|

అపర భగీరధుడు కె.సి.ఆర్

తెలంగాణ రైతుల వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదారమ్మ బీడునేలలను తడపడానికి ఉరుకులు, పరుగులతో వచ్చేస్తున్నది. భగీరథ యత్నంతో గంగ భూమి మీదకు వచ్చినట్లు మనకు తెలుసు. గంగను భగీరథుడు దివి నుంచి భువికి దించాడు. అంటే ఎత్తు నుంచి పల్లానికి నీరు ప్రవహించింది. ఇది సహజంగా జరిగేదే. నీరు పల్లమెరుగు అనే నానుడి మనకు తెలిసిందే. కానీ అపర భగీరథుడుగా పేరు తెచ్చుకున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గంగను లోతులో నుంచి పైకి తీసుకువచ్చి వ్యతిరేక దిశలో పారించి తెలంగాణ భూములను సస్యశ్యామలం చేస్తున్నాడు. ఇందుకు కేసీఆర్‌ చేసిన ప్రయత్నం అనితర సాధ్యమని చెప్పక తప్పదు. దక్కన్‌ పీఠభూమిగా ఉన్న మన తెలంగాణకు గోదావరిని రివర్స్‌లో పారించి గంగను ఒడిసిపట్టి మరీ తెలంగాణ నేలకు మళ్ళిస్తున్నాడు.

కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఒక్కటే ప్రాజెక్టుగా రూపు దిద్దుకోలేదు. ఇది బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువలు, సొరంగాలు ఉమ్మడిగా ఏర్పడిన ప్రాజెక్టు. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానించ బడ్డాయి. గోదావరిలో నీరు పుష్కలంగా ఉంది. ఏన్నొ టిఎంసీల నీరు సముద్రం పాలవుతున్నది. అలాంటి నీటిని వృధా పోనీయకుండా తెలంగాణ బీడునేలలను తడపడానికి ఎంత వరకు సాధ్యమైతే అంతవరకు నీటిని వినియోగించుకోవడానికి ఈ ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. ఇందులో భాగంగా గోదావరి నదినే రిజర్వాయర్‌గా చేసి నదిపై పలుచోట్ల బ్యారేజీలు నిర్మించారు. దీనివల్ల ఒక బ్యారేజీకి, మరో బ్యారేజీకి మధ్య గోదావరి నదిలో నీరు రెండు ఒడ్డులను తాకుతూ నిండుగా ప్రవహిస్తుంది. సుమారు 150 కిలోమీటర్ల మేర గోదావరి నది నిత్యం నిండుకుండలా ప్రవహిస్తుంటుంది. ప్రతి బ్యారేజీ నుంచి పంపు హౌజ్‌లు, కాలువలు, సొరంగాల ద్వారా నీటిని పొలాలకు మళ్ళిస్తారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియగా చెప్పవచ్చు. ఇక గోదావరి ఎండిపోవడమంటూ ఉండదు.
రీడిజైన్‌తో నీటి లభ్యత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదించిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం రీడిజైన్‌ చేయించింది. ముందుగా అనుకున్నట్టు ప్రాణహిత నదిపై కాకుండా కాస్త కిందకు, ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తరువాత ప్రధాన నిర్మాణం సాగేలా రీడిజైన్‌ చేశారు. ఒక బ్యారేజీలా కాకుండా 3 బ్యారేజీలు, 19 పంపు హౌజులు, వందల కిలోమీటర్ల కాలువలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోంది.

తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లోని గోదావరి నుంచి దక్షిణాన హైదరాబాద్‌, చిట్యాల, షామీర్‌పేట వరకు నీళ్లొచ్చేలా ఈ కొత్త డిజైన్‌ ఉంది. కన్నెపల్లిలో నిర్మిస్తున్న ఓపెన్‌ పంప్‌ హౌజ్‌ తాగునీటికి.. పారిశ్రామిక అవసరాలకు కూడా.. ఉపయోగపడుతుంది.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 13 జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. దారి పొడవునా ఉండే గ్రామాలకు, హైదరాబాద్‌కు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు ఇవ్వాలనీ ప్రణాళిక రూపొందించారు.

కొత్త ఆయకట్టు కాకుండా శ్రీరాంసాగర్‌, నిజాం సాగర్‌, మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు, అప్పర్‌ మానేరు ప్రాజెక్టులను కూడా ఈ ప్రాజెక్టుతో అనుసంధానించడానికి కొత్తగా కాలువలు, సొరంగాలు, పంపు హౌజులు తవ్వారు. వీటి ద్వారా మిగిలిన నీటిని తరలించి ఆయకట్టును స్థిరీకరిస్తారు. వీటికి అదనంగా, పాత ప్రాణహిత ప్రాజెక్టు ప్రతిపాదించిన చోటే అప్పటికంటే ఎత్తు తగ్గించి మరో బ్యారేజీ నిర్మిస్తున్నారు. అసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా దీన్ని రీడిజైన్‌ చేశారు.

