భక్త జన జాతర మేడారం అనుబంధ జాతరలు

medaramఅతి పురాతనమైన ఆదివాసీల పోరాటాలు భూమి కోసం, భుక్తి కోసం, జీవనం కోసం జరిగాయి. సుమారు 800 సంవత్సరాలకు పూర్వం కాకతీయుల పాలనలో, కీకారణ్యంలో ఆదివాసి బిడ్డలు పరాధీనత నుంచి స్వేచ్ఛాయుతమైన స్వయం పాలన కోసం ఉద్యమించారు. ఆదిమ కోయజాతి వీర వనితలు సమ్మక్క సారలమ్మలు కాకతీయుల సైన్యంతో పోరాడి త్యాగాలు చేసి గిరిజన జాతిలో చెరగని ముద్ర వేశారు. ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ బిడ్డలు స్వరాష్ట్ర సాధనకై ఉద్యమించారు. ఆంధ్రవలస పాలకుల నుంచి ‘తెలంగాణ’ను విముక్తి చేసుకుని ప్రత్యేక రాష్ట్రాన్ని ఆవిర్భవింప చేసుకోవడం స్ఫూర్తి ప్రధాయకం.

మహత్తర చారిత్రక నేపథ్యం కలిగిన మేడారం సమ్మక్క సారలమ్మలు మనపురా ఆత్మలు. చరిత్రలో సామాన్య జనం కోసం పోరాడి దేవతలైన మహిమాన్వితులు మరెక్కడా కనిపించరు. ప్రకృతిలో ఇలాంటి వనదేవతల ఆరాధన మరే ప్రాంతంలో ఉండదు. విగ్రహాలు లేని వీరవనితలు వీరు. కేవలం చిహ్నాల రూపంలో వెదురు వనాల్లో నుంచి గద్దె నెక్కే ఇద్దరు దేవతా మూర్తులు సమ్మక్క సారలక్కలు వీరత్వానికి, దైవత్వానికి ప్రతీకలై, మొక్కులు తీర్చుకునేందుకు ఆదివాసీ గిరిజనులు భక్తితో ప్రణమిల్లడం మరుపురాని మధురానుభూతి.

మేడారం అతి చిన్న గిరిజన కుగ్రామం. వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలంలోని అరణ్య ప్రాంతంలో ఊరట్టం గ్రామ పంచాయితీలో ఉంది. మేడారం గ్రామంలోనే ప్రతీ రెండేళ్ళకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. అందుకే ‘మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర’ గా ప్రసిద్ధి పొందింది. జాతరను గిరిజనులు నిర్వహించడం వలన గిరిజన జాతరగా పిలుస్తున్నారు. ప్రధానంగా కోయ గిరిజనులకు చెందినప్పటికీ అసంఖ్యాక ప్రజలు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఛత్తీస్‌ఘడ్‌, ఒరిస్సా, మధ్య ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. జాతర జరిగినన్ని రోజులు ప్రతి చెట్టు గుట్టా ఉసిళ్ల పుట్టలా జనం తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. అతిపెద్ద గిరిజన జాతరగా పేర్కొనే ఈ జాతర ‘స్టేట్‌ ఫెస్టివల్‌’ గానే గుర్తించబడ్డది. కాని భారతదేశంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ జాతరను నేషనల్‌ ఫెస్టివల్‌ గా గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

సమ్మక్క జాతరలో ప్రధానంగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు గోవిందరాజులకు పూజలు, మొక్కుబడులు ఇవ్వడం ఆనవాయితీ. మేడారం జాతర జరిగినపుడే అనేక ప్రాంతాల్లో సమ్మక్క జాతరలు జరుగుతాయి. కరీంనగర్‌,ఆదిలాబాద్‌ లాంటి పొరుగు జిల్లాలలోకూడా ఈ జాతరలు జరగడం విశేషం. కర్నెపల్లిలో, భూపతిపురం తదితర చోట్ల సారలమ్మ జాతరలు జరుగుతాయి. సమ్మక్క జాతర ముగిసిన వారం రోజులకు బయ్యక్కపేటలో సమ్మక్క జాతర జరుగుతుంది.అదేవిధంగా మూడు రోజుల తరువాత పునుగొండ్లలో పగిడిద్దరాజు జాతర జరుగుతుంది.సమ్మక్కతో బంధుత్వం ఉన్నటువంటి ముసలయ్య, గుంజేడు ముసలమ్మ, కాసాల నాయుడు, సూరు గొండయ్య, లక్ష్మీదేవర, వేల్పులమ్మ, నాగులమ్మ, గోవిందరాజులకు కూడా ప్రత్యేకంగా జాతరలు జరుగడం విశేషం.ఇలాంటి జాతరులు జన బాహుల్యంలోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉంది.

