|

ఆరోగ్య తెలంగాణకు అడుగులు గజ్వేల్‌ నుంచే.. సీఎం కేసీఆర్‌

గజ్వేల్‌ నియోజకవర్గం నుంచే ముందుగా రాష్ట్ర ఆరోగ్య సూచిక (హెల్త్‌ ప్రొఫైల్‌) తయారుచేస్తున్నట్లు సీఎం కె. చంద్రశేఖర రావు పేర్కొన్నారు.

ఆరోగ్య తెలంగాణకు అడుగులు గజ్వేల్‌ నుంచే మొదలవుతాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు. గజ్వేల్‌ నియోజకవర్గం నుంచే ముందుగా రాష్ట్ర ఆరోగ్య సూచిక (హెల్త్‌ ప్రొఫైల్‌) తయారుచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో ప్రతిపౌరుని ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయన్నారు. బ్లడ్‌ గ్రూప్‌, షుగర్‌, బీపీ లాంటి వ్యాధులు ఉన్నాయా.. గతంలో ఎలాంటి వైద్యం చేయించుకున్నారు, తదితర అన్ని విషయాలు నమోదు చేయబడతాయన్నారు. ప్రతి పౌరునికి ఒక నెంబర్‌ కేటాయించబడుతుందని దాని ద్వారా పౌరుని పూర్తి ఆరోగ్య సూచిక (హెల్త్‌ ప్రోఫైల్‌) తెలిసిపోతుందన్నారు. దీనివల్ల పౌరులకు వైద్యం చేయించడం సులభమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం గజ్వేల్‌లో విజయవంతమైతే దాన్ని రాష్ట్రం మొత్తం చేపడతామని సీఎం వివరించారు. గజ్వేల్‌ను చూసి ఇతరులు నేర్చుకునేలా గజ్వేల్‌ను రూపుదిద్దుదామని సీఎం అన్నారు. రాష్ట్రమంతా అలాగే మార్చుతామని చెప్పారు.

నియోజకవర్గంలోని ములుగు మండలంలో అటవీకళాశాల, పరిశోధనకేంద్రం, కొండా లక్ష్మణ్‌బాపూజీ హార్టికల్చర్‌ యూనివర్సిటీలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన కొండా లక్ష్మణ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను సందర్శించారు. ప్రారంభోత్సవాల సందర్భంగా అక్కడ సీఎం మొక్కలు నాటారు. గజ్వేల్‌ పట్టణంలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, మహతి ఆడిటోరియంను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. మాతా, శిశు సంరక్షణ దవాఖాన, మున్సిపాలిటీలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ‘మహతి’ ఆడిటోరియంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు..

ఈ ఆడిటోరియం పేరు మహతి. ఇదేం పేరో అర్థంకాక కొందరు తికమక పడుతుంటరు. మహతి పేరు నేనే పెట్టిన. ప్రపంచంలో అతి గొప్ప సంగీత విద్వాంసులు నారద మహర్షి, అతని సహచరుడు తుంబురుడు. వాళ్లిద్దరే ముల్లోకాల్లో ఆరితేరినవారు. నారద మహర్షి వాయించే వీణ పేరే మహతి. ఎంత గొప్ప పేరు! మన గజ్వేల్‌ ప్రాంతం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ సాహితీ సౌరభం, కళాభినివేశం, ఇవన్నీ కలగలిసి ఈ మహతి ఆడిటోరియం నుంచి యావత్తు దేశానికి, ప్రపంచానికి, రాష్ట్రానికి ఆ వెలుగులు ప్రసరించాలన్నది నా కోరిక. అంత గొప్ప పేరు రావాలి. ప్రతి జిల్లా, నియోజకవర్గ కేంద్రంలో ఇలాంటి ఆడిటోరియాలు తేవాలనే సంకల్పం ఉన్నది. అవి నెరవేరే రోజులు ముందున్నాయని అన్నారు.

నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఇండ్లులేని నిరుపేద కుటుంబం నియోజకవర్గంలో ఉండవద్దని చెప్పారు. ప్రతి గ్రామంలో ఎంతమందికి ఇండ్లుకావాలో అందరికీ ఇచ్చుకోవాలి. పైరవీల్లేవు.. పార్టీల్లేవు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరికి ఇష్టమైనవారికి వారు ఓట్లు వేసుకుంటరు. ఇప్పుడు ప్రజలంతా మనవారే. కచ్చితంగా అందరికీ ఇండ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. అప్పుడే గజ్వేల్‌ ఆదర్శంగా తయారవుతుంది. స్వయంసమృద్ధంగా, మనకు మనమే గొప్పగా ఉండేలా గజ్వేల్‌ తయారుకావాలి. నేను ఒకప్పుడు సిద్ధిపేట నియోజకవర్గంలోని రామునిపట్లలో చేశాను. మోడల్‌ విలేజ్‌గా తీర్చిదిద్దినం. మనకు మనమే అనుకుంటే ఊరిలోనే ఎంప్లాయిమెంట్‌ ఇవ్వొచ్చు. అన్నాహజారే రాలేగావ్‌సిద్ధిలో చేశారు.

