అనువాదంలో ‘సారా’ విప్లవం

ములుగు రాజేశ్వర రావు
tsmagazine
అనువాదం ఇప్పటివరకు ఒక క్లిష్టమైన కళ. ఇకమీదట మాత్రం అది కళ కాదు, ఏ మాత్రం క్లిష్టతరం కూడా కాదు. కారణం-ఎంత పెద్ద పుస్తకం అయినా, అది ఏ భాషలో ఉన్నా క్షణాల్లో…ఔను… క్షణాల్లోనే… మీకు ఇంకా సూటిగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ..సెకన్లలోనే మీకు కావలసిన భాషలో మొత్తం పుస్తకం అంతా సిద్ధమయిపోతుంది. ఎలా…!!!! అలాచేసే ఒక సాఫ్ట్‌ వేర్‌ను యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ప్రయోగాత్మకంగా రూపొందించింది. దీనికి ఓ పేరు కూడా పెట్టింది-‘సారా’ (సారం) అని.

ఓం ప్రథమంగా ‘క్షణహోత్తు ఆణిముత్తు’ అనే 150 పేజీల కన్నడ పుస్తకాన్ని, ‘క్షణకాలం ఆణిముత్యం’ అనే పేరుతో 90 శాతం కచ్చితత్త్వంతో కేవలం రెండు మూడు నిమిషాల్లోనే ‘సారా’ సాఫ్ట్‌ వేర్‌ తెలుగులోకి అనువదించింది. సాక్షాత్తూ భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, జస్టిస్‌ ఎల్‌. నరసింహా రెడ్డిల సమక్షంలో హైదరాబాద్‌లో ఈ ప్రక్రియను విజయవంతంగా సాక్షాత్కరింపచేసింది.

సాంకేతికంగా జరిగే అనువాద రచనలో విప్లవానికి శ్రీకారం చుట్టినవారు ఇదే యూనివర్శిటీకి చెందిన ఆచార్య కవి నారాయణ మూర్తి. మొదటగా కన్నడ నుంచి తెలుగుకు అనువదించే సాఫ్ట్‌ వేర్‌ను రూపొందించి విజయం సాధించారు. ఇది తెలుగు నుంచి కన్నడకు కూడా ఇదే సామర్థ్యంతో అనువాదం చేస్తుందని ఆయన చెప్పారు. మరో ఆచార్యుడు డా.పమ్మి పవన్‌ కుమార్‌ తెలుగులో తనకు సహకరిస్తున్నారనీ, ఇది పూర్తిగా సిద్ధమయిన తరువాత యూనివర్శటీ వెబ్‌ సైట్‌ లో పెడతామని, దేశంలోని ఇతర యూనివర్శిటీలు, రీసెర్చి విద్యార్థులు దానిని అక్కడి స్థానిక భాషల అవసరాలమేరకు అభివద్ధి చేయవచ్చని ఆయన వెల్లడించారు.

గత మూడు దశాబ్దాలుగా భాషా సాంకేతిక పరిజ్ఞానంలో ప్రత్యేకించి యాంత్రిక అనువాదంలో పరిశోధనలు సాగిస్తున్న మూర్తి అత్యంత నిరాడంబరుడే కాదు, నిస్వార్ధపరుడు కూడా. ఇంత అద్భుతమైన సాఫ్ట్‌ వేర్‌కు ‘పేటెంట్‌’ తీసుకున్నారా? అని ఉపరాష్ట్రపతి ఎంతో ఉత్సుకతతో ప్రశ్నించగా…’ఆ ఉద్దేశం ప్రస్తుతానికి యూనివర్శీటికి లేదు సర్‌’ అని ఎంతో వినమ్రంగా చెప్పారు. భారత దేశంలో అత్యంత ప్రాచీన కాలం నుండీ మన రుషుల మేధో పరిజ్ఞానానికి ‘పేటెంటింగ్‌’ లేదు, అంతా’ పేరెంటింగే’ అని నాయుడు చమత్కరించారు. (‘పేటెంటింగ్‌’ అంటే వాణిజ్యపరంగా దానిని తాను తప్ప, తన అనుమతితో తప్ప వేరొకరు వాడకుండా హక్కులు పొందడం. ‘పేరెంటింగ్‌’ అంటే దానిని శ్రమతో సష్టించి, దాని బాగోగులు చూస్తూ నిస్వార్థంగా దానిని నలుగురికి ప్రయోజనకరంగా తీర్చిదిద్దడం).
tsmagazine