పగిడిద్దరాజు జాతర :

సమ్మక్క జాతర ముగిసిన మూడవ రోజున పెనక వంశానికి చెందిన వడ్డెలు పునుగొండ్ల గ్రామంలో పగిడిద్దరాజు జాతర జరుపుతారు. సమ్మక్క జాతర నుండి గిరిజనులు నేరుగా పగిడిద్దరాజు జాతరకు వెళతారు.పగిడిద్ద రాజు సమ్మక్క భర్త. ఇతనిది నాలుగవగొట్టు సనపగాని ఋషి గోత్రం. సముద్రుడు శశి మందాకినిలకు సూర్యుని వరంచేత పగిడిద్దరాజు జన్మిస్తారు. ఇతడు చాలా అందగాడు.చాలా శాంతస్వభావం కలవాడు.నాగులమ్మ, సమ్మక్కలు పోట్లాడినప్పుడు ఇతని కుడి కన్నుకు సమ్మక్క కంకణం తగిలి గాయమై కన్ను లొట్టపడింది.కాకతీయులు, చాళుక్యులు పొలవాస రాజ్యంమీద దండెత్తినప్పుడు ఈడెరాజు అనే బాలుడు తన రాజైన గుండరాజును శిక్షిస్తుండగా పారిపోయినట్లు చరిత్రకారుల అభిప్రాయం. ఈడెరాజు పేరులోని అక్షరాలు విడదీసినప్పుడు పగ ఈడె రాజు అని పేరు వస్తుంది.’పగ’ అంటే శత్రుత్వం అని, ‘ఈడె’ అనగా పోలవాసి యుద్ధంలో తన ప్రభువును పట్టించుకోకుండా పారిపోయిన బాలుడని అంటారు.నాలుగు అక్షరాల్లో ఈ అనే అక్షరాన్ని తొలగిస్తే పగిడి అనగా బంగారం అని అర్థాలు ఏర్పడతాయి. కోయ రాజులు లింగాయుత శైవులుగా మారడానికి పూర్వం జైనమతాన్ని అనుసరించేవారు. జైన గురువుల విగ్రహాల వెనుక పాము పడిగె ఉంటుంది. పగిడిద్దెరాజు జాతరలో సమ్మక్క గద్దె పక్కన ఉన్న నెమలినార వృక్షంపై ఉంటాడని విశ్వాసం. ఒకరోజు సమ్మక్క జాతరకు ఎంతో మంది ప్రజలు వచ్చి పోతున్నప్పుడు పగిడిద్దరాజు భార్యతో ఎందుకు ఇంతమంది జనం, ఇంత పెద్ద జాతర అవసరమా అన్నప్పుడు నీవు నన్ను చూసి ఓర్వలేకున్నావు. గుడ్డోడివైపో అని శపించేసరికి పగిడిద్దరాజు పాముగా మారి చెట్టు కిందకు చేరినాడని కథనం ప్రచారంలో ఉంది.

