తెలుగు అక్షరాలతో కళాకృతులు
ప్రపంచమంతా కంప్యూటర్ యుగంగా మారిపోయి, అక్షరాలను కంప్యూటర్ కీబోర్డు ద్వారా తప్ప చేతితో వ్రాసే పద్ధతిని ప్రజలు మరిచిపోతున్న తరుణంలో, మాటలు కరువై చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ల ద్వారానే భాష, భావం ఒకరికొకరు మార్చుకుంటున్న, ఆధునిక సాంకేతికత అలరారుతున్న ఈ సమాజంలో, తెలుగు అక్షరాలనే దొంతరలుగా పేర్చి, వివిధ ఆకృతులు గా మార్చి, చూపరులకు తెలుగు అక్షరాల ద్వారా ఇన్ని ఆకృతులు, అద్భుతాలు చేయొచ్చా.. అని అబ్బురపడే విధంగా తన అక్షర విన్యాసాలను చూపిస్తున్న విద్యాధికుడైన యువకుని విజయగాథ ఇది. ఈ యువకుడు చేసే అక్షర విన్యాసాలను సాంకేతిక పరిభాషలో క్యాలీగ్రఫీ అంటారు. ఇది మొదట కేవలం ఆంగ్లం, రోమన్ భాషా అక్షరాలకే పరిమితమై ఉండేది. దీన్ని చూసిన ఈ యువకుడు ఇది తెలుగు అక్షరాలకు కూడా ఎందుకు అన్వయింపచేయకూడదని ఆలోచించాడు. వెంటనే క్యాలీగ్రఫీని తెలుగులో కూడా అభివృద్ధి చేశాడు. ఈ యువకుని పేరు కరిడె నవకాంత్. ఇతని స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు. ఇతను బిటెక్ పూర్తి చేసిన విద్యాధికుడు. తెలుగు అక్షరాలను అందంగా, వివిధ ఆకృతుల్లో వ్రాయడం ఈయనకు స్కూల్ విద్యనుంచే అబ్బింది. మొదట స్కూల్లో ప్రాథమిక విద్య గడిస్తున్నపుడే పుస్తకాల అట్టపుటలతో పాటు, తన స్నేహితుల పుస్తకాల అట్టపుటలపై కూడా వారి వారి పేర్లు అందంగా, శిల్పాలు చెక్కిన విధంగా వ్రాసి ఇచ్చేవాడు.
తన చెల్లెలు పుస్తకాలపై, నోట్ బుక్‌లపై మొదట ఇలా వ్రాసి ఇచ్చిన తరువాత మెల్లమెల్లగా తోటి స్నేహితులందరి పుస్తకాలపై కూడా అందమైన అక్షరాలతో పేర్లు వ్రాసి ఇవ్వడం ప్రారంభించాడు. అప్పటికి నవకాంత్‌కు తాను చక్కగా, వివిధ ఆకృతుల్లో చెక్కుతున్న ఈ అక్షరమాలలను క్యాలీగ్రఫీ అని పిలుస్తారని తెలియనే తెలియదు. తాను డిగ్రీ చేస్తున్న సమయంలో హైదరాబాద్ నగరంలోని కోఠి సెంటర్లో సెకండ్‌హ్యాండ్ బుక్స్ కొనడానికి వెళ్ళగా అక్కడ క్యాలీగ్రఫీకి సంబంధించిన పుస్తకం అగుపించిందని నవకాంత్ తెలిపారు. అందులో చదివిన తరవాతనే తాను అక్షరాలతో చేస్తున్న విన్యాసాలను క్యాలీగ్రఫీగా పిలుస్తారని తనకు తెలిసిందని ఆయన తెలిపారు. పుస్తకంలో ఉన్న వివరాల ప్రకారం ఈ విద్యలో మెళకువలు నేర్వాలంటే తనకు శిక్షణ అవసరమని భావించి ముంబాయిలోని అచ్యుత్పాల్ అనే శిక్షకుని వద్దకు చేరుకున్నట్లు తెలిపారు. అక్కడ సుమారు 4 మాసాల పాటు శిక్షణ పొంది తిరిగి వచ్చాడు. ఇంగ్లీష్, రోమన్, దేవనాగరి లిపిలో ఈ క్యాలీగ్రఫీ ఎలా చేస్తున్నారో పూర్తిగా ఆకళింపు చేసుకుని దాన్ని తెలుగులో అన్వయిస్తూ రకరకాల ఆకృతుల్లో అక్షరాలను పొందికగా పేర్చి తయారు చేయడం ప్రారంభించానని చెప్పారు.

తిరిగి వచ్చిన తరువాత నగరంలోని మల్కాజిగిరి కాకతీయ స్కూల్లో విద్యార్థులకు క్యాలీగ్రఫీలో శిక్షణ ఇచ్చినట్లు నవకాంత్ తెలిపారు. ఇదే కాకుండా ఓంకారాన్ని తన క్యాలీగ్రఫీలో వేసి ప్రదర్శనకు పంపించినట్లు చెప్పారు. నెదర్ల్యాండ్, దక్షిణ కొరియా దేశాలలో తన క్యాలీగ్రఫీ పెయింటింగ్‌లు ప్రదర్శనకు నోచుకున్నాయన్నారు. దేశంలోని కేరళ రాష్ట్రంలో, ముంబాయి నగరంలో కూడా ప్రదర్శించినట్లు తెలిపారు. ఈ క్యాలీగ్రఫీ నేర్చుకోవడానికి విద్యార్థులు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలోనే దీన్ని ఒక సబ్జెక్ట్‌గా పెట్టి బోధిస్తే బాగుంటుందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఎలాంటి సంపాదన లేదు
ఈ క్యాలీగ్రఫీ వల్ల తనకు ఇప్పటికైతే ఎలాంటి సంపాదన లేదన్నారు. ముందు ముందు సినిమా టైటిల్స్ వేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అలాగే కొత్త ఫాంట్లు తయారుచేయాలని కూడా యోచిస్తున్నానని నవకాంత్ తెలిపారు. కరోనా వల్ల ప్రజలు మాస్క్‌లు వాడుతున్నారని అలాంటి మాస్క్‌లపైనా, స్మార్ట్ఫోన్లపై కూడా డిజైన్లు వేసి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే ఇది ఏమంత సంపాదన ఇచ్చే విధంగా లేదన్నారు. ఈ కళను ప్రాథమిక విద్యలోనే ప్రవేశపెడితే గతించిపోతున్నమన తెలుగు అక్షరాలకు జీవం పోసినట్లు అవుతుందని తన అభిప్రాయాన్ని తెలియచేశాడు.
ఇంగ్లీష్‌మీడియం మోజులో తెలుగును చదవడమే గగనమై పోతున్న ఈ రోజుల్లో తెలుగు అక్షరాలను ఏర్చి, కూర్చి, వాటికి మంచి మంచి ఆకృతులు కల్పించి, తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తున్న నవకాంత్ అభినందనీయుడు.