రైతమ్మల ఆత్మగౌరవ సంబరం, పాతపంటల జాతర!!

నల్లని మబ్బుతునకలు కదులుతుంటే, పస్తాపూర్ ఎర్రమట్టి పొలాల మధ్య రహదారిలో ఆరుద్ర పురుగుల్లా ఎడ్లబండ్లు కదలి వస్తున్నాయి. వాటిలో పండించిన చిరుదాన్యాల రాసులున్నాయి. ఆ బండ్ల ముందు పైట కొంగులను బిగించిన మహిళలు, డప్పుల శబ్దానికి లయబద్ధంగా ఆడుతూ, పాడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ చుట్టూ విసిరేసినట్టుండే ఎల్గోయి, రేజింతల్, జీడిగడ్డ,పస్తాపూర్, గొడ్డిగార్ పల్లి, ఖాసింపూర్, పొట్పల్లి, చిలుకపల్లి తదితర 70 గ్రామాల నుండి వందలాది రైతులు మచునూరులో డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ నిర్వహించిన పాతపంటల జాతరకు సందడిగా తరలి వచ్చారు. ఈ ఆడబిడ్డలు 12వందల ఎకరాల్లో చిరుధాన్యాలను సాగు చేస్తున్నారు.
ఈ జాతర నేపథ్యం
ఒకప్పుడు వ్యవసాయం స్వయంపోషక వ్యవస్థగా ఉండేది రైతులు దేనికోసమూ ఎవరిమీదా ఆధారపడే వారు కాదు. కానీ వాతావరణ మార్పులు, వానలు తగ్గడంతో, రానురానూ సాగు భారమైంది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 61,051 హెక్టార్లు. సాగునీటి వసతి లేక వర్షాధార పంటలు పండించే వారు. రాగులు, కొర్రలు, జొన్నలు వంటి కరవు పంటలు తర తరాలుగా పండిస్తున్నారు. జహీరాబాద్ మండలంలో నైతే దాదాపు అపరాలే సాగు చేస్తున్నారు. అయితే ఇంత చెమటోడ్చి మెట్టపంటలు పండించినా పెద్దగా గిట్టుబాటు కాక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి భూమిని సారవంతంగా మార్చడానికి, దళిత, గిరిజన మహిళా రైతులను స్వయం సమృద్ధ సముదాయాలుగా మార్చాలనే సంకల్పంతో డిడిఎస్ ఏర్పాటయింది. ఆనాటి నుండి నేటివరకు, 21 సంవత్సరాలుగా అంతరించిపోతున్న పాతపంటల పరిరక్షణకు పాత పంటల జాతరను నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పర్వదినమైన జనవరి 14న ఎడ్లబండ్లలో పాత పంటల ధాన్యంతో జాతరను సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని శంశల్లాపూర్ గ్రామంలో ప్రారంభించి, ఫిబ్రవరి 15న ఝరాసంగం మండలం మాచ్నూరులో నిర్వహించే కార్యక్రమంతో జాతర ముగుస్తుంది.
పాతపంటల ప్రాధాన్యత గురించి వివరిస్తూ అంతరించిపోతున్న పంటలను పరిరక్షించుకుని పల్లె వ్యవసాయాన్ని కాపాడుకునే విధానంపై ప్రచారం నిర్వ హించారు. జాతరలో అందంగా అలంకరించిన 18 ఎడ్లబండ్లలో పాతపంటల ధాన్యాన్ని ప్రదర్శించారు.
జీవవైవిధ్య పండుగ..

‘‘గత 20 ఏండ్ల నుండి క్రమం తప్పకుండా చిరుధాన్యాల జాతర నిర్వహిస్తున్నాం. జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు మహిళా రైతుల కృషికి దర్పణం ఈ సందడి. రైతులకు ఆహార భద్రత కల్పించడం, స్వతంత్రంగా జీవించే స్వేచ్ఛను కల్పించడమే మా డిడిఎస్ లక్ష్యం. మా సంఘం తరఫున వారికి ప్రేరణ ఇచ్చి, ఆర్థికంగా అండగా నిలిచాం. మేం అనుకున్న దానికన్నా రైతులు రెట్టింపు అభివృద్ధి సాధించారు. మహిళా రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వ్యవసాయం చేస్తూ, స్వతంత్రంగా జీవించగలమనే భరోసా కల్పించాం. పాత పంటల పరిరక్షణ, వాటి వల్ల కలిగే ఉపయోగాలను వివరించి, సాగుకు ప్రోత్సహించాం. తెలంగాణలో మిగతా రైతులు కూడా సంఘటితం అయి, తగిన వేదికలను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే వ్యవసాయంలో, వారి జీవితాల్లో మార్పులు వస్తాయి. ఈ జాతరలో భాగంగా, కమ్యూనిటీ మీడియా ట్రస్టు తరుపున ఫిబ్రవరి 13న ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించి పలు డాక్యుమెంటరీలు ప్రదర్శించాం’’ అన్నారు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ పి.వి.సతీశ్.
ఆరుదైన వనమూలికలు!!
ఈ జాతరలో వివిధ రకాల స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. దాదాపు అరవై రకాల విత్తనాలు ప్రదర్శించారు. ఇరవై రకాల మట్టినమూలు,వాటిలో ఎలాంటి పంటలు పండుతవో తెలియచేసే చార్టులు ప్రదర్శించారు. చిరుదాణ్యాలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా రకరకాల వంటలుగా వండి చూపించారు. అరుదైన మెడిసినల్ ప్లాంట్స్‌ని వాటి మూలికలను కూడా స్టాల్స్‌లో ఉంచారు.
అంతా సేంద్రియమే…
జహీరాబాద్ చుట్టుపక్కలంతా కరువు ప్రాంతమే. కాబట్టి, అక్కడ వరిలాంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలు పండించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే డీడీఎస్ సభ్యులు చిరు ధాన్యాలు, పప్పు దినుసుల సాగుపై దృష్టి పెట్టారు. భవిష్యత్‌లో వీటి అవసరం ఎక్కువగా ఉంటుందని గుర్తించి, ఆ దిశగా వ్యవసాయం చేయిస్తున్నారు. తమకు ఆర్థిక భరోసాతోపాటు ఆరోగ్యాన్నీ అందించే ఈ సాగుపై రైతులుకూడా ఆసక్తి చూపించారు. ప్రతిరైతూ కనీసంగా 15 నుంచి 20 రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతిలోనే సాగుచేస్తున్నారు. ఎక్కడా రసాయన ఎరువులు, పురుగు మందుల జోలికి వెళ్లరు. వారికున్న ఎకరం, అరెకరం చిన్న కమతాల్లో బహుళ పంటలు పండిస్తూ నష్టనివారణ చేస్తున్నారు. కుటుంబ అవసరాలు తీరడంతోపాటు మిగులు పంటను విక్రయించడం ద్వారా ఆర్థిక స్వావలంబన పొందుతున్నారు.
మార్కెట్ ధరకన్నా ఎక్కువ !!
మహిళా రైతుల పంటలను డీడీఎస్ సంస్ధ కొనుగోలు చేస్తుంది. దానికి ముందుగా రైతు కుటుంబ అవసరాలు తీరాయో? లేదో? పరిశీలిస్తారు. అవసరాలకు మించి పంటలు పండితేనే కొనుగోలు చేస్తారు. మార్కెట్ ధరకన్నా 10శాతం అధిక ధర చెల్లిస్తారు.
వీటిని డీడీఎస్ ఆధ్వర్యంలోనే నడుస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి విక్రయిస్తారు. అరుదుగా లభించే చిరుధాన్యాలను పూర్తిగా ఆర్గానిక్ విధానంలో సాగు చేయడంతో మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఇలా నేరుగా పంటలు కొని, ప్రాసెసింగ్ చేసి వినియోగదారులకూ నాణ్యమైన ఆహారాన్ని అందించడమే కాక, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నది.
రైతు ఆదాయం రెట్టింపు దిశగా… !!
ఇక్కడి మహిళలు తమదైన ప్రత్యేక పర్యావరణ వ్యవ సాయం చేపడుతున్కారు. పొలంలో వేసే ఎరువు నుండి భిన్నరకాల విత్తనాలు, పర్యావరణానికి, మనుషులకి, పశువులు, పక్షులకు హాని చేయని తెగులు నివారణ ద్రావణాలు, కషాయాలు వాడుతారు. ప్రతీదీ స్థానికంగా దొరికే వనరు లతోనే వీరు స్వయంగా తయారు చేసుకుంటారు. పంట కోసం అప్పుతేవడం గానీ, ఇతరుల నుంచి ఒక్క రుపాయి తీసుకోవడం గానీ, సర్కారు ఎరువులు వాడడం గానీ చేయరు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తాం అనే సర్కారీ నినాదాలను వీరు నిజం చేయబోతున్నారు. డిడిఎస్ పేద మహిళలను సంఘాలుగా మలచి స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తున్నారు. పర్యావరణ వ్యవసాయం ప్రాముఖ్యతను చాటి చెబుతూ పంటల సాగు ప్రక్రియలో వాడే ప్రతీదీ స్థానికమే అని సగౌరవంగా చాటి చెబుతున్నారు.
మహిళా మీడియా


డీడీఎస్ సంఘాల్లోని మహిళా రైతులు వ్యవసాయానికే పరిమితం కాలేదు. మీడియా రంగంలో బలోపేత మయ్యేం దుకు ప్రయత్నిస్తున్నారు. చదువు లేకపోయినా సొంతంగా డాక్యుమెంటరీలు తీస్తున్నారు. వీడియో కెమెరాలను ఆపరేట్ చేస్తూ, రైతుల కష్టాలపై పలు డాక్యుమెంటరీలు చేశారు. ఇందులో కొన్ని అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ ప్రదర్శించారంటే, ఏ స్థాయికి ఎదిగారో అర్థం చేసుకోవచ్చు. వారి సంఘంలో, డీడీఎస్లో ఏ కార్యక్రమం జరిగినా మహిళా రైతులే వీడియో గ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తారు.
అరుదైన జాతర!!

ఈ కార్యక్రమంలో మరో అతిధి, వి.సునీతా లక్ష్మారెడ్డి (ఛైర్ పర్సన్, తెలంగాణ స్టేట్ కమిషనర్ ఫర్ వుమెన్) పాల్గొని ప్రతీ స్టాల్‌ని సందర్శించి. అక్కడున్న విత్తనాలు, ఔషధ మూలికలు, మట్టి నమూనాలు గురించి అడిగి తెలుసు కున్నారు. ‘‘ఇలాంటి జాతర వల్ల అన్ని రకాల పంటలను, వాటిని పండించిన రైతులతో ముచ్చటించే అవకాశం కలిగింది. సన్నబియ్యం, బాస్మతి రైస్ తినడమే స్టేటస్ అనుకునే రోజులు పోయి, ప్రాభవం కోల్పోయిన చిరుధాన్యాల రోజులు వచ్చాయి. రసాయన రహిత సాగుకు అంతులేని ప్రోత్సాహం ఇస్తున్న డిడిఎస్ డైరెక్టర్ సతీష్‌కి అభినందనలు..’’ అని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
జాతరలో పాల్గొన్న శాసన సభ్యురాలు పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘పాతపంటల జాతర సంప్రదాయాన్ని 21 ఏండ్లుగా కొనసాగించడం అపూర్వం. డిడిఎస్ మహిళా రైతులను సేంద్రియ పంటల సాగుకు ప్రోత్సహించడం వల్ల, నేల ప్రకృతిసాగుకు అనువుగా మారి, రాబోయే తరాలకు ఆరోగ్యవంతమైన ఆహారం అందుతుంది.’’ అన్నారు.
అరుదైన రుచులు
ఈ జీవ వైవిధ్యజాతరలో కనుమరుగైన సామల రొట్టెలను. మచ్చుకైనా కనిపించని సజ్జ మలీదలు, ఈ తరానికే తెలియని నూనె పోలెలు అందరినీ ఆకట్టుకున్నాయి. మొగ్దంపల్లి నుండి వచ్చిన రైతులను పలకరిస్తే, సమ్మర్లో సామబియ్యం తిని, రాగి అంబలి తాగితే, చలువ అని, చలికాలం కొర్ర బువ్వ తినాలని, పచ్చ జొన్న రొట్టె, కొర్రబియ్యం తింటే షుగర్, బీపీ కంట్రోల్ అవుతుందనే చైతన్యం కలిగిస్తారు. నల్లవడ బియ్యం తింటే, రోగాలు రావని లక్ష్మమ్మ అనే రైతు చెప్తుంటే ఇంతకాలం మనం తిన్న చెత్తేంటో తెలుస్తుంది.
డిడిఎస్ అనుసరిస్తున్న విధానం చిన్న కమతాలున్న రైతుల అవసరాలను తీరుస్తుంది. తిండికి, పౌష్ఠికాహారానికి, ఆరోగ్యానికి, జీవనోపాధికి భద్రత నివ్వడంతోపాటు పశువుల మేతకూ భద్రత ఇస్తోంది.
‘‘ఎందుకంటే రసాయనిక మందులు లేని, ప్రకృతి సిద్ధమైన పంటల వల్ల కుటుంబాల ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తుంది.’’ అని ఈ జాతరకు వచ్చిన జహీరాబాద్ రైతులు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.
ఇంతకూ మీకు ఆర్థిక రాబడి ఎంతరావచ్చు? అని అడిగితే, నీటివసతి లేని ఈ ఎర్రనేలల నుంచి ఎకరానికి రూ.70 వేల వరకు రాబడి తీస్తామని, ఖాసింపూర్ రైతు అంజమ్మ ధీమాగా అంటున్నారు. కొవిడ్ అనంతరం మహిళా రైతుల ఎజెండా ఇది.
సొంత కాళ్లపై నిలబడి సొంత వనరులతో మట్టిని బంగారంలా మారుస్తున్న ఈ పర్యావరణ జీవవైవిధ్య వ్యవ సాయానికి ప్రకృతి సైతం సై అంటూ చిరుజల్లులు కురుపిస్తోంది.
సొంత విత్తనాల బ్యాంక్

డీడీఎస్ మహళా రైతులు సీడ్ కంపెనీలు సరఫరా చేసే విత్తనాల కోసం ఎదురు చూడకుండా తమకు అవసరమైన విత్తనాలను ముందే నిల్వ చేసి ఉంచుకోవడం విశేషం. తాము పండించిన పంట చేతికందగానే, దానిలో నాణ్యమైన ధాన్యాన్ని విత్తనం కోసం భద్రపరుస్తారు.
‘‘ఆ విత్తనాలను ఈత ఆకులతో చేసిన బుట్టల్లో పోసి పైభాగంలో మట్టి, పేడ కలిపి మూసివేస్తాం. వాటికి పురుగు పట్టకుండా, వేపాకు, బూడిద కలుపుతాం. అలా రెండేళ్ల వరకు చెక్కుచెదరకుండా ఉంటాయి. విత్తనాలు నాటే సమయం రాగానే వాటిని బయటకు తీస్తాం.’’ అని మచునూర్లో జాతర జరిగిన ప్రాంతంలో విత్తన బ్యాంక్‌ను నిర్వహిస్తున్న లక్షమ్మ అన్నారు. వీరు డీడీఎస్ ఆధ్వర్యంలో విత్తన బ్యాంకులను నిర్వహిస్తున్నారు. ఈ విత్తనాలు సుమారు 10 వేల ఎకరాలకుపైగా సాగు చేసేందుకు ఉపయోగపడుతాయి. రైతులు 40నుంచి 70రకాల విత్తనాలను అందుబాటులో పెట్టుకుంటారు.
