|

పేదల భ్రదతకు భరోసా… ఆసరా!

By:- మార్గం లక్ష్మినారాయణ

పనైనా, పతకమైనా, పది మందిని ఆదుకోవడమైనా, ఆపన్నులకు అండగా ఉండటమైనా… ఏదైనా సరే, చుట్టపు చూపుగనో, మొక్కుబడిగనో జరగకూడదు. మనస్ఫూర్తిగా జరగాలి. ప్రభుత్వం కేవలం ప్రభుత్వంగా కాకుండా, ప్రజల కేర్‌ టేకర్‌గా ఉండాలి. పొదుపును పాటిస్తూనే, అవసరమెనౖ చోట చేతికి ఎముక లేదా? అన్నంతగా ఖర్చు చేయాలి.. ఇవన్నీ అనుభవంలో ఉన్నందుననే సీఎం కేసిఆర్ ప్రభుత్వ పథకాలకు కేవలం అభివృద్ధి, సంక్షేమాలనే కాదు. మానవీయ కోణాలని కూడా అనుసంధానించారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు విజయవంతంగా అమలు అవుతున్నాయి.

పేదలందరికీ గౌరవప్రదంగా బతికే అవకాశం, భద్రతతో కూడిన భరోసానిస్తూ, సురక్షితమై జీవితాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం నవంబర్‌ 2014 నుండి ‘ఆసరా’ పెన్షన్‌ పథ కాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోంది. ఆసరా పథ కం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, హెచ్‌ఐవి-ఎయిడ్స్‌, ఫైలేరియా ప్రభావిత వ్యక్తులు (గ్రేడ్‌-2, ) చేనేత, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నది.

ఒకప్పుడు రూ.75గా ఉండే పెన్షన్‌, తెలంగాణ వచ్చేనాటికి రూ.200 మాత్రమే ఉండది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ నిధిని పెంచి, వికలాంగులకు నెలకు రూ.3,016, ఇతర అన్ని వర్గాలకు రూ.2,016 పెన్షన్‌గా ఇస్తున్నది. ఈ పెన్షన్లను కరోనా కష్టకాలం సహా, క్రమం తప్పకుండా, నెల నెలా నాలుగు విధాలుగా లబ్ధిదారులకు అందిస్తున్నది. 45 శాతం తపాలా శాఖ ద్వారా, 55 శాతం లబ్ధిదారుని బయోమెట్రిక్‌ ప్రమాణీకరణ ద్వారా లబ్ధిదారుల CBS బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడం ద్వారా పంపిణీ జరుగుతున్నది. శాశ్వతంగా దివ్యాంగులు, కుష్టువ్యాధి, ఫైలేరియా, హెచ్‌ఐవీ బాధితులకు పంచాయతీ కార్యదర్శి / బిల్‌ కలెక్టర్‌ ద్వారా మాన్యువల్‌ చెల్లింపు జరుగుతున్నది.

డయాలసిస్‌ బాధితులకు కూడా…

రాష్ట్రంలో ఉన్న 6 వేల 906 మంది డయాలసిస్‌ బాధితులకు కూడా పెన్షను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మహిళలకే పెద్దపీట!

ప్రతి మనిషి జీవితం మహిళ నుంచే మొదలవుతుంది. మహిళల చేతుల్లోనే మనుషులు సంస్కారవంతులుగా తీర్చిదిద్దబడతారు. మహిళలపైనే మనుగడ ఆధారపడి ఉంది. కాబట్టి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తున్నది. అనేక పథకాల్లో వారికి సమాన అవకాశాలు కల్పిస్తున్నది. అందులో భాగంగా పెన్షన్లలోనూ మహిళలకే ఎక్కువ మొత్తంలో పెన్షన్లు అందుతున్నాయి. మొత్తం పెన్షన్లలో మహిళలకు 69 శాతం పెన్షన్లు అందుతున్నాయి.

దేశంలో మనమే నెంబర్‌ వన్‌!

దేశ వ్యాప్తంగా పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నెంబర్‌ వన్‌ గా ఉంది. మనం నాలుగు అంకెల పెన్షన్లు ఇస్తుండగా, దేశంలోని కొన్ని రాష్ట్రాలు కేవలం రెండంకెల సంఖ్యను మించడం లేదు. దేశంలో కేంద్రం, ఇతర  రాష్ట్రాలకంటే మన రాష్ట్రం మన వృద్ధులు, ఇతర పెన్షన్‌ దారులను సగౌరవంగా చూస్తున్నదనడానికి ఉదాహరణ.

కుదించిన వయోపరిమితి ప్రకారం కొత్త పెన్షన్లు

ప్రభుత్వం తాజాగా 65 ఏండ్ల వయో పరిమితిని 57 ఏండ్లకు కుదించింది. మీ సేవ ద్వారా 57 సంవత్సరాల వయస్సుగల అర్హులైనవారి నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 14 ఆగస్టు 2021 నుండి 31 ఆగస్టు 2021 వరకు మొదటి విడత, 11 అక్టోబర్‌ నుండి 30 అక్టోబర్‌, 2021 వరకు 2వ విడత మొత్తం 2 విడతలుగా మొత్తం 8 లక్షల 11 వేల 817 దరఖాస్తులు వచ్చాయి. ఇవే కాకుండా, అన్ని కేటగిరీల నుండి ఇప్పటికే వెరిఫై చేసిన 3 లక్షల 87 వేల 846 దరఖాస్తులు మంజూరు కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దరఖాస్తులను ఐటీ విభాగం పరిశీలించింది. ఈ పరిశీలన ప్రకారం దాదాపు 2 లక్షల వరకు అర్హత లేని వారి దరఖాస్తులున్నట్లుగా గుర్తించారు. ఇదేగాక 6 వేల 906 మంది డయాలసిస్ రోగులు కూడా కొత్త కేటగిరిగా పెన్షన్ ఇవ్వాలనే పరిశీలన ప్రభుత్వం వద్ద ఉంది. ఇవన్నీ కలిపి దాదాపు 10 లక్షల మంది కొత్త పెన్షన్ ల కోసం రూ. 2,500 కోట్లు అవసరమవుతాయని ప్రాధమిక అంచనాను ప్రభుత్వం చేసింది.

అదనపు భారం అయినా...

ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ల పై ప్రభుత్వానికి సంవత్సరానికి రూ. 9 వేల 255 కోట్లు ఖర్చు జరుగుతుండగా, కొత్త పెన్షన్ల ద్వారా 1 వెయ్యి 416 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతున్నది. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో 11 వేల 728 కోట్లు కేటాయించారు . తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఈ మొత్తం పెన్షన్లలో 6 లకల్ష  66 వలే 553 వృద్దాప్య, వితంతువులు మరియు వికలాంగులకు రూ. 215 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. అయితే, తెలంగాణ ప్రభుత్వం పెన్షన్లను, భారంగానో, అనవసర ఖర్చుగానోకాక, కరోనా సమయంలో కూడా తగ్గించకుండా, నిలిపివేయకుండా నిరంతరంగా ఇస్తున్నది. అంతేగాక, మానవీయ కోణంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు కూడా పెన్షన్లు అందచేస్తుండటం కచ్చితంగా మానవీయ… మాననీయమే.!