మహిళల ఆరోగ్య రక్షణకు రుతు ప్రేమ
By: యం.పండరి నాథ్
నియోజకవర్గమే తన కుటుంబంగా భావించి తన కుటుంబం ఆరోగ్య వంతంగా ఉండాలన్న లక్ష్యంతో సిద్ధిపేటలో మహిళా ఆరోగ్య సంరక్షణ కోసం ‘రుతు ప్రేమ’ పేరిట నూతన కార్యక్రమానికి మైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్ రావు శ్రీకారం చుట్టారు. ర్యాష్ ఫ్రీ, క్యాష్ ఫ్రీ, ఫీల్ ఫ్రీ నినాదంతో మహిళలకు, బాలికలకు రుతుస్రావ శానిటరీ కప్స్, బట్ట డైపర్లు, ప్యాడ్లు ఉచితంగా పంపిణీ చేశారు.

అలా మొదలైంది..!
తడి, పొడి చెత్తలను విడిగా సేకరించి.. వ్యర్థాల నిర్వహణలో సిద్ధిపేట మున్సిపాలిటీ శభాష్ అనిపించుకున్నది. ఈ క్రమంలో తడి, పొడిచెత్త కాకుండా మూడో రకం హానికర చెత్త సవాల్ గా మారింది. ముఖ్యంగా శానిటరీ ప్యాడ్లు, పిల్లల డైపర్లను ఏం చేయాలన్న దానికి సరైన పరిష్కారం దొరకలేదు. ఇవి భూమిలో కలసి పోవాలంటే వందలాది ఏళ్ల సమయం పడుతుంది. కాల్చడం వల్ల హానికర వాయువులు విడుదల అవుతాయని భావించిన మంత్రి హరీశ్ రావు, బెంగళూరుకు చెందిన పర్యావరణ వేత్త డాక్టర్. శాంతి నేతృత్వంలోని బృందం పునర్వినియోగానికి అనువుగా డైపర్లు, నాప్కిన్లు ఇందుకు సరైన పరిష్కారమనే నిర్ణయంతో రుతు ప్రేమకు శ్రీకారం చుట్టారు.

చాలా మంది గట్టిగా మాట్లాడటానికే సిగ్గుపడే విషయం పై బహిరంగ చర్చ పెట్టారు. సిద్ధిపేట మున్సిపాలిటీ ఐదవ వార్డులో పైలట్ ప్రాజెక్టు కింద ‘‘రుతు ప్రేమ’’ పేరిట నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన ఓ కంపనీ సామాజిక బాధ్యత కింద ముందుకొస్తే స్టోన్ సూప్ అనే స్వచ్ఛంద సంస్థ- సిద్ధిపేట మున్సిపాలిటీ సహకారంతో అమలుకు శ్రీకారం చుట్టారు. పది రోజులుగా వార్డులో సర్వే చేసి మహిళలకు అవగాహన కల్పించారు. ఆ తర్వాత వస్త్రంతో తయారు చేసిన ప్యాడ్లు, మెడికల్ గ్రేడ్ సిలికాన్ కాప్స్, శిశువులకు వస్త్రంతో తయారు చేసిన డైపర్లను పరిచయం చేశారు. రుతు ప్రేమ బృందం సిలికాన్ కప్పులను నాప్కిన్లు కొన్నట్లు మళ్లీ మళ్లీ కోనాల్సిన అవసరం లేదని, ఒక కప్పుని 8 నుంచి 10 ఏళ్ల వరకూ వాడొచ్చని, దీంతో ఖర్చు కూడా తగ్గుతుందని, యేడాదికి రూ.1200 ఆదా చేయుచ్చునని తెలిపారు. వీటిని అమర్చుకునే విధానంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆ వార్డులో 1900 మందికి పైగా మహిళలు, యువతులు, శిశువులకు వీటిని పంపిణీ చేశారు.
అంతటితో అయిపోలేదు. అంగన్ వాడీ టీచర్లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఈ విధానం అమలులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. అంటూ తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే మహిళా వైద్యుల సాయంతో సందేహాల నివృత్తి కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా మొత్తం విస్తరించేలా కావల్సిన చర్యలు చేపట్టారు. విపంచి కళా నిలయంలో 3 రోజుల పాటు జిల్లాలోని అన్నీ శాఖలకు చెందిన ఉద్యోగినిలకు రుతు ప్రేమ పై అవగాహన సదస్సులు నిర్వహించారు.
ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మహిళలు, బాలికలకు పీరియడ్స్ పై పలువురు పర్యావరణ ప్రేమికులు, పట్టణ ప్రముఖ వైద్యులు అవగాహన సదస్సులు చేపట్టింది. రసాయనిక శానిటరీ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు చెప్పుకొచ్చారు. సిలికాన్ శానిటరీ కప్స్, క్లాత్ ప్యాడ్లు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని వెల్లడిరచారు. శానిటరీ కప్స్ వాడటం వలన ఆరోగ్యంతో పాటు డబ్బు ఆదా చేయొచ్చునని తెలిపారు. మరో మార్పుకు తొలిమెట్టు మనమే కావాలని మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు. మహిళలకు సంబంధించి ఋతుస్రావం అంశం పై బహిరంగంగా చర్చించడం విజయానికి తొలిమెట్టుగా భావించాలని, పునర్వినియోగమయ్యే వస్త్ర ప్యాడ్లు, కప్స్, డైపర్లతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలోని తొలి ప్రక్రియగా సిద్ధిపేటలో మొదలైన రుతు ప్రేమ ఇక్కడితో ఆగొద్దని ఆశించారు.
రానున్న రోజుల్లో జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి దేశానికే ఆదర్శంగా నిలవాలని కోరారు. వైద్యులకు మహిళలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. చాలా మంది అమ్మాయిలు క్లిష్ట సమయాల్లో ఒత్తిడిని జయించే ధైర్యం లభించక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఆ హద్దులను చెరిపేసి ఆమెకు ఆరోగ్యం కల్పించే దిశగా సిద్ధిపేటలో అడుగులు పడటం సంతోషించదగిన విషయంగా.. దీనిపై వైద్యులు, జిల్లా ఉన్నతాధికారులు మహిళలందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని మంత్రి చెప్పారు. కర్ణాటకలో 24 శాతం, మహారాష్ట్రలో 28 శాతం సిజేరియన్లు ఉండగా, తెలంగాణలో ఎక్కువగా 62 శాతం సిజేరియన్లు జరగడం మంచిది కాదని, ముహూర్తాలు చూసుకుని కాన్పులు చేయించుకోవద్దని మంత్రి హితవు పలికారు.
మహిళాభ్యుదయానికి ప్రతీక