మాజీ కేంద్రమంత్రి మోహన్‌దారియా మహారాష్ట్రలో చేశారు. ప్రొఫెసర్‌ భండార్కర్‌ లండన్‌లో చదువుకొనే అవకాశం వచ్చినా త్యాగం చేసి.. కుంకన్‌ ప్రాంతంలో అద్భుతమైన ద్రాక్ష గార్డెన్స్‌ పెట్టారు. ఆయన కృషివల్ల ఇప్పుడు మహారాష్ట్ర రూ.10వేల కోట్ల ద్రాక్ష పండ్లను ఎగుమతి చేస్తున్నది. చేసింది ఒక మనిషి.. ఈ రోజు లక్షలమంది బాగుపడుతున్నరు. ఇక్కడ కూడా అంతే. ఒక గ్రామంలో ఒకరికి టైలరింగ్‌ దుకాణం పెడితే అక్కడే కుట్టించుకుంటాం. మన దుకాణంలోనే చెప్పులు కొంటాం. ఇలా అయితే అందరికీ పని దొరుకుతది అని సీఎం సూచించారు. ఇది గజ్వేల్‌ కోసమే కాదు. గజ్వేల్‌ ఎమ్మెల్యేగా నాకు స్వార్థం ఉంటది. అందులో తప్పులేదు. తనకు మాలిన ధర్మంలేదని శాస్త్రం చెప్తది. మనం యాడనో గప్పాలు కొడితే.. నీదే సక్కగలేదు.. నాకేం చెప్తవంటరు. గజ్వేల్‌కు పోయి సూడుపో ఎట్లా చేసినమో! అంటే అప్పుడు వింటరు. ఇతరులు నేర్చుకునేలా గజ్వేల్‌ను తయారుచేసుకొని, తర్వాత రాష్ట్రమంతా అలాగే మార్చుతాం అని సీఎం చెప్పారు.


గజ్వేల్‌కు కాళేశ్వరం జలాలు

గజ్వేల్‌ నియోజకవర్గం వ్యవసాయంపై ఆధారపడ్డ నియోజకవర్గమని ఇక్కడ రైతులకు సాగునీరు ఎంతో ముఖ్యమని కేసీఆర్‌ పేర్కొన్నారు. కాళేశ్వరం జలాలు ఇక్కడికి తెచ్చి ఇక్కడి నేలను తడుపుతామన్నారు. కాళేశ్వరస్వామి దయతో వచ్చే జనవరిలో గజ్వేల్‌కు కాళేశ్వర జలాలు వస్తున్నాయని, ఇది చాలా సంతోషమైన విషయమని సీఎం కేసీఆర్‌ అన్నారు. కాల్వలు కూడా పూర్తికావాలని చెప్తూ.. అందుకు ఆయా గ్రామాల పరిధిలో అవసరమైన భూములను అప్పగించాలని రైతులను కోరారు. కాల్వలు పూర్తిచేసుకుని ప్రతి కుంట, చెరువు నింపుకొంటేనే గౌరవం. ప్రతి ఎకరానికి పారాలి. అద్భుతమైన పంటలుపండాలి అని ఆకాంక్షించారు. వందల ఏండ్లు ఉండే మంచిపనికోసం కాల్వల నిర్మాణానికి భూములు అప్పగించాలని, ఇది అందరికోసం జరుగుతున్న పని అని చెప్పారు.

ఇక్కడినుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయం (మిడ్‌మానేరు) వరకు రైతులు, ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. మొన్న సూర్యాపేట వెళ్తే ప్రజలు నన్ను బంతిలా ఎగురవేశారు. అక్కడ అద్భుతంగా పనులు జరుగుతున్నాయి. మాకు మార్చి వరకు నీళ్లు కావాలి అని అక్కడివాళ్లు సంతోషంగా అడిగారు. గజ్వేల్‌లో కూడా గోదావరి జలాల పండుగ చేసుకోవాలి. నేను కూడా వస్తాను. కాల్వలు సత్వరం తవ్వుకుంటే చెరువులు ఎండనే ఎండవు. ఇంతకుముందు మార్కెట్‌ ఓపెన్‌చేసి, చేపలు అమ్మేవారిని అడిగితే.. హైదరాబాద్‌ నుంచి చేపలు తెస్తున్నామని చెప్పారు. మన చెరువుల్లో నీళ్లుంటే ఈ పరిస్థితి ఉండేదా? అని పక్కనే ఉన్న వంటేరు ప్రతాప్‌రెడ్డిని అడిగిన. ఏడాదిలో ఇక్కడి నుంచి చేపలు హైదరాబాద్‌కు పంపిస్తామని స్థానిక ప్రతినిధులు చెప్తున్నారు. చాలా సంతోషం అని సీఎం అన్నారు.