ముసలయ్య జాతర :

వరంగల్‌ జిల్లాలోని లక్నవరం సరస్సు గుట్టల్లోని ఒక సొరంగంలో నాగలి కర్రు ఆకారంలో ముసలయ్య ఉంటాడు. మేడారం జాతర ముగిసిన తరువాత వచ్చే మార్చి నెలలో ముసలయ్య జాతర జరుగుతుంది.ముసలయ్య కాకతీయులతో జరిగిన యుద్ధంలో పాల్గొని, యుద్ధం ముగిసిన తరువాత రాయినిగూడెంలో కరువు, అతిసార వచ్చి ప్రజలు చనిపోతుండంగా ముసలయ్య తవిటవారింట్లో బాలుడిగా జన్మించాడు. ఇతని రాకతో ఆ ప్రాంతంలో పంటలు సమృద్దిగా పండాయని భక్తుల విశ్వాసం. లక్నవరం గుట్టల్లో ఉన్న ముసలయ్యను జాతర సందర్భంలో రక్తపు పానుపుతో కొలుస్తారు. దేవుని రాయిని తెచ్చి రాత్రంతా నృత్యాలు చేస్తూ జోగు అడుగుతారు. అనంతరం దేవునికి బలి ఇస్తారు. రాత్రంతా మెలుకువగా ఉండి తెల్లవారి జంతు బలులు ఇచ్చి, దేవున్ని గ్రామ సమీపంలోని తునికి చెట్టు కింద నిర్మించిన పూరి పాకలో పెట్టి కొలుస్తారు.

గుంజేడు ముసలమ్మ :

వరంగల్లు జిల్లాలోని కొత్తగూడా ఏజెన్సీ పరిధిలో గుంజేడు శివారులో ముసలమ్మ జాతర ప్రతీ రెండు సంవత్సరాలకొకసారి సమ్మక్క జాతర జరిగిన సమయంలోనే రెండు రోజుల పాటు జరుగుతుంది.1995 నుండి జాతర దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. రెండు సంవత్సరాలకు ఒకసారి కాకుండా ప్రతీ శుక్రవారం ఇక్కడకు భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటుండంతో చిన్న జాతరను తలపింప చేస్తుది. జిల్లానుంచే కాకుండా పొరుగు జిల్లాలైన ఖమ్మం, కరీంనగర్‌, నల్గొండ, ఉభయ గోదావరి జిల్లాలు, మెదక్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల నుండి భక్తులు వస్తుంటారు. ఇలా వచ్చినవారు వారం రోజుల పాటు ఇక్కడే ప్రశాంతంగా ఉంటారు. గిరిజనులే కాకుండా గిరిజనేతరులు కూడా పెద్దసంఖ్యలో ఈ జాతరకు వస్తుంటారు. సంతానంకోసం వచ్చేవారు ఇక్కడ నిద్ర చేయడంవల్ల సంతానం కలుగుతుందని భావిస్తారు.

గుంజేడు ముసలమ్మ మేడారం సమ్మక్క అక్కాచెల్లెల్లని గిరిజనులు భావిస్తారు. గుంజేడు ముసలమ్మ సుల్తానులకు కప్పం కట్టడం కోసం ఎడ్ల బండ్లపై నగలు, దేవతా గంటలు వేసుకొని దట్టమైన అరణ్యంగా ఉన్న ఈ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు మద్యలో బండి ఆగిపోయింది. ముసలమ్మ తోలెం వంశీయుల కలలో కనిపించి నేను ఈ గుట్టపైన ఉన్నాను. నాకు జాతర జరిపితే మీకు కావలసిన వరాలు ఇచ్చి కాపాడతానని చెప్తుంది.అందుకే జాతర సమయంలో తోలెం వంశీయులు గిరిజన సాంప్రదాయ రీతిలో ముసలమ్మను గద్దెకు తీసుకవస్తారు.ముసలమ్మ దయ వల్ల సంతానం కలిగిన వారు ఉయ్యాల కట్టి మొక్కు చెల్లించడం ఆనవాయితీ.

సూరుగొండయ్య జాతర :

తాడ్వాయి గ్రామం నుండి 20 కి.మీ.దూరంలో రంగాపురం గ్రామం ఉంది.ఏప్రిల్‌, మే నెలలో చైత్ర పౌర్ణమి రోజైన ఈ వేల్పుకు పూజలు నిర్వహిస్తారు. కోయ గిరిజనుల్లో భరద్వాజ ఋషి గోత్రానికి చెందిన మూడవగట్టు వేల్పులలో పెద్ద సూరుగొండయ్య, చిన్న సూరుగొండయ్య అనే వారున్నారు. పెదసూరుగొండయ్యను పోలితగలని వడ్డె బోయడు, చిన్న సూరుగొండయ్యకు బోయనికి వడ్డ్డె పూజా కార్యక్రమం నిర్వహిస్తాడు. నేతగానివారు ముత్యాలమ్మను పూజించిన పద్ధతిలోనే సూరుగోండయ్యను కూడా ఒక రాయిని అమర్చి పసుపుకుంకుమలతో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. పూజలు జరిపే వడ్డే మూడు రోజులుగా ఉపవాసం ఉంటాడు. పెద్ద ఎత్తున కోళ్లను బలి ఇస్తారు. బెల్లాన్ని ప్రసాదంగా పంచుతారు. .