మహిళలు సహజంగా ఎదుర్కొంటున్న సమస్య పీరియాడ్స్. ఇదే ప్రధాన ఎజెండా అంశంగా సమావేశం జరగడం మహిళా అభ్యుదయానికి ప్రతీక ఈ వేదిక. ఒకప్పుడు ప్రతి ఇంట్లో పీరియాడ్స్ విషయం మూడవ కంటికి తెలియకుండా ఆడవాళ్ళు జాగ్రత్తలు పాటించేవాళ్లు. అలాంటిది ఇవాళ ఒక మార్పు కోసం సమావేశం జరగడం అభినందనీయం. మారుతున్న కాలానికి అనుగుణంగా రుతుస్రావ అలవాట్లు మార్చుకోవాలి. వందలాది మహిళలు కూర్చుని చర్చించడం గొప్ప విషయం. ప్లాస్టిక్ ప్యాడ్ల స్థానంలో క్లాత్ ప్యాడ్స్ వినియోగం ఆరోగ్యానికి మంచింది. మంచి మార్పునకు సిద్ధిపేట నాంది కావాలని నా ఆకాంక్ష.
– పోలీసు కమిషనర్ ఎన్ .శ్వేత
ఓ చైతన్య ప్రక్రియ

రుతు ప్రేమ కార్యక్రమం ఓ చైతన్య ప్రక్రియ. ప్రతి ముగ్గురు మరో ముగ్గురికి దీనిపై అవగాహన కల్పించాలి. ప్రస్తుత సమయంలో చిన్న పిల్లలకు రుతుస్రావం వస్తున్నదని వారిని చైతన్యం చేయాలి. మహిళ జీవితంలో పీరియాడ్స్ అనేది సహజమైన ప్రక్రియ. ఆందోళన చెందోద్దు. క్లాత్ ప్యాడ్ల వినియోగం పై అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తాం. ప్రతి రోజూ అందుబాటులో ఉంటాం.
– వైద్యులు గాయత్రి, రమాదేవి
ఒక్కొక్కరూ.. ఐదుగురిని మార్చాలి.!

పునర్వినియోగ నాప్కిన్లు వాడిన తర్వాత మహిళల అనుభవాలు సేకరించాం. అంతకంటే ముందు నెలసరి అంటే గోప్యంగా ఉండాల్సిన విషయం కాదని చైతన్యం తెచ్చాం. అవసరమైన వాళ్ళకు డాక్టర్ల సాయంతో వైద్య సలహాలు ఇప్పించాం. ఈ క్రమంలో చైతన్యమైన ఒక్కో మహిళ మరో ఐదుగురిని మార్చాలన్నదే మా సంకల్పం. మహిళా ప్రజాప్రతినిధులు ఈ మార్గంలో నడుస్తూ.. తోటి మహిళల్లో చైతన్యం తేవడం సంతోషంగా ఉన్నది. ఇంత విడమరిచి చెప్పడంతో ఇప్పుడిప్పుడే మహిళలు నాప్కిన్స్ వాడకం తగ్గిస్తున్నారు. వాడిన ప్రతీవారు కంఫర్ట్ గురించే ఫీడ్ బ్యాక్ చెప్తున్నారు. ఇప్పటి వరకు రోజుకు వెయ్యి మంది చొప్పున్న మొదటి ఐదవ వార్డు పైలట్ ప్రాజెక్టులో 2 వేలు, విపంచిలో జరిపిన మూడు రోజుల సెషన్స్ లో 3 వేల మందికి, మొత్తం 5 వేల మందికి రుతుప్రేమ కప్పులను ఉచితంగా అందించాం.
– పర్యావరణ ప్రేమికురాలు డాక్టర్ శాంతి