ఆరోగ్య సౌభాగ్యం
By: సిద్ధార్థ్ బిసగోని
రాష్ట్రంలో వైద్య సేవలను మరింత విస్తరించాలని, పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. టిమ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం నలుదిక్కులా సూపర్ స్పెషాల్టీ హస్పిటళ్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని గచ్చిబౌలి, ఎల్బీనగర్, అల్వాల్, ఎర్రగడ్డలలో ఏర్పాటు చేయనుంది. ప్రతి హాస్పిటల్లో వెయ్యి పడకల చొప్పున నాలుగు వేల పడకలతో నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం, పేదలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా చేయబోతున్నది. రూ.2,679 కోట్లతో ఎర్రగడ్డ, ఆల్వాల్, ఎల్బీనగర్లో హాస్పిటల్లో నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఇటీవలే శంకుస్థాపన చేశారు. అదే విధంగా నిమ్స్ హస్పిటల్ లో మరో రెండు వేల పడకలను ప్రభుత్వం పెంచబోతున్నది. దీంతో నిమ్స్ లో మొత్తం 3489 పడకలు అందుబాటులోకి వస్తాయి.

వరంగల్‌లో హెల్త్ సిటీ..
వరంగల్‌లో హెల్త్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే కాళోజీ నారాయణ రావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. వరంగల్ నగరంలో అధునాతనమైన వసతులతో కొత్తగా రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. 24 అంతస్తులతో నిర్మించబోయే ఈ ఆసుపత్రి కోసం 11 వందల కోట్లు వెచ్చించనుంది. ఇందులో 35 సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఉంటాయి. గుండె, కిడ్నీ, కాలేయం తదితర అవయవ మార్పిడి ఆపరేషన్లతోపాటు క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన కీమోథెరపీ, రేడియేషన్ వంటి అత్యాధునిక చికిత్సలూ ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయి.
ప్రతి జిల్లాకో వైద్య కళాశాల
60 ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో తెలంగాణలో ఏర్పాటయిన ప్రభుత్వ వైద్య కళాశాలలు కేవలం మూడంటే మూడే అవి ఉస్మానియా, గాంధీ, కాకతీయ. ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడేకన్నా ముందు నుంచే ఉన్నాయి. టి.ఆర్.ఎస్. ప్రభుత్వం ఏడున్నర ఏళ్లలో పన్నెండు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించింది. దీంతో రాష్ట్రంలోని వైద్యకళాశాలల సంఖ్య పదిహేడుకు పెరిగింది. తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల, కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటం వల్లనే వైద్య కళాశాలల సంఖ్యను ఇంతగా పెంచుకోగలిగాం.
రాష్ట్రం ఏర్పడగానే మొదటి విడతగా ప్రభుత్వం 4 కొత్త వైద్య కళాశాలలు మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేటలో ప్రారంభించింది. ఈ కళాశాలల్లో వైద్య విద్యా బోధన విజయవంతంగా జరుగుతున్నది. వీటిలో పీజీ కోర్సులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మరో 8 వైద్య కళాశాలలను మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలకు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నది. శరవేగంగా భవనాల నిర్మాణం, వైద్య సిబ్బంది నియామక ప్రక్రియ జరుగుతున్నది. రాబోయే రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ సంవత్సరం కొత్తగా ఎనిమిది వైద్యకళాశాలలను, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 2023 సంవత్సరంలో రాష్ట్రంలోని మిగతా ఎనిమిది జిల్లాలైన మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నూతన మెడికల్ కాలేజీల స్థాపన కోసం ఈ బడ్జెట్లో వెయ్యికోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. వైద్య సిబ్బంది కొరత లేకుండా 13 వేల పోస్టులను భర్తీ చేస్తున్నది.
బస్తీ దవాఖానాలు..

గతంలో నగరంలోని బస్తీలలో వైద్య సౌకర్యాలేవి ఉండేవి కావు. పేదలు విధి లేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించవలసి వచ్చేది. ఈ పరిస్థితిని మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ప్రస్తుతం 259 బస్తీ దవాఖానాలు సేవలందిస్తున్నాయి. వీటిలో వైద్య సేవలతో పాటు 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. త్వరలో ఈ పరీక్షల సంఖ్య 134 కు పెంచుతున్నారు. తమ ముంగిట్లోకి ఆసుపత్రులు రావడంతో బస్తీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చీటికిమాటికి ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన బెడద తప్పిందని సంతోషపడుతున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో మరో 91 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పనులు ప్రారంభించింది. నగరంలోని బస్తీ దవాఖానాలకు వస్తున్న స్పందనను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో మరో 60 బస్తీ దవాఖానాలను కొత్తగా ప్రారంభించనున్నది. బస్తీ దవాఖానాలు అందిస్తున్న సేవలను గుర్తించిన పదిహేనో ఆర్థిక సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించింది. ఈ తరహా దవాఖానలు ఇతర రాష్ట్రాలలోను ఏర్పాటు చేయాలని సూచించింది.
