రాఖీతో అనురాగ బంధం

By: తాళ్ళపల్లి యాదగిరి గౌడ్‌

భారతీయుల సనాతన సంస్కృతిలో రాఖీ పూర్ణిమ (రక్షాబంధన మహోత్సవానికి)కు విశేష గౌరవ, విలువల మహోన్నత ఆచరణ వుంది… సోదరీ, సోదరుల అనురాగ బంధాలను మరెంతో బలోపేతం చేస్తుంది రాఖీ పండుగ. మహిళ జన్మించింది మొదలు మరణం వరకు తల్లిదండ్రులు, అన్నా, తమ్ముళ్ళు, భర్త, కుమారులు, కుమార్తెలు రక్షగా ఉంటారు. తల్లిదండ్రులు మరణించిన తర్వాత… పుట్టింటి బంధాలు తెగిపోకుండా ఆమె రక్షణ బాధ్యతను సోదరులు కొనసాగిస్తారు. భర్త జీవితాంతం తోడు, నీడగా ఉన్నా పుట్టింటి బంధాలకే స్త్రీ విలువనిస్తుంది. ఆ అంతరంతరాలనుంచి పుట్టుకొచ్చిన ఆత్మీయ, అనురాగ బంధాలను సోదరీ, సోదరుల మధ్య మరింత పటిష్ఠ పరచి అది శాశ్వతంగా పదిల పరచటానికి పూర్వం ఋషులు తీసుకొచ్చిందే మహత్తర రాఖీ పండుగ. ఎవరి వల్ల ఏ ఆపద, ఏ కష్టమొచ్చినా, అన్ని వేళలా నీకు రక్షగా ఉండి కాపాడుకుంటాం అని సోదరులు, సోదరీ మణులకు రక్ష ద్వారా అభయం ఇచ్చే సందేశాన్ని తెలిపేదే రాఖీ పండుగ. రక్ష అంటే రక్షణ. రక్షణకై ధరింపజేసే సూత్రంతో రూపొందిన తోరం రానురాను వాడకంలో రాఖీగా మారింది.

పురాణాల్లో రాఖీ విశిష్ఠత

భవిష్యోత్తర పురాణం, హేమాద్రి చతుర్వర్గ చింతామణి, భాస్కర రామాయణం, మొగిలాయి చరిత్ర, మహావీర పురుషోత్తమ చరిత్ర, భాగవతం, మహాభారతం, శివపురాణం, తదితర గాథలతో కూడిన ఆధ్యాత్మిక, పౌరాణిక, చరిత్రాత్మక కథనాలు సోదరీ, సోదరుల మధ్య ఆప్యాయతానురాగాలను పంచే విశిష్ఠ పండుగగా రాఖీ పండుగ(రక్షాబంధనం) వైభవం గురించి గొప్పగా చెబుతున్నాయి.

రాఖీ పుణ్యమా అని… సంతోషీ మాత జననం:

వినాయకునికి లాభం, క్షేమం అనే ఇద్దరు కుమారులు. వీరు శ్రావణ పూర్ణిమ నాడు శంకరుని పుత్రికగా పిలువబడే నాగదేవత వద్దకు రాఖీ కట్టడానికి వెళ్ళారు. దీంతో ఆమె రాఖీ కేవలం సోదరులకు కట్టడానికే. తనకు ధరింపజేయడం ఉచితం కాదని సున్నితంగా తిరస్కరించింది. దీంతో ఇరువురు సోదరులు తమకు తోడబుట్టిన ఒక చెల్లెలు కావాలని తండ్రిని కోరారు. నారదుని సలహాను పాటించి వినాయకుడు తన ఇరువురు భార్యలు బుద్ధి, సిద్ధిలను ఆదేశించాడు. దీంతో వారి శరీరాల నుంచి ఒక మహెజ్వల దివ్య శక్తి ఆకాశమంత ఎత్తుతో తేజస్సు వెలువడిరది. త్రిశక్తి మాతల దివ్య రూపాలు, వారి శక్తి, మహిమాన్వితాల సమ్మేళనంతో… మహాశక్తి స్వరూపిణిగా… విజయ వర ప్రదాయినిగా, మహోజ్వల మహోన్నత ప్రకాశిత దివ్య తేజస్సునుండి శ్రీ సంతోషి మాత సర్వ జగత్తులోని అంధకారాన్ని బాపడానికి ఆవిర్భవించింది. అప్పుడు ఆమెను తమ తోడబుట్టిన చెల్లెలిగా స్వీకరించి లాభం, క్షేమం సోదరులు ఇరువురు ఆప్యాయతాను రాగాలతో ఆమెను హత్తుకుంటూ పరస్పరం రాఖీలు కట్టుకున్నారు. ఇలా రాఖీ పుణ్యమా అని సంతోషీ మాత జనించి సకల లోకాలకు ఆరాధ్య దేవతైంది. అందరికీ అమ్మవారైంది. కోరిన వారికి కొంగు బంగారమైంది. తన భక్తుడు అమ్మా అని పిలువగానే బిడ్డా అని చంకనెత్తుకునే చల్లని తల్లి అయింది.

పూర్వం రాఖీని ఎవరు ఎవరికి కట్టారు?

అయితే వివిధ పురాణ గాథలను బట్టి చూస్తే స్త్రీలు మాత్రమే తమ సోదరులకు రాఖీ కట్టాలనే నియమం లేదని తెలుస్తోంది. స్త్రీలు స్త్రీలకు, పురుషులు పురుషులకు, భార్యకు భర్త, భర్తకు భార్య, తల్లి కుమారునకు, ఇలా ఒకరు మరొకరికి కట్టడం ఉందని తెలుస్తోంది. కాగా భారతీయ సంస్కృతిలో కేవలం శ్రావణ పూర్ణిమ నాడు కట్టినవే కావని అనేక సందర్భాల్లో కట్టినట్లుగా ఉందని పౌరాణికులు చెబుతారు. తల్లి కౌసల్యా దేవి అరణ్య వాసానికి వెళుతున్న శ్రీరామ చంద్రునికి రక్ష కట్టి ఆశీర్వదించినట్లుగా భాస్కర రామాయణంలో ఉంది. దానవులతో యుద్ధంలో ఓడిన దేవతల రాజు ఇంద్రుడు పరమేశ్వరి శక్తి అంశ కలిగిన… భార్య శచిదేవి (ఇంద్రాణి) రక్ష ధారణతో మరుసటి రోజు జరిగిన యుద్ధంలో దానవులను ఇంద్రుడు ఓడిరచాడు. ఇదే క్రమంలో రాక్షసరాజు, శ్రీమహావిష్ణువు భక్తుడు బలి చక్రవర్తికి అపమృత్యు నివారణకు మహాలక్ష్మి రక్ష కట్టింది. శకుంతల తన కుమారుడు భరతునకు రక్ష కట్టి, శతృ భయం లేకుండ నివారించింది. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు రక్షమహిమ గురించి చెప్పాడు. ఈ క్రమంలో యుద్ధానికి వెళుతున్న భర్త విజయుడై తిరిగి రావాలనీ భార్య ఉత్తర అభిమన్యునకూ, అలాగే పల్నాటి యుద్ధంలో మాంచాల బాలచంద్రునకూ, ఖడ్గ తిక్కనకు భార్య, మేడారం సమ్మక్క కుమారుడు జంపన్నకు భార్య సోమక్కలు రాఖీలు కట్టి యుద్ధానికి సాగనంపిన సందర్భాలు మనకు కనిపిస్తాయి.

అన్నా చెల్లెళ్ళ పండుగే :

అయినా ఈ రాఖీ పండుగ మాత్రం అన్నా, చెల్లెళ్ళు, అక్కా తముళ్ళ అనురాగ బంధాలు వెల్లివిరిసే పండుగగానే ప్రజల్లో ఉండిరది. ఈ పండుగకు మరింత మహోన్నత ఆచరణను కలిగించడానికి శ్రీరాముడు తన అక్క మహర్షి ఋశ్యశృంగుని భార్య శాంతతో, శ్రీకృష్ణుడు తన చెల్లెళ్ళు అయిన సుభద్ర, ద్రౌపదిలతో రాఖీలు కట్టించుకొని తమ అపూర్వ సోదరీ, సోదరుల ప్రేమను ప్రపంచానికి చాటి రాఖీ పండుగకు ప్రఖ్యాతి తెచ్చారు…. అలాగే చరిత్రలోకి వస్తే… మహావీర పురుషోత్తముడు… తనను అన్నగా గౌరవిస్తూ రుక్సానా కట్టిన రక్షబంధనానికి కట్టుబడి యుద్ధంలో ఆమె భర్త జగదేక వీరుడు అలెగ్జాండర్‌ను వదిలి పెట్టాడు. అలాగే చిత్తోడ్‌ గఢ్‌ పై మొగలాయి పాదుషా బహదూర్‌షా దండెత్తినప్పుడు ఆయనకు రాణి కర్ణావతి సోదరభావంతో రక్షా బంధనంతో సంధి కుదుర్చుకుంది… ఇలా ఎవరైనా సోదర సమానునిగా భావించి మహిళలు రాఖీలు కట్టడం కూడా ఆచారమయింది.

