మహిళా జర్నలిస్టులకు పురస్కారాలు

తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా ముందంజలో
ఉందని, ప్రధానంగా మహిళా, శిశు సంక్షేమంలో అగ్రస్థానంలో కొనసాగుతోందని రాష్ట్ర మున్సిపల్‌, ఐ.టి. శాఖా మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక పురస్కారాలను కే.టీ.రామారావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీ రాథోడ్‌లు అందచేశారు. వివిధ పత్రికా, ప్రసార మాధ్యమాల్లో పనిచేస్తున్న దాదాపు 80 మందికి పైగా మహిళా జర్నలిస్టులకు బంజారాహిల్స్‌లోని తాజ్‌ కృష్ణ హోటల్‌ లో ప్రత్యేక పురస్కారాలు అందచేశారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్‌ అర్వింద్‌ కుమార్‌ హాజరయ్యారు.

ఈ సందర్బంగా మంత్రి కే.టీ.రామారావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డ ఈ ఎనిమిదేళ్లలో మహిళాభ్యుదయం, శిశు సంక్షేమ రంగంలో గణనీయమైన ఫలితాలు వచ్చాయని అన్నారు. ముఖ్యంగా శిశు మరణాలు, నియో నాటల్‌ మరణాలు, మెటర్నల్‌ మరణాలు గణనీయంగా తగ్గాయని, దీనికి నిదర్శనం రాష్ట్ర ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యతేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే ఈ విజయాలకు సాక్ష్యమని తెలియచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రికలైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలతో రాష్ట్రం లో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గాయని మంత్రి గుర్తుచేశారు. ఇప్పటివరకు 10 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందచేశామని, కేసీఆర్‌ కిట్‌, ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాలతో రాష్ట్రంలో ఆసుపత్రులలో ప్రసవాలసంఖ్య పెరిగిందని అన్నారు. ఒక్క, సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే నెలకు 300 లకు పైగా డెలివరీలు జరుగుతున్నాయని ఉదహరించారు. దీనితో, గతంలో మాదిరిగా, సీజేరియన్‌ ఆపరేషన్లు జరగడంలేదని, రాష్ట్రంలో 17 లక్షల మంది గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మి కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహారాన్ని అందచేశామని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 300 అమ్మఒడి వాహనాలను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.

పాశ్చాత్య దేశాలతో పోల్చితే మన దేశంలోని మహిళలు బహుముఖ విధులను నిర్వహిస్తారని, ముఖ్యంగా మీడియా రంగంలోని మహిళలు మరింత కఠినతరమైన విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతీ ఒక్క రంగంలోని వారు తమసేవలకు గుర్తింపు కోరుకుంటారని, ఈ క్రమంలోనే వీరి సేవలకు గుర్తింపుగా మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి చిరు సత్కారం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలతో అభివృద్ధి, సంక్షేమ రంగంలో వచ్చిన మార్పులను ప్రజలను చైతన్యం చేసే విధంగా వార్తా కథనాలను రాయాలని కేటీఆర్‌ కోరారు. రాష్ట్రంలో 18000 పోలీసు ఉద్యోగాల నియామకం జరిగితే దానిలో 30 శాతం మంది మహిళలే ఉన్నారని, విద్యుత్‌ శాఖలో 9644 ఉద్యోగ నియామకాలు జరిగితే దీనిలోనూ 50 శాతం మహిళలే ఉన్నారని వెల్లడిరచారు. కేవలం మగవాళ్ళు మాత్రమే చేస్తారనే పేరున్న లైన్‌మెన్‌
ఉద్యోగాలలోనూ 217 మంది మహిళలను నియమించామని, ఇలాంటి వాటిపై విజయ గాథలు ప్రత్యేక కథనాలు రాసి మహిళలకు స్ఫూర్తి నింపాలని జర్నలిస్టులకు సూచించారు.

ఈ సందర్బంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తర్వాత మహిళాభ్యుదయాన్ని చూడాలని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల మహిళల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సందర్బంగా అవి స్వీకరించే అమ్మాయిల కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రావడం చూస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీ రాథోడ్‌ మాట్లాడుతూ, రాష్ట్ర బడ్జెట్‌లో మహిళా శిశు సంక్షేమానికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేయడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞత లు తెలిపారు. రాష్ట్రంలో షీ- టీమ్‌లు ప్రవేశపెట్టిన తర్వాత మహిళలు తమ ఉద్యోగ విధులనుండి అర్ధ రాత్రిళ్ళలో నైనా క్షేమంగా ఇంటికి చేరుకుంటామని ధైర్యం ఏర్పడిరదని గుర్తు చేశారు.

ఆంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొట్ట మొదటి సారిగా రాష్ట్రం లోని ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, ఫ్రీలాన్సర్‌ రంగాల్లోని మహిళా జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళా జర్నలిస్టులు హాజరయ్యారు.