పారిస్‌లో కె.టి.ఆర్‌. ప్రసంగానికి కరతాళ ధ్వనులు

 By: దిలీప్‌ కొణతం

తెలంగాణ కీర్తి పతాకను అనేక విశ్వవేదికల మీద రెపరెప లాడిరచిన మంత్రి కె. తారకరామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఫ్రెంచ్‌ సెనేట్‌లో జరిగిన యాంబిషన్‌ ఇండియా 2021 కార్యక్రమంలో అక్టోబర్‌ 29న కీలకోపన్యాసం చేయాల్సిందిగా సాక్షాత్తూ ఫ్రాన్స్‌ ప్రభుత్వం నుండి అందిన  ఆహ్వానం మేరకు అక్టోబర్‌ నెల చివరి వారంలో మంత్రి నేతృత్వంలో ఒక తెలంగాణ ప్రతినిధి బృందం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో పర్యటించింది. ఫ్రెంచ్‌ సెనేట్లో అక్టోబర్‌ 29న మంత్రి కేటీఆర్‌ చేసిన కీలకోపన్యాసానికి స్థానిక వాణిజ్య, రాజకీయ ప్రముఖుల నుండి విశేష స్పందన వచ్చింది. కేటీఆర్‌ ప్రసంగానికి సభికులు కరతాళధ్వనులతో స్పందించారు. పారిస్‌లో ఫ్రెంచ్‌ సెనేట్లో జరిగిన ‘యాంబిషన్‌ ఇండియా 2021’ బిజినెస్‌ ఫోరమ్‌లో ‘‘కోవిడ్‌ అనంతర కాలంలో ఇండో-ఫ్రెంచ్‌ సంబంధాల భవిష్యత్తును రూపొందించడం’’ అనే అంశం మీద మంత్రి ప్రసంగించారు. గత ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం  పురోగమిస్తున్న తీరును వివరిస్తూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు మంత్రి కేటీఆర్‌. జాతీయ విధానాలు కేంద్ర ప్రభుత్వ పరిధి అయితే, భారత సమాఖ్య నిర్మాణంలో, రాష్ట్రాలు కూడా భూమి కేటాయింపు, ఆమోదం మరియు అనుమతులు అందించడం, శిక్షణ పొందిన మానవ వనరులను పొందడంలో కంపెనీలకు సహాయం చేయడం, వనరుల సేకరణ విధానాలు వంటి బహుళ కార్యాచరణ అంశాలలో గణనీయమైన స్వయం ప్రతిపత్తిని పెంపొందించుకుంటున్నాయని కేటీఆర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 

తెలంగాణ ప్రభుత్వ వ్యాపార, వాణిజ్య అనుకూల విధానాలు, రాష్ట్రంలో నెలకొన్న పారిశ్రామిక ఎకోసిస్టంను మంత్రి కేటీఆర్‌ సెనేట్‌ వేదికగా ప్రస్తావించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అన్వేషించాలని ఫ్రెంచ్‌ పెట్టుబడి దారులను ఆయన ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం ఫ్రెంచ్‌ కంపెనీలకు, ముఖ్యంగా ఎస్‌ఎంఈలకు ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్‌ను అభివృద్ధి చేయడానికి సుముఖంగా ఉందన్నారు. టీఎస్‌ఐపాస్‌ గురించి మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ అత్యంత ప్రగతిశీల రాష్ట్రమని, తెలంగాణ ప్రభుత్వ టీఎస్‌ ఐపాస్‌ పాలసీ పారదర్శకతతో కూడిన స్వీయ-ధృవీకరణను అనుమతిస్తోందని, చట్టం ప్రకారం 15రోజులలో అన్ని రకాల అనుమతులకు సంబంధించి పూర్తి క్లియరెన్స్‌ లభిస్తుందన్నారు. తెలంగాణలో పారిశ్రామిక అవసరాలకు తగినంత భూమి అందుబాటులో ఉందనీ, విద్యుత్‌, నీరు, 

ఉత్తమ మౌలిక సౌకర్యాలను కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌)ను మంత్రి కేటీఆర్‌ హైలైట్‌ చేస్తూ, ప్రభుత్వం తన సొంత ఖర్చులతో 

యువతకు శిక్షణనిస్తోందని, వారిని నాణ్య మైన మానవ వనరులుగా మారుస్తుందని, ఇది స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తోందని పేర్కొన్నారు. 

