ఇది ఒక విశిష్ట శాసనం

శాసనాలు మనకు భారతదేశంలో క్రీ.పూ. 3వ శతాబ్దినుంచి ప్రారంభమైనాయి. భారతదేశాన తొలి శాసనాలు వేయించిన అశోకుడే మొదటివాడు. బ్రాహ్మీ లిపిలో బౌద్ధధర్మాన్ని రాయించడం చేత ఈ శాసనాలు ధర్మ శాసనాలనవచ్చు. తరువాతి కాలంలో వచ్చిన శాసనాల్లో జైన, బౌద్ధ ధర్మ శాసనాలు ఉన్నాయి. వీటితోబాటు హిందూ ధర్మానికి సంబంధించిన శాసనాలు మిగతా ధర్మాలకంటే అత్యధికంగా ఉన్నాయి. దానబుద్ధిగల రాజులు, బ్రాహ్మణులకిచ్చిన దానాలు, దేవాలయాలకిచ్చిన దానాలు, సూర్య చంద్ర గ్రహణాలు ఉత్తరాయణ పుణ్యకాలాల్లో, తల్లిదండ్రుల స్మరణంలో ఇచ్చిన దానాల శాసనాలు కోకొల్లలు.

భారతదేశంలోకి తరువాతికాలంలో వచ్చిన తొలి ధర్మం ఇస్లాం. వీరు పరదేశీయులై భారతదేశాన్ని కొల్లగొట్టడానికి వచ్చినవారు. తమ స్వస్థలాలలో చిరునామాలేని చిన్నసామంతులు మాత్రం ఇక్కడకు వచ్చి భారతదేశంలో స్థిరపడి ఇస్లాంను ఆచరిస్తూ వ్యాప్తి చేస్తూ, ఏలికలైనా స్థానికతకు భిన్నంగానే ఉండిపొయ్యారు. టర్కీ దేశీయులైన వీరిని తురకలని స్థానికులు సంబోధించగా వీరు మాత్రం రాజులైనా, వారి మతానికి భిన్నం. తటాక, దేవాలయాది నిర్మాణాలు, చేసిన దానాలు మనకు శాసనరూపంలో లభించవు. ఆలయ నిర్మాణాలు (మసీదులు) చేసినా ఎక్కువగా హిందూ ఆలయాలే మార్చబడ్డాయి. స్వతంత్ర నిర్మాణాల సంఖ్య తక్కువే.

తెలుగునేలపై నిర్మాణాల సంబంధంగా ఇలాంటి శాసనాలే తక్కువకాగా, తెలంగాణలో మాత్రం ఒక అరుదైన శాసనం కనబడింది. తెలంగాణ చరిత్ర నిర్మాణంలో భాగంగా పరిశీలిస్తున్నప్పుడు ఇది జరిగింది. ఆ శాసన వివరాలు ఇస్తున్నాను.

ఘనపూర్‌లో ఒక దేవాలయం పాడుచేసినపుడు శిథిలమైన మంటపంలోని ఒక స్థంభాన్ని తీసికొని దానిమీద చెక్కించినదీ శాసనం. ఐతే ఈ శాసనం ఒక బావి నిర్మాణానికి సంబంధించినది.

సప్త సంతానాల్లో జలవనరుల సంరక్షణం ఒకటి. అది చెరువుల నిర్మాణం రూపంలో ఉంటుంది. కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణం, శాసనాలు వేయడం మనం చూస్తున్నాం. ఈ ధర్మ కార్యానికి ఆద్యులు కాకతీయులుకాదు. వీరికిముందే పశ్చిమ చాళుక్యుల కాలంలో చెరువులు సాగర, సముద్రాలపేరిట నిర్మాణాలు అయినాయి. అయితే కాకతీయులు వారి సామంతులుగా, పశ్చిమ (కళ్యాణీ) చాళుక్యుల నుండి ఈ ధర్మకార్యం స్వీకరించి, తెలంగాణలో దీన్ని చాలా విస్తృతపరిచారు. వీరి తరువాత తెలంగాణనేలిన చిన్న రాజ్యాలలో ఇది ఇలానే నడిచింది. దేవరకొండ నేలిన మాధవరాయని భార్య ఒక పెద్ద చెరువు తవ్వించి శాసనం వేయించింది కదా! తరువాత ఏలిన తురకలు ఇలాంటి పనులు చేయించలేదు. విచిత్రంగా ప్రస్తుతాంశం ఐన శాసనంలో బావిని ఒక తురక సర్దార్‌ నిర్మించి శాసనం వేయించాడు.

శాసనకర్త పేరులో ‘అలీ’అని మాత్రం దొరుకుతున్నది. మిగతా భాగం శిథిలం. బావి తవ్వించిన ఈ అలీ ఒక సైన్యాధిపతి. ‘మలక’గా పేర్కొనబడ్డాడు. ఇతని తండ్రిపేరు ‘యార్‌ అలీ’. ఎందుకు తవ్వించాడంటే తమ పుత్ర పౌత్రాదులకు సుకృతం రావాలని ఉంది. ఈ శాసనం తొలుత సంస్కృతంతో ప్రారంభం అవుతుంది. ‘శ్రీశుభమస్తు’తో మొదలైంది. సూర్యచంద్రాదులు న్నంతవరకు రామరాజ్యం ఉంటుందన్న రామాయణ కథా శ్లోకంతో ఈ శాసనం ప్రారంభమైంది.

