14 గంటలు, టీఆర్‌ఎస్‌ 11.14 గంటలు, బీజేపీ 6.32 గంటలు, ఎంఐఎం 5.07 గంటలు, టీడీపీ 2.57 గంటలు, సీపీఎం 1.48 గంటలు మాట్లాడారు. సీఎం చంద్రశేఖరరావు మొత్తం 4.12 గంటలు మాట్లాడారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి 3.15 గంటలు మాట్లాడారు. మొత్తం 65 మంది సభ్యులు మాట్లాడారు. 168 ప్రశ్నలు, 192 అనుబంధ ప్రశ్నలకు సభలో సమాధానమిచ్చారు. మొత్తంగా బడ్జెట్‌ సమావేశాలు అర్దవంతమైన చర్చలతో, ప్రశాంత వాతావరణంలో ముగిసాయి.

మండలి సమావేశాల్లో అర్థవంతమైన చర్చ

ద్రవ్య వినిమయ బిల్లును శాసన మండలి ఆమోదించింది. తొమ్మిది రోజుల పాటు జరిగిన శాసన మండలి బడ్జెట్‌ సమావేశాలల్లో వివిధ అంశాలపై చర్చ జరిగింది.

రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు మార్చి 27తో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు మండలి సమావేశాలు కొనసాగాయి. చివరి రోజున శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్‌ పై చర్చ జరిగింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ పై ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్‌ అలీతో పాటు బిజెపి, ఎంఐఎం సభ్యులు కూడా చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను సూచనలను తెలియజేశారు.

ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌, బ్యాలెట్‌ బాక్స్‌ బడ్జెట్‌ కాదని బడుగుల బ్రతుకులు మార్చే బడ్జెట్‌ అని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన విధంగా ఏ రాష్టాలు అణగారిన వర్గాలకు ఇన్ని నిధులు కేటాయించలేదన్నారు. ప్రతి పైసా ఖర్చులో జవాబుదారీ తనంగా పని చేస్తున్నామని ఈటెల అన్నారు. ప్రభుత్వ సమాధానం తరువాత ద్రవ్య వినిమయ బిల్‌ను శాసన మండలి ఆమోదించింది.

శాసన మండలి బడ్జెట్‌ సమావేశాలు తొమ్మిది రోజులు జరిగాయని చైర్మన్‌ స్వామి గౌడ్‌ తెలిపారు. 34 గంటల33 నిమిషాల పాటు చర్చ జరిగిందని చెప్పారు. జీతాలు, పెన్షన్‌ చెల్లింపుల సవరణ బిల్లు, తెలంగాణ భూదాన్‌, గ్రామధాన్‌ సవరణ బిల్లు, ఎస్సి, ఎస్టీ ప్రత్యేక అభివద్ధి నిధితో సహా మొత్తం ఐదు బిల్లులను శాసన మండలి ఆమోదించింది. మండలి సమావేశాలు నిరవధిక వాయిదా వేస్తున్నట్లు మండలి ఛైర్మన్‌ స్వామి గౌడ్‌ ప్రకటించారు.

తొమ్మిది రోజులు జరిగిన శాసన మండలి సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరిగిందని ముఖ్యమంత్రితో సహా మంత్రులు, సభ్యులు సంతప్తి వ్యక్తం చేశారు.

శాసన సభ సమావేశాల సందర్భంగా విద్యార్థుల మెస్‌ చార్జీలు పెంచుతామంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. తాను ఇచ్చిన హామీ మేరకు మెస్‌ చార్జీలను పెంచుతూ జివో జారీచేశారు. ఈ పెంపు వల్ల 18 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతుంది.

దీనిపై విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, ఇతర నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు బిసి నాయకులు ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.

మెస్‌ చార్జీలు పెంపు

3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు

రూ. 750 నుంచి రూ. 950

8వ నుంచి 10 తరగతి విద్యార్థులకు

రూ. 850 నుంచి రూ. 1,100

పోస్ట్‌ మెట్రిక్‌ విభాగంలో ఇంటర్‌ నుంచి డిగ్రీ వరకు

రూ. 1,050 నుంచి 1400

కాలేజీ హాస్టళ్లలో….

వృత్తి విద్యా కోర్సు వారికి రూ. 962 నుంచి రూ. 1500

పీజీ విద్యార్థులకు రూ. 682 నుంచి రూ. 1500

డిగ్రీ విద్యార్థులకు రూ. 520 నుంచి రూ. 1000

ఇంటర్‌ రూ. 520 నుంచి రూ. 750

స్టూడెంట్‌ మేనేజ్డ్‌ హాస్టల్స్‌

డే స్కాలర్స్‌లోని వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు రూ. 442 నుంచి రూ. 650

పీజీ విద్యార్థులకు రూ. 442 నుంచి రూ. 650

డిగ్రీ విద్యార్థులకు రూ. 325 నుంచి రూ. 500

ఇంటర్‌ విద్యార్థులకు రూ. 425 నుంచి రూ. 500