|

తెలంగాణ వైభవాన్ని చాటిన నృత్యరూపకం

dcf‘‘జయతు జయతు జయోస్తు తెలంగాణ మాత’’ అన్న గీతం రవీంద్ర భారతి ఆడిటోరియంలో మారు మ్రోగింది. ఆ శ్రావ్యమైన గీతంతో పాటు లయబద్ధంగా నాట్యం చేస్తున్న దృశ్యం చూస్తున్నవారందరినీ ఆనందడోలికల్లో ముంచెత్తింది. మే 5న రవీంద్ర భారతి వేదికగా ప్రముఖ సాంస్కృతిక సంస్థ త్రైలోక్య ఆర్ట్స్‌ అసోసియేషన్‌ తన 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భాషా సాంస్కృతిక సంస్థ సౌజన్యంతో ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డి రచించిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ నృత్య రూపకాన్ని, డి.వి.ఎస్‌. శాస్త్రి సంగీత దర్శకత్వంలో ప్రముఖ నృత్య గురువు ఇందిర పరాశరం నృత్య దర్శకత్వంలో ప్రదర్శించింది. ఈ నృత్యరూపకం ఆద్యంతం కనువిందు చేసింది.

వేలాది సంవత్సరాల తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక నేపధ్యంగా సాగిన ఈ రూపకంలో నదులు, నాగరికత, పరిపాలించిన రాజులు, కళాపోషణ, సాహిత్య వికాసం, గ్రామీణ జీవనం, ఆటలు, పాటలు, పండుగలు, పాల్కుర్కి సోమన, రామదాసు, పోతన, కుంరం భీం, సమ్మక్క`సారక్కలు, కాళోజీ మొదలైన వారి ఎనలేని సేవానిరతి, పోరాటాలు, ఉద్యమాలు , శాతవాహనులు, కాకతీయులు, గోలుకొండ నవాబులు కాలంనుండి నేటి మన ప్రియతమ ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. వరకు తెలంగాణ వైభవవాన్ని చక్కగా ప్రదర్శించారు ఇందిర పరాశరం, వారి బృందం. తొలుత వినాయక కౌతంతో ప్రారంభమయింది. దాదాపు గంటన్నర సేపు సాగిన ఈ రూపకంలో 40 మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు, నృత్య కళాకారులు పాల్గొని చక్కగా నృత్యం చేసి తమ ప్రతిభను చూపించారు.

ఈ కార్యకమ్రానికి రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి కళాకారులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన చారిత్రక నేపథ్యం ముందు తరాలవారికి తెలియవలసిన అవసరం ఎంతయినా వుందన్నారు. అందుకు ఇటు నృత్య రూపకాలు ఎంతగానో దోహదపడతాయని కొనియాడారు. చక్కని రచనను అందించిన రచయిత నందిని సిధారెడ్డి అభినందనీయుడని కొనియాడారు.

సభకు అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉద్వేగభరితంగా సాగిన ఈ రూపకం వివిధ చోట్ల ప్రదర్శిస్తే విద్యార్థులకు మన తెలంగాణ వైభవం, గొప్పదనం తెలియజేయడానికి ఎంతగానో దోహద పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పి.ఆర్‌.వో. డా॥ జె. చెన్నయ్య, ప్రముఖ నృత్య గురువు డా॥ వనజా ఉదయ్‌, రచయిత నందిని సిధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యాఖ్యానం, లైటింగ్‌, కాస్టూమ్స్‌, సంగీతం,నృత్యరూపకానికి మరింత శోభను ఇనుమడింపజేశాయి.