జీఓ 111 రద్దు – ప్రత్యామ్నాయాలు
By: వి. ప్రకాశ్
హైదరాబాద్ నగరంలో సుమారు నాల్గవ వంతు ప్రాంతానికి త్రాగునీరందించే గండిపేట (ఉస్మాన్‌సాగర్), హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను కాలుష్యం నుండి పరిరక్షించడానికి జీ.ఓ. 111ను 1996 మార్చి 8న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు.ఈ జీఓలో జంట జలాశయాల పూర్తి నీటి నిల్వస్థాయి నుండి 10 కి.మీ. పరిధిలో గల 84 గ్రామాలపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఆంక్షలు ఇలా ఉన్నాయి…
ఈ 84 గ్రామాల పరిధిలో గల ప్రాంతంలో ఎలాంటి కాలుష్యకారక పరిశ్రమలు అనుమతించబడవు. పెద్ద హోటల్స్, రెసిడెన్షియల్ కాలనీలు, కాలుష్యం వెదజల్లే ఇతర ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ను అనుమతించరు.
కానీ, నివాస భవనాలను నివాసాల కోసం నిర్ధారించిన జోన్‌లో కొన్ని ఆంక్షలతో అనుమతిస్తారు. ఈ 84 గ్రామాలలోని మూసీ క్యాచ్‌మెంట్ ఏరియాలలో చేసే లే అవుట్లలో 60 శాతం భూమిని (రోడ్లు, ఖాళీ స్థలాలు) వదిలివేయాలి.
ఈ 10 కి.మీ. పరిధిలో 90శాతం భూమిని రిక్రియేషన్, కన్జర్వేషన్ అవసరాల కోసం మాస్టర్ ప్లాన్‌లో కేటాయించారు. వ్యవసాయ, పండ్ల, పూల తోటలు పెంచేలా చర్యలు చేపట్టాలని హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి సూచించారు.
జంట జలాశయాల నీటిలో ఎరువులు, పురుగుల మందుల అవశేషాలు ఏమేరకు వస్తున్నవో ఎప్పటికప్పుడు జెఎన్‌టియు, సెంట్రల్ యూనివర్సిటీలలోని నిపుణులతో పరీక్షించేలా చర్యలు చేపట్టే బాధ్యత హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయి, సీవెరేజ్ బోర్డ్ (హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి) పై వుంటుంది.
కాలుష్యకారక పరిశ్రమలను ఈ జంట జలాశయాలకు 10కి.మీ. ఎగువన, దిగువ ప్రాంతంలో కూడా అనుమతించరాదని ఈ జీవోలో స్పష్టం చేశారు. ఈ పరిశ్రమల వాయుకాలుష్యం (ఎసిడిఫికేషన్) నుండి జంట జలాశయాలను పరిరక్షించడానికి ఈ నిబంధన పెట్టారు.
ఈ నిషేధిత జోన్ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలను కూడా అనుమతించరాదని జీఓ 111 స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రస్తుతం జలాశయాలకు ఎగువన, దిగువన వున్న పరిశ్రమలను పరిశీలించి అమల్లో వున్న చట్టాల పరిధిలో చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఉస్మాన్ సాగర్ నుండి ఆసిఫ్‌నగర్ వరకు గల త్రాగునీటి సరఫరా ఛానెల్ నుండి 100ఫీట్లు వదిలిన తర్వాతే లే`అవుట్లకు, బిల్డింగులకు అనుమతివ్వాలని జీఓ 111లో పేర్కొన్నారు. డ్రైనేజీ పైపులను ఈ ఛానెల్‌కు సమాంతరంగా నిర్మించాలని, 9.మీ. రోడ్డు, గ్రీన్ బెల్ట్‌ను (100ఫీట్లు) ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ జీ.ఓ 111ను సి. అర్జున్ రావు, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీగా రూపొందించి జారీ చేశారు.
జీ.ఓ. 111 జారీకి పూర్వం 13-3-1994న అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ 192ను జారీ చేసి అప్పటికే అమల్లో వున్న ఈ జీఓను ఈ అంశంపై హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ పరిశీలించి వారి సిఫార్సులకనుగుణంగా జీఓ 111ను చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసింది.
