బందగి

bandagiవెలపాటి రామారెడ్డి
బందగి రక్తం చిందిన క్షేత్రం
బందూకులకు బెదరని క్షాత్రం!
స్వాభిమానం నిలబెట్టగ – వీ
రాభిమన్యుల కన్న ప్రదేశం!!

భారతదేశానికి స్వాతంత్య్రం రాకపూర్వం హైదరాబాద్‌ రాజ్యంలో, నల్లగొండ జిల్లాలోని జనగామ తాలూకాలో, విసునూరు దేశ్‌ముఖ్‌ అపర రావణాసురుడిగా పేరొందిన రాపాక వెంకటరామచంద్రారెడ్డి ఏలుబడిలో నున్న ఒక కుగ్రామం కామారెడ్డిగూడెం. అక్కడి ఒక పేద రైతు బందగి. ఐదుగురు అన్నదమ్లులో షేక్‌ బందగి రెండవవాడు. పెద్దవాడు అబ్బాస్‌ అలీ. అబ్బాస్‌ అలీ దేశ్‌ముఖ్‌కు నమ్మినబంటు. దేశ్‌ముఖ్‌ ఆజ్ఞలకు అబ్బాస్‌ అలీ చేతలకు అక్కడ అడ్డులేదు. వారు ఎంత అంటే అంత, ఏది అంటే అది.

బందగీ అన్నదమ్ముల ఆస్తి పంపకం జరిగింది. పెద్దవాడైన అబ్బాస్‌ అలీకి జ్యేష్ఠ భాగంతో కలిపి 8 ఎకరాలు రాగా, మిగతావారికి మిగతా భూమి వచ్చింది. తనకు వచ్చిన ఎనిమిది ఎకరాలు అబ్బాస్‌ అలీ అమ్ముకొన్నాడు. మిగిలిన ఆస్తిలో మళ్లీ తనకు వాటా కావాలన్నాడు. బందగీతోసహా మిగతా తమ్ముళ్లు ఇవ్వమన్నారు. ఇంతవరకు ఇచ్చిందే అమ్మి పాడు చేశావు. మళ్లీ, యిస్తే మళ్లీ పాడు చేస్తావు, మేం ఇవ్వమన్నారు. తగాదా దేశ్‌ముఖ్‌ దాకా వెళ్లింది. ఆయన, తనకు నమ్మినబంటు అబ్బాస్‌ అలీకి మళ్లీ వాటా ఇవ్వడమే న్యాయమన్నాడు. తమ్ముళ్లు ఇవ్వమన్నారు. ‘నాకు మీరు ఇవ్వడమేంటి? భూమి పట్టానాది’ అని అబ్బాస్‌ అలీ భూమిని దున్నుకోవడం ప్రారంభించాడు. తమ్ముళ్లు అడ్డంపోగా తగాదా తుదకు కోర్టుకెక్కింది. కార్వాయి నడిచి నడిచి తుదకు తమ్ముళ్లవైపే ఫైసలా అయింది. అన్నకు, అంతకు మించి అతనికి అండగా ఉన్న దేశ్‌ముఖ్‌కు, తలకొట్టేసినట్లయింది.

కోర్టు కేసులో బందగి గెలుస్తాడన్న సూచనలు వచ్చే సరికి, కేసును ఉపసంహరించుకోవాలని బందగికి బెదిరింపులు వచ్చినవి. అయినా బందగి లొంగలేదు సరిగదా, దేశ్‌ముఖ్‌తో ముఖాముఖిగా, ‘దొరా! నేను పేద పకీరు వాణ్ణి. నువ్వు (తెలంగాణలో ఎంత పెద్దవాణ్ణి అయినా ‘నువ్వు’ అనే సంబోధిస్తారు. పుస్తకాలలోగల ‘మీరు’ వగైరా గ్రాంధిక సంబోధనలు ఆనాటికి ప్రబలలేదు) అరవై గ్రామాలకు దొరవు. నువ్వు నీ పాటి దొరలను ఎదిరించాలి గానీ పూటకు గతిలేని పేదవాణ్ణైన నన్నా? నేను ఓడిపోతే చిప్ప పట్టుకొని బిచ్చమెత్తుకున్నా నాకు ‘నాదాన్‌’ కాదు. నేను గెలిస్తే మాత్రం నీకు అప్రతిష్ట’ అని ముఖంమీద అనేసినాడు.

