అధిక్షేపానికి చిరునామా ఆచార్య పేర్వారం..

pervaram

ఎలుకల బాధ భరించలేక

పిల్లిని పెంచితే లాభమేముంది కనుక

పాడిని కాపాడలేక

నెత్తిమీద మరో కొత్త సమస్య…

అంటూ లోకంలో ఒక చెడును పరిహరించాలని మరోదాన్ని ప్రవేశపెడితే, అది మరో ప్రమాదానికి మార్గం ఏర్పడుతుంటుంది. ఇటువంటి అనేక సత్యాల్ని సూటిగా, వ్యంగ్యంగా, అధిక్షేపరూపంగా చెప్పిన కవి ఆచార్య పేర్వారం జగన్నాధం. ఆయన కవి, విమర్శకుడు, ఉత్తమ అధ్యాపకుడు, పరిపాలనా దక్షుడు. సాగర సంగీతం, వృషభపురాణం, గరుడ పురాణం వంటి కవితా సంకలనాలేగాక, సుప్రసన్న, సంపత్కుమార, వే.న.రెడ్డితో కలిసి చేతనావర్త కవులుగా రెండు చేతనవర్త కవితా సంకలనాలను వెలువరించిన ఉత్తమ కవి ఆచార్య పేర్వారం జగన్నాథం. సాహిత్యావలోకనం, సాహితీ వసంతం, పేర్వారం పీఠికలు, సాహితీ సౌరభంవంటి సాహిత్య విమర్శ గ్రంథాలు మాత్రమేగాక ‘ఆరెజానపద సాహిత్యం-తెలుగు ప్రభావం’ అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టాను పొంది ఆ గ్రంథాన్ని కూడా అందించిన గొప్ప విమర్శకులు జగన్నాథం.

కేవలం తన రచనలేగాక అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు, సాహిత్యం-సమాజం-రాజకీయాలు, అమృతస్మృతి విద్యారణ్య భారతి, తెలుగులో దేశీయ కవితా ప్రస్థానం వంటి విలువైన వ్యాస సంపుటాలకు సంపాదకత్వం వహించారు. ప్రాచీన సాహిత్యంపై మంచి అధికారం ఉన్న ఆచార్యులవారు ఇంద్రద్యుమ్నీయం, రంగరాజు కేశవరావు లఘుకృతులు, అధ్యాత్మ రామాయణం కీర్తనలు (రంగరాజు కేశవరావు), సౌదామనీ పరిణయం (ఒద్దిరాజు సీతారామ చంద్రరావు)వంటి కావ్యాలను పరిష్కరించి ప్రకటించడం వారి సంపాదకత్వ ప్రతిభకు నిదర్శనం. ఇంకా ఆరెజానపద గేయాలు, ఆరెజానపదగాథలు, ఆరె భాషా నిఘంటువును కూడా ప్రచురించారు.

జీవితమంతా సాహిత్యంగానే తీర్చిదిద్దుకున్న ఆచార్య పేర్వారం జగన్నాథం వరంగల్‌ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో 1934, ఆగస్టు 23న కీ.శే. పేర్వారం సంతాజీ, సయ్యమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా ఖిలాషాపురం, జనగామలలో జరిగింది. ఉన్నతవిద్య వరంగల్‌, హైదరాబాదులలో సాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంనుంచి ఎం.ఏ., పి.హెచ్‌.డి.పట్టాలు పొందిన పేర్వారం కళాశాల అధ్యాపకులుగా జీవితాన్ని ప్రారంభించారు. ఉపన్యాసకులుగా, కొంతకాలం వరంగల్‌లోని సి.కె.ఎం. కళాశాల ప్రిన్సిపాల్‌గా, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా అనేక బాధ్యతల్ని నిబద్ధతతో నిర్వహించి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఉపకులపతిగా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేశారు. అనేక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు మార్గదర్శనం చేసిన జగన్నాథం సాహితీ బంధుబృందాన్ని స్థాపించి పలు కార్యక్రమాలు నిర్వహించారు.

కవిత్వంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్న ఆచార్య పేర్వారం తెలుగులో అధిక్షేప కవితకు చిరు నామాగా మారారు. ఆయన మాటల్లోనే ‘అధిక్షేపమంటే అందులో వ్యంగ్యం ఉంటుంది, వెక్కిరింత ఉంటుంది, సున్నిత మైన హాస్యమూ ఉంటుంది, కించిద్విమర్శ కూడా ఉంటుంది. అన్నిటికీ మించి శరీరంపై ఎక్కడా కనిపించని కొరడా దెబ్బ ఉంటుంది. ధ్వని దీనికి ప్రాణం అన్నారు. మిక్కిలి ప్రతిభావంతంగా వారు చెప్పిన అధిక్షేప కవిత్వాన్ని వృషభ పురాణం, గరుడ పురాణాల్లో విస్తృతంగా చూడవచ్చు.

సున్నితంగా, సునిశితంగా, సుకుమారవంతమైన వ్యంగ్యంతో సాధికారంగా వారు చెప్పిన కవిత్వం కొత్త తరానికి స్ఫూర్తిదాయకం. తెలుగు సాహితీ ప్రపంచం వారికి అనేక పురస్కారాలను అందించి నీరాజనాలెత్తింది. ‘వాన మామలై వరదాచార్య అవార్డు (కోరుట్ల), అమలాపురం సమతా రచయితల సంఘం అవార్డు, ఢిల్లీవారిచ్చిన అఖిల భారత జాతీయ సమైక్య పురస్కారం, బూర్గుల రామకృష్ణా రావు సాహిత్య పురస్కారం (శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, హైదరాబాద్‌) డాక్టర్‌ జే రమణయ్య ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ (జగిత్యాల) వారి స్వర్ణ కంకణ పురస్కారం వంటివి ఎన్నో వారందుకున్న గౌరవాల్లో ఉన్నాయి.

‘నత్తి నత్తిగా మాట్లాడకు-అది పిరికి వాడి లక్షణం

వంగివంగి సలాములు కొట్టకు – అది బానిస లక్షణం

అనవసరంగా గొంతు చించుకోకు-అది పిచ్చివాని లక్షణం

కొటారు కొమ్మలపై గంతులేయకు-అది కోతి లక్షణం

నిటారుగా నిలుచుండి నడువు-చల్లకు వచ్చి ముంతదాచకు

దేవుడెదురైనా తలవంచకు-దేబెమొకంతో కాలం గడపకు’-

అంటూ యువతను ఋజుమార్గంలో నడవాలని కోరుకునే ఆచార్య పేర్వారం జగన్నాథం తెలంగాణాలో పుట్టి పెరిగిన జాతిరత్నం.

గన్నమరాజు గిరిజామనోహర్‌ బాబు