కాలగతికి నిలిచే రచనలు

ఆయన వ్రాసిన నవలే ఆయన ఇంటి పేరుగా మార్చి తమ గౌరవాన్ని ప్రకటించుకున్నారు తెలుగు ప్రజలు. ఇది చాలా అరుదైన అపురూప సంఘటనగా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచి పోతుందని ఘంటా పథంగా చెప్పవచ్చును. ప్రస్తుత సమీక్షా గ్రంథం ‘‘స్నేహరాగం’’ (ఒక నవలిక కొన్ని కథలు) రచయిత అంపశయ్య నవీన్‌ ఒక ట్రెండ్‌సెట్టర్‌గా తెలుగు పాఠకులకు సుపరిచితులు. 33 నవలలు, 8 కథా సంకలనాలు, పలు సాహిత్య వ్యాసాలు, జీవిత చరిత్రలు – విరివిగా వెలుబడుతూ తెలుగు పాఠకుల మెప్పు పొందాయి. అంపశయ్య, బాంధవ్యాలు, రక్త కాసారం, చెదిరిన స్వప్నాలు, లాంటి రచనలు తెలుగేతర భాషలకు అనువదింపబడ్డాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మార్క్స్‌ ప్రాయడ్‌ల తత్త్వ శాస్త్రాన్ని మనో విశ్లేషణ శాస్త్రాన్ని తనదైన దృష్టికోణంతో పరిశీలించి పరిచయం చేస్తోన్న ఈ రచయత ప్రముఖ విమర్శకులు కూడా!

స్ట్రీమ్‌ ఆఫ్‌ కాన్షియస్‌ టెక్నిక్‌ ప్రక్రియతో జేమ్స్‌ జామిస్‌ యూరోప్‌లో ప్రవేశపెట్టిన సాహితీ సృజనను ‘చైతన్య స్రవంతి’గా తెలుగు పాఠకులకు నవీన్‌ పరిచయం చేసారు. ఒక పాత్రలో క్షణక్షణానికీ కలిగే మనోద్వేగాల యధా తథ చిత్రణను ‘చైతన్య స్రవంతి’ గా పేర్కొంటారు. ఇలాంటి ప్రక్రియ ఒకటి ఉంటుందని తెలియకుండానే వ్రాయటం నవీన్‌ గొప్పతనం. తర్వాతి కాలంలో వీరు వ్రాసిన చాలా నవలలు కథలు ఇదే ట్రెండ్‌ను ఆనుసరించి పాపులర్‌ అయ్యారు. ‘స్నేహరాగం’ నవలిక శైలేంద్ర అనే ప్రఖ్యాత రచయిత అభిమాని చైతన్య అను యువతి మధ్య చోటుచేసుకున్న పరస్పరాధన కథకు మూలవస్తువు. 90 పేజీలుగా నడిచిన కథలో చైతన్య కాలేజీ జీవితం డాక్టర్‌ పట్టా పొందటం, ఉద్యోగం చివరకు రిటైరయ్యి ‘ఆగ్రాలోని’ రాధాస్వామి సత్సంగ్‌ సంస్థలో సేవికగా మారి తనువు చాలించటం వరకు కథ నడుస్తుంది. క్లయిమాక్స్‌, పతాక సన్నివేశాలు, ఉత్కంఠ లాంటి భావోద్వేగాలు గట్రా ఏమీలేకుండా నల్లేరు మీద నడకలా సాగుతుంది కథ. మిగతా 5 కథల్లో కూడా ఇదే చైతన్య స్రవంతి పంథాలో నడిచాయి. విముక్తి కథలో రవళి బాల్యం, కౌమారం, యవ్వనం, పాపారావు (భర్త)తో వివాహం. భర్త తాగుబోతుతనం ఇవన్నింటి వల్ల రవళి మీద పాఠకులకు బోలెడంత సానుభూతి కలుగుతుంది.

నవీన్‌ కథనంలో రచయిత ఎప్పుడూ కథ నడుస్తుంది. ఏ ఇజాలకు కట్టుబడక, మూల సిద్ధాంతాల పట్ల గాఢమైన అభినివేశమే వీరి రచనలకు ఆయువు పట్టు.

