వ్యవసాయం, అనుబంధరంగాలు

farmingజనాభాలో సగంమందికి జీవనాధారంగా ఉన్న వ్యవసాయరంగాన్ని లాభదాయకంగా తీర్చిదిద్దేందుకు, ప్రతికూల పరిస్థితులను మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు తక్షణం ఉపశమనం కలిగించడానికి రైతుల బ్యాంకు రుణాల మాఫీకోసం ప్రభుత్వం రూ. 4,250 కోట్లు విడుదల చేసింది. దీనివల్ల వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో రైతులు తిరిగి రుణాలు తీసుకొనే వెసులుబాటు కలిగింది.

 • 2015-16 బడ్జెట్‌లో రుణమాఫీకోసం రూ. 4,250 కోట్లు ప్రతిపాదించారు.
 • రైతాంగానికి నిలకడైన ఆదాయం లభించేందుకు వీలుగా పండ్లతోటలు, కూరగాయలసాగు, పూలసాగు అభివృద్ధి పరచాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులోభాగంగా ‘గ్రీన్‌హౌజ్‌’ సాగుకోసం రూ. 250 కోట్లు ప్రతిపాదించారు. గ్రీన్‌హౌజ్‌ ఏర్పాటుకోసం ప్రభుత్వం 75శాతం సబ్సిడీగా ఇస్తుంది.
 • సూక్ష్మ సేద్యాన్నికూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ఈ బడ్జెట్‌లో రూ. 200 కోట్లు ప్రతిపాదించారు.
 • వ్యవసాయ మార్కెట్‌రంగంలో సంస్క రణలు తెచ్చేందుకు ప్రభుత్వం నియమించిన రాష్ట్రస్థాయి కమిటీ 2014 అక్టోబర్‌లో నివేదిక సమర్పించింది. ఈ కమిటీ సిఫార్సుల ప్రకారం వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో వ్యవసాయ మార్కెటింగ్‌శాఖలో ఈ`టెండర్ల వేలం పద్ధతులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

కూరగాయలకు పెరుగుతున్న డిమాండ్‌నుబట్టి ‘మన ఊరు`మన కూరగాయలు’అనే వినూత్న పథకం రూపుదిద్దుకొంది.

రాష్ట్రంలో కొత్తగా 6.725 లక్షల మెట్రిక్‌టన్నుల సామర్థ్యంగల గిడ్డంగులను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకు రూ. 403.50 కోట్లు వ్యయం కాగలదని అంచనా. అలాగే, నాబార్డు రుణసహాయంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సంఘాల వద్ద 9.10 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంగల గిడ్డంగులను నిర్మిస్తున్నారు.

ఇందుకోసం వ్యవసాయ మార్కెటింగ్‌శాఖకు ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలక్రింద 2015`16 బడ్జెట్‌లో రూ. 411 కోట్లు ప్రతిపాదించారు.

మొత్తం వ్యవసాయ, వ్యవసాయ అనుబంధరంగాలకు ఈ బడ్జెట్‌లో రూ. 8,432 కోట్లు ప్రతిపాదించారు.

curentపారిశ్రామికాభివృద్ధి:

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడానికి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామికీకరణే మార్గమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ‘పరిశోధనల నుండి ఆవిష్కరణలు, ఆవిష్కరణల నుండి పరిశ్రమలు, పరిశ్రమల నుంచి అభ్యుదయం’ అన్నదే తమ సూత్రమని ఆర్థికమంత్రి తమ ప్రసంగంలో పేర్కొన్నారు.

ఉన్న పరిశ్రమలను సుస్థిరం చేయడంతోపాటు, పారిశ్రామికరంగంలో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేవిధంగా దేశంలోనే విశిష్టమైన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలలో వ్యవస్థాపకతను ప్రోత్సహించాలన్నది ఈ పారిశ్రామిక విధానంలో మరో విశిష్టత.

2015-16 సంవత్సరంలో హైదరాబాద్‌-వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌, వరంగల్‌లో వస్త్రోత్పత్తి పరిశ్రమ, కొత్తగా ఏర్పడే ఫార్మాసిటీ, ఇండస్ట్రియల్‌ పార్క్‌లకు అనుసంధానంగా మినీ పారిశ్రామిక టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి, హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డుకు కేవలం 30 నిమిషాల ప్రయాణదూరంలో ఉన్న ముచ్చర్ల గ్రామంలో 11,000 ఎకరాలలో ఫార్మాసిటీ అభివృద్ధి చేయనుంది. 2015-16 బడ్జెట్‌లో పారిశ్రామికాభివృద్ధికి రూ. 973.74 కోట్లు ప్రతిపాదించారు.

విద్యుత్‌

currents

మరో ముఖ్యమైన రంగం విద్యుత్‌రంగం. ప్రస్తుతం రాష్ట్రం విద్యుత్‌కొరత ఎదుర్కొంటోంది. అన్నిరకాల వినియోగదారులకు సరిపోయినంత, నాణ్యమైన విద్యుత్‌ అందించడం, ముఖ్యంగా రాష్ట్రంలోని 19.53 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు రోజుకు ఏడు గంటలపాటు నిరంతర విద్యుత్‌ అందించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. సంప్రదాయ విద్యుత్‌తోపాటు, సోలార్‌ విద్యుత్‌ను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 500 మెగావాట్ల సామర్థ్యంగల సోలార్‌ విద్యుత్‌ప్లాంట్ల స్థాపనకు బిడ్‌లను కూడా ఆహ్వానించింది. సాంప్రదాయేతర ఇంధన వనరుల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 20 శాతం సబ్సిడీ ఇస్తూ, గృహ అవసరాలు తీర్చేందుకు ఒక కిలోవాట్‌ సామర్థ్యంగల 4,000 సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను ప్రభుత్వం ప్రోత్సహించనుంది.

రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 4,320 మెగావాట్లుగా వుంది. విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా తయారు చేయడానికి వీలుగా 2018 సంవత్సరంనాటికి 23,675 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

2015-16 బడ్జెట్‌లో విద్యుత్‌ రంగానికి రూ. 7,400 కోట్లు ప్రతిపాదించారు.

నీటిపారుదల రంగం

కృష్ణా, గోదావరి నదీజలాలలో మన వాటా నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నది ప్రభుత్వ దృఢ సంకల్పం. అందులో భాగంగానే పాలమూరు ఎత్తిపోతల పథకం, నక్కలగండి ప్రాజెక్టులను చేపట్టాలని ఈ బడ్జెట్‌లో కొత్తగా ప్రతిపాదించారు. వర్షాకాలంలో 51 టి.ఎం.సి.ల నీటిని నిల్వ చేసుకొనే సామర్థ్యంగల రెండు రిజర్వాయర్లను నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో ఒకటి తడకపల్లిలో, రెండవది పాములపర్తిలో నిర్మించనున్నారు.

మిషన్‌ కాకతీయతోకలిపి, ఇతర సాగునీటి ప్రాజెక్టులు అన్నింటికీ 2015-16 బడ్జెట్‌లో రూ. 8,500 కోట్లు ప్రతిపాదించారు. ‘మిషన్‌ కాకతీయ’ కార్యక్రమంలో భాగంగా, 2015-16 కాలంలో 9,308 చెరువుల పునరుద్ధరణ చేపట్టనున్నారు. ఇందుకుగాను 2015-16 బడ్జెట్‌లో మిషన్‌ కాకతీయతోపాటు చిన్ననీటిపారుదల శాఖతో కలిపి రూ. 2,083 కోట్లు ప్రతిపాదించారు. ఈ పథకాలకు నిధులను నాబార్డు, ఇతర బ్యాంకుల ద్వారా కూడా సమీకరించనున్నారు.

 • ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మరో పథకం ‘వాటర్‌గ్రిడ్‌’. రాగల నాలుగేళ్ళలో తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లాద్వారా నీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.ఈ పథకానికి ఈ బడ్జెట్‌లో రూ. 4,000 కోట్లు ప్రతిపాదించారు.
 • రహదారుల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. 2015`16 వార్షిక బడ్జెట్‌లో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కింద రోడ్ల నిర్వహణ, నవీకరణలకోసం రోడ్లు, భవనాలశాఖకు రూ. 4,980 కోట్లు, పంచాయతీరాజ్‌శాఖకు రూ. 2,421 కోట్లు ప్రతిపాదించారు.
 • ఈ ఏడాది కూడా హైదరాబాద్‌, జిల్లా కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులన్నింటినీ బలోపేతం చేయడానికి, ఆధునికీకరించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 108 అంబులెన్స్‌ సేవలను బలోపేతం చేసే చర్యలలో భాగంగా వీటి సంఖ్యను 337 నుంచి 506కు పెంచనున్నారు. 104 సర్వీసులను కూడా మెరుగుపరచాలని ప్రభుత్వం సంకల్పించింది. వైద్య, ఆరోగ్య సేవలకోసం ఈ బడ్జెట్‌లో రూ. 4,932 కోట్లు కేటాయించారు.
 • విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు ప్రారంభించింది. గతంలో నిర్లక్ష్యానికి గురైన చరిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఈ బడ్జెట్‌లో రూ. 238 కోట్లు ప్రతిపాదించారు. కొత్తగా ఏర్పాటు చేసిన పి.వి. నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్‌ ఉద్యానవన విశ్వవిద్యాలయంతోపాటు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి రూ. 261 కోట్లు ప్రతిపాదించారు.
 • 2015`16 బడ్జెట్‌లో మొత్తం విద్యారంగానికి రూ. 11,216 కోట్లు కేటాయించారు.
 • పోలీస్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కూడా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. పోలీస్‌స్టేషన్లలో సౌకర్యాల కల్పనకోసం నగర పోలీస్‌స్టేషన్లకు రూ. 75,000 చొప్పున, జిల్లా కేంద్రాలలోని పోలీస్‌స్టేషన్లకు రూ. 50,000, గ్రామాలలోని పోలీస్‌ స్టేషన్లకు రూ. 25,000 చొప్పున నెలవారీ ఖర్చుల కోసం ప్రభుత్వం కేటాయించింది.
 • గత ఏడాది చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించింది. మొక్కలు నాటడం, వాటి సంరక్షణ, తదితర అంశాలమీద ప్రజలలో అవగాహన పెంచడానికి 2015 జూలై నెలలో ఒక వారం పూర్తిగా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘హరితహారం’ కార్యక్రమానికి ఈ బడ్జెట్‌లో రూ. 325 కోట్లు ప్రతిపాదించారు.