అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ‘వెరీగుడ్‌’

మేనేజ్‌మెంట్‌ ఎఫెక్టివ్‌నెస్‌ ఎవాల్యుయేషన్‌ (ఎంఈఈ) నివేదికలో రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా, అచ్చంపేట నియోజక వర్గంలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ 78.79 శాతం స్కోరు సాధించింది. దీనితో గుడ్‌ నుంచి ‘వెరీ గుడ్‌’ కేటగిరీకి పురోగమించింది. అమ్రాబాద్‌ కోర్‌ ఏరియా పరంగా దేశంలో రెండవ అతిపెద్ద టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌గా ఉంది. 1983లో అభయారణ్యంగా ప్రకటించారు. రాష్ట్ర విభజన తరువాత 2015లో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వుగా ప్రకటించారు. దీని వైశాల్యం 2,611.39 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఇక కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ 74.24 శాతం స్కోర్‌ను పొంది ‘మంచి’ విభాగంలో 33వ స్థానంలో నిలిచింది. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నివేదికను ప్రాజెక్ట్‌ టైగర్‌ 50 సంవత్సరాల సంస్మరణ సందర్భంగా విడుదల చేశారు. దేశంలోని 51 టైగర్‌ రిజర్వ్‌లను అంచనా వేయడానికి పది స్వతంత్ర ప్రాంతీయ నిపుణుల కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ అంచనాలో పంతొమ్మిది టైగర్‌ రిజర్వ్‌లు ‘వెరీ గుడ్‌’ కేటగిరీలో జాబితా చేయబడ్డాయి.