త్వరలోనే ఒక రోజంతా సమావేశం

కేసీఆర్‌ ఈ మధ్య మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు అనుకుంటున్నరు (నవ్వుతూ). తప్పుకాదు. అనుకుంటేనే పని అయితది. కొద్దిరోజుల్లోనే ఓ రోజు మొత్తం మీ మధ్య ఉండేలా సమావేశం పెట్టుకుందాం అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ప్రజలకు ఇచ్చినమాట ప్రకారం గజ్వేల్‌లో నాకు పనిలేదు అనేవాళ్లు ఉండకుండా చూడాలనేది తన లక్ష్యమని స్పష్టంచేశారు. ఇంటింటికీ పాడిపశువులను ఇచ్చి, ఆ ఇండ్లు పాడి సంపదతో కళకళలాడాలన్నారు.

మంత్రులూ.. గజ్వేల్‌ను కాపాడాలే..

గజ్వేల్‌ నియోజకవర్గాన్ని ఆయా శాఖల మంత్రులు కాపాడాలని సీఎం కేసీఆర్‌ కోరటంతో సభలో నవ్వులు విరిశాయి. నాది పది ఊర్ల గాయిదితనం. యాడ మునిగితే యాడ తేలుతమో తెల్వదు. అందుకే మంత్రులు నా గజ్వేల్‌ దిక్కు చూడాలె. ఇప్పుడే వైద్యశాఖ మంత్రి ఈటల రాజందర్‌ మరో మాతా, శిశుసంరక్షణ కేంద్రానికి రూ.27 కోట్లు మంజూరుచేశారు. సంతోషం. సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రాంరెడ్డినే గజ్వేల్‌ ఎమ్మెల్యే అనుకోవాలి అని సీఎం చెప్పడంతో మళ్లీ నవ్వులు విరిసాయి. కలెక్టర్‌ నుంచి ఏ ప్రతిపాదన వచ్చినా వెంటనే మంజూరుచేయాలని.. తానుకూడా మీకు సాయం చేసేదగ్గర చేస్తానని చెప్పడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, సభకు హాజరైనవారి నుంచి నవ్వుల వర్షం కురిసింది.

7,500 ఎకరాల్లో అరోమాటిక్‌ పార్క్‌

నియోజకవర్గంలో 30 వేల ఎకరాల అటవీభూమి ఉన్నదని, మల్లన్నసాగర్‌ కాల్వ వచ్చే కొండపాక మండలంలోని గిరాయిపల్లి, తిమ్మారెడ్డిపల్లి గుట్టల్లో 7,500 ఎకరాలు ఉన్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రాజెక్టు వస్తే ఎప్పుడూ ఇక్కడ నీరు ఉంటుందని, హైదరాబాద్‌కు దగ్గరలో ఉండటంతో మల్లన్నసాగర్‌ అద్భుతమైన పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఈ 7,500 ఎకరాల భూమిని ఔషధమొక్కలతో అరోమాటిక్‌ పార్క్‌గా మార్చాలన్న సీఎం.. స్థానిక మంత్రి హరీశ్‌రావు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీశాఖ అధికారి శోభ వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించి తగు చర్యలు చేపట్టాలని సూచించారు. పోతే మల్లన్నసాగరే పోవాలనేలా ఆ పార్క్‌ ఉండాలన్నారు. వికారాబాద్‌కా హవా.. లాఖో మరింజోంకా దవా అని ఒకప్పుడు తెలంగాణలో సామెత ఉండేదని సీఎం గుర్తుచేశారు. అనంతగిరిలో తిరుమల కొండల్లో వచ్చిన విధంగా చెట్ల నుంచి సువాసన వస్తుందని, అక్కడినుంచి రాబుద్ధికాదని అన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

తెలంగాణ బిడ్డలూ ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్లు కావాలి

తెలంగాణ బిడ్డలకు ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్లుగా అవకాశం దొరుకాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. ములుగులో ఫారెస్ట్‌ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించడాన్ని ప్రస్తావిస్తూ.. దీనిని దేశంలోనే నంబర్‌వన్‌ కళాశాలగా తీర్చిదిద్దుకుంటామన్నారు. ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ ప్రియాంక వర్గీస్‌ నా ఆఫీసులో పనిచేస్తున్నారు. ఆమె హరితహారం ఇంచార్జిగా ఉన్నారు. సొంత రాష్ట్రం కేరళ. ఎక్కడ చదువుకున్నావమ్మా? అని అడిగితే తమిళనాడులోని కోయంబత్తూరు పక్కన మెట్టుపాళ్యం ఫారెస్ట్‌ కాలేజీలో అని చెప్పారు. ఆమె భర్త కూడా అక్కడే చదివారు. ఈ ఒక్క కాలేజీనుంచే 120 మంది ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్లు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు. మన తెలంగాణ పిల్లలకు కూడా ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్లుగా అవకాశం దొరకాలని ములుగులో కళాశాల ఏర్పాటుచేసుకున్నాం అని సీఎం వివరించారు.

