అరుదైన చరిత్రకు అక్షర రూపం ‘దశ-దిశ’

ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే ఒక అరుదైన ఉద్యమంగా మిగిలింది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. గడిచిన శతాబ్దమంతా త్యాగాలతో, పోరాటాలతో, హింసతో, ప్రతి హింసతో ప్రజ్వరిల్లిన తెలంగాణ గడ్డపై ఇరవై ఒకటవ శతాబ్దపు తొలిపొద్దు శాంతియుత ఉద్యమ బాటపై తన వెలుగులను ప్రసరించింది. అహింస, ఆత్మార్పణలతో ఆశయ సాధన కోసం శాంతియుత, రాజకీయ ఉద్యమాలతో అడుగులు వేసింది తెలంగాణ. భావోద్వేగాలు, ఆవేశకావేశాలు ఆకాశాన్నంటినా అంతిమంగా పలు రాజకీయ పార్టీల చొరవతో తెలంగాణా రాష్ట్రం అవిష్కృతమైంది. ఎంతో గొప్పదైన ప్రజల చరిత్రను తెలంగాణ స్వంతం చేసుకుంది. 21వ శతాబ్దపు ఉద్యమాలకు ఆదర్శంగా, మార్గదర్శిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ గమనాన్ని ఇరు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలను, ఆకాంక్షలను పరస్పరం అర్థం చేసుకునేలా ‘దశ-దిశ’ కార్యక్రమాలను నిర్వహించిన నాటి హెచ్‌.ఎమ్‌.టి.వి. సి.ఇ.ఓ. కొండుభట్ల రామచంద్రమూర్తి అభినందనీయులు.

2009 డిసెంబర్‌ 20న హైదరాబాద్‌ జూబ్లీహాల్‌లో ప్రారంభమైన చారిత్రాత్మకమైన ‘దశ-దిశ’ చర్చ 2010 జూలై 4న వికారాబాద్‌తో ముగిసింది. ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో నిర్వహించిన ‘దశ-దిశ’ చర్చలలో వేలాదిమంది తెలంగాణా వాదులు, సమైక్యవాదులు పాల్గొన్నారు. 1956 నవంబర్‌ ఒకటిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం ఇరు ప్రాంతాల స్థితిగతుల ప్రస్తావనతో మొదలై శ్రీకృష్ణకమిటీ విచారణ వరకు చరిత్రలోని ప్రతి అంశమూ ‘దశ-దిశ’లో చర్చకు వచ్చింది. ప్రతి వక్త తన వాదనను ఎంతో బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్న ప్రొ. జయశంకర్‌, ప్రొ. కేశవరావు జాదవ్‌, ఎం.టి. ఖాన్‌, బుర్రా రాములు, ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి, ఎర్రం నాయుడు, కోడెల శివప్రసాద్‌, వనం ఝాన్సీ, వై.ఎస్‌. వివేకానంద రెడ్డి మరికొందరు ప్రముఖులు ఈనాడు మన మధ్య లేరు కానీ, వారి వాదనలను భవిష్యత్‌ తరాలకు ‘తెలుగు ప్రజల దశ-దిశ’ పుస్తకం యధాతథంగా విన్పిస్తున్నది.

తెలంగాణ మహోద్యమం భవిష్యత్‌ తరాలకు ఒక ‘గతం’. ఆ గత కాలపు చరిత్రను తారీఖులతో వివిధ సంఘటనల సమాహారంగా క్రమపద్ధతిలో ఎందరెందరో రాస్తారు. కానీ ఆ ఉద్యమ కాలంనాటి వాడి, వేడిని, భావోద్వేగాలను, ఆగ్రహావేశాలను, ఆవేదనలను, పశ్చాత్తాపాలను, నిస్సహాయ స్థితిని యథాతధంగా రికార్డు చేసి అక్షర రూపమిచ్చి భవిష్యత్‌ తరాలకు అందించడమనేది చరిత్రకారులకే ఊహకందని ఒక అరుదైన చరిత్ర.

