మరో మానవీయ పథకం
ఆకలిగొన్నవారికి పట్టెడన్నం పెడితే, వారికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అలాంటిది మన కుటుంబీకులు అనారోగ్యంతో వున్నప్పుడు వారిని ఆసుపత్రిలో చేర్పించడం, వెంట వుంటూ అన్ని సపర్యలు చేయడం ఒకెత్తయితే, మరోవైపు సమయానికి ఆహారం సమకూర్చుకోవడం మరో ఎత్తవుతుంది. ఇటువంటి ఈతిబాధలను అర్థం చేసుకున్నది మన ప్రభుత్వం. పేదల ఆకలిని అర్థం చేసుకొని, వారి కడుపు నింపడానికి ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నది.

గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో రూ.5 కే భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఇపుడు అదే జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానలల్లో అనారోగ్య బాధితుల సహాయకులకు (అటెండెంట్స్) రోజూ మూడు పూటలా రూ.5 కే భోజనం అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖా మాత్యులు తన్నీరు హరీశ్ రావు, హోం మంత్రి మహమూద్‌అలీ, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి ఉస్మానియా దవాఖానలో ప్రారంభించారు. ఈ భోజన పథకం ప్రారంభంతో పాటు రూ. 36 కోట్లతో కొత్తగా నిర్మించిన ఆర్థోపెడిక్ అకడమిక్ బ్లాక్, ఆపరేషన్ థియేటర్లు వంటివాటిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ గొప్ప మానవతా వాది.. మానవత్వానికి మారు పేరని పేర్కొంటూ ఇదివరకు రేషన్ బియ్యం ఒక్కొక్కరికి 4 కిలోల చొప్పున కుటుంబం మొత్తానికి 20 కిలోలకు మించకుండా ఇచ్చేవారు. ఇంట్లో పది మంది ఉన్నా.. 20 మంది ఉన్నా 20 కిలోల బియ్యమే ఇచ్చేవారు. దాన్నిరాష్ట్రం వచ్చిన తొలి నాళ్లలోనే పేదలు అన్నానికి ఇబ్బంది పడొద్దని, కడుపునిండా భోజనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించారు. అందుకే అప్పటినుండి రూపాయికి కిలో బియ్యాన్ని కార్డుమీద ఎంతమంది ఉన్నా ఆరు కిలోల చొప్పున పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆ ప్రకారం ఇప్పుడు కార్డులో 10 మంది పేర్లు వుంటే వారందరికీ, ఒక్కో పేరుకు 6 కిలోల చొప్పున 60 కిలోల బియ్యం ప్రతి నెలా అందుకుంటున్నారు.పేదల కడుపు నింపడానికి ఖర్చుకు వెనుకాడలేదు’ అని వివరించారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో అన్నం ముద్దముద్దగా ఉండేదని. ఒక్కో విద్యార్థికి 200 గ్రాములని కొలిచి పెట్టేవారని గుర్తుచేశారు. పిల్లలు అర్ధాకలితో బాధపడుతుండటాన్ని గమనించిన కేసీఆర్ పిల్లలు తిన్నంత అన్నం పెట్టాలని అది కూడా సన్న బియ్యం అన్నం పెట్టాలని ఆదేశించారని తెలిపారు.


గ్రేటర్ పరిధిలోని 18 దవాఖానల్లో ఈ పథకం ద్వారా రోజుకు 20 వేల భోజనాలు అందిస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. అటెండెంట్ల ఆకలి తీర్చే ఈ పథకానికి సహకారం అందిస్తున్న హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్‌కు మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. దీనికోసం ప్రభుత్వానికి యేటా రూ.40 కోట్ల వరకు ఖర్చవుతుందని పేర్కొన్నారు. ప్రధాన దవాఖానలల్లో ఇప్పటికే నైట్ షెల్టర్లను కొన్ని చోట్ల నిర్మించామని, మిగతావి త్వరలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రభుత్వం ఇటీవలే డైట్ చార్జీలను రెట్టింపు చేసిందని, తద్వారా ఏటా రూ.43 కోట్ల ఖర్చు పెరుగుతున్నదని వెల్లడిరచారు. పారిశుధ్య నిర్వహణకు సంబంధించి ఒక్కో బెడ్‌కు చెల్లించే మొత్తాన్ని రూ.5 వేల నుంచి రూ.7,500కు పెంచామని, వీటి ద్వారా ప్రభుత్వంపై ఏటా రూ. 338 కోట్ల భారం పడుతుందని వివరించారు.
మన రాష్ట్రం మనకి రావడానికి ముందు వృద్ధులు.. వారి వారి కొడుకులు, కోడళ్లు, వితంతువులు వారి తోబుట్టువుల మీద ఆధారపడేవారని హరీశ్‌రావు అన్నారు. వీరందరు కూడా ఆత్మగౌరవంతో బతకాలని సీఎం ఆసరా పింఛన్లను రూ.200 నుంచి రూ.2016కు పెంచారని తెలిపారు. దివ్యాంగులకు రూ.3,016 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.వీటితో పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆడపిల్లల పెండ్లికి రూ.లక్షా నూటపదహార్లు ఇస్తుండటంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గిందని వివరించారు. ఇవన్నీకూడా ఎవరో వచ్చి మాకు ఇది కావాలని దరఖాస్తు పెడితేనో.. దండం పెడితేనో అమలు చేసినవి కావు. అందుకే సీఎం కేసీఆర్ గొప్ప మానవతావాది అని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు.
నిజానికి సీఎం కేసీఆర్ తొలుతగా ఉస్మానియా ఆస్పత్రినే సందర్శించారని, వెంటనే రూ.250 కోట్లతో నూతన భవనం నిర్మాణానికి ఉత్తర్వులు కూడా విడుదల చేయించారని గుర్తుచేశారు. అయితే చారిత్రక భవనాన్ని కాపాడాలంటూ కొందరు కోర్టులో కేసు వేయడంతో పనులు నిలిచిపోయాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వారసత్వ కట్టడాన్ని కాపాడుతూనే కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. దీనిపై అధ్యయనానికి నియమించిన కమిటీ ఇటీవలే ప్రాథమిక నివేదిక ఇచ్చిందని, పూర్తి నివేదిక అందిన తర్వాత దానిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొంటారన్నారు.
రాజధానిలో రూ.2,679 కోట్లతో ఏర్పాటు చేయనున్న మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్బంగా హరీశ్‌రావు గుర్తు చేశారు. గచ్చిబౌలి టిమ్స్, నిమ్స్‌లో ఇప్పటికే వున్న పడకలతో పాటు అదనంగా 2 వేల పడకల ఏర్పాటుకు త్వరలో ఉత్తర్వులు విడుదల అవుతాయని చెప్పారు. అలాగే అల్వాల్‌లో ఎంసీహెచ్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజధానిలోని అన్ని దవాఖానలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచింగ్ హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీ చర్యల కోసం నిధులు కేటాయించినట్టు వెల్లడిరచారు. కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఈ రమేశ్‌రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ నాగేందర్ పాల్గొన్నారు.
అనారోగ్య బాధితుల సహాయకుల కోసం రూ.5 కే మూడు పూటలా భోజనాన్ని అందించే భోజన కేంద్రాలను, ఉస్మానియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు ప్రారంభించగా, గాంధీ, ఎం.ఎన్.జే, నిమ్స్, నిలోఫర్, పేట్లబుర్జు, నాంపల్లి ఏరియా ఆసుపత్రి తో పాటు మొత్తం 18 ఆసుపత్రులలో రూ.5 భోజన కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. వివిధ కార్యక్రమాలలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, స్థానిక శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొన్నారు.