గజ్వేల్‌ దేశానికి రోల్‌మోడల్‌: హరీశ్‌రావు

నియోజకవర్గం ఎలా ఉండాలో.. అలాంటి హంగులతో దేశానికి ఆదర్శంగా గజ్వేల్‌ను సీఎం కేసీఆర్‌ తీర్చిదిద్దారని ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఒకేరోజు ఎన్నో అద్భుత కార్యక్రమాలను ప్రారంభించుకోవడం గజ్వేల్‌ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. గజ్వేల్‌ నుంచి శాసనసభకు ఎన్నికైన వారంరోజులకే సీఎం కేసీఆర్‌ ఇక్కడ సభ నిర్వహించి ప్రజలనుద్దేశించి మాట్లాడిన సందర్భాన్ని మంత్రి గుర్తుచేశారు. ఏడాదికాలంలో నియోజకవర్గంలో ఇంటింటికీ నీళ్లివ్వకపోతే నేను గెలిచి వృదా అని ఆ సభలో కేసీఆర్‌ హామీ ఇచ్చారని, ప్రతి ఇంటికి నల్లాద్వారా స్వచ్ఛమైన మంచినీళ్లు అందించి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. గజ్వేల్‌లో మొదలుపెట్టిన ఇంటింటికీ తాగునీరందించే పథకమే ఇప్పుడు మిషన్‌భగీరథ పేరుతో దేశానికే రోల్‌మోడల్‌ అయ్యిందన్నారు. తెలంగాణలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీళ్లు అందించిన తొలి సీఎంగా కేసీఆర్‌ చరిత్ర సృష్టించారని చెప్పారు. గజ్వేల్‌లో జరుగుతున్న అభివృద్ధి చూసి ఇక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబురాలు చేసుకుంటున్నారని, వారి ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నదని అన్నారు.

సీఎం కేసీఆర్‌ పర్యటన సక్సెస్‌

సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ పర్యటన విజయవంతమైంది. పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజలు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్‌పై పూలవర్షం కురిపించారు. సీఎం కేసీఆర్‌ బస్సులోనుంచే ప్రజలకు అభివాదంచేస్తూ ముందుకుసాగారు..

మార్కెట్‌లో కూరగాయల వ్యాపారులతో ముచ్చట్లు

మార్కెట్‌లో కూరగాయల వ్యాపారుల వద్దకు వెళ్లి మార్కెట్‌ నిర్మాణంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. మార్కెట్‌ మొత్తం కలియతిరిగి సంతృప్తి వ్యక్తంచేశారు. ఆ తర్వాత గజ్వేల్‌- సంగాపూర్‌ రోడ్డులోని సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయాలను ప్రారంభించారు. కార్యాలయాల్లోకి వెళ్లి పరిశీలించారు. రూ.27.35 కోట్లతో 100 పడకల మాతా శిశుసంక్షేమ దవాఖాన నిర్మాణానికి, మున్సిపాలిటీ పరిధిలో రూ.100 కోట్లతో నిర్మించనున్న అంతర్గత మురుగు కాల్వల నిర్మాణాలకు శంకుస్థాపనచేశారు. అనంతరం ముట్రాజ్‌పల్లి రోడ్డులోని మహతి ఆడిటోరియాన్ని ప్రారంభించారు. అక్కడే నిర్వహించిన సభలో గజ్వేల్‌ మున్సిపాలిటీ, గజ్వేల్‌ నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించారు. గజ్వేల్‌లోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి మంత్రులు, ముఖ్యఅధికారులు, నాయకులతో కలిసి భోజనం చేసి.. హైదరాబాద్‌కు బయలుదేరారు.

ఆయా కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రాజేశ్‌తివారీ, పీసీసీఎఫ్‌ ఆర్‌ శోభ, ఎఫ్‌సీఆర్‌ఐ డీన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్లు వేలేటి రోజాశర్మ, హేమలతగౌడ్‌, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్‌, రసమయి బాలకిషన్‌, మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, ఫారుక్‌హుస్సేన్‌, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పన్యాల భూపతిరెడ్డి, బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ వెంకట్రాంరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు మొరంశెట్టి రాములు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.