అందాల భామలు
ఎంతోకాలం మానవమాత్రులు నివసించే గృహాలను, వాటి తీరుతెన్నులను ఎంతో వైవిధ్యవంతంగా కాన్వాస్‌పైకి ఎక్కించిన అంజనీరెడ్డి తర్వాతకాలమంతా మనుషులను మరీముఖ్యంగా మహిళలను వస్తువుగా తీసుకొని, వారి నిత్యకృత్యాలను, మనోభావాలను బహు రమ్యంగా ఆక్రాలిక్ వర్ణచిత్రాలుగా, అపురూపమైన టెక్చర్‌తో రూపుదిద్దుతున్నారు.
ఈమె వేసిన చిత్రాలు మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రతియేటా కేంద్ర లితకళా అకాడమీ వార్షిక చిత్రకళా పోటీ ప్రదర్శనకు, అలాగే నాగ్‌పూర్‌లోని దక్షిణ కేంద్రీయ సాంస్కృతిక కేంద్రం కళాప్రదర్శనకు ఎంపిక అవుతూనే ఉన్నాయి. కాని అదేమిచిత్రమో సృజనాత్మక చిత్రాలకు సైతం అవార్డు మాత్రం రాలేదు.
ఇటీవల ఆమె చిత్రించిన ‘‘భగవత్పరమైన సంకీర్తన’’ కేవలం భక్తులనే కాకుండా కళాప్రియులను కనువిందు చేస్తున్నది. లోహపు రేకులపై ప్రాచీనత్వాన్ని ద్యోతకం చేస్తూ గీసినట్టు ప్రేక్షకుడికి భ్రమకలిగించే ఈ చిత్రం కాన్వాస్‌పై రంగుల సమ్మేళనంతో రూపొందించింది. ఇందులో విఘ్నేశ్వరుడు మొదలు శివుడు, కృష్ణుడు, శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీలిత, శ్రీరామచంద్రుడు, నంది తదితర దేవుళ్ళ పూజనీయ రూపాలు, అక్కడక్కడ తెలుగు లిపిలో సంస్కృత శ్లోకాలు ఉన్నాయి. ఇవన్నింటి భంగిమలు, వర్ణ రేఖాస్వరూపం, లేఖన విన్యాసం అంజని నైపుణ్యాన్ని ప్రస్ఫుటం చేస్తాయి. అట్లాగే మహిళా పరిణామ వికాసంపై ఆమె వేసిన చిత్రం. వివిధ దశలో మహిళలను విపులంగా, వైవిధ్యంగా, వర్ణపూరితంగా ఉంది.
హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ వారికోసం ప్రత్యేకంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆత్మకథ చదివి ఆయన కలలు ఆకళింపు చేసుకొని కలాం జీవిత దృశ్యాలతో గీసిన చిత్రం కమనీయమైందే కాకుండా అంజని పరిశీలన పటిమ, సృజనాత్మక శక్తి కలగలుపు. ఈ చిత్రం కలాంకు బహూకరించిన సందర్భంగా చిత్రాన్ని ఆయన ఎంతో ఆసక్తితో పరిశీలించి ఈ చిత్రం తన జీవితకామంతా తనతో ఉంచుకుంటానన్నాడు. ఇక అంతక్నా గొప్ప అవార్డు తనకు మరొకటి ఉండదని, ఎంతో సంతృప్తిని ఆమె వ్యక్తం చేసింది.
మెదక్‌జిల్లా ‘నందికంది’లో వీరమ్మ శివరామరెడ్డి దంపతు ముద్దుల పట్టి అంజని కోరికమేరకే లలితకళల కళాశాలలో చేరి చిత్రాలు గీయడం శాస్త్రీయంగా నేర్చుకున్నది. అంతా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కలలుకంటున్న కాలంలో కేవలం రెండో తరగతి చదువుతున్న అంజనిని ఒక ప్రభోజనంలో కులుసుకున్న బంధువు. పూర్వ ఉపముఖ్యమంత్రి కె.వి.రంగారెడ్డి సతీమణి తుంగభద్రమ్మ ఏం చదువుకుంటావమ్మా అని అడిగినప్పుడు ఆలోచించకుండా, తొట్రుపడకుండా డ్రాయింగ్‌కళను అభ్యసిస్తానందట. అప్పుడు ఆమె హైదరాబాద్‌లోని లలితకళల కళాశాలలో బోధించే చిత్రకళావిద్య గురించి చెప్పారట. ఇక అదే మనసులో పెట్టుకొని, ఎవ్వరేమనినా, మనసు మార్చుకోకుండా పాఠశాల చదువు తర్వాత చిత్రకళలో డిప్లొమాలో చేరి పూర్తిచేశారు.
ఇంట్లో అప్పటికి ఎవరు చిత్రకారులు లేకపోయినా చిత్రకారుల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహకైనా తెలియని అంజని తండ్రి కేవలం కూతురు ఇష్టానికి కట్టుబడి ఆమె కోరిందే చదివించాడు. ఏ రంగమైనా ఫరవాలేదు. ఎంచుకున్న రంగంలో శిఖరాగ్రానికి చేరాలన్నది ఆయన కోరిక.
