చిన్నారుల రక్షణ కోసం బాలరక్షక్‌ వాహనాలు 

కార్పొరేట్‌ సోషల్‌ రెస్సాన్స్‌బులిటీ (సీఎస్‌ఆర్‌) నిధులతో బాలరక్షక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గిరిజన, మహిళా, శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని  మహిళా, శిశుసంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా జండా ఊపి వాహనాలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ బాలరక్షక్‌ వాహనాలను ఆపదలో ఉన్న చిన్నారులను ఆదుకోవడానికి ఉపయోగిస్తామని తెలిపారు. 1098 ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేస్తే తక్షణమే స్పందించి వాహనాలు వస్తాయని మంత్రి తెలిపారు.

పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో జిల్లాకు ఒకటి చొప్పున 33 బాలరక్షక్‌ వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లు ఆమె తెలిపారు.  వీటితో పాటు మహిళ, శిశు సంక్షేమశాఖకు బస్సులను అందచేసిన స్వచ్ఛంద సంస్థలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ (బీపీసీఎల్‌) ఒక్కటే కోటి రూపాయలతో 15 వాహనాలు సమకూర్చినట్లు తెలిపారు.

కార్యక్రమంలో  శిశుసంక్షేమ శాఖ కమిషనర్‌, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజ్‌, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అముదాన్‌, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.