యాంత్రిక అనువాదంలో సహజంగా తలెత్తే ‘ప్రామాణికత’- అనే అంశాన్ని ప్రస్తావించినప్పుడు, ఎటువంటి భేషజాలకు పోకుండా ”90శాతం కచ్చితంగా ఉంటుంది. మిగిలిన 10 శాతం మానవ నైపుణ్యంతో మనం సరిచేసుకోవాల్సి ఉంటుంది” అని మూర్తి తెలియ చేశారు. అంటే ఉదాహరణకు- 600 పేజీల గ్రంథాన్ని నిపుణుడైన అనువాదకుడు రోజుకు గరిష్టంగా 10 పేజీల చొప్పున అనువదిస్తే 60 రోజులు…అంటే 2 నెలలు పడుతుంది. డేటా ఎంట్రీకి మరో వారం రోజులు, ప్రూఫ్‌ రీడింగ్‌కు మరో 10 రోజులు…ఇలా కనీసంలో కనీసం మూడు నెలలు పడుతుంది. ఇక ఖర్చు సంగతికొస్తే….మొత్తం మీద దాదాపు రు.1.25 లక్షల దాకా ఖర్చవుతుంది. ఇప్పుడు ఇంత పనిని ‘సారా’ మూడు నిమిషాల్లో ముగించేస్తుంది. అయితే అది 90శాతం కచ్చితమే కనుక మిగిలిన దానికోసం ఒక నిపుణుడికి అప్పగించి తప్పులు దిద్దించి ఘనంగా దక్షిణ సమర్పించుకున్నా… రు.10-15 వేలల్లో అదీ ఓ వారంలో పుస్తకం మనకు కావాల్సిన ప్రామాణికతతో ముద్రణకు సిద్ధమయి పోతుంది.

2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 121 భాషలున్నాయి. వీటిలో ఒక్కొక్కటి కనీసం 10 వేలమంది మాట్లాడేవి. అంతకంటే తక్కువమంది మాట్లాడే భాషలు మరి కొన్ని వందల్లో ఉంటాయి. 125 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో ఇంగ్లీష్‌ భాషా పరిజ్ఞానం ఉన్నవారు 12.5 కోట్లు మాత్రమే. ఇప్పుడున్న ఇంటర్నెట్‌ సమాచారం కానీ, ఇంజ నీరింగ్‌, మెడిసిన్‌ వంటి వత్తిపరమైన, సాంకేతిక విద్యా కోర్సులతోపాటూ ఇతరత్రా సబ్జెక్టుల సమాచారం, సాహిత్యం ఎక్కువగా ఇంగ్లీష్‌లో ఉంది. అలాగే గుర్తింపు పొందిన భారతీయ భాషల్లో కూడా అపారమైన విజ్ఞానం ఆయా భాషలవారికే పరిమితమై ఉంది. ఇప్పుడు ‘సారా’ వంటి సాఫ్ట్‌ వేర్‌లు మరింత ప్రామాణికతను పెంచుకుని పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితే ఏమవుతుంది ?

వందలాది.. వేలాదిమంది అనువాదకులు రోడ్డున పడతారు. అదొక్కటే దీనివల్ల జరిగే అనర్థం. అది తప్ప అన్ని భారతీయ భాషలు, ప్రపంచ భాషలు సుసంపన్నం అయి హద్దులు చెరిపేసుకుంటాయి. మూల రచయితల పంట పండుతుంది.

ప్రస్తుతం కన్నడ, తెలుగు భాషల్లో పరస్పర అనువాదాలు కావాలనుకున్నవారు తమ వద్దకు వస్తున్నారనీ, వారికి నామమాత్రపు చార్జీలతో చేసి పెడుతున్నామని ఆయన వివరించారు.

అనువాదంలో ‘ఆత్మ’ మాటేమిటి ?