పారిశ్రామిక వేత్తలతో చర్చలు  

తెలంగాణ ప్రతినిధి బృందం పారిస్‌ పర్యటనలో భాగంగా వివిధ గ్లోబల్‌ సీఈఓలతో, పారిశ్రామికవేత్తలతో, ప్రముఖులతో సమావేశాలు నిర్వహించింది. పర్యటన తొలిరోజున మంత్రి కేటీఆర్‌ ఫ్రెంచ్‌ ప్రభుత్వ డిజిటల్‌ అఫైర్స్‌ అంబాసిడర్‌ హెన్రీ వర్డియర్‌ తో సమావేశం అయ్యారు. ఇన్నోవేషన్‌, డిజిటైజేషన్‌, ఓపెన్‌ డేటా వంటి అంశాల్లో ఫ్రాన్స్‌, తెలంగాణ మధ్య పరస్పర సహకారం అందించుకునే అవకాశం గురించి ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్‌, అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి, ఓపెన్‌ డేటా పాలసీ గురించి, రాష్ట్రంలో నిర్మాణం అవుతున్న డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ గురించి మంత్రి కేటీఆర్‌ అంబాసిడర్‌ హెన్రీ వర్దియర్‌కు వివరించారు. అటు తెలంగాణలోని ఆంకుర సంస్థలకు ఫ్రాన్స్‌లో, ఇటు ఫ్రాన్స్‌లోని అంకుర సంస్థలకు తెలంగాణలో వ్యాపార, వాణిజ్య అవకాశాలు కల్పించడం గురించి కూడా వివరమైన చర్చ జరిగింది.

రెండో రోజున మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ డిప్యూటీ సీ.ఈ.ఓ మిస్‌ జెరాల్డిన్‌ లెమ్లేతో సమావేశ మయ్యారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, ఫ్రెంచ్‌ ఎస్‌ఎంఈలకు తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన సహకారాన్ని, అవకాశాలను అందిస్తుందని తెలిపారు. ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో తెలంగాణ ఇటీవల సాధించిన విజయాలను మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు.  ‘‘తెలంగాణ ప్రభుత్వ నూతన విధానాలు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలకు అనేక అవకాశాలను తెరిచాయి’’ అని ఆయన పేర్కొన్నారు. అనంతరం ప్యారిస్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ క్యాంపస్‌ స్టేషన్‌ ఎఫ్‌ను మంత్రి కేటీఆర్‌ సదర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌ ఎఫ్‌ ప్రతినిధి బృందంతో సమావేశం కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో టీహబ్‌, వీ-హబ్‌ మరియు టీ వర్క్స్‌ వంటి తెలంగాణ ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌ సంస్థలతో భాగస్వ్యామ్య అవకాశాలు మరియు పరస్పర సహకారం గురించి చర్చించారు. స్టేషన్‌ ఎఫ్‌ అనేది ప్యారిస్‌ నడిబొడ్డున ఉన్న ఒక ప్రత్యేకమైన క్యాంపస్‌ మరియు కమ్యూనిటీ, ఇందులో 1,000 స్టార్టప్‌లు ఉన్నాయి. ఒక పాత రైల్వే డిపోను పునర్నిర్మాణం చేసి ఈ ఇంక్యుబేటరును స్థాపించారు. మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం పారిస్‌లో ఏడీపీ సంస్థ ఛైర్మన్‌ Ê సీ.ఈ.ఓ అగస్టిన్‌ డి రోమనెట్‌తో సమావేశమైంది.  ఏడీపీ ఇటీవల హైదరాబాద్‌ విమానాశ్రయంలో పెట్టుబడి పెట్టింది. ఈ సమావేశంలో, మంత్రి కేటీఆర్‌ భారతదేశంలో విమానయాన రంగం వేగవంతమైన వృద్ధి దశలో ఉందని, కరోనా ఆంక్షలు సడలించడంతో పరిశ్రమ దేశంలో పెద్దఎత్తున విస్తరించడానికి  సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అనేక ప్రధాన ప్రపంచ ఏరోస్పేస్‌ కంపెనీలకు హైదరాబాద్‌ కేంద్రంగా ఉందని మంత్రి తెలిపారు.  ఏరోస్పేస్‌ రంగానికి అవసరమైన సిబ్బందికి నాణ్యమైన శిక్షణ ఇచ్చి సరఫరా చేయాల్సిన అవసరాన్ని కేటీఆర్‌ ప్రముఖంగా ప్రస్తావించారు. 