బాలకుమార స్వామి జాతర :

బాలకుమారస్వామి తాడ్వాయి మండలంలోని గట్టుపై గండ్ర గొడ్డలి రూపంలో ఉంటాడు. ఇతడిని సమ్మక్కకు సోదరుడని, పినతండ్రి కుమారుడని, కోటెం వంశస్థుడని, సిద్దబోయిన, పెడకంట్ల ఇంటి పేర్లు గల వడ్డెలు ఇతనికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతీ రెండు సంవత్సరాలకొకసారి మేడారం జాతర ముగిసిన తరువాత మంగళవారం ఈ జాతర జరుగుతుంది. జాతర జరగడానికి ముందు రోజు దేవతను గ్రామంలో ఊరేగించి,ి ఏడు బిందెలతో జలాభిషేకం చేస్తారు. డోలీల చప్పుళ్లు, గంటల శబ్దాలతో పడగలు ధరించిన బాలకుమారుడు గుడికి చేరుకుంటాడు. సంతానం కలిగించే దేవుడిగా ప్రసిద్ధి. ఇతనికి వరం పడితే తప్పకుండా సంతానం కలుగుతుందని విశ్వాసం. కాకతీయులకు సమ్మక్క సైన్యాలతో జరిగిన యుద్ధంలో ఇతడు కూడా పాల్గొన్నాడని చెపుతారు.కాని యుద్ధంలో మరణించిందీ లేనిదీ తెలియదని అంటారు. కోయ గిరిజనులు బాలకుమారుని జాతరను చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు.

నాగులమ్మ జాతర :

కొండాయి గ్రామంలో గోవిందరాజులు గుడికి సమీపంలో చిన్న గుడిసెలో నాగులమ్మ దేవతను నిలిపి పూజిస్తున్నారు. మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో పాల్గునశుద్ధ పౌర్ణమి రోజున గోవిందరాజుల జాతర జరిగే సమయంలోనే నాగులమ్మ జాతర నిర్వహిస్తారు. కోయ తెగకు చెందిన మూడవగట్టు గోత్రం ఇంటికి చెందిన అందె ఇంటిపేరు గలవారు వంశపారంపర్యంగా పూజారిగా ఇక్కడి ఆచార సాంప్రదాయాలను నిర్వహిస్తారు.

వేల్పులమ్మ జాతర :

వరంగల్‌ జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రానికి 16కి||మీ ల దూరంలో ఉన్న వేల్పులమ్మను దేవతగా కొలుస్తున్నారు. ప్రతి మూడేళ్లకొకసారి ఈ జాతర జరుగుతుంది.ఇక్కడ కోయలు ప్రధాన పూజారులు. జాతరలో భక్తులు జాగరణ చేయడం, ఉపవాస దీక్షలు, గంటలు సమర్పించుకోవడం జరుగుతుంది. ఈమెను కొందరు కోయ గిరిజనుల ఇంటి దేవతగా కూడా కొలుస్తారు. ఒకటిన్నర ఇంచుల బంగారు, వెండి కడ్డీలు దేవతకు గుర్తుగా ఒక వెదురుబొంగులో పెట్టి, వెదురు బొంగును కుండలో పెడతారు. జాతర జరిగినప్పుడు ఈ వెదురు బొంగును పూజలో ఉపయోగిస్తారు.

