|

పోటీ పరీక్షలకు ‘వారధి’

By: యం. రామాచారి

ఉద్యోగ గర్జనతో ఉద్యమాన్ని మొదలు పెట్టింది. జిల్లా సమగ్ర అభివృద్ధిలో అన్నింటా అగ్రగ్రామిగా నిలిచేలా చేసింది. బీడు పడ్డ భూములకు కాళేశ్వరం జలాల బాట పట్టించేలా చేసిన సిద్ధిపేట గడ్డ మరో కొత్త పంథాకు సంకల్పించింది. ఈ తరం యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమై ఉద్యోగ నియామకాలపై గురి పెట్టాలని శిక్షణ కేంద్రాలకు శ్రీకారం చుట్టింది.

2016లోనే ప్రారంభమైన కేసీఆర్‌ ఉచిత శిక్షణ శిబిరంలో.. వెయ్యి మంది టెట్‌ శిక్షణలో 800 అర్హత, పోలీసు ఉద్యోగాలలో 608 శిక్షణలో 224 మంది కానిస్టేబుల్స్‌, 8 మంది సబ్‌ ఇన్స్‌ పెక్టర్లు, గ్రూపు పరీక్షకు హాజరైన 350 శిక్షణలో  వివిధ శాఖలలో 22 మందికి ఉద్యోగాలు, 300 మంది డీఎస్సీ శిక్షణలో 66 మంది అర్హత పొందారు. ఈ మేరకు నిర్మాణాత్మకంగా అడుగులు వేసి ప్రభుత్వ పరిపాలకులుగా మారాలంటూ.. ఓ వైపు టెట్‌, మరో వైపు పోలీసు నియామకాలకు కేసీఆర్‌ ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేయించి జిల్లాలోని ఈ తరం యువతకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు మార్గదర్శనం చేస్తున్నారు.

పట్టు పడితే ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఉచితం అనే భావన వద్దు. మీలో సిన్సియారిటీ ఉండాలి. ఉద్యోగ సాధన ఇప్పుడు కష్టం కానీ జీవితమంతా సుఖమయం. మీరు ఉద్యోగాలు సాధించడమే మాకు నిజమైన ప్రోత్సాహమని, అప్పుడే మరింత చేయాలనే ఉత్సాహం వస్తదని రాష్ట్ర మంత్రి హరీశ్‌ రావు ఉద్యోగార్థులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాదు కంటే అద్భుతంగా ఇక్కడ శిక్షణ ఏర్పాటు చేశామని, ఇప్పుడు 600 మందికి టెట్‌ శిక్షణ తరగతులు ప్రారంభించినట్లు తెలిపారు. ‘‘మీరు టెట్‌ అర్హత, పోలీసు ఉద్యోగాలు సాధించినప్పుడే మాకు ఆనందం ఉంటుంది. మీరంతా నా కుటుంబ సభ్యులు, తోబుట్టువులా భావించి నా స్వంత డబ్బులు వెచ్చించి శిక్షణ ఇప్పిస్తున్నట్లు’’ వివరించారు. 

ఈ రెండు నెలలు దించిన తల ఎత్తకుండా చదవాలి. అప్పుడే మీ జీవితమంతా తల ఎత్తుకునేలా బతుకుతారని తెలిపారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకోవాలని హితవు చెప్పారు. కేవలం ఉపాధ్యాయ ఉద్యోగం కోసం కాకుండా, ఇంకా చాలా ఉద్యోగాలు ఉన్నాయని, వాటిపై దృష్టి పెట్టాలని, ఇందుకోసం ఈ టెట్‌ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మీరు ఉద్యోగం సాధించినప్పుడే ఈ శిబిరానికి సార్ధకత ఉంటుంది. ఉచిత శిక్షణ శిబిరంలో ఏదీ ఉచితంగా రాలేదు. కావున 

ఉద్యోగార్థులంతా కష్ట పడి చదవాలని కోరారు. శిక్షణ తర్వాత ఫిజికల్‌ ట్రైనింగ్‌ కూడా ఇస్తారని, ఉచితంగా యువతీ, యువకులకు ట్రైనింగ్‌ ఇస్తున్న కోచింగ్‌ సెంటర్‌, నిర్వాహకులకు కలుపుకుని ప్రభుత్వం రూ.1.50 కోట్ల ఖర్చు భరిస్తున్నదని, ఒక్కో విద్యార్థిపై రూ.14 వేల రూపాయల వ్యయం అవుతున్నదని చెప్పుకొచ్చారు. దూర వ్యయప్రయాసలకులోను కాకుండా, మీకోసం చేపట్టిన ఈ శిక్షణ తరగతులకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లలో హైదరాబాదులో కూడా లేని సౌకర్యాలను సిద్దిపేట ఉచిత కోచింగ్‌ సెంటర్‌లో కల్పిస్తున్నామని వివరించారు. కోచింగ్‌ సెంటర్‌ లను సిద్ధిపేట పోలీసు కమిషనర్‌ శ్వేతాతో పాటు తాము కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తామని మంత్రి చెప్పారు. 

సిద్ధిపేట-పొన్నాల టీఆర్‌ఎస్‌ భవన్‌లో ‘కేసీఆర్‌ ఉచిత శిక్షణ శిబిరం’లో టెట్‌ శిక్షణ తరగతులు, సిద్ధిపేట బీజేఆర్‌ హాల్‌, రాజగోపాల్‌ పేట పాలిటెక్నిక్‌ కళాశాల, గజ్వేల్‌ మహాతి ఆడిటోరియంలో ఉచిత పోలీసు కానిస్టేబుల్‌ శిక్షణ తరగతులు ప్రారంభించారు. మొత్తం 70 రోజులు ఈ శిక్షణ శిబిరాలు జరగనున్నాయి. సిద్ధిపేటలోని బీజేఆర్‌ భవన్‌ లో రెండు కేంద్రాలు, నంగునూరు మండలం రాజగోపాల్‌ పేట పాలిటెక్నిక్‌, గజ్వేల్‌ మహతి ఆడిటోరియంలో శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. మొత్తం 1162 మంది శిక్షణ పొందుతున్నారు. వీరిలో దాదాపు 400 మంది మహిళలు ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ తరగతులు కొనసాగుతున్నాయి. 

త్వరలోనే శారీరక ధారుడ్యం పై శిక్షణ

పేరొందిన శిక్షణ సంస్థ నిర్వాహకులతో తరగతులు నిర్వహణ జరుగుతున్నది. ఆర్థమేటిక్‌, రీజనింగ్‌, జనరల్‌ ఇంగ్లీషు, సైన్స్‌, ఇండియన్‌ పాలిటిక్స్‌, జాగ్రఫీ, దేశ ఆర్థిక వ్యవస్థ, భారత, తెలంగాణ చరిత్రలు, తెలంగాణ ఉద్యమం, జనరల్‌ నాలెడ్జి, కరెంటు అఫైర్స్‌ తదితర అంశాలపై సన్నద్ధం చేస్తున్నారు. శిబిరాల్లో తొమ్మిది మంది చొప్పున్న భోధకులు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఒక్కో అభ్యర్థికి సుమారు రూ.18, 500 వెచ్చిస్తున్నారు. అదే స్థాయిలో హైదరాబాదు, ఇతర ప్రాంతాల్లో శిక్షణ తీసుకుంటే రూ.50 వేల వరకూ ఖర్చు అవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రిలిమినరీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే శారీరక ధారుడ్య-ఫిజికల్‌ టెస్టు, శిక్షణ సైతం ప్రారంభించనున్నారు. ఇప్పటికే శిక్షణార్థులకు టీ షర్టులు పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థికీ ఐడీ కార్డు జారీ చేశారు. అయితే శిక్షణలో ప్రవేశానికి ముందుగానే స్క్రీనింగ్‌ నిర్వహించగా, 4800 మంది హాజరయ్యారు. వీరిలో 1162 మంది అర్హత సాధించారు. 

ఈ మేరకు గతంలో సీఎం కేసీఆర్‌ పేరిట నిర్వహించిన టెట్‌ శిక్షణ తరగతులలో హాజరై ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన స్రవంతి, అలాగే పోలీసు కానిస్టేబుల్స్‌ గా ఎంపికైన మమత, స్వాతి, ఎస్‌ఐగా ఎంపికైన జ్యోతిలు.. తమ జీవితంలో మంత్రి హరీశ్‌ రావు వెలుగులు నింపారని మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 

శిక్షణ పొంది ఉద్యోగం సాధిస్తేనే నిజమైన సార్థకత

పరిస్థితి బాగా లేక దూరం వెళ్ళలేదు. పైగా అప్పుడు నేను గర్భిణీగా ఉన్న. ఇవాళ ఉద్యోగం సాధించి కొడుకుతో కలిసి వచ్చిన. పత్తి మార్కెట్‌ యార్డులో టెట్‌ శిక్షణ తీసుకుని సద్వినియోగం చేసుకుని ఇవాళ ఉద్యోగం సాధించిన. మనం ఇక్కడ శిక్షణ పొందడం గొప్ప కాదు. టెట్‌ శిక్షణ పొంది ఉద్యోగం సాధిస్తేనే నిజమైన సార్థకత ఉంటుంది. మనలాంటి వాళ్లకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తూ ఇందుకు సహకరిస్తున్న మంత్రి హరీశ్‌ రావు సార్‌ కు జాబ్‌ సాధించి కృతజ్ఞతలు వ్యక్తం చేద్దాం. 

– స్రవంతి, ఉపాధ్యాయురాలు

కల సాకారం చేసుకునే అవకాశం

పోలీసు శాఖలో ఉద్యోగం చేయాలనేది నా కల. అది నెరవేర్చుకునే అవకాశం వచ్చింది. కొన్ని కారణాలతో బీఎస్సీ నర్సింగ్‌ మధ్యలోనే మానేయాల్సి వచ్చింది. ఇప్పుడు కానిస్టేబుల్‌ ఉద్యోగానికి సిద్ధమయ్యాను. హైదరాబాదు వెళ్ళి శిక్షణ తీసుకునే ఆర్థిక స్థోమత మాకు లేదు. మంత్రి హరీశ్‌ రావు సార్‌, పోలీసు శాఖ చేపట్టిన ఈ శిక్షణ కేంద్రం మా లాంటి మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో మంచింది. రోజు చేర్యాల నుంచి సిద్ధిపేటకు కోచింగ్‌కు వస్తున్నా. ఇక్కడ శిక్షణ చాలా బాగా ఇస్తున్న తీరు బాగుంది. ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తదనే నమ్మకం ఉన్నది. 

– ప్రస్తుతి, కడవేర్గు-చేర్యాల 

అమ్మానాన్నలు ఎద్దులు అమ్మి బీఈడీ చేయించారు

మాది నారాయణరావుపేట మండలం జక్కాపూర్‌ గ్రామం. అమ్మానాన్నలు వెంకటలక్ష్మీ, వెంకటేశం. వ్యవసాయ కుటుంబం. 2019లో పెళ్లి జరిగింది. భర్త కనకరాజు ప్రైవేట్‌ కళాశాల అధ్యాపకుడు. 2017లో బీఈడీ  పూర్తయ్యింది. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, కానిస్టేబుల్‌, ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐగా కొలువు సాధించాను. 2019లో ఎస్‌ఐగా ఎంపికయ్యాను. మంత్రి హరీశ్‌ రావు, పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణ శిబిరాన్ని  సద్వినియోగం చేసుకున్నా. రెండేళ్లు పడ్డ శ్రమ వృథా కాలేదు. ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఎన్నోసార్లు అనేక ఇబ్బందులు పడ్డాం. ఎన్నోసార్లు ఉపాధి కూలీ పనికి వెళ్ళాను. అమ్మానాన్న ఎద్దులు అమ్మి నాకు బీఈడీ చేయించారు. ప్రస్తుతం నారాయణగూడ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న. పట్టుదల, తపనతో ముందడుగు వేయాలి. 

– జ్యోతి, నారాయణగూడ (సబ్‌ ఇన్స్‌ పెక్టర్‌)

ఖచ్చితంగా ఎస్‌ఐ అవుతా

గతంలో హైదారాబాదులో గ్రూపు-2 శిక్షణ తీసుకున్నా. శిక్షణకే వేల రూపాయలు ఖర్చు అయ్యింది. పైగా వసతికి చాలా ఇబ్బంది అయ్యింది. 2019లో డిగ్రీ పూర్తయ్యింది. సిద్ధిపేటలో ఉచిత శిక్షణ అందిస్తున్న మంత్రి హరీశ్‌ రావు, సీపీ శ్వేతలకు ఎంతగానో రుణపడి ఉంటాం. ఇక్కడ అన్ని సదుపాయాలతో ఉచితంగా శిక్షణ ఇవ్వడం ఎంతో మందికి మేలు చేకూరుతుంది. ఖచ్చితంగా నేను ఎస్‌ఐ అవుతా.

– మహేశ్‌, చిట్టాపూర్‌-దుబ్బాక 

మా జాబే నాన్నను బతికించింది

వన్‌ టౌన్‌, టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌ కానిస్టేబుల్‌ స్వాతి, మమత

ఆత్మ స్థైర్యంతో.. ఆశయ సాధన దిశగా.. మమత, స్వాతి. ఇప్పటికే కానిస్టేబుల్‌ ఉద్యోగాలు చేజిక్కించుకుని గ్రూప్‌-1 పై గురి పెట్టిన సిద్ధిపేట పొన్నాల యువతుల స్ఫూర్తి కథనం ఇది. అసలే పేదరికం. ఆపై నలుగురు ఆడపిల్లలు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. అందరిలా కాకుండా తమ బిడ్డలకు మంచి భవిష్యత్‌ అందించాలని తల్లిదండ్రులు బిడ్డలకు ధైర్యం చెబుతూ.. రెక్కలు ముక్కలు చేసుకుని చదివిస్తే వారి తల్లిదండ్రులు ఆశలను మమత, స్వాతిలు వమ్ము చేయలేదు. పేదరికం వెంటాడుతూ.. వెనక్కి నడిపిస్తుంటే..పేదరికం ప్రతిభకు ప్రతిబంధకం కాకూడదని అనుకున్నారు. తమ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చేందుకు అత్మసైర్యం, ధైర్యంతో వేసిన ముందడుగు సులభంగా కానిస్టేబుల్‌ ఉద్యోగాలను చేజిక్కించుకునేలా చేసింది. ఫలితంగా మంత్రి తన్నీరు హరీష్‌ రావు, సిద్ధిపేట పోలీసు కమిషనర్‌ ఎన్‌. శ్వేతతో సహా పుర ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తేలా చేసింది. 

తమలాంటి మధ్యతరగతి కుటుంబీకులకు మంత్రి హరీశ్‌ రావు ఇప్పించే శిక్షణ సద్వినియోగం చేసుకుని, సీపీ శ్వేత మేడంలా తాము కావాలన్నదే వారి కల. అదే స్ఫూర్తితో.. రాష్ట్రంలోనే అత్యున్నత సర్వీస్‌ గ్రూప్‌-1 సాధనే లక్ష్యంగా ఐపీఎస్‌ పై గురిపెట్టిన అక్కాచెల్లెళ్ళు సన్నద్ధమై ‘‘తల్లిదండ్రుల బెంగ తీర్చిన కూతుళ్ల’’ మాటల్లోనే… 

 మా స్వగ్రామం పొన్నాల. అమ్మానాన్నలు వజ్రవ్వ, సత్యనారాయణ. అమ్మ గృహిణి, నాన్న బీడీ కంపనీలో టేకేదారు. మా ఇంట్లో నలుగురం అక్కా చెల్లెలం. ఇద్దరు అక్కల పెళ్లిళ్లు జరిగాయి. మమత 2016లో బీటెక్‌ పూర్తి చేసింది. స్వాతి బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతుండగా 2018 నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగం వచ్చింది. కాంపీటెటీవ్‌ ఎగ్జామ్స్‌ గురించి ఏమీ తెలియదు. అక్క మమతతో పాటు శిక్షణకు ఎంట్రన్స్‌ టెస్ట్‌ జస్ట్‌ అంటెప్ట్‌ చేస్తే 90 శాతం పై మార్కులు వచ్చాయి. క్లాసులకు రావడం లేదని శిక్షణ శిబిరం నుంచి కాల్స్‌ వచ్చేవి. 10 సార్లు కాల్స్‌ వస్తే ఇక తప్పేది లేదని అక్క మమతతో కలిసి వెళ్లాను. క్లాసులు చెప్పిన ప్రతి భోధకుడు మాకు అర్థమయ్యే విధంగా చెప్పేవారు. నేను శ్రద్దగా విని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదివాను. కాంపీటేషన్‌ 1:50 నిష్పత్తిలో ఉన్నదనే విషయం నాకు తెలియదు. అందులో సీటు నాకొస్తదనే నమ్మకం కూడా లేదు. అప్పట్లో సీపీ జోయల్‌ డేవీస్‌, మంత్రి హరీశ్‌ రావు సార్‌ అప్పుడప్పుడు వచ్చి మానిటరింగ్‌ చేసేవారు. అప్పుడు రోహిణి అక్క స్టేజీ పై మాట్లాడే మాటలు విని, నేను స్టేజీ పై మాట్లాడాలి అని ఫిక్స్‌ అయ్యాను. ఇక జాబ్‌ వచ్చి సెలెక్ట్‌ అయిన తర్వాత ట్రైనింగ్‌ పూర్తయ్యింది. 

అయితే ట్రైనింగ్‌ ప్రారంభమై వెళ్లిన తర్వాత ఊర్లో ఫస్ట్‌ కరోనా మా నాన్నకు వచ్చింది. బతుకుతారో లేదో అన్న స్టేజీలో అందరూ ట్రైనింగ్‌ లో స్పొర్ట్స్‌ అన్నీ బాగా చేస్తుంటే మేము మాత్రం ఇద్దరం ట్రైనింగ్‌ లో ఏడుస్తున్నాం. నాన్నకంటే ఎక్కువేమీ కాదని ట్రైనింగ్‌ వదిలేసి వద్దామని డిసైడ్‌ అయ్యాను. అప్పుడు ఉన్న ఎస్పీ గారు మంత్రి హరీశ్‌ రావు దృష్టికి తీసుకెళితే మెడికల్‌ ఆఫీసర్‌ తో మాట్లాడి మా నాన్నకు స్పెషల్‌ కేర్‌ గా చూశారు. నాన్న చావు బతుకుల మధ్య ఉన్నప్పుడైనా నేను దగ్గరుండి కూడా కరోనా కారణంగా ఏమీ చేయలేని పరిస్థితి అని తెలిసిందే. కానీ నా జాబే మా నాన్నను సేవ్‌ చేసింది. నేను ఇక్కడ ఈ పోలీసు ట్రైనింగ్‌ ఉండి ఉన్నాను కాబట్టే ఇదంతా నా జాబ్‌ వల్లే సాధ్యమైంది. అంటే ఈ జాబ్‌ కు ఇంత వాల్యూ ఉంటదా అని మళ్లీ అనిపించింది. ఇక ట్రైనింగ్‌ పూర్తయి పోస్టింగ్‌ ఎక్కడిస్తారో తెలియదు. ప్రజల్లోకి వచ్చి సర్వీసు చేయాలంట. ఎట్లా అనే తెలియని ఆందోళన నాలో మొదలైంది. సిద్ధిపేట టీటీసీ భవన్‌లో సీపీ జోయల్‌ డేవీస్‌ సార్‌ పిలిచి మెరిట్‌ లిస్టులో ఫస్ట్‌ ఉన్నావ్‌ నువ్వు. ఏ పోలీసు స్టేషన్‌ కావాలి. ఏం పోస్టింగ్‌ కావాలి అమ్మా నీకు అని అడిగారు. అప్పుడు నాకు అనిపించింది కష్టపడ్డ ఫలితం వృథాగా పోలేదు. కష్టపడితే ఏదో రూపంలో ఫలితం తిరిగి తప్పక వస్తదని టూ టౌన్‌ సెలెక్ట్‌ చేసుకున్నాను. 

హరీశ్‌ రావు సార్‌ స్పెషల్‌ థాంక్స్‌

ఫైనాన్షియల్‌గా అయితే మేము ఇంతగా చదువుకునే వాళ్లంకాదు. ఏ ఇంట్లో ఒక్కరికీ జాబ్‌ వస్తేనే సెట్‌ అయి పోతుంది. అట్లాంటింది. మా ఇంట్లో రెండు జాబులు వచ్చినయ్‌. అంటే మీ సపోర్ట్‌ వల్లనే సార్‌. ఫైనాన్షియల్‌గా నేను పూర్‌, రిచ్‌ అని ఎప్పుడు మీరు అనుకోవద్దు. మీకు చేయాలని కోరిక, తపన ఉంటే సిచ్యువేషన్‌ డిమాండ్‌ చేస్తది అంతే. మిగతా అంతా ఛాన్స్‌ వస్తది. మీరు ఏదైనా చేయగలుగుతారు.