మరో సమావేశంలో పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ పారిస్‌లో సనోఫీ ఇంటర్నేషనల్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ మిస్టర్‌ ఫాబ్రిస్‌ బస్చిరా మరియు గ్లోబల్‌ వ్యాక్సిన్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ హెడ్‌ ఇసాబెల్లె డెస్చాంపును కలిశారు. సనోఫీ త్వరలో తన హైదరాబాద్‌ ఫెసిలిటీ నుండి సిక్స్‌ ఇన్‌వన్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఆ తరువాత మంత్రి కేటీఆర్‌ పారిస్‌లోని సఫ్రాన్‌ ప్రధాన కార్యాలయంలో సఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్ల సి.ఇ.ఓ. జీన్‌ పాల్‌ అలారీ, ఆ కంపెనీ సీనియర్‌ ఎక్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఇంటర్నేషనల్‌ & పబ్లిక్‌ అఫైర్స్‌, అలెగ్జాండ్రే జీగిల్‌తో సమావేశమయ్యారు. ఫ్రెంచ్‌ బహుళజాతి ఎయిర్‌క్రాఫ్ట్‌ & రాకెట్‌ ఇంజన్‌, ఏరోస్పేస్‌ కాంపోనెంట్‌, డిఫెన్స్‌ మరియు సెక్యూరిటీ కంపెనీలో భాగమైన ‘‘సఫ్రాన్‌ ఎలక్ట్రికల్‌ & పవర్‌’’ ఇటీవల హైదరాబాద్‌లో తన ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజన్‌ ఫెసిలిటీని విస్తరించింది.

ఈ సమావేశంలో తెలంగాణలో ఏరోస్పేస్‌ మరియు డిఫెన్స్‌ రంగాలకు దోహదకారిగా ఉండేలా నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై మంత్రి వారితో చర్చించారు. ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఎయిర్‌ అటాషే ఎయిర్‌ కమోడోర్‌ హిలాల్‌ అహ్మద్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

హైదరాబాదుకు మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ

ప్రముఖ ఓపెన్‌ ఇన్నోవేషన్‌ ప్లాట్‌ఫారమ్‌ ‘‘ప్లగ్‌ అండ్‌ ప్లే’’ భారతదేశంలో తన మొదటి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నామని ప్రకటించింది.  

పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ఫ్రాన్స్‌లో పర్యటించిన తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ‘‘ప్లగ్‌ అండ్‌ ప్లే’’ సంస్థ నాయకత్వ బృందం సమావేశమైన తర్వాత ఈ ప్రకటన వెలువడిరది.

ఫ్రెంచ్‌ ప్రభుత్వం మరియు బిజినెస్‌ ఫ్రాన్స్‌ నిర్వహిస్తున్న ‘‘యాంబిషన్‌ ఇండియా’’ ఈవెంట్‌ సందర్భంగా ఫ్రెంచ్‌ సెనేట్లో ఈ సమావేశం జరిగింది.

మొదటి సారిగా భారతదేశంలో కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ‘‘ప్లగ్‌ అండ్‌ ప్లే’’ హైదరాబాద్‌లో మొబిలిటీ, ఐ.ఓ.టీ, ఎనర్జీ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల్లో పటిష్టమైన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి పెడుతుంది. తదుపరి దశలో ఫిన్టెక్‌ మరియు లైఫ్‌ సైన్సెస్‌/ హెల్త్‌కేర్‌ రంగాలకు విస్తరించనుంది. 

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటి రామారావు చూపిన చొరవను అభినందించారు. మంత్రి కేటి రామారావు అందించిన ప్రోత్సాహం, సహాయంతో ప్లగ్‌ అండ్‌ ప్లే భారతదేశంలో అత్యంత విజయవంతమైన కొలాబరేషన్‌ ప్లాట్‌పారమ్‌ నిర్మిస్తుంది అని వారు అన్నారు.      

తెలుగు భాషపై మమకారం

అధికారిక పర్యటన మీద ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ వచ్చిన మంత్రి కేటీఆర్‌కు ఈ విదేశీ గడ్డ మీద ఒక ఆత్మీయ అతిథి తారసపడ్డారు.

మూడు దశాబ్దాలకు పైగా తెలుగు భాష మీద పరిశోధన చేస్తూ, తెలుగులో అనర్గళంగా మాట్లాడే ప్రొఫెసర్‌ డానియేల్‌ నెగర్స్‌ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. 

ఫ్రెంచ్‌ యూనివర్సిటీ ‘‘నేషనల్‌ ఇన్సిటిట్యూట్‌ ఫర్‌ ఓరియెంటల్‌ లాంగ్వేజెస్‌ అండ్‌ సివిలైజేషన్స్‌’’ లో దక్షిణ ఆసియా Ê హిమాలయన్‌ స్టడీస్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నెగర్స్‌ గత కొన్నేళ్లుగా తాను తెలుగు భాషపై చేస్తున్న పరిశోధన గురించి మంత్రికి వివరించారు. 

‘‘వేల మైళ్ళ దూరాన ఉండి కూడా మీరు తెలుగు భాషపై చూపిస్తున్న మమకారం నిజంగా స్ఫూర్తి దాయకం’’ అని మంత్రి కేటీఆర్‌ ప్రొఫెసర్‌ డానియేల్‌ నెగర్స్‌ను ప్రశంసించారు.