ఒక రచయితను వివిధ కోణాల్లోంచి అనేకులు తమతమ అభిప్రాయాలతో ఆయన రచనలని ఎంచి చూడటాన్ని ‘గీటురాయి’ ప్రక్రియగా పేర్కొంటారు. ఈ సంకలనం ‘‘అంపశయ్య నవీన్‌ సాహితీమూర్తి మత్వం’’ 36గురు రచయిత / రచయిత్రుల. వ్యాససంకలనం. డా॥ అమ్మంగి వేణుగోపాల్‌, అనిశెట్టి రజిత, ఎ.కె. ప్రభాకర్‌, డా॥ కె. నరేందర్‌, పి. సత్యవతి, డా॥ కొమర్రాజు రామలక్ష్మి, సుధామ, కె.పి. అశోక్‌ కుమార్‌, సత్యాన్వేషి ఎ. వెంకట నారాయణ ప్రభృతులు. వివిధ కోణాల్లోంచి నవీన్‌ రచనలను విశ్లేషించారు. రచయితలో చూపును మతబాజి శ్రీధర్‌ బయల్పరిచితే, గత వర్తమానాల వారధి, అని బన్న అయిలయ్య ‘ముళ్ల పొదలు’పై వ్యాఖ్యానించారు. కాల్పనిక సాహిత్య విమర్షకుడు అని సి.హెచ్‌. లక్ష్మణ చక్రవర్తి, విమర్శకుల కుండవలసిన లక్షణాలను వింగడిస్తూ నవీన్‌ సాహిత్య విమర్షకుడిగా ఎన్నెన్ని మార్గాలను అవలంబించాడో వివరించాడు. లక్ష్మణ చక్రవర్తి ‘పాలపిట్ట’ అనే ప్రముఖ మాసపత్రిక తరపున అంపశయ్య నవీన్‌ని ఇంటర్వ్యూ చేస్తూ కె.పి. అశోక్‌ కుమార్‌ నవీన్‌ ఎదుగుదల గురించి వ్రాస్తూ అంపశయ్య అని ఇంటిపేరుగా నవీన్‌ తెలిపారు. ఎందుకు వ్యవహరించబడుతున్నారో 23 పేజీల ఈ ఇంటర్వ్యూ రచయితలోని బహుగుణ వైవిధ్యం, చైతన్య స్రవంతి శిల్పం గురించి వివరించారు. సినీ విమర్శకుడిగా కాలమిస్టుగా నిలద్రొక్కు కోవటానికి చేసిన ప్రయత్నాలు ఆంధ్ర, తెలంగాణ వివక్షత చదివిన పాఠకులు పెద్దవారి పక్షపాత వైఖరికి ముక్కున వేలువేసుకుంటారు. ఆశ్రిత జన పక్షపాతం, కుబుద్ధి, ఎదుగుగల వోర్వలేని కొందరు పండిత ప్రకాండుల వైఖరికి విస్తుపోతాము. పాశ్చాత్య సాహిత్యం అంటే ఇష్టపడే నవీన్‌ కలాన్నుండి విమర్శ గ్రంథాలు ఇకముందు ఎక్కువగా వస్తాయని ఆశిద్దాం. కథకంటే నవలకు, నవలకంటే విమర్శకు, కాలానికి నిలిచి నిలబడగలిగే సామర్థ్యం ఎక్కువ.

ఒక్క మాటలో అంపశయ్య నవీన్‌ గురించి చెప్పాలంటే వీరు నిన్నా రేపటి మధ్య వారధి. ప్రాచ్య పాశ్చాత్య పోక డలను విజయవంతంగా సమన్వయ పరిచిన దార్శనికుడు.

స్నేహరాగం: నవలిక కథలు
వెల: రూ. 200/- అంపశయ్య నవీన్‌ సాహితీ మూర్తి మత్వం,
నవీన్‌ సాహిత్యంపై మూల్యాంకనం. వెల రూ. 300/-
పై రెండు గ్రందాల ప్రకాళకులు ప్రత్యూష ప్రచురణలు వరంగల్‌.
పంపిణీదారులు: నవోదయా బుక్‌ హౌజ్‌ మరిము నవచేతన