శా.శక సం. 1451 ఖరనామ సంవత్సరం ఫాల్గుణ బహుళ విదియ గురువారం నాడు బావి తవ్వించినట్లు పేర్కొనబడింది. క్రీ.శ. 1532, ఫిబ్రవరి 22కి సరిపోయే ఇది శా.శ. 1453 కావాలి. ఈ శాసన పద్ధతి, రామాయణ శ్లోకం, శక సం|| వివరణ, ఆఖరున రాసిన ‘మంగళమహాశ్రీ’ వాక్యం ఈ సైన్యాధిపతి (అలీ)ని హిందూమతంపట్ల విశ్వాసం ఉన్నవాడుగా గానీ, అతనికీ దాన బుద్ధిని సూచించిన అమాత్యుణ్ణి హిందువుగా గానీ భావించడంలో తప్పులేదు. లేదా హిందువై, తన శౌర్యంచేత తురక రాజుల సర్దారుగా, మతం మార్చుకున్నవానిగా భావించినా తప్పులేదు. ఆనాడివి మామూలే. ఓరుగల్లు నేలిన షితాబ్‌ ఖాన్‌ అలాంటివాడే. ఈ బావిని తవ్వించిన ”……అలీ’ ఒక సుల్తాన్‌గా భావించవచ్చు. శాసనంలో ‘సు-తాన్‌’గా (ఒక్క అక్షరం లోపించింది) పేర్కోబడ్డాడు.

ఈ శాసనంలో ”తురకలు”, ”హిందువులని” రెండు పదాలు పేర్కోబడటం మరో విశేషం. ఉభయులూ ఈ బావి నీళ్లు వాడుకోవచ్చునని, ఎవరిని ఎవరు నిషేధించరాదని శాసనంలో ఉంది. మరో విశేషం ఏమంటే ఎవరు నీటిని వాడకుండా అడ్డుకొన్నా గోవును చంపినంత పాపమని పేర్కొనడం మరో విశేషం.ఈ సూత్రం ఇద్దరికి (రెండు మతాలకు) వర్తిస్తుంది. ఇది ‘సర్వమయిన వారున్ను చాందకుండాను మానిపిరా గో బ్రానికి జంప్పిన దోషానం బోయినవారు” అని శాపం ఉంది. దీని అర్థం సర్వమయినవారున్ను = అన్ని మతాలవారికి, చాందకుండాను = చెందకుండాను, మానిపిరా = అడ్డుకొన్నారా?, గోబ్రానికి = గో(వు) ప్రాణికి, జంప్పిన దోషాన = చంపిన దోషానికి’.. అని తురకలకు, హిందువులకు పాప భయాన్ని చెప్పడం ఈ శాసనంలో విశేషం. గోప్రాణి హితాన్ని అటు తురకలకు కూడా పెట్టి నాటి సమాజంలో ఒక రివాజును తెల్పినట్లయింది. ఇది ఈనాడు మనం అందరం ఆలోచించాలి. ఒక ధర్మంవారు పూజిస్తారని, ఒక ధర్మంవారు చంపి తింటారని భావన కాకుండా, అందరూ నాడు గోవధను వ్యతిరేకించిన వారే అనుకోవాలి. లేకుంటే ఈ ‘ఒట్టు’ ఉండదు.

‘తురకలు’, ‘హిందూలు’ అనే పదాలు వాడిన ఈ శాసనంలో ‘అలీ’ బావిని తవ్వించి, శాసనం వేయించాడు కనుక, దీన్ని విశేషంగా ‘తురక శాసనం’ అన్నాను. లేదా ఘనపూర్‌-అలీ-శాసనం అని ఐనా పేర్కొనవచ్చు. ఈ శాసనం వేయించింది తురకే ఐనా శాసన ప్రారంభంలో రామునిపై శ్లోకం ఉండడం మరో విశేషం.

ప్రజలకోసం ఓ సత్కార్యం, ఓదానం, తన సంతానానికి సుకృతం, ఓ తురక సర్దార్‌ (మలక) వేయించడం, రామాయణ శ్లోకం రాయడం, అందరూ వాడుకోవాల్సిన ఉదాత్తంగా కోరుకోవడం, ఎవరైనా అడ్డుకుంటే ‘గోవధ పాపం ఇలా శాసనం నిండా విశేషాలే. ఇది నేటికీ 485 సం|| క్రితం శాసనం ప్రకారం ఈ తురక సర్ధార్‌ తొలి కుతుబ్‌షాహీల సామంతుడో, బ్రహ్మనీల సామంతుడో అయ్యుండాలి. ఆనాడు మత సహనం ఉండేది. కుతుబ్‌ షాహీల తరువాత ఈ సామరస్యం పలుచబడింది.

డాక్టర్‌ సంగనభట్ల నరసయ్య