కానీ ఈ జీఓ రాజకీయ కారణాల వల్ల జారీ చేయడబడిందనే విమర్శ కూడా బలంగానే వున్నది. ఈ నిషేధిత గ్రామాలు చేవెళ్ళ నియోజక వర్గ పరిధిలోనివి. అప్పుడు ఇంద్రారెడ్డి ఈ స్థానానికి శాసన సభలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన లక్ష్మీపార్వతి టిడిపిలో వున్నారు. ఇంద్రారెడ్డిపై కక్షతోనే బాబు ఈ జీఓ 111ను జారీ చేశాడని, జంట జలాశయాలను కాలుష్యం నుండి పరిరక్షించాలనుకుంటే మూసీ, ఈసా నదులు పుట్టిన స్థలాల నుండి ఈ జలాశయాల దాకా ఆంక్షలు పెట్టేవారని కొందరు పర్యావరణ వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సమైక్య రాష్ట్రంలో ఈ జీఓ 111 పాక్షికంగానే అమలైంది. ఆంక్షలకు విరుద్ధంగా పలు భవనాలు, రెసిడెన్షియల్ కాలనీలు, కళాశాలలు నిర్మాణమైనాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు నిషేధిత ప్రాంతంలోనే నిర్మించారు.
కాలుష్యకారమైన కొన్ని పరిశ్రమలు (చిన్నతరహా) అక్రమంగా హిమాయత్‌సాగర్ ఎగువన వెలసినవి. అప్పట్లో 84 గ్రామాలే వున్నా ఇప్పుడవి 120 గ్రామాలైనాయి. ఈ 84 గ్రామాల ఎంపిక కూడా శాస్త్రీయంగా జరగలేదు. వీటిలో కలిసిన వట్టినాగులపల్లి గ్రామం మూసీ క్యాచ్‌మెంట్‌కు వెలుపల వున్న గ్రామం. పరిధిని 10 కి.మీ. అని ఏ ప్రాతిపదికన నిర్ణయించిందో ప్రభుత్వం పేర్కొనలేదు.
ఈ జీఓ అమల్లో వుండగానే ఈ ప్రాంతంలోని మొయినాబాద్, అజీజ్‌నగర్, హిమాయత్‌నగర్, శంశాబాద్, చేవెళ్ళ మొదలైనవి పట్టణాలుగా మారినాయి. ఈ పట్టణాలు, గ్రామాల నుండి వచ్చే కాలుష్యం జంట జలాశయాల్లోకి రాకుండా ఏ చర్యలనూ జీఓ 111 సూచించలేదు. ఈ గ్రామాల్లో ఎరువులు, క్రిమి సంహారక మందుల కాలుష్యాన్ని అరికట్టడానికి వ్యవసాయ శాఖకు ఎలాంటి సూచనలు, ఆదేశాలూ ఈ జీఓలో లేవు.
ఈ జీఓ 111ను ఎత్తేయాలని చాలా కాలంగా నిషేధిత ప్రాంతాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాలపై వరుసగా ఒత్తిడి చేస్తూనే వున్నారు. 2018లో రాష్ట్ర శాసన సభకు జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జీఓ 111ను ఎత్తేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేస్తూ జీఓ 69ను 12`4`2022న ప్రభుత్వం జారీ చేసింది.
జీఓ 111 గురించి నియమించిన హై పవర్ కమీటీ 31-3-2022న తమ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించారు. ఈ విషయాన్ని జీఓ 69లో ప్రస్తావించారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయి, సివరేజ్ బోర్డు ఇచ్చిన గణాంకాల ప్రకారం 1996లో జీఓ 111 జారీ చేసిన నాడు హైదరాబాద్ నగర త్రాగునీటి అవసరాలలో 27.59 శాతం మాత్రమే ఈ జంట జలాశయాలు తీర్చుతున్నవి.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల వున్న గ్రామాలు, మున్సిపాలిటీలు, మునిసిపల్ కార్పోరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్.. అన్నింటిలోకలిపి కోటి నలభై రెండు లక్షల మందికి త్రాగునీటిని హెచ్‌ఎండబ్ల్యు & ఎస్‌బి అందిస్తున్నది. ఈ జనాభా అవసరాలలో ఈ జంట జలాశయాలు తీర్చుతున్నది కేవలం 1.25 శాతం మాత్రమేనని ప్రభుత్వం జీఓ 69లో పేర్కొన్నది.

