|

సేవారంగం పురోగతి

-By వి. ప్రకాశ్‌

రెండవ ఐసీటీ పాలసీని 2021`22లో కేసీఆర్‌ రూపొందించారు. ఈ పాలసీ ద్వారా ఇన్నోవేషన్‌, ఉద్యోగాలు, ఎగుమతులు పలు రెట్లు వృద్ధి చెందుతాయని పరిశీలకుల అభిప్రాయం. 

వ్యవసాయరంగ అభివృద్ధికి కారణమైన రైతాంగ అనుకూల విధానాలు

వ్యవసాయ, అనుంబధ రంగాలు తరతరాలుగా నెలకొన్న సంక్షోభం నుండి బయటపడి వడివడిగా పురోగమిస్తున్న దృశ్యాన్ని తెలంగాణ ఆవిష్కరిస్తున్నది. రైతును రాజుగా చూడాలనే తలంపుతో సీఎం కేసీఆర్‌ తానే రైతుగా అవతారమెత్తి ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను లోతుగా అధ్యయనం చేసి రూపొందించిన రైతాంగ అనుకూల విధానాల అమలు ఫలితమిది. సమైక్య రాష్ట్రంలో ఆత్మహత్యలతో వల్లకాడును మరపించిన తెలంగాణ పల్లెలు ఇప్పుడు పసిడి సిరులతో, రైతుల మోమొపై చిరునవ్వులతో మురిపిస్తున్నాయి. దశాబ్దాల పాటు బీళ్ళుగా పడావులుగా ఉన్న రైతుల భూములలో కాళేశ్వరం, దేవాదుల, గోదావరి జలధారలతో నాగార్జున సాగర్‌, కల్వకుర్తి, నెట్టెంపాడు. భీమా, కృష్ణమ్మ దివ్య జలాలతో తడిసి ముద్దయి, పురుడు పోసుకుని బంగారు పంటలకు జన్మనిస్తున్నాయి. దశాబ్దాల రైతుల కష్టాలకు, కన్నీళ్ళకు చరమగీతం పాడి తెలంగాణ రైతులు సగర్వంగా తలెత్తుకునేలా భారతావనికే ఆదర్శంగా నిలిపినాడు ముఖ్యమంత్రి కేసీఆర్‌. రాష్ట్రంలోని సుమారు సగం జనాభా ప్రత్యక్షంగా ఆధారపడ్డ రంగమిది.

వ్యవసాయ అనుబంధ రంగాల ప్రగతికి సాక్షం ఈ గణాంకాలు 

వ్యవసాయం, అటవీ సంపద, పశుసంపద, మత్స్యసంపద రంగాల నుంచి 2014`15లో 76,123 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ఖజానాకు లభించగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1,89,924 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. గణనీయంగా ఈ రంగంలో అభివృద్ధికి 49.73శాతం పశుసంపద దోహదం చేయగా, 44.66శాతం వ్యవసాయ పంటలు, 3.23 శాతం మత్స్య సంపద అలాగే 2.33శాతం కలప, అటవీ ఉత్పత్తులు దోహద పడ్డాయి. 

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్థుతం 139 లక్షల లైవ్‌స్టాక్‌ యూనిట్లు ఉన్నాయి. పశువుల సంఖ్య 2012లో 26.77 మిలియన్లు ఉండగా, 2019 నాటికి 32.06 మిలియన్‌లకు పెరిగింది. దేశంలోని పెద్ద రాష్ట్రాల పశుసంఖ్యతో పోలిస్తే పశ్చిమబెంగాల్‌ తరువాత దేశంలో రెండవ స్థానం తెలంగాణదే. 

భౌగోళిక విస్తీర్ణంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలలో 11వ స్థానం తెలంగాణది. ఈ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 276.96 లక్షల ఎకరాలు. ఈ మొత్తం భూమిలో 49.07 శాతం భూమి నికర పంట భూమి. తెలంగాణలో వానాకాలంలో వరి పండించే మొత్తం భూమి. 2014-15లో పంట భూమి మొత్తంలో 22 శాతం ఉండగా, 2020-21లో 37.1 శాతానికి పెరిగింది. పత్తి విస్తీర్ణంలో పెద్దగా మార్పేమీ లేదు. 2014-15 యాసంగి (రబీ) లో 43.4శాతం భూమిలో వరి పండించగా, 2020`21లో ఇది 76 శాతానికి పెరిగింది. యాసంగి పంటల్లో మొక్కజొన్న, పల్లి, శనగలు తదితర పంటలు పండించే భూమి విస్తీర్ణం బాగా తగ్గింది. 

తెలంగాణలో సాగునీటి వసతి బాగా పెరిగినందునే రైతాంగం మెట్టపంటల నుండి వరి వైపు ఆసక్తి చూపుతున్నారు. రెండు పంటలు పండే భూమి విస్తీర్ణాన్ని గమనిస్తే 2014-15లో 131 లక్షల ఎకరాల పంట నుంచి 2020-21లో 210 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే అదనంగా 79లక్షల ఎకరాలలో పంటలు పండిస్తున్నారు. దీనిలో వరి 50శాతం భూమిలో, పత్తి 28శాతం భూమిలో పండిస్తున్నారు. 

2014-15లో వరి పంట పండించిన మొత్తం భూమి కేవలం 35లక్షల ఎకరాలు మాత్రమే. 2021లో ఇది 197శాతం పెరిగి 104 లక్షల ఎకరాలకు వృద్ధి చెందింది. 

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాల వల్ల అన్ని పంటల ఉత్పత్తులు 2014-15లో 232 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉండగా, 2020-21 నాటికి 52శాతం వృద్ధితో 353 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగింది. 

2015-16లో వరిధాన్యాల ఉత్పత్తి 45లక్షల టన్నులు ఉండగా, 2020-21 నాటికి 378శాతం వృద్ధితో 218.5 లక్షల టన్నులకు చేరింది. ఇదే కాలంలో పత్తి ఉత్పత్తి 18 లక్షల టన్నుల నుంచి 61శాతం వృద్ధితో 30.42 లక్షల టన్నులకు చేరింది. 

బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్ద పీట :` 2016-17లో వ్యవసాయ రంగంపై రూ. 6611 కోట్లు బడ్జెట్‌లో కేటాయించగా, 2021-22 బడ్జెట్‌లో 26,822 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఈ సానుకూల చర్యల ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తుల విలువ 2014-15లో రూ. 41,706 కోట్లు ఉండగా, 2020-21లో రూ. 84,785 కోట్లకు పెరిగింది. (103 శాతం వృద్ధి). 

రైతు బంధు: దేశంలోనే తొలిసారి తెలంగాణ ప్రభుత్వం కరానికి ఏడాదికి రూ. 10వేల చొప్పున వ్యవసాయ పెట్టుబడి సాయాన్ని సుమారు 63 లక్షల మంది రైతులకు అందిస్తున్నారు. 2018 వర్షాకాలం పంట నుంచి 2021-22 యాసంగి పంటవరకు రైతాంగానికి 8 వాయిదాలలో అందిన మొత్తం రూపాయలు 50,448 కోట్లు. లబ్ధిదారుల్లో 48శాతం బీసీలు, 13 శాతం ఎస్సీ, ఎస్టీ రైతులు ఉన్నారు. ఈ రైతులలో 72.58 శాతం 2.5  ఎకరాల లోపు, 18శాతం 5 ఎకరాల లోపు గల చిన్న రైతులు. 25 ఎకరాలకు మించి ఉన్న రైతులు కేవలం 0.1శాతం మాత్రమే. 

తెలంగాణ పారిశ్రామిక రంగం 

2016 నుండి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే తెలంగాణ మూడవ స్థానంలో కొనసాగుతున్నది. టీఎస్‌ ఐపాస్‌, టీఎస్‌ ఐ ఫ్రైడ్‌ వంటి విధానాలే దీనికి కారణం. 

తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి 63 స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌లు (సెజ్‌) ఏర్పాటు చేసి 1.5 లక్షల ఎకరాల ల్యాండ్‌ బ్యాంక్‌ను కొత్త పరిశ్రమల కోసం అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. 2021లో రూ. 64,539 కోట్ల పారిశ్రామిక ఉత్పత్తులు తెలంగాణ నుండి విదేశాలకు ఎగుమతులైనాయి. వీటిలో 65శాతం ఫార్మా, ఆర్గానిక్‌ రసాయనాలు. ఈ ఎగుమతుల్లో 26.3శాతం అమెరికా దిగుమతి చేసుకుంటున్నది. 

2014-15 నుండి 2021 జనవరి 22 వరకు మధ్య కాలంలో పరిశ్రమల ఏర్పాటుకు 18,761 ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. వీటి ద్వారా రూ. 2,26,806 కోట్ల పెట్టుబడులు సమకూరుతున్నవి. వీటిలో 95.6 శాతం ఎంఎస్‌ఎంఇ యునిట్లు, పెద్ద పరిశ్రమలు 4.4శాతం మాత్రమే. టీఎస్‌`ఐపాస్‌ ద్వారా గరిష్టంగా 30 రోజుల్లో కొత్త పరిశ్రమలకు అనుమతులు లభిస్తున్నాయి. రాష్ట్రంలోని పారిశ్రామిక కార్మికుల సంఖ్య 25లక్షల 69వేల 134.

తెలంగాణ విద్యుత్‌ రంగంలో విప్లవం

2014-15 నాటికి తెలంగాణలో 9470 మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ సామర్ధ్యం ఉండగా, 2020-21లో ఇది 17218 మెగావాట్లకు చేరింది. వృద్ధి 80 శాతం. 

అతితక్కువ ట్రాన్స్‌మిషన్‌ నష్టాలు ఉన్న రాష్ట్రాలలో 3వ స్థానం తెలంగాణది. ఈ అంశంలో దేశ సగటు 20.66 శాతంకాగా తెలంగాణ ట్రాన్స్‌మిషన్‌ లాసెస్‌ 14.8 శాతం మాత్రమే, 

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి డిమాండ్‌ (పీక్‌) లో కొరత 2700 మెగావాట్లు. గృహ వినియోగంలో సుమారు 4 నుంచి 8 గంటల పవర్‌కట్‌ ఉండగా, వారానికి రెండుమూడు రోజులు నగర పారిశ్రామిక వాడల్లో పవర్‌ హాలీడే ఉండేది. తెలంగాణ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు శ్రద్ధ చూపకపోవడం వలన ఈ ప్రాంత రైతులు స్వయం కృషి, పెట్టుబడులతో సాగునీటి కోసం సుమారు 24 లక్షలకు పైగా బోర్లు వేసుకున్నారు. లక్షలాది బావులు తవ్వుకున్నారు. వీరికి ప్రభుత్వం సాయం లభించక పోగా విద్యుత్‌ చార్జీల వసూళ్ళకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధపడింది. రోజుకు కనీసం నాలుగు గంటల పాటు వ్యవసాయ పంపుసెట్లకు నాణ్యమైన విద్యుత్‌ లభించలేదు. అర్ధరాత్రి ఎప్పుడు వస్తుందో తెలియని కరంట్‌ కోసం నిద్రమత్తులో పంపుసెట్ల వద్దకు పోయిన రైతుల్లో వేలాదిమంది కరంట్‌ షాక్‌లకు, పాముకాటులకు బలైపోయారు. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి నెలకొన్న పరిస్థితి. 

2014, జూన్‌ రెండు తరువాత 

ప్రారంభంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరెంట్‌ కష్టాలపై దృష్టిపెట్టారు. ఈ రంగంలో ఎంతో అనుభవమున్న దేవులపల్లి ప్రభాకర్‌రావును టీఎస్‌ జెన్‌కో, ట్రాన్స్‌కోలకు సీఎండిగా నియమించి అనూహ్యమైన వేగంతో కేవలం 6నెలల కాలంలోనే కరెంట్‌ కష్టాలకు చెక్‌ పెట్టారు. ఛత్తీస్‌గడ్‌, ఇతర రాష్ట్రాల నుండి కరెంటును కొనడం, అసంపూర్తిగా ఉన్న గ్రిడ్‌ పనులను వేగవంతం చేసి దేశంలో  ఏ ప్రాంతం నుంచి అయిన విద్యుత్‌ను రాష్ట్రానికి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవడం, రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న విద్యత్‌ ఉత్పాదక ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయడం, సోలార్‌పవర్‌ ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి సాధించడం.. దూరదృష్టితో ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి చర్యల వలన గత అయిదేళ్ళ నుంచి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను గృహ, పరిశ్రమ, వ్యవసాయ వినియోగదారులు పొందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లు 25.02 లక్షలు ప్రతి సంవత్సరం విద్యుత్‌ సంస్థలకు ప్రభుత్వం సబ్సిడీగా  వేలకోట్లు చెల్లిస్తు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నది.  2021-22 బడ్జెట్‌లో రూ. 10,500 కోట్లు ఉచిత విద్యుత్‌ సబ్సిడీ కోసం కేటాయించింది ప్రభుత్వం. రాష్ట్రంలోని గృహ సంబంధ విద్యుత్‌ కనెక్షన్లు 1.20 కోట్లు కాగా, పరిశ్రమల విద్యుత్‌ కనెక్షన్లు 19.30 లక్షలు.  

తలసరి విద్యుత్‌ వినియోగం తెలంగాణలో 2020-21లో 1905 కిలోవాట్లు కాగా, ఇది జాతీయ తలసరి విద్యుత్‌ వినియోగం కన్నా  1.8 శాతం ఎక్కువ. ఈ అంశంలో సాధించిన వృద్ధి సీఏజీఆర్‌ (కాంపౌండ్‌ ఆన్యుయల్‌ గ్రోత్‌ రేట్‌) 2014-15 నుండి 2020-21 మధ్య 8.74 శాతం కాగా, జాతీయ వృద్ధిరేటు కేవలం 3.24శాతం మాత్రమే. జాతీయ తలసరి విద్యుత్‌ వినియోగం 2020-21లో కేవలం 1031 కిలోవాట్లు మాత్రమే. 

‘‘తెలంగాణ రాష్ట్రం ఇస్తే అంతా అంధకారమే. కంరెటు తీగలపై బట్టలు ఆరేసుకుంటారన్న’’ వారికి గొప్ప విజన్‌తో అనితర సాధ్యమైన చేతలతో సమాధానం చెప్పారు కేసీఆర్‌. 

భవిష్యత్తులో ఎత్తిపోతల పథకాలకు 10వేల మెగావాట్లు అవసరమైనా తీర్చగల విద్యుత్‌ ఉత్పాదక శక్తిని కూడగట్టుకుంటున్నది తెలంగాణ రాష్ట్రం.