తలసరి ఖర్చులో నెంబర్ వన్..
ఇటీవల రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వైద్యరంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని ప్రశంసించింది. వైద్య సేవల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని వెల్లడిరచింది. వైద్య సేవల కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తలసరి ఖర్చు 1698 రూపాయలు. ఆరోగ్య రంగంలో అత్యధికంగా తలసరి ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. ఈ బడ్జెట్ ప్రకారం, తలసరి ఖర్చు రూ.3,091 కు పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య శాఖకు గతేడాదితో పోల్చితే బడ్జెట్ డబుల్ చేశారు. రు. 11,440 కోట్లు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నది.
దవాఖానాల్లో మౌలిక వసతుల అభివృద్ధి….
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని దవాఖానలన్నింటిలో మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది. వైద్య పరీక్షల పరికరాలు, మందులు తదితర సౌకర్యాలన్నీ అందుబాటులోకి తెచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ‘తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలు’ ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలు 57 కు పైగా పరీక్షలను ఉచితంగా చేస్తున్నాయి. కిడ్నీ రోగులకు వైద్యం కోసం రాష్ట్రంలో 42 ఉచిత డయాలసిస్ కేంద్రాలను, వాటిలో 313 డయాలసిస్ మిషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డయాలసిస్ కేంద్రాలను 102 కు పైగా ఏర్పాటు చేస్తున్నది. డయాలసిస్ కేంద్రాలకు రోగులు వచ్చిపోవడానికి ఆర్టీసీ ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో 21 చోట్ల సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ తో పాటు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్‌లలో ‘క్యాథ్ ల్యాబ్’ సేవలు అందుబాటులో వచ్చాయి. ఈ ల్యాబ్‌లలో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి.
ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగులకు చికిత్సతోపాటు పోషకాహారాన్ని అందించాలనీ, ఇందుకోసం డైట్ చార్జీలను రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీ.బి., క్యాన్సర్ తదితర రోగులకు బలవర్ధకమైన ఆహారం అందించడం కోసం బెడ్ ఒక్కింటికి ఇచ్చే డైట్ చార్జీలను 56 రూపాయల నుంచి 112 రూపాయలకు, సాధారణ రోగులకు ఇచ్చే డైట్ చార్జీలు బెడ్ ఒక్కింటికి 40 రూపాయల నుంచి 80 రూపాయలకు ప్రభుత్వం పెంచింది. దీనికోసం ప్రభుత్వం ప్రతి ఏటా 43.5 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నది.
హైదరాబాద్‌లోని 18 మేజర్ ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగితో ఉండే సహాయకులకు రూ.5కే మూడు పూటలా భోజన సదుపాయం కల్పించింది. ప్రతి రోజు సుమారు 18,600 మందికి ఈ ప్రయోజనం కలుగుతోంది. దీని కోసం సంవత్సరానికి 38.66 కోట్లు ఖర్చవుతాయి.
హాస్పిటళ్లలో పారిశుధ్య ప్రమాణాలను పెంచడం కోసం, పారిశుధ్య కార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి సహృదయంతో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం బెడ్ ఒక్కింటికి చేసే పారిశుధ్య ఖర్చును 5000 నుంచి 7500 రూపాయలకు పెంచింది. ఇందుకోసం ప్రభుత్వం రు. 338 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం వెచ్చించనుంది.
మార్చురీల ఆధునికీకరణ
మృతదేహాలను భద్రపరిచేందుకు, పోస్టుమార్టం నిర్వహించేందుకు ఉపయోగించే మార్చురీలను ఆధునీకరించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా 61 మార్చురీల ఆధునీకరణకు 32 కోట్ల 50 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది.
ఆరోగ్యశ్రీ ద్వారా అందించే సేవల పరిమితి గతంలో 2 లక్షలు మాత్రమే ఉండేది. ఇప్పుడా పరిమితిని తెలంగాణ ప్రభుత్వం 5 లక్షలకు పెంచింది. ప్రత్యేకంగా హార్ట్, లివర్, బోన్‌మారో వంటి అవయవ మార్పిడి చికిత్సల కోసం ఆరోగ్య శ్రీ ద్వారా పది లక్షల వరకు ఇస్తుంది. దీనివల్ల రాష్ట్రంలోని పేదలకు ఎంతో మేలు చేకూరుతుంది. ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అరోగ్య శ్రీ కోసం ఏటా 850 కోట్లు ఖర్చు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 22 ఎం.సీ.హెచ్. హాస్పిటల్స్ ను 407 కోట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యునిసెఫ్ సూచించిన ప్రమాణాల ప్రకారం లేబర్ రూంలను ఆధునీకరించింది.
రాష్ట్రంలో 300 అమ్మ ఒడి వాహనాల ద్వారా మారుమూల పల్లెల నుంచి గర్బిణు లను దవాఖానాలకు తరలించే ఏర్పాటు చేసింది. హై రిస్క్ ప్రెగ్నెన్సీని గుర్తించడంలోనూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచడంలోనూ తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. బాలింత మరణాల తగ్గుదల రేటులోనూ తెలంగాణ ముందు వరుసలో ఉంది.
సమర్థవంతంగా కరోనా కట్టడి
కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రశంసించింది. దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలోని అన్ని పడకలను ఆక్సిజన్ పడకలుగా మార్చింది. పీడియాట్రిక్ ఐ.సి.యు.లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు 135 టన్నుల నుంచి 550 టన్నులకు పెంచేందుకు చర్యలు తీసుకున్నది.
రాష్ట్రంలో నిర్వహించిన జ్వర సర్వే సత్ఫలితాలను ఇచ్చింది. ప్రభుత్వ సిబ్బంది ప్రజల ఇంటి వద్దకు వెళ్లి కరోనా పరీక్షలను నిర్వహించారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వారికి కరోనా కిట్లను అందించారు. అవసరమైనవారిని ఆస్పత్రులకు తరలించి వైద్యం చేయించారు. నీతి ఆయోగ్ గత ఏడాది విడుదల చేసిన నివేదికలో జ్వర సర్వేను బెస్ట్ ప్రాక్టీసుగా ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని ప్రాథమిక దశలోనే కట్టడి చేసేందుకు ఇది సరైన పద్ధతి అని పేర్కొన్నది. దీనివల్ల ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గిందని ప్రశంసించింది.
వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడంలో పటిష్టమైన కార్యాచరణను అమలు చేసిన మూడో అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణాను ఎకనమిక్ సర్వే గుర్తించింది. కరోనా వాక్సినేషన్ ప్రక్రియలో సైతం తెలంగాణ జాతీయ సగటు కన్నా ముందుంది.
అత్యవసర ఆరోగ్య సౌకర్యాలు పెంపు…
క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వం పది పడకలు కల్గిన 20 ఐసీయూలను ఏర్పాటు చేసింది. 25 జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో ఐసీయూ సౌకర్యాలను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు భద్రతనిస్తున్నది.
కంటి వెలుగు పథకం…
రాష్ట్రంలో ఏ ఒక్కరు కంటి సమస్యలతో బాధపడకుండా అందత్వ రహిత తెలంగాణ సాధన దిశగా కంటి వెలుగు పేరిట రాష్ట్ర వ్యాప్తంగా శిబిరాలను నిర్వహించింది. గ్రామీణ పట్టణ ప్రాంత్లాలో కలిపి మొత్తం 1.54 కోట్ల మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో సమస్యలున్న 41లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు, మందులను ప్రభుత్వం అందించింది..
108, 102 వాహనాలు….

అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు 424, 108 వాహనాలను ఏర్పాటు చేసింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన గర్భిణులకు సేవలందించేందుకు ప్రభుత్వం అమ్మ ఒడి పథకం కింద 102 ప్రత్యేక వాహన సర్వీసులను అందిస్తున్నది. వీటికి తోడు మృత దేహాలను తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 50 పరమపద వాహనాలను ఏర్పాటు చేసింది.
మెరుగైన వైద్యానికి చర్యలు….
జిల్లా కేంద్ర దవాఖానల్లో సూపర్ స్పెషాల్టీ సేవలు ప్రారంభించింది. నలుగురు డాక్టర్లతో మండల స్థాయిలో 30 పడకల దవాఖాన, 125 సీహెచ్‌సీల్లో 24 గంటల సేవలు ప్రారంభించింది. దవాఖానల అవసారలను బట్టి తాత్కాలిక రిక్రూట్మెంట్, న్యూ ప్రొక్యూర్మెంట్ పాలసీ, హెచ్ఆర్ పాలసీలను అమలు చేసింది.