నిజానికి అంజనివారి గ్రామంలో ఉన్న చాళుక్యు కాలంలో నిర్మించిన రామలింగేశ్వరస్వామి ఆలయంలోని, నల్లరాయి స్తంభాలపై చెక్కిన అపురూప శిల్పాలే స్పూర్తినిచ్చాయట. మదిలో నిలిచిన ఆ మూర్తుల ప్రభావంతో రోజరీ కాన్వెంట్ స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో ఆమె నోటు పుస్తకాల్లో వాటి అట్టలపై రకరకాల మనుషుల తలలు గీసేవారట. ఇంట్లో ఆమె ఒక్కతే తప్ప పిల్లలు మరెవ్వరూ లేకపోవడం వల్ల ఒంటరిగా కూర్చుని పరిసరాలు, చెట్లు, పిట్టలు, మనుషులను గాఢంగా పరిశీలించడం, స్వంతంగా ఆలోచించడం, సృజనాత్మకంగా చిత్రించడం అలవాటైంది. ఈ నేపథ్యం ఆమె ఇవ్వాళ ఒక విశిష్టమైన బాణీగ చిత్రకళాకారిణిగా రూపొందడానికి ఎంతగానో ఉపకరించింది.
1974 నుంచి అనేక దేశవిదేశాల్లో సమష్టి చిత్రకళాప్రదర్శనలో పాల్గొనడానికి, 1991 నుంచి ఇప్పటిదాకా డజనుకు పైగా వ్యష్టి చిత్రకళాప్రదర్శనలు పలు అంశాలపై నిర్వహించడానికి నిర్విరామంగా ఆమె ఎప్పటికప్పుడు వినూత్న భావాలతో వైవిధ్యమైన చిత్రాలు రూపొందించడమే కారణం. చిత్రం ఏదైనా సరే ఆమె గీసే గీతలో జీవం తొణికిసలాడుతుంది. డ్రాయింగ్ నేపథ్యంగా ఉన్నందున ఆమె వేసే ప్రతి చిత్రం ప్రేక్షకులను, కళా హృదయాలను విశేషంగా ఆకర్షిస్తుంది.
ప్రస్తుతం ఆమె చీరలపై లతలు, పుష్పాలు, బొమ్మలతో పాటు రకరకాల రంగుల దృశ్యాలు, మానవాకారాలను చూడముచ్చటగా వేయడంలో సిద్దహస్తురాలైంది. ఎక్కువగా ఖరీదైన పట్టుచీరపై ఈమె వేసే కళాత్మక చిత్రాల కోసం ఎందరో మహిళలు కాచుకొని కూర్చుంటారు. వెండి తదితర లోహాల లాకెట్లపై వివిధ రీతుల్లో ఈమె వేసే బొమ్మలకు ఎంతో డిమాండ్ ఉంది. అట్లాగే, ఇంట్లో కర్ర పెట్టెపైన, ఇతర ఫర్నీచర్‌పైన, అలంకరణ సమాగ్రిపైన శివకళ్యాణం, సీతాస్వయంవరం లాంటి అనేకదృశ్యాలు గీయడంలోనూ ఈమెకొక ప్రత్యేకత ఉంది. జర్మనీకి చెందిన ప్రతిష్టాత్మకమైన ‘‘ మినెవెల్ట్’’ త్రైమాసిక పత్రిక ఈమధ్యే ముఖచిత్రంగా వీరి చిత్రాన్ని వేసింది. అంతర్జాతీయ స్థాయి కంపెనీ వీరి చిత్రాలను క్యాలెండర్‌కు ఉపయోగించింది.
ఇప్పటి వరకు వేయికిపైగా వివిధ ధోరణుల చిత్రాలను గీసిన అంజనీరెడ్డి బంగారు భవిష్యత్తుగల నిరంతర చిత్రకారిణి. ఆమె చదువుకున్న కళాశాలలోనే చిత్రకళ బోధించే ఉపన్యాసకురాలై, ఆ తర్వాత ఆచార్య స్థానం ఆక్రమించింది. కళాశాల ప్రిన్స్‌పాల్‌గా రెండుమూడు సార్లు అవకాశం వచ్చినా తన చిత్రకళారచనకు భంగం కలుగుతుందని ప్రిన్సిపల్ ఉద్యోగాన్ని తిరస్కరించి, ఆచార్య స్థానంలో ఉండి కొత్తతరం చిత్రకారులను తయారుచేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఉద్యోగ విరమణ చేసినా, చిత్రకళారంగంలోనే తలమునకలై ఉన్నారు. నానాటికి ప్రపంచ చిత్రకళా రంగంలో వస్తున్న ధోరణులను ఆమె సునిశితంగా పరిశీలిస్తూ సమకాలీన చిత్రకళారంగానికి తనవంతు సేవను విశేషమైన చిత్రాల రూపకల్పన ద్వారా అందిస్తున్నారు.
ఈమె వేసిన చిత్రాలకు 1995లో ఆలిండియా క్రియేటివ్ డ్రాయింగ్ అవార్డు (చండీఘర్) 1977లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అవార్డు, 1997లో ఎఫ్.ఎఫ్.సిఎస్. అర్ధశతాబ్ది ఉత్సవ అవార్డు, 1988లో స్త్రీ కళా అవార్డు లభించాయి. ఈమె గీసిన చిత్రాలను దేశంలోని పలు ప్రముఖ మ్యూజియాలలో విదేశాలలో ఎందరో కళాహృదయులు సేకరించారు. ఇలా ఇంటా బయటా తన ప్రత్యేకతను చాటుతున్న అంజనీరెడ్డి దేశంలో, రాష్ట్రంలో నిర్వహించే చిత్రకారుల శిబిరాలకు టంచనుగా వెళ్ళి, అక్కడికక్కడే ఎన్నో చిత్రాలను, ప్రధానంగా మహిళ మానసిక ప్రవృత్తిని వ్యక్తం చేసే చిత్రాలను సహజసుందరంగా రూపొందిస్తున్నారు. ఎక్కడ ఏ సందర్భంలో, ఏ విశేష అంశాన్ని ఆలంబన చేసుకొని అంజనీరెడ్డి చిత్రం గీసినా, అందులో సర్వాంతర్యామియై మహిళే కన్పిస్తున్నది.