జీఓ 111 జారీ చేసిన నాడు ఈ జంట జలాశయాల అవసరం చాలా ఎక్కువగా వుండేది. ప్రస్తుతం పెరిగిన జనాభా అవసరాల కోసం ఈ జంట జలాశయాలు ఆధారపడదగిన వనరు కాదని ప్రభుత్వం భావిస్తున్నట్లు జీఓ 69లో పేర్కొన్నారు.
జంట జలాశయాల్లో మురుగునీరు కలవకుండా వేర్వేరు స్థలాల్లో ఎస్టీపీలను నిర్మిస్తామని, శుద్ధి చేసిన నీటి మళ్ళింపుకై డైవర్షన్ చానెల్స్‌ను నిర్మిస్తామని, తద్వారా ఈ నీరు జంట జలాశయాల్లో కలవకుండా నిరోధించనున్నట్లు జీఓ 69లో పేర్కొన్నారు.
భూగర్భ జలాల నాణ్యతను పరిరక్షిస్తామని, వ్యవసాయ భూముల నుండి ఈ జలాశయాల్లోకి చేరే కాలుష్యాన్ని కనీస స్థాయికి తగ్గిస్తామని, జలాశయాల్లో నీటి నాణ్యత కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని జీఓ 69లో ప్రభుత్వం పేర్కొన్నది. ఈ లక్ష్యాల సాధనకై అవసరమైన నియమనిబంధనలను రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన సంబంధిత శాఖల అధికారులతో ఒక కమిటీని నియమిస్తున్నట్లు ఈ జీఓలో పేర్కొన్నారు.

ఈ కమిటీ అనుసరించాల్సిన సూచనలను నిబంధనలను జీఓలో పేర్కొన్నారు.
పర్యావరణ వేత్తలు ఈ విషయమై తమ సూచనలు, అభిప్రాయాలను ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన గల కమిటీకి తెలియ చేస్తే కమిటీ సరైన నియమనిబంధనలను రూపొందించడానికి సహకరించిన వారవుతారు.
ఈ జంట జలాశయాలు ఐదేళ్ళకోసారి కూడా నీటితో నిండడం లేదు. దీనికి కారణం గ్లోబల్ వార్మింగేనని పర్యావరణ నిపుణులంటున్నారు. అడపాదడపా మూసీ, ఈసా నదుల క్యాచ్‌మెంట్‌లో వర్షాలు కురుస్తున్నా ఆ నీటి వినియోగం జలాశయాలకు ఎగువనే ఎక్కవగా జరుగుతున్నది. నదుల్లోకి నీరు తక్కువగా ప్రవహిస్తున్నది.
పెరిగిన నగర జనాభా త్రాగునీటి అవసరాలకు మరో దారి లేనందుననే ముఖ్యమంత్రి కాళేశ్వరం నుండి పలు దశల్లో ఎత్తిపోతల ద్వారా నీటిని తరిలిస్తున్నారు. ఈ విషయంలో ఖర్చు ఎక్కువవుతున్నదనే వాదన కొందరు లేవనెత్తుతున్నారు. మరోదారి లేనప్పుడు ఖర్చుగురించి ఆలోచించడంలో అర్థం లేదు.
క్యాచ్‌మెంట్‌ను, జలాశయాలను కాలుష్యం నుండి కాపాడడానికి జీఓ 111 అవసరంలేదు. ప్రస్తుతం వున్న ‘వాటర్ యాక్ట్’ వంటి చట్టాల్లోనే వున్న కఠిన నిబంధనలను అమలు చేస్తే చాలు.
నిజానికి ఏ నగరంలోనైనా జలాశయాల పరిరక్షణ కోసం జీఓ 111 వంటిది లేనేలేదు. అమల్లో వున్న చట్టాలనే పరిగణనలోకి తీసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళిక 2014లోనే మూసీ నదికి పునరుజ్జీవనం గురించి పేర్కొన్నారు. మూసీ నది కలుషితం కాకుండా, ఫ్యాక్టరీలు రసాయన వ్యర్థాలు వదలకుండా గట్టి చర్యలు టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతుంది. మూసీ నది పునర్‌వైభవం కోసం ఒక నగరస్థాయి వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది’’.
ఈ హామీని ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్’ను టిఆర్‌ఎస్ ఆధికారం చేపట్టిన వెంటనే ఏర్పాటు చేసింది. ఈ కార్పోరేషన్‌కు ఎల్‌బినగర్ ఎంఎల్‌ఏ సుధీర్ రెడ్డి ఛైర్మన్‌గా వున్నారు. మూసీ నది పరిరక్షణకు అనేక చర్యలను చేపట్టారు.
‘మూసీ నదితో తెలంగాణకు చారిత్రక వారసత్వ బంధం వున్నది. అటువంటి ఏ భావోద్వేగం లేని ఆంధ్ర పరిపాలకుల పాలనలో మూసీ నది అంతరించిపోయే ప్రమాదం ఏర్పడిందని టిఆర్‌ఎస్ 2014 ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న కేసీఆర్ తెలంగాణను 57 ఏళ్ళ విధ్వంసం నుండి అన్ని రంగాలను పునర్నిర్మిస్తున్నారు. అందరూ అసాధ్యమనుకున్న లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని అమలు చేసి చూపిస్తున్నారు. గత సంవత్సరం మూసీ క్యాచ్‌మెంట్‌లో ఎస్‌టిపిల నిర్మాణం కోసం రూ. 3600 కోట్లను జీఓ ఇచ్చి నిధులు కేటాయించారు, పనులు జరుగుతున్నవి.
పర్యావరణవేత్తలు, ముఖ్యమంత్రిని విశ్వసించి జంట జలాశయాల క్యాచ్‌మెంట్ పరిరక్షణకు అవసరమైన సూచనలివ్వాలి. మూసీ మొత్తం క్యాచ్‌మెంట్‌లో జీఓ 111 ఎత్తేసినా ఎలాంటి రసాయనిక, కాలుష్య కారక పరిశ్రమలు రాకుండా, జంట జలాశయాల ఎగువన గల ప్రాంతం కాంక్రీట్ జంగల్ కాకుండా, గ్రీన్ కవర్‌ను కాపాడేలా సిఎస్ ఆధ్వర్యంలోని కమిటీ కఠినమైన నిబంధనలు రూపొందించాలి.
ఇష్టం వచ్చినట్లు లే-అవుట్లకు అనుమతులివ్వకుండా ఒక పద్ధతి ప్రకారం పర్యావరణ పరిరక్షణ నియమాలను అమలు చేస్తూ ఒక ఆదర్శవంతమైన స్మార్ట్ సిటీని జంట జలాశయాల క్యాచ్‌మెంట్‌లో నిర్మించే అవకాశాన్ని ప్రభుత్వం వదులుకోకూడదు. ఆస్ట్రేలియా, విక్టోరియా స్టేట్ మెల్‌బోర్న్ నగరంలో ప్రైవేట్ భూములను ప్రభుత్వమే కొని ఒక పద్ధతి ప్రకారం లే-అవుట్ చేసి ఆ స్థలాలను వేలం వేస్తుంది. ఉప్పల్‌లోని గడ్డి భూములను ఈ పద్ధతిలోనే ప్రభుత్వం కొనుగోలు చేసి వేలంలో రియల్టర్లకు అమ్మింది. ధరలు పలురెట్లు పెరగడంతో భూ యజమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. (భూమిని కోల్పోయిన వారికి ప్రభుత్వం కొంత భూమిని ఈ లే-అవుట్‌లో కేటాయించింది.) ఈ పద్ధతినే జంట జలాశయాల ఎగువన గల భూముల విషయంలో ప్రభుత్వం అనుసరించాలి.
జంట జలాశయాలకు ఎగువన గల 84 గ్రామాల ప్రజల హక్కులకు భంగం కలిగించకుండా & మూసీ క్యాచ్‌మెంట్‌ను పరిరక్షించే మరొక మంచి జీఓ వస్తుందని ఆశిద్దాం.