ఛత్రపతి శివాజి… బాలగంగాధర్‌ తిలక్‌ :

దేశ రక్షణకు, హిందూ జనోద్ధరణకు అకళంక దేశ భక్తాగ్రేసరుడు, మరాఠా మహావీరుడు ఛత్రపతి శివాజి… రాజ్యంలోని అనేక మంది వీరనారీమణులతో వీర రాఖీలు కట్టించుకొని మొగలాయి చక్రవర్తి ఔరంగ జేబ్‌ పై రణభేరి మోగించి మహారాష్ట్రలోని అనేక దుర్గాలను కైవసం చేసుకున్నాడు…. ఈ క్రమంలో ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టి స్వాతంత్య్ర సముపార్జనకు బాల గంగాధర్‌ తిలక్‌ భారత జాతి సమైక్యతకూ, మత సామరస్యానికి రక్షా బంధన మహోత్సవాన్ని గొప్పగా జరిపించాడు.

జంధ్యాల పూర్ణిమ :

శ్రావణ పూర్ణిమను రాఖీ పూర్ణిమతో పాటు జంధ్యాల పూర్ణిమగా కూడా పిలుస్తారు. నూతన యజ్ఞోపవీతం ధరించే ప్రతి ఒక్కరూ జీర్ణ యజ్ఞోపవీతాన్ని విసర్జించి… నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. తమ ఇష్ట దైవాలకు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపి జంధ్యాలు వేసుకొని శ్రావణ పూర్ణిమను తమ ఇళ్ళలో గొప్ప పర్వదినంగా జరుపుకుంటారు.

పర్వదినాల మాసం శ్రావణం:

శ్రావణ మాసం సర్వ దేవుళ్లకూ… ముఖ్యంగా శ్రీమహావిష్ణువు, శ్రీమహాలక్ష్మిలకు ప్రీతికరమయినదిగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే శ్రావణమాసాన్ని పర్వదినాల, పవిత్ర, ఆధ్యాత్మిక మహోన్నత పుణ్య, శుభమానంగా తమ ఇష్టదైవాలకు ఆరాధనలు జరుపుతారు. శ్రావణ పౌర్ణమి విద్యారంభ కాలంగా కూడా పరిగణిస్తారు. ఈ మాసంలో శ్రావణ శుద్ధ పంచమి, శ్రావణ బహుళ షష్ఠి శ్రావణ శుద్ధ దశమి, పుత్రదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి, శ్రావణ పూర్ణిమ… ఇదే పూర్ణిమను రాఖీ పూర్ణిమగా, హయగ్రీవ జయంతిగా, గురు రాఘవేంద్రుల జయంతిగా, దేవ వైద్య శిఖామణి ధన్వంతరీ జయంతిగా జరుపుకుంటారు. ఇదే క్రమంలో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఇలా ఉండగా శ్రావణ మాసంలో మంగళ, శుక్ర, శని వారాలు అత్యంత పుణ్యప్రదమయినవిగా హిందువులు భావిస్తారు. మంగళ వారాలు మంగళ గౌరీ పూజ, శుక్ర వారాలు శ్రీలక్ష్మీ పూజ, శని వారాలు శ్రీమహావిష్ణువు పూజలు చేస్తారు. ఈ విధంగా ఎన్నో శుభ, పర్వ దినాల సమ్మేళన మాసంగా శ్రావణంలో… దైవారాధనలతో, ఆధ్యాత్మిక చింతనలతో, పౌరాణికుల ప్రవచనాలతో, ఆలయాల్లో పూజా వైభవాలతో భారతీయులు ప్రశాంతంగా, పవిత్ర జీవనాన్ని సాగిస్తూ తరిస్తారు.