అనువాద కళలో ఆరితేరినవాడి దగ్గరకు వెళ్ళి పనిచేసి పెట్టమని అడిగితే… అతడు పని ఒప్పుకోవడానికి ముందు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. 1. ఈ అనువాదం దేనికోసం ? (అంటే ఏం ప్రయోజనం ఆశించి దీన్ని అనువాదం చేయించుకుంటున్నారు). 2. ఎవరి కోసం ? (అంటే ఎలాంటి పాఠకులు/శ్రోతలు/వీక్షకుల కోసం…ఉదా…పిల్లలకోసం, భక్తులకోసం, స్త్రీల కోసం, మేధావుల కోసం, వ్యాపారుల కోసం..ఇలా) 3. ుతీబవ ుతీaఅరశ్రీa్‌ఱశీఅ కావాలా ? లేక ఖీతీవవ ుతీaఅరశ్రీa్‌ఱశీఅ కావాలా ? అని ుతీబవ ుతీaఅరశ్రీa్‌ఱశీఅ అంటే మక్కీకి మక్కీ.. మూల పత్రంలో 10 పేరాలు, 100 వాక్యాలుంటే అనువాదంలో కూడా అన్నే పేరాలు, అన్నే వాక్యాలుండేలా, లేక ఖీతీవవ ుతీaఅరశ్రీa్‌ఱశీఅ అంటే స్వేచ్ఛానువాదం. అంటే మూలంలోంచి విషయాన్ని, భావాన్ని, వ్యక్తీకరణ శైలిని పట్టుకుని, వాటిని గౌరవిస్తూ భాషను స్వేచ్ఛగా, చక్కగా, స్పష్టంగా, సులభగ్రాహ్యంగా దానిని ఎవరికోసం ఉద్దేశించారో వారి మనసులకు హత్తుకునేలా అనువదించడం).
tsmagazine

ఇన్ని ప్రశ్నలు ఎందుకంటే..మక్కీకి మక్కీ అంటే యాంత్రికంగా ఉంటుంది. అదే స్వేచ్ఛానువాదం అయితే మూల రచయిత కూడా మురిసిపోయేంతగా దానిలో ఆత్మను మరింత ఆకర్షణీయంగా మలిచి అనువాదంలో దించేస్తాడు, అనువాదకుడు. స్వతహాగా అనువాదకుడు, పలుభాషలను అనర్గళంగా మాట్లాడే వాడు, తెలుగు భాషాభిమాని, తెలుగు నుడికారాలు, అంత్యప్రాసల సయ్యాటలా సాగే ప్రసంగాలతో సభికులను విశేషంగా ఆకర్షించే వెంకయ్య నాయుడు ఆ సభలో ‘సారా’ ప్రయోగాన్ని చూచిన తరువాత కచ్చితంగా ఇదే ప్రశ్న అడిగారు…’మరి ఆత్మ మాటేమిటి?’ అని.

ఇప్పటికే గూగుల్‌లో యాంత్రికంగా అనువాదాలు జరుగుతున్నాయి. పదాలకు అర్థం ఇవ్వడంలో అది దాదాపు విజయం సాధించినా, వాక్యాలకు భావస్ఫోరక, సందర్భానుసార అర్థాన్ని ఇవ్వడంలో… అది అంత కచ్చితంగా లేకపోగా పరిహాసానికి మాత్రం పనికొస్తున్నది. ఈ వాస్తవాన్ని ఒంటపట్టించుకున్న మూర్తి శ్రమించి, చెమటోడ్చి,’దాదాపు 90శాతం కచ్చితంగా ఉండేవిధంగా సాధించినట్లు’ నిజాయితీగా, నమ్మకంగా ప్రకటిస్తున్నారు.

అయితే దానితోపాటూ ఆయన మరో మాట కూడా సెలవిస్తున్నారు. తన ‘సారా’ను ఉపయోగించే కొద్దీ అది కత్రిమ మేధస్సుతో దాని పరిజ్ఞానాన్ని అదే పెంచుకుని మరింత పదునెక్కు తుందనీ, అలా క్రమేణా దాదాపు సంపూర్ణత్వం సాధించగలదంటున్నారు.

మున్ముందు ఇది సాధించే విజయాల పరంపర వేగం ఎలా ఉండబోతుందో చూద్దాం. కానీ చచ్చిపోతున్న భారతీయ భాషలను బతికించడానికి శ్రీ మూర్తి లాంటి వాళ్ళు, యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వంటి సంస్థలు నిస్వార్ధంగా చేస్తున్న యజ్ఞంలో అందరం పాలుపంచుకోకపోయినా నైతికంగాన యినా ఆత్మస్థయిర్యం ఇవ్వడం మన కనీస కర్తవ్యం. (కవి నారాయణ మూర్తి ఇ-మెయిల్‌ – సఅఎబష్ట్రఏవaష్ట్రశీశీ.షశీఎ)

ఈ సందర్భంగా తనకు బాగా నచ్చిన అనువాద రచన ‘పరిపాలనలో ధర్మపాలన’ పుస్తక ఆంగ్ల గ్రంథ మూల రచయిత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌ కందాని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా శాలువా కప్పి సన్మానించారు. దీనిని తెలుగులోకి అనువదించిన ములుగు రాజేశ్వర రావును ఆయన అభినందించారు.