|

పలు కీలక నిర్ణయాలతో ముగిసిన అసెంబ్లీ సమావేశాలు

ఉద్యోగాల నియామక నోటిఫికేషన్లకు గ్రీన్‌ సిగ్నల్‌, జీవో 111 రద్దు నిర్ణయం, సెర్ఫ్‌, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించడం, ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లకు మళ్ళీ ఉద్యోగాలు కల్పించడం, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనం రూ. 3వేలకు పెంచడం, వీఆర్‌ఏలను లష్కర్లుగా నియమించడం, ఉర్దూలోనూ పోటీపరీక్షలు నిర్వహించడం తదితర కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శాసనసభ సమావేశాల చివరిరోజు సభలో ప్రకటించారు.

శాసనసభ సమావేశాలు మార్చి 7వ తేదీన ప్రారంభమై 15వ తేదీ వరకు కొనసాగాయి. సెలవులు పోను 7 పని దినాలు సభ నడిచింది. సభలో ద్రవ్యవినిమయ బిల్లు, ద్రవ్య వినిమయబిల్లు2, ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి పెంపు చట్ట సవరణ బిల్లు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీల కాల పరిమితిని ఏడాది నుంచి రెండేళ్ళకు, సభ్యుల సంఖ్యను 14 నుంచి 18కి పెంచేందుకు ఉద్దేశించిన మార్కెట్‌ కమిటీల చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెట్టగా, వాటికి సభ ఆమోదం లభించింది. ఆర్థిక మంత్రి హరీష్‌రావు 2,56,958,51 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయం, వైద్యం, విద్య రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టిన దళితబందు పథకానికి బడ్జెట్‌లో 17,700 కోట్ల రూపాయలను కేటాయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభ సమావేశాలలో రెండు పర్యాయాలు ప్రసంగించారు. మొదట ఆర్థిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరువాత రోజు శాసనసభలో ప్రసంగిస్తు 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేయడానికి నిర్ణయించినట్లు ప్రకటించారు. ఏశాఖకు సంబంధించి ఆ శాఖ వారు త్వరలోనే నోటిఫికేషన్లు వెలువరిస్తారని తెలిపారు. దీనితో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఇక రెండవ సారి శాసనసభ సమావేశాల చివరిరోజు సభలో ద్రవ్య వినిమయ బిల్లును సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై ప్రతిపక్షాలు మాట్లాడిన తరువాత సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.

పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలలో చర్చల సరళి మెరుగుపడాలన్నారు. బడ్జెట్‌ను అధికార పక్షం ఓహో ఆహా అనడం, ప్రతిపక్షం అంకెలగారడీ, పాత చింతకాయపచ్చడి అని విమర్శించడం మామూలై పోయిందన్నారు. అలా కాకుండా లోతుగా, అర్థవంతంగా చర్చ జరగాలన్నారు. బడ్జెట్‌ కు ప్రధానమైనది ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ అన్నారు. మొదట బడ్జెట్‌ అంచనాలు రూపొందించి, తరువాత పన్నుల ద్వారా వచ్చే రాబడి తదితర విషయాలను తీసుకుని క్రోడీకరించి పూర్తి బడ్జెట్‌ రూపొందిస్తారన్నారు. ఇలా తెలంగాణ వచ్చాక ప్రవేశపెడుతున్న బడ్జెట్‌తో బంగారు తెలంగాణకు అడుగులు వేస్తోందన్నారు. ఆర్‌బిఐ తన నివేదికలో తెలంగాణ అద్భుతాలు సాధిస్తోందని ప్రశంసించిందని పేర్కొన్నారు. అప్పులు చేస్తున్నామని విమర్శించే వారికి అవి అప్పులు కాదు వనరుల సమీకరణ అని జవాబు చెప్పారు. అప్పుల విషయంలో మనకన్నా 24 రాష్ట్రాలు ఎక్కువ అప్పులు చేశాయన్నారు. మనం 25వ స్థానంలో ఉన్నామని సీఎం పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో కేంద్ర సరాసరి కంటే మన రాష్ట్రమే ఎక్కువగా ఉందన్నారు. 2014లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినపుడు జీఎస్‌డీపీ 5 లక్షల కోట్లు ఉంటే, ఇప్పుడు దాన్ని 11లక్షల కోట్లకు తీసుకెళ్ళామని తెలిపారు. 38.7 శాతం వృద్ధిరేటు సాధించామన్నారు. తెలంగాణ ప్రగతిపథంలో దూసుకు పోతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను హరించివేస్తున్నదని విమర్శించారు. బలమైన కేంద్రం`బలహీనమైన రాష్ట్రాలు అనే నినాదంతో ముందుకు పోతున్నదని విమర్శించారు. ఇది ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్దమన్నారు. దీనిపై అన్ని రాష్ట్రాల శాసనసభల్లో చర్చ జరగాలని ఆకాంక్షించారు. కాగా ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలపై వరాలజల్లు కురిపించారు.

మండలి ఛైర్మన్‌గా గుత్తా ఎన్నిక ఏకగ్రీవం

రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్‌గా గుత్తాసుఖేందర్‌ రెడ్డి రెండవ దఫా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనమండలి సమావేశాలు ప్రారంభం కాగానే మొదటి రోజు రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం రెండవ రోజు ఛైర్మన్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ఎంఐఎం సభ్యుడు, ప్రోటెం స్పీకర్‌ సయ్యద్‌ అమీనుల్‌ హసన్‌ జాఫ్రీ ప్రకటించారు. మండలి ఛైర్మన్‌ అభ్యర్థిగా మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మాత్రమే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంరతం చివరిరోజు ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థిక మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టారు. ద్రవ్య వినిమయబిల్లు ఆమోదంతో సభ ముగిసింది.