గోదావరి నీటిని గోదావరిలోనే కలిపేలా..
గోదావరి నదిపై నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా బ్యారేజీలే.. డ్యాంలు కాదు. డ్యాం అంటే నదిపై ఆనకట్ట నిర్మించే నీటిని నిలువచేయడం. ఇక బ్యారేజీ అంటే నదికి రెండు ఒడ్డులను కలుపుతూ గోడ నిర్మించి ఎక్కువైన నీరు దిగువకు పారేలా ఏర్పాటు చేయడం. ఇలా గోదావరి నీటిని నదిలో రెండు ఒడ్డులు కలిపేలా నదిలోనే నిలువచేయడం. దీనివల్ల నది ఒడ్డును ఆనుకుని ఉన్న భూములు ముంపునకు గురికావు. నదిలో నీటి ప్రవాహాన్ని ఆపి నిలువచేస్తాం. ఇలా కట్టే నిర్మాణాన్ని బ్యారేజ్‌ అంటారు. దీనివల్ల ఎక్కువ నీరు నిలువ వుంటుంది. తక్కువ భూమి ముంపునకు గురవుతుంది. ఇప్పుడు గోదావరిపై మూడు చోట్ల (మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం) బ్యారేజ్‌లు కడుతున్నారు. ఒక బ్యారేజ్‌లో నిల్వ ఉన్న నీటిని పంపుహౌజు నుంచి తోడి కాలువ ద్వారా మరో బ్యారేజ్‌ ముందుకు వదిలేలా ఏర్పాటు ఉంటుంది. (గోదావరి ప్రవాహానికి వ్యతిరేక దిశలో, ఎగువకి) ఇలా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకూ నీటిని తెస్తారు. అక్కడి నుంచి కాలువల ద్వారా నీటిని పంపిస్తారు.

ఈ నీరు సొరంగాలు, కాలువల్లో ప్రవహించి, పంపుహౌజుల్లో లిఫ్టు చేసి భూమి లోపల, బయట ప్రయాణించి వేర్వేరు కొత్త, పాత జలాశయాలను కలుపుతూ దక్షిణ తెలంగాణ వరకూ వస్తుంది. అవసరానికి అనుగుణంగా గోదావరి నీటిని కాలువలోకి మళ్లించి, గోదావరి ప్రవాహానికి వ్యతిరేక దిశలో (వెనక్కు) తీసుకెళ్లి మళ్లీ గోదావరిలోనే కలుపుతారు. ఇదంతా కాళేశ్వరం లింక్‌ -1 లో జరుగుతుంది.

అక్కడి నుంచి కాలువల ద్వారా అనుకున్న చోటుకు తరలిస్తారు. కొన్ని చోట్ల పాత చెరువులు, రిజర్వాయర్లను, కాలువలను బాగు చేశారు. మరికొన్ని చోట్ల కొత్తగా కాలువలు, సొరంగాలు, పంపు హౌజులు, రిజర్వాయర్లు నిర్మించారు. ఈ మొత్తం పనిని లింకులుగా, తిరిగి ఆ లింకులను ప్యాకేజీలుగా విభజించారు. మొత్తం ఈ ప్రాజెక్టులో 7 లింకులు 28 ప్యాకేజీలు ఉన్నాయి.

ప్రస్తుతం లింక్‌ 1, లింక్‌ 2 పనులు వేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. లింక్‌ 1, లింక్‌ 2 లలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, వాటికి అనుబంధంగా ఉండే పంపుహౌజుల ద్వారా మొత్తం 20 జిల్లాలకు సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు నీరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అతి ముఖ్య మైన అంశాలుగా టన్నెల్స్‌(సొరంగం), సర్జ్‌ పూల్‌, భారీ పంపులు, గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌ స్టేషన్‌లను చెప్పుకోవాలి.

తెలంగాణలో గోదావరి నీటిని కాలువల్లో తరలించడానికి ఉన్న పెద్ద ఇబ్బంది పీఠభూమి. ఈ ప్రాంతం దక్కన్‌ పీఠభూమి మీద ఉండటంతో నది నుంచి నీటిని కాలువల్లోకి పంపాలంటే మోటార్ల ద్వారా తోడి కాలువలో పోయాల్సిందే. దీన్ని లిఫ్ట్‌ ఇరిగేషన్‌(ఎత్తిపోతలు) అంటారు.

నది నుంచి నీరు కాలువలోకి రావడం, అక్కడి నుంచి సొరంగం ద్వారా ప్రయాణించడం. అక్కడ భూమిలోపల ఉన్న పంపుల నుంచి తిరిగి పైకి రావడం. అక్కడి నుంచి కాలువలు, రిజర్వాయర్ల ద్వారా మళ్లీ నీటిని అందించడం. ఇదీ ఇక్కడ జరిగే ప్రక్రియ. ఇందుకోసం 4 ప్రత్యేక నిర్మాణాలు అవసరమయ్యాయి. దీనితో పాటు భూసేకరణ తగ్గించడానికి, భూమి ఎత్తుపల్లాల సమస్యలను తప్పించుకోవడానికి భూగర్భంలో కాలువలు నిర్మించారు. భూమి కింద పది మీటర్ల వ్యాసంతో ఈ టన్నెల్స్‌ నిర్మించారు. అంటే ఒక్కో టన్నెల్లో ఒకేసారి నాలుగు కార్లు ప్రయాణించవచ్చన్నమాట.
ప్రపంచంలో ఇదే పెద్ద ఎత్తిపోతల పథకం
పంపు లోతు వంద మీటర్ల కంటే ఎక్కువ ఉంటే అండర్‌ గ్రౌండ్‌ ఎక్కువ అనుకూలం. ఖర్చు కూడా తగ్గుతుంది. అందుకని వీలైనన్ని అండర్‌ గ్రౌండ్‌ పంపులు, టన్నెల్స్‌ పెట్టాం. తెలంగాణలో మంచి గ్రానైట్‌ రాయి అందుబాటులో ఉండడం సాంకేతికంగా అనుకూలమయ్యింది. సాధారణంగా ఇటువంటి ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేయడం అరుదు.

ఇలా మొత్తం 203 కిలోమీటర్లు పొడవైన టన్నెల్స్‌ నిర్మిస్తున్నారు. ప్రపంచంలో చాలా చోట్ల సొరంగాలు ఉన్నాయి. కానీ, నీటిని తరలించడానికి ఇంత పెద్ద, పొడవాటి సొరంగాలు ఎక్కడాలేవు. సర్జ్‌ పూల్‌: టన్నెల్స్‌ నుంచి వచ్చిన నీటిని నేరుగా పంపులు తోడవు. నీటి హెచ్చుతగ్గుల వల్ల పంపుల్లో సమస్యలు రాకుండా ఉండడం కోసం ఆ నీటిని చిన్న జలాశయం లాంటి దాంట్లో నిల్వ చేయాలి. ఎత్తిపోతల పథకాల్లో ఇది అనివార్యం. భూమిలోపల నీటిని నిలువ చేసే రిజర్వాయర్లనే ‘సర్జ్‌ పూల్‌’ అని అంటారు.

ఈ ప్రాజెక్టులో 2 సర్జ్‌ పూల్స్‌ నిర్మిస్తున్నారు. వీటి నుంచి పంపుల్లోకి నీరు వెళుతుంది. భూమి లోపల నేలను, రాళ్లను తొలిచి సర్జ్‌ఫూల్స్‌ (భూగర్భ చెరువులు) కడుతున్నారు.పంపులు: ఈ ప్రాజెక్ట్‌లో వాడే పంపులు అత్యంత శక్తివంతంగా ఉంటాయి. ఒక్కోటీ చిన్న భవనం అంత ఉంటాయి. కాళేశ్వరంలో వాడే అతి పెద్ద పంపుల సామర్థ్యం 139 మెగావాట్లు. ఇలాంటివి మొత్తం 7 పంపులు బిగిస్తున్నారు. ఈ పంపులకు కరెంటు సరఫరా చేయడానికి 400/11 కేవీ సబ్‌ స్టేషన్‌ నిర్మిస్తున్నారు.

భూమి లోపలే సబ్‌ స్టేషన్‌
ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండే 400/11 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మించడానికి 60 ఎకరాల స్థలం కావాలి. ధర్మారం దగ్గర్లో నిర్మిస్తోన్న పంపుహౌజు సరిగ్గా ఒక కొండ కింద ఉంది. ఆ పంపుహౌజుకు కరెంటు ఇవ్వడానికి సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి అవసరమైన 60 ఎకరాల స్థలం అందుబాటులో లేదు. దీంతో భూమి లోపలే సబ్‌ స్టేషన్‌ నిర్మించాల్సి వచ్చింది. భూమిలోపల 60 ఎకరాలు తొలచడం, సబ్‌ స్టేషన్‌ నిర్మించడం అసాధ్యం. అందువల్ల గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సాంకేతికతను వాడి రెండు ఎకరాల తక్కువ స్థలంలో భూగర్భంలో నిర్మించారు. ఈ సాంకేతికత వల్ల సబ్‌ స్టేషన్లలోని ట్రాన్స్‌ఫార్మర్ల మధ్య ఖాళీ స్థలం పెద్దగా అవసరం లేకుండా ద్రవ రూపంలోని గ్యాసులను వాడతారు. ఎస్‌.ఎఫ్‌.6 (సల్ఫర్‌ హెక్సాఫ్లోరైడ్‌) ను ఇన్సులేటర్‌గా వాడి భూమిపైన 60 ఎకరాల్లో నిర్మించాల్సిన సబ్‌ స్టేషన్‌ భూమి లోపల రెండెకరాల కంటే తక్కువ స్థలంలో నిర్మిస్తున్నారు. దీనివల్ల ఖర్చు రెండున్నర రెట్లు పెరుగుతోంది. ఓ జర్మన్‌ కంపెనీ దీన్ని నిర్మిస్తోంది.