మహిళా ‘సంఘం’ రేడియో

ఈ జాతర జరిగిన ప్రాంగణంలోనే ఒక కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఉంది. జనరల్ నర్సమ్మ అక్కడి కార్యక్రమాలకు సారధ్యం వహిస్తోంది. ఆమెను పలకరించగా …‘‘మేమంతా సంగారెడ్డి జిల్లాలోని 70 గ్రామాలకు చెందిన 5 వేల మంది మహిళలం. మా భాష, పాటలు, ఎవుసం, కట్టుబాట్లు, కష్టసుఖాలు… పంచుకోవడానికి మాకంటూ సొంతంగా ఓ రేడియో కావాలనుకున్నాం. మా ఆలోచన దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, డైరెక్టర్ సతీష్ సార్‌కి చెప్పగా, ‘యునెస్కో’ సాయంతో 1998లో ‘సంఘం’ అనే రేడియోస్టేషన్‌ను మాచనూరు గ్రామంలో నెలకొల్పారు. ఇదంతా బాగానే జరిగింది. మరి రేడియో స్టేషన్‌ను నడిపించుట ఎట్ల? కార్యక్రమాలను తయారు చేసేదెవరు? మేం చదువు లేనివాళ్లం. పొలం పనులు చేసేటోళ్లం. కార్యక్రమాలు ప్రసారం కావాలంటే రేడియోస్టేషన్లో సున్నితమైన మీటలు నొక్కడం మాకు చేతనయ్యే పని కాదు. అదే విషయం సతీష్ సార్‌కి చెప్పాం! ఆయన మమ్మల్ని నెమ్మదిగా ఒప్పించి, అనుభవం ఉన్న టెక్నిషియన్లతో నాతో పాటు అల్గోలు నర్సమ్మ అనే మహిళకు ఫీడర్లను ఎలా వాడాలో, రికార్డింగ్ ఎలా చేయాలో నేర్పించారు. అలా ప్రోగ్రామ్ ఎడిటింగ్ చేయడం, బ్రాడ్‌కాస్టింగ్ చేయడం నేర్చుకుని సమర్థంగా రేడియో ప్రసారాలు చేయగలుగుతున్నాం!’’ అని వివరించారు.
‘సంఘం’ రేడియోలో ప్రతి రోజూ రాత్రి 7 నుంచి 9 గంటలవరకూ ప్రసారాలుంటాయి. అన్నీ మహిళా కార్యక్రమాలే! ఊళ్లలో దళిత మహిళలకు వచ్చిన పాటలు, ఆటలు, కథలు, వ్యవసాయ, వైద్య , న్యాయ చిట్కాలు, వార్తలు… ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలుంటాయి. ‘మన ఊరి పంటలు’ కార్యక్రమంలో వ్యవసాయం తెలిసినవారు విత్తనాలు, భూములు, ఎరువులు, వాటి వాడకం, పంటనష్టం జరగకుండా అనుసరించవలసిన సాగు పద్ధతుల గురించి వివరిస్తారు. ‘మన భాష’ కార్యక్రమంలో కనుమరుగవుతున్న తెలంగాణ పదాలు, కథల గురించి వివరిస్తారు. అలాగే చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు వాడదగిన చెట్ల మందుల గురించి పెద్దలు వివరిస్తారు.
‘ఊరి వార్తలు’ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల్లో జరిగిన గొడవలు, తప్పిపోయిన పశువుల గురించి సాగుతాయి. అలాగే, తెలంగాణ యాస, గోసలు, పండగలు, వేడుకలు జరుపుకున్న పద్ధతులు ఎలా ఉండేవి, అప్పటి సంస్కృతీసంప్రదాయాల తీరుతెన్నులు ఎలా ఉండేవి? లాంటి కార్యక్రమాలను ఈ ఆడవారే రూపొందిస్తారు.
జాతరలో పాల్గొన్న ఉపాసన కొణిదల

ఈ పంటల పండుగలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు, ఎన్జీఓలతో పాటు, పలువురు మంత్రులు, ప్రముఖులు కూడా ఉత్పాహంగా పాల్గొన్నారు.
‘‘మనుషుల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మళ్లీ పాతతరం పద్ధతుల్లోకి మారిపోతున్నారు. చిరు ధాన్యాల విలువేంటో సమాజానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కొర్రల పాయసం, పచ్చజొన్నల గటక, రాగి జావ లాంటి పేర్లు ఈ జాతరలో వింటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటకు సార్థకత చేకూరుతోంది. ఒకప్పటి పచ్చ జొన్నల గట్క, రాగిజావ తిరిగి కళ్ల ముందుంచారు ఇక్కడి రైతమ్మలు. వీరి మధ్య గడపడం చాలా హ్యాపీగా ఉంది.’’ అని ఈ జాతరకు వచ్చిన ఆపోలో గ్రూప్ ఛైర్ పర్సన్ ఉపాసన కామినేని కొణిదల అన్నారు. జాతర ఆవరణలో డిడిఎస్ మహిళలు నిర్వహిస్తున్న సంగం రేడియో కేంద్రం, విత్తన బ్యాంక్‌ను ఉపాసన ఆసక్తిగా పరిశీలిం చారు. చిరు ధాన్యాలతో చేసిన వంటలను రుచి చూసి, వాటిని చేసిన మహిళలను అభినందించారు.