|

8 స్థానిక సంస్థలకు పురస్కారాలు

  •  దీనదయాల్‌ ఉపాధ్యాయ్‌ పంచాయతీ సశక్తి కరణ్‌ పురస్కార్‌కు ఎంపికైన ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌
  •  సిద్ధిపేట, శ్రీరాంపూర్‌ మండల పరిషత్‌లకూ పురస్కారం
  •  ముష్టిపల్లి, ఇర్కోడు, గంట్లవల్లి, వెలిచాల పంచాయతీలకూ అవార్డులు
  •  నానాజీ దేశ్‌ముఖ్‌ రాష్ట్రీయ గౌరవ్‌ గ్రామసభ పురస్కారానికి ఎంపికైన కరీంనగర్‌ జిల్లా
  •  సైదాపూర్‌ మండలం దుద్దెనపల్లి పంచాయతీ

తెలంగాణాలోని 8 స్థానిక సంస్థలకు ఉత్తమ పంచాయతీ పురస్కారాలు దక్కాయి. ఈ అవార్డులను ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం జాతీయ పంచాయతీ దివస్‌ను పురస్కరించుకుని అందజేస్తోంది. ఇందులో ఈ ఏడాదికి దీనదయాల్‌ ఉపాధ్యాయ్‌ పంచాయతీ సశక్తి కరణ్‌ పురస్కార్‌కు తెలంగాణాలోని ఒక జిల్లా పరిషత్‌తో పాటు…రెండు మండల పరిషత్‌లను, మరో నాలుగు గ్రామ పంచాయతీలను కేంద్రం ఎంపిక చేసింది. ఇందులో జిల్లా పరిషత్‌ విభాగంలో ఆదిలాబాద్‌, మండల పరిషత్‌ విభాగంలో సిద్ధిపేటతో పాటు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌ మండల పరిషత్‌కు పురస్కారం దక్కింది. గ్రామపంచాయతీ విభాగంలో రాజన్న సిరిసిల్ల మండలం ముష్టిపల్లి, సిద్ధిపేట మండలం ఇర్కోడు, రంగారెడ్డి జిల్లా ఫారూఖ్‌నగర్‌ మండలం గంట్లవల్లి, కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం వెలిచాల పురస్కారం దక్కించుకున్నాయి.

జిల్లా పరిషత్‌కు 50 లక్షలు, మండల పరిషత్‌లకు 25 లక్షలు, గ్రామపంచాయతీలకు జనాభా ప్రాతిపదికన 8 నుండి 12 లక్షల నగదు ప్రోత్సాహకం కూడా కేంద్రం అందజేస్తుంది. అలాగే నానాజీ దేశ్‌ముఖ్‌ రాష్ట్రీయ గౌరవ్‌ గ్రామ సభ పురస్కారాన్ని కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం దుద్దెనపల్లి దక్కించుకుంది. ఈ కేటగిరి కింద దాదాపు 10 లక్షల నగదు ప్రోత్సాహకం దక్కనుంది. జాతీయ పంచాయతీ దివస్‌ను పురస్కరించుకుని మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో 2016-17లో ప్రతిభ కనబర్చిన అవార్డు గ్రహీతలకు కేంద్రం పురస్కారాలు అందజేసింది. అవార్డు గ్రహీతలను పంచా యతీరాజ్‌ మరియు గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు.