హరితంలో విశ్వనగరం!

రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోంది. రాష్ట్ర రాజధాని, విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌ మహానగరంలో పెద్దఎత్తున మొక్కలు నాటడంతోపాటు, వాటిని పరిరక్షించేందుకు తగు చర్యలు చేపట్టడం ద్వారా నగరాన్ని సుందరంగా, ఆరోగ్య వంతంగా తీర్చిదిద్దుకోగలుగుతున్నాం. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకొంటోంది. ఇప్పుడు ఏకంగా, హైదరాబాద్‌ మహానగరం  పచ్చదనంలో అంతర్జాతీయ గుర్తింపు పొంది,  ట్రీ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌ – 2020గా ఎంపికయింది.

ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎప్‌.ఏ.ఓ), అర్బర్‌ డే ఫౌండేషన్‌లు ప్రపంచంలోని 63 దేశాలనుంచి 120 నగరాలను పరిగణ లోకి తీసుకోగా, వీటిలో 51 నగరాలను 2020 సంవత్సరానికి ట్రీ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌గా ఎంపికచేశాయి. వీటిలో మన దేశంలో ఏకైక నగరంగా మన హైదరాబాద్‌ నగరం ఎంపిక కావడం నిజంగా గర్వకారణం. గతంలో కన్నా పెద్దసంఖ్యలో మొక్కలు, అడవులు పెంచడం ద్వారా హైదరాబాద్‌ నగరం మరింత ఆరోగ్యకర మైన, నివాసయోగ్యమైన నగరంగా రూపొందడం అభినందనీయమని అర్బర్‌ డే ఫౌండేషన్‌ అధ్యక్షుడు డానే లాంబే ఈ సందర్భంగా తన సందేశంలో పేర్కొనడం కూడా విశేషమే.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో చేపట్టిన అర్బన్‌ ఫారెస్టు బ్లాక్‌ల ఏర్పాటు, ఎవెన్యూ ప్లాంటేషన్లు, కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, ఖాళీ స్థలాలలో పెద్దఎత్తున చేపట్టిన హరితహారం ప్లాంటేషన్‌ లు హైదరాబాద్‌ నగరానికి ఈ అవార్డు లభించడానికి దోహదం చేశాయి.

రాష్ట్రంలో హరితవనాలను 35 శాతానికి పెంచాలన్న సంకల్పంతో తెలంగాణకు హరితహారం అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి,  ప్రతియేటా కోట్లాది మొక్కలు నాటేందుకు ఎనలేని కృషిచేస్తున్న ముఖ్యమంత్రి qకే. చంద్రశేఖర రావు నిజమైన హరిత అభిమాని. అందుకే ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా కోటి వృక్షార్చన నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ నిర్వాహకుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ పిలుపునివ్వడంతో  రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, అభిమానులు ముందుకు కదలి వచ్చి కోటి వృక్షార్చన ను విజయవంతం చేయడం శుభ పరిణామం.