ఒక విశ్వాసం… ఒక భరోసా !

అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పరుగులు తీస్తున్న తెలంగాణ రాష్ట్రం ఏడేళ్ళు పూర్తిచేసుకొని నిండైన ఆత్మవిశ్వాసంతో ఎనిమిదవ వసంతంలోకి అడుగు పెడుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న పరిస్థితులకు నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది వాస్తవం. రాష్ట్ర అవతరణ నాటినుంచి ఈనాటి వరకూ సాగిన విజయ ప్రస్థానమే ఇందుకు నిదర్శనం.

నూతన రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించే చారిత్రక ప్రస్థానంలో ఎన్నో ప్రతిబంధకాలు, అవరోధాలు, సమస్యలు, సవాళ్ళు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, వాటన్నింటినీ అధిగమించి పురోగమించగలిగాం. నాటి ఉద్యమ సారధి, నేటి మన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిరంతర శ్రమ, మేథోమథనం, దార్శనికత, దూరదృష్టి రాష్ట్రాన్ని విజయపథం వైపునడిపిస్తోంది. అందుకే ఏడేళ్ళ ప్రాయం గల తెలంగాణ రాష్ట్రం ఏడుదశాబ్దాల వయసున్న రాష్ట్రాలతో పోటీపడటమేగాక, అనేక రంగాలలో దేశానికే ఆదర్శంగా నిలువగలిగింది.

రాష్ట్ర ప్రగతిరథం సజావుగా సాగుతున్న తరుణంలో కరోనా రూపంలో ఊహించని విపత్తు మానవాళిపై దాడిచేసింది. కరోనా ధాటికి పెద్దపెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలే అతలాకుతలమవుతున్నాయి. కరోనా ప్రభావం మన రాష్ట్రంపై కూడా పడిరది.

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు రక్షించడంతోపాటు రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినకుండా కూడా రాష్ట్రప్రభుత్వం ఎన్నో ముందు జాగ్రత్త  చర్యలు తీసుకుంది. కరోనా  రెండవ దశలోనూ ఎదురవుతున్న సవాళ్ళను ధైర్యంగా అధిగమిస్తూ, ప్రజలకు అండదండలు అందిస్తోంది. డబ్బుకన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తీసుకున్న చర్యల ఫలితంగా కరోనా కేసుల విషయంలో, మరణాల విషయంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చిచూస్తే, తెలంగాణ రాష్ట్రం ఎంతో మెరుగైన దశలో దర్శనమిస్తోంది.

రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అమలుచేస్తోంది.  ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహించి మెడికల్‌ కిట్లు అందజేస్తూనే, కరోనా పరీక్షలను మరింత పెంచుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా, ఎవ్వరూ సాహసించని రీతిలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వయంగా హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానా, వరంగల్‌లోని ఎం.జి.ఎం దవాఖానాలను సందర్శించి, అక్కడ ఐ.సి.యులో చికిత్స పొందుతున్న రోగులతోనూ, వైద్యులు, ఇతర సిబ్బందితో స్వయంగా మాట్లాడి, వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ‘‘మీకేం కాదు..మీరు పూర్తిగా కోలుకుంటారు. మీ వెనుక నేనున్నా’’ అంటూ రోగులకు, ‘‘క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా వుండి సేవచేస్తున్న మీకు ఏ సమస్య వచ్చినా మీకు సంపూర్ణ సహకారం అందిస్తా’’నని వైద్యసిబ్బందికి ముఖ్యమంత్రి భరోసా ఇవ్వడం రోగులకు, వైద్యులకు కొండంత బలాన్ని ఇచ్చింది.

కరోనా కోరల నుంచి రాష్ట్రం త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ, తెలంగాణ ప్రజానీకం అందరికీ రాష్ట్ర అవతరణోత్సవ శుభాకాంక్షలు.