కాసాల నాయుడు :

ప్రతీ మేడు పాల్గుణ బహుళ విదియ మరియు తదియ మార్చి లేదా ఏప్రిల్‌ నెలల్లో కాసాల నాయుడు జాతర జరుగుతుంది.కాసాల నాయుడు బంగారు కడ్డీ రూపంలో ఉంటాడు. జానెడు పొడవుతో రెండు అంగుళాల వ్యాసంతో ఉంటుంది. హోళీ పండుగ సందర్భంగా ఇక్కడ జంతుబలి,ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ జాతరను అరవై సంవత్సరాలుగా జరుపుతున్నారు.

కార్నేపల్లి జాతర :

ములుగు నుండి 20 కి.మీ.దూరంలో ఉన్న కార్నేపల్లి గ్రామ పంచాయితీలోని సండ్రగూడెంలో కార్నేపల్లి జాతర జరుగుతుంది.కోయ గిరిజనులే ఎక్కువగా పాల్గొనే ఈ జాతరలో గిరిజనేతరులు కూడా పాల్గొంటారు. ఇక్కడ సారలమ్మను పులి రూపంలో భక్తులచే పూజలందుకోవడం విశేషం.

భూపతిపురం జాతర:

భూపతిపురంలో మాఘశుద్ధ పౌర్ణమి నుండి పదకొండు రోజల పాటు పెద్ద యెత్తున జాతర జరుగుతుంది. ఇక్కడ కోయలు కొండ సారలమ్మ పేరుతో సారలమ్మను పూజించినా,గ్రామం పేరుమీదనే ఈ జాతర జరుగుతుంది. జాతర సందర్భంలో బెల్లం, పసుపు, కుంకుమలు దేవతకు సమర్పిస్తారు. వంద సంవత్సరాలకు పైగా ఇక్కడ జాతర జరుగుతున్నదని చెపుతారు. కోయ గిరిజనులతో పాటు ఇతరులు కూడా ఈ జాతరలో పాల్గొంటారు.

సమ్మక్క అనుబంధ జాతరలు :

ప్రధానంగా వరంగల్‌ జిల్లాలోని అటవీ ప్రాంతమైన మేడారంలో సమ్మక్క జాతర జరిగినప్పటికీ,పొరుగు జిల్లాలైన కరీంనగర్‌,ఖమ్మం,ఆదిలాబాద్‌,తూర్పుగోదావరి,పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈ జాతరలు జరగడం విశేషం.సమ్మక్క జాతర జరగిన సమయంలోనే ఈ అనుబంం జాతరలు కూడా జరుగుతాయి.వరంగల్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న భూపతి పేట, అన్నారం గ్రామాల్లోను, మైదాన ప్రాంతాలైన అగ్రంపాడ్‌, గుర్రంపేట, నాగరాజుపల్లి, లింగంపల్లి, అమ్మవారిపేట,మద్దిమేడారం,అమ్మవారిపేట, ముల్కలపల్లి గ్రామల్లో ఇప్పటికీ సమ్మక్క జాతరను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతర నుండే సమ్మక్క గంటలను, కోయగిరిజనులు తీసుకెళ్లి మేడారం జాతర ప్రారంభించారని అంటున్నారు. కరీంనగర్‌ జిల్లా లో శంకరపట్నం, గోదావరిఖని, గుమ్లాపుర్‌, రాగంపేట, గోలీవాడ, హుజురాబాద్‌లోని రంగనాయకుల గుట్టవద్ద ఈ జాతరను నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో కాలువ వడ్డున పెద్ద ఎత్తున జాతర జరుగుతున్నది. ఇంతటి మహిమాన్వితమైన మేడారం జాతర గురించి కేవలం సాహిత్యాంశాలపైన మాత్రమే పరిశోధనలు జరిగాయి,మేడారం అనుబంధ జాతరలు,సంబంధిత జాతరలతో పాటుగా,గిరిజన పూజారుల జీవిత చరిత్రలను,ఆర్ధిక,సామాజిక స్థితి గతులను వివిధ కోణాల్లో అధ్యయనం చేయాల్సిన అవసరం భావి పరిశోధకులపై ఎంతైనా ఉంది.ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతున్నా కొద్ది,అదే రీతిలో సౌకర్యాలు కల్పించి నేషనల్‌ ఫెస్టివల్‌ గా గుర్తింపు వచ్చేలా చర్యలు చేపడతారని కోరుకుందాం.