నగరానికి మరో దిగ్గజ సంస్థ ‘మాస్‌ మ్యూచువల్‌’

మన భాగ్యనగరం విశ్వనగరమన్న పేరును సార్థకం చేసుకుంటోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎన్నో బహుళజాతి కంపెనీలు హైదరాబాద్‌ కేంద్రంగా తమ కార్యకలాపాలను నిర్వహించడానికి ముందుకొస్తున్నాయి. అమెజాన్‌ లాంటి దిగ్గజ సంస్థ అమెరికా బయట తన అతిపెద్ద వ్యాపార కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పింది. అలాంటి మరో దిగ్గజ సంస్థ అయిన ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ, బీమారంగ దిగ్గజం, అమెరికాకు చెందిన ‘మాస్‌ మ్యూచువల్‌’ భాగ్యనగరంలో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాస్‌ మ్యూచువల్‌ సంస్థ ప్రతినిధులు చర్చించిన అనంతరం తమ కేంద్రాన్ని నెలకొల్పడానికి సుముఖత వ్యక్తం చేశారు.  

కంపెనీ ప్రతినిధులతో జరిపిన చర్చల సందర్భంగా ప్రభుత్వం తరఫున వారికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. కరోనాతో ప్రపంచమంతా పారిశ్రామికంగా కుదేలైన సమయంలో కూడా హైదరాబాద్‌కు కంపెనీలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం మన నగర ప్రాముఖ్యతను ప్రస్ఫుటం చేస్తున్నది. హైదరాబాద్‌లో ఈ సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. అమెరికా తర్వాత ఇక్కడే తొలి కేంద్రం నెలకొల్పడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. 170 సంవత్సరాల చరిత్ర కలిగిన మాస్‌ మ్యూచువల్‌ సంస్థ తమ గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం విశేషం. ఫార్చ్యూన్‌-500లో స్థానం పొందిన ఈ సంస్థ అమెరికా వెలుపల తమ మొదటి కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పడం నగర విశిష్టతను తెలియచేస్తున్నది. నగరంలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో త్వరలో 1.5 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో తన కేంద్రాన్ని నెలకొల్పనుంది. 

దీని ద్వారా అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌, సపోర్ట్‌, ఇంజినీరింగ్‌ డాటా సైన్స్‌, డాటా ఎనలిటిక్స్‌ తదితర రంగాల్లో పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఆ సంస్థ ఇప్పటికే 300 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నది. భవిష్యత్తులోనూ మరింత మంది ఉద్యోగులను నియమించుకునే అవకాశమున్నది.

ఈ సందర్భంగా మాస్‌ మ్యూచువల్‌ సంస్థ (ఇండియా) హెడ్‌ రవి తంగిరాల మాట్లాడుతూ, తమ కంపెనీ గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రపంచం లోని అనేక నగరాలను పరిశీలించిందని, హైదరాబాద్‌లో నైపుణ్యం గల మానవ వనరులు అందుబాటులో ఉండడంతో ఈ నగరాన్ని ఎంచుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కూడా తమకు ఎంతో అనుకూలంగా ఉన్నాయన్నారు. అందువల్లనే హైదరాబాద్‌ నగరాన్ని ఎంచుకున్నామని తెలిపారు. 

తమ కంపెనీ 1851లో ఏర్పాటై ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆర్థిక సేవలను అందిస్తున్నదని, రానున్న రోజుల్లో ఇతర రంగాలకు కూడా తమ సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.  తమ కంపెనీ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌, సపోర్ట్‌, ఇంజినీరింగ్‌ డాటా సైన్స్‌, డాటా ఎనలిటిక్స్‌ రంగాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని వెల్లడించారు. దీన్నిబట్టి ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్‌ గమ్యస్థానంగా మారిందన్న విషయం మరోసారి నిరూపితమైంది.