సుమారు 680 పేజీలతో ‘ఎమ్మెస్కో’ వెలువరించిన ‘తెలుగు ప్రజల దశ-దిశ’ ఆ సంస్థ ఇప్పటి వరకు ప్రచురించిన వందలాది పుస్తకాలలో ఒక ఆరుదైన రచనగా మిగిలిపోయి భవిష్యత్‌ చరిత్రకారుల మన్ననలందుకుంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

వేలాది వక్తల భావోద్వేగ ప్రసంగాలకు అక్షర రూపం ఇవ్వడం అనేది ఎంతో సాహసోపేతమైనది. ఈ ‘దశ-దిశ’ కార్యక్రమాల్లో నాలుగైదు సార్లు పాల్గొన్న వ్యక్తిగా ఆ వాడి-వేడిని కళ్ళారా చూశాను. ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ‘దశ-దిశ’ల్లో తెలంగాణ వక్తల ప్రసంగాలను, తెలంగాణలో ఆంధ్ర వక్తల ప్రసంగాలను తరచుగా అడ్డుకోవడం, ఉద్రిక్తతలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది. వక్తల ప్రసంగాల్లో ఒకరు చెప్పిన విషయాన్నే పలువురు రిపీట్‌ చేసేవారు. నేతలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసేవారు. ఇవేవీ రాకుండా ఈ ‘తెలుగు ప్రజల దశ-దిశ’ పుస్తక సంపాదకులు కల్లూరి భాస్కరం, డి. చంద్రశేఖర రెడ్డి, ప్రొ. జయధీర్‌ తిరుమలరావు, ప్రొ. గూడూరు మనోజ, అబ్దుల్‌ వాహెద్‌ ఎంతో జాగ్రత్తగా ఎడిట్‌ చేశారు.

పుస్తకం చివరి పేజీల్లో ప్రముఖుల అభిప్రాయాలను ప్రచురించడం ఈ రచనకు మరింత విలువను సమకూర్చింది. ఈ ‘దశ-దిశ’ కార్యక్రమాల్లో హెచ్‌.ఎమ్‌.టి.వి. వ్యాఖ్యాతగా పాల్గొనడం, వక్తల ప్రసంగాలు వినడం ద్వారా తన ఆలోచనల ‘దిశ’ మారిందని పి. కిరణ్‌ పేర్కొనడం నాకు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగించింది.

”తెలంగాణ ప్రాంతంలో జరిగిన ‘దశ-దిశ’ల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఏకాభిప్రాయం వ్యక్తం కాగా, ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ‘దశ-దిశ’ కార్యక్రమాల్లో సమైక్యాంధ్ర వాదానికి ఏకగ్రీవ మద్దతురాలేదన్న” కల్లూరి భాస్కరం, ఈ పుస్తక సంపాదకుల సునిశిత పరిశీలన వందశాతం నిజం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొనకపోవడం పై వాదనను ధృవీకరించే వాస్తవం.

అరుదైన చరిత్రకు అక్షరరూపమిస్తూ ”తెలుగు ప్రజల దశ-దిశ’ గ్రంథాన్ని వెలువరించిన రామచంద్రమూర్తి (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు)కి అభినందనలు.

ప్రతి ఒక్కరి ఇంట్లో భద్రపరచుకోవలసిన చారిత్రక గ్రంథం ‘తెలుగు ప్రజల దశ-దిశ’.

తెలుగు ప్రజల దశ-దిశ
ప్రధాన సంపాదకుడు : కొండుభట్ల రామచంద్రమూర్తి
పేజీలు : 680, వెల : రూ. 400
ప్రతులకు : ఎమ్మెస్కో బుక్స్‌
1-2-7, బానూ కాలనీ, గగన్‌మహల్‌ రోడ్‌,
దోమలగూడ, హైదరాబాద్‌ – 500 029.
ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.