పేదలకు తొమ్మిదంతస్థుల మేడ సొంతింటి కలకు అడుగుజాడ
ఇల్లు లేనివారికి ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు కార్పోరేట్ ఆఫీసులను తలపిస్తున్నాయి. అన్ని వసతులతో చక్కగా నిర్మించి ఇస్తుండడంతో అవి అబ్బురపడే విధంగా తయారవుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల నిర్మించిన రెండు పడకగదుల ఇండ్లు పేద ప్రజల స్వంతింటి కలను నెరవేరుస్తున్నాయి. ఇందులో భాగంగానే భాగ్యనగరంలోని చంచల్గూడ జైలు ప్రాంతంలో నిర్మించిన తొమ్మిది అంతస్థుల మేడ చూపరులను కట్టి పడేస్తున్నది. పేదల కోసం ప్రభుత్వం ఇంటి వసతి కల్పించడానికి చేస్తున్న కృషి, పట్టుదలకు ఇది అద్దం పడుతున్నది.

చంచల్గూడ ప్రధాన రహదారి పక్కనే పిల్లి గుడిసెల కాలనీ ఉండేది. అక్కడి పేదలకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని సదుద్దేశ్యంతో ప్రభుత్వం ఇదే స్థలంలో మూడు వందల ఫ్లాట్లతో తొమ్మిది అంతస్థుల అపార్టుమెంట్ నిర్మించింది. ఇది ప్రస్థుతం నిర్మాణం పూర్తయి, ఇండ్లు లేని పేదలకు కేటాయించడానికి సిద్ధంగా ఉంది. గతంలో రహదారి పక్కన గుడిసెలతో కనిపించే ఈ ప్రాంతం ఇప్పుడు తొమ్మిది అంతస్థుల మేడతో కళకళలాడుతున్నది. ఇది పేదలకు రెండు పడకగదుల ఇండ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధకు, చిత్తశుద్ధికి నిదర్శంగా నిలుస్తున్నది.