కండ్ల ముందే మార్పులు…
ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల వల్ల అనేక మార్పులు వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, తెలంగాణలో శిశు మరణాల సంఖ్య, మాతృ మరణాల సంఖ్య, 5 ఏండ్ల లోపు చిన్నారుల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. నాణ్యమైన వైద్యం అందుతుండటంతో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులతో గత రెండేండ్లలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.
ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో వైద్య సేవలు అందించాలనుకునే వారెవరైనా తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోవాల్సిందే. వచ్చే ఫిర్యాదులను ఇది పరిష్కరిస్తుంది. జాతీయ అరోగ్య సూచిల్లో రాష్ట్రం ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నది.
రాష్ట్ర బడ్జెట్ లో ఆరోగ్య బడ్జెట్…..
6,295 కోట్ల నుండి 11,440 కోట్లకు పెంపు. 2.5% నుండి 4.45%కు పెంపు ప్రతి మనిషిపై పెట్టే సగటు ప్రభుత్వ బడ్జెట్ సగటు 1,698/- నుండి 3,091/- పెంపు. ఈ విషయమంలో పెద్ద రాష్ట్రాలలో మొదటి స్థానంలో తెలంగాణ
- ఆసుపత్రులు నడపడానికి : 1,500 కోట్లు
- ఆసుపత్రులలో వ్యాధినిర్ధారణ పరీక్షలకొరకు : 300 కోట్లు
- ఆసుపత్రులలో వైద్య పరికరాలు : 500 కోట్లు
- ఆసుపత్రులలో సర్జికల్ కొరకు : 200 కోట్లు
- ఆసుపత్రులలో మందులకొరకు : 500 కోట్లు
- ఆసుపత్రుల నిర్మాణానికి : 2,000 కోట్లు
- వైద్య కళాశాల ఆసుపత్రులు : 1,000 కోట్లు
- సూపర్ స్పెషలిటీ ఆసుపత్రులు : 1,000 కోట్లు
ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ఐదంచెల వ్యవస్థకు నాంది పలికింది. ఇందులో భాగంగా మూడంచెల వ్యవస్థను ఐదంచెలుగా అభివృద్ధి చేసింది. ఇప్పటివరకు ఉన్న ప్రాథమిక, ద్వితీయ, తృతీయ వైద్య విభాగాలకు తోడు కొత్తగా ప్రివెంటివ్, సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రాథమిక : PHC, CHC
ద్వితీయ బీ ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు
తృతీయ: బోధనా ఆసుపత్రి
కొత్తగా : ప్రివెంటివ్ డ సూపర్ స్పెషలిటీ వైద్యం
ప్రివెంటివ్ : పల్లె దవాఖాన, బస్తీ దవాఖానలు
సూపర్ స్పెషలిటీ: టిమ్స్ ఆసుపత్రులు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…
ఉమ్మడి పాలన ప్రభుత్వ వైద్య రంగాన్ని విచ్ఛిన్నం చేసి ప్రైవేటును ప్రోత్సహించారు. కాంగ్రెస్, బీజేపీ పాలకులు ఏనాడూ ప్రజా వైద్యాన్ని పట్టించుకోలేదు. దీంతో ప్రైవేటు ఆసుపత్రులు పెరిగిపోయాయి. దీంతో ప్రజలు ప్రతి ఆరోగ్య సమస్యకు ప్రైవేటును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో పేదలు వైద్యంపై అధికంగా ఖర్చు చేసి ఆర్థికంగా చిక్కిపోయేవారు. ఏదైనా పెద్ద రోగం వస్తే అప్పులు చేసి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి.
ఈ పరిస్థితులను కళ్లనిండా చూసిన ముఖ్యమంత్రి దాన్ని మార్చేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. వైద్య రంగాన్ని బలోపేతం చేశారు. గుణాత్మక మార్పు సాధ్యం చేశారు. జిల్లాకొక మెడికల్ కాలేజీ విప్లవాత్మకమైన చర్య. సమైక్య పాలనలో తెలంగాణలో మూడు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే, ఇప్పుడు 17కు పెంచుకున్నాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈ ఏడాది మరో 8, వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. దేశంలోనే అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలువబోతున్నది.