స్వీపర్‌ రజని కాదు… అసిస్టెంట్‌ ఎంటమాలజిస్ట్‌!

ఆ మహిళకు ఉద్యోగమిచ్చిన కేటీఆర్

ఆమె ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయింది. అందుకు కారణం లేకపోలేదు. జిహెచ్‌ఎంసీలో ఒక సాధారణ స్వీపర్‌ గా పనిచేస్తున్న ఆమెకు ఉన్నట్టుండి ప్రభుత్వం రూపంలో అదృష్టం వరించి వచ్చింది. ఆమె స్వీపర్‌గా పనిచేసిన సంస్థలోనే ఇప్పుడు అసిస్టెట్‌ ఎంటమాలజిస్ట్‌గా నియమితులయ్యారు. ఆమె పేరు రజని.

వరంగల్‌ జిల్లాలో ఓ నిరుపేద వ్యవసాయకూలీల కుటుంబంలో రజని పుట్టింది. తల్లిదండ్రులు కూలిపనిచేస్తూ కూడా కుమార్తెను వారిశక్తికి మించి చదివించారు. ఆమె కూడా కష్టపడి చదువుకుంది. 2013లోనే ఎమ్మెస్సీ ఫస్ట్‌ క్లాస్‌లో ఉత్తీర్ణురాలయింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో పీహెచ్‌డీకి అర్హత కూడా సాధించింది. అదే సమయంలో మరో విద్యావంతునితో ఆమెకు తల్లిదండ్రులు వివాహం చేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన భర్తతో కలసి రజని హైదరాబాద్‌కు చేరుకున్నారు. వారి సంసారం కొంతకాలం సాఫీగానే సాగింది. ఇద్దరు పిల్లలు కలిగారు. కుటుంబాన్ని చూసుకుంటూనే పోటీ పరీక్షలు రాస్తూ, ఉద్యోగ ప్రయత్నాలలో ఉంది రజని.

సరిగ్గా ఇదే సమయంలో విధి వక్రించింది. సజావుగా నడుస్తున్న వారి కుటుంబంలో కష్టాలు మొదలయ్యాయి. నిండా 30 ఏళ్ళుకూడా లేని రజని భర్తకు గుండె జబ్బు బయటపడిరది. ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించారు. ఏకంగా మూడుసార్లు స్టంట్‌ వేయవలసి వచ్చింది. దీంతో ఆయన ఉపాధికి దూరమయ్యాడు. కుటుంబం గడవడమే కష్టమయింది. కుటుంబ భారం ఇక రజనిపై పడిరది. ఉన్నత చదువులు చదివిన రజని కుటుంబ పోషణకోసం సంతలో కూరగాయల వ్యాపారం చేసింది. అదీ కలసి రాకపోవడంతో జిహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు పద్ధతిలో పారిశుధ్య కార్మికురాలిగా చేరి, 10 వేల రూపాయల వేతనంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది..

రజని దీనగాధ ఒక వార్తాపత్రికలో ప్రచురితం అయింది. ఈ వార్తను చూసి పలువురు ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయం రాష్ట్ర మంత్రి కె.టి.రామారావు దృష్టికి రావడంతో ఆయన రజనిని పిలిపించి మాట్లాడి ఆమె సమస్యలను తెలుసుకున్నారు. రజని విద్యార్హతలకు తగినట్టుగా ఉద్యోగం కల్పించవలసిందిగా అధికారులను ఆయన ఆదేశించడంతో జిహెచ్‌ఎంసీలో ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ ఎంటమాలజిస్ట్‌గా నియమిస్తూ కమీషనర్‌ లోకేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ విషయాన్ని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. మంత్రి కెటిఆర్‌ ఆ ట్విట్‌ను కోట్‌ చేస్తూ,’’ విరామంలేకుండా గడుపుతున్న నాకు ఇదొక ఉత్తమమైన సందర్భం. మీరు పోషించబోయే కొత్త పాత్రకు ఇవే నా శుభాకాంక్షలు’’ అని ట్వీట్‌ చేశారు. కెటిఆర్‌ను కలసి తన దీనగాథను వివరించిన సందర్భంగా రజని భావోద్వేగానికి లోనై కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు. ‘నా అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తే చాలనుకుంటున్నా. జీవితంలో చీకటి మాత్రమే శాశ్వతం కాదని, వెలుగువస్తుందని ఎదురుచూస్తున్నా’’. అంటూ రజని అన్నమాటలకు స్పందించిన ప్రభుత్వం ఆమెకు తగిన ఉద్యోగావకాశం కల్పించింది. ఇప్పుడు రజని ఆనందానికి అవధులు లేవు. మంత్రి కెటిఆర్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌లకు రజని కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే చొరవతీసుకొని స్పందించిన మంత్రి కె.టి.ఆర్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు.