రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి
రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమ్మక్క-సారలమ్మ తల్లులను ప్రార్థించారు. మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర చివరి రోజు గవర్నర్ తమిళిసై తల్లులను దర్శించుకుని తల్లులకు చీర, సారెలను, గోవిందరాజు, పడిగిద్దరాజులకు పంచెలను సమర్పించారు. గవర్నర్ తల్లుల దర్శనానికి రాగా రెవెన్యూ, గిరిజన సంక్షేమశాఖ అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అధికారులు, పూజారులు గవర్నర్‌కు చీరే, పసుపు కుంకుమ, బంగారం(బెల్లం), జ్ఞాపికను అందజేశారు.

సమాచార, పౌర సంబంధాల శాఖ, జాతర విశిష్టతను తెలియజేస్తు రూపొందించిన సావనీర్ ను ఆవిష్కరించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి గవర్నర్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేడారం జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర అని, ఈ జాతరకు రావడం తల్లులను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలను రక్షిస్తూ ప్రజలందరికీ సుఖసంతోషాలను, అష్టైశ్వర్యాలను కలుగచేయాలని తల్లులను ప్రార్థించినట్టు తెలియజేశారు.