కేసును తన పలుకుబడితో తలక్రిందులు చేయ ప్రయత్నించినాడు దేశ్‌ముఖ్‌. కానీ వీలుకాలేదు. తాను ఇంతకు పూర్వం తన మాట వినని ఒక చిన్న భూస్వామి-పడిశాల వెంకటరెడ్డిని హత్య చేయించడం, కష్టంగానైనా సరే ఆ హత్యానేరం నుండి తప్పించుకోవడం, జ్ఞాపకం వచ్చింది’. ఆ ప్రయత్నమే ఈసారీ చేయతలపెట్టాడు దేశ్‌ముఖ్‌. ఆయన ఆజ్ఞతో ఒకడు ఒకసారి బందగిని కత్తితో నరకడానికి వచ్చాడు. సమయస్ఫూర్తితో బందగి కత్తిని చేతితో పట్టుకోగా, వ్రేళ్ళు తెగినవి, ప్రాణం మాత్రం దక్కింది. ‘ఇంటి గుట్టు లంకకు చేటు’ అన్నట్టు, బందగిని పాలి వాళ్ళ ద్వారా లొంగదీయాలనుకొన్నాడు దేశ్‌ముఖ్‌.

బందగీ తండ్రి తోబుట్టువు కొడుకు పకీరు అహ్మద్‌. అతడు దేశ్‌ముఖ్‌ నౌకరు. అతనితో ఆస్తి తగాదా పెట్టించాడు. తన తండ్రి, బందగీ తండ్రి వేరుపడ్డ తరువాత, తన తండ్రియే ఆస్తినంతా సంపాదించాడని, కాబట్టి బందగీ సోదరులు అనుభవించే ఆస్తి అంతా తనదేనని, దానిపై బందగీ సోదరులకు ఎట్టి హక్కు లేదని, వారా భూమినుండి బే దఖల్‌ కావలసిందేనని ఫకీరు అహ్మద్‌ కొత్త తగాదా పెట్టినాడు. ఇది దేశ్‌ముఖ్‌ పన్నిన కుట్రయేనని ఊళ్లో వాళ్లందరికీ తెలుసు. అందువల్ల వారందరూ నైతికంగా బందగీవైపే నిలిచారు. అంతేకాదు, బందగీకి అన్నతో వచ్చిన తగాదాలో గూడా బందగీ వైపే న్యాయం ఉన్నదని సర్వజనాభిప్రాయం. అంతేకాదు, దేశ్‌ముఖ్‌ అబ్బాస్‌ అలీ ద్వారా సాగించే దౌష్ట్యాలను-(ఇండ్లను దోచుకోవడం, పేదవారి ఆస్తులను ఏదోవంకన స్వాధీనం చేసుకోవడం, ఏదో మిషమీద లంచాలు వసూలు చేయడం, వెట్టి చేయించుకోవడం, వంతుల వారీగా వ్యవసాయ పనులు చేయించుకోవడం ఇలాంటి అన్యాయాలను ఎదిరించే ధైర్యంలేక)-భరించలేక వారిపట్లగల ఏవగింపు బందగీపైగల సానుభూతిని ఎక్కువ చేసింది.

బందగీ సహజంగా అందరితో కలిసిపోయే మనస్తత్వం కలవాడు. ప్రతి ఉదయం ఎవరో ఒకరితో ఊరిలో జరిగే అన్యాయాల గురించి పనిలో పనిగా తనకు జరుగుతున్న అన్యాయం గురించి ముచ్చటిస్తుండేవాడు. మొత్తంమీద బందగి సర్వజన ప్రియుడైనాడు. దేశ్‌ముఖ్‌ అండతో ఎదుటిపక్షంవారు కామారెడ్డిగూడెం నుండి జనగామ వరకు రూపాయలు పోగుపోసి కేసు నడిపిస్తున్నారు. దోసిళ్ళకొద్ది పైసలు పైరవీకారులకు తినిపిస్తున్నారు. బందగికి ప్రజల ఆశీస్సులు, నైతికబలం బాగానే ఉన్నది. కానీ ఆర్థిక పుష్టియేది సుమారు 16 మైళ్ళ దూరానగల జనగామకు ఒంటరిగా-ఒక పూటకు సద్దికట్టుకొని కాలినడకన వచ్చిపోయేవాడు. న్యాయం తనవైపే ఉన్నదన్న దృఢ విశ్వాసంతో-విసుగు విరామంలేకుండా కేసులకై తిరిగినాడు. చివరకు న్యాయమే గెలిచింది. ఎదుటిపక్షానికి, ముఖ్యంగా ఎదురునదురు లేకుండా ఏకచ్ఛత్రాధిపత్యంగా పలుకుబడి సాగిస్తున్న దేశ్‌ముఖ్‌కు నిద్ర కరువైంది. ఆయన నైజాం రాజ్యంలో డిప్యూటీ కమాండర్‌. వీడు ఒక్క ఫకీర్‌ (కొడుకు)! వీణ్ణి ఖతం చేస్తేగాని మనసు కుదుటపడదు. ఆ ఊరికే చెందిన వడ్డ చంద్రమౌళి అనేవాడు తేనెపూసిన కత్తి. అతని యింటిలోనే బందగీ హత్యకు కుట్ర జరిగింది. తెల్లవారే సరికి ప్లాన్‌ సిద్ధమైంది.

ఉదయం 8 గంటలకు సూర్యాపేటనుండి జనగామకు వెళ్ళే బస్సు కామారెడ్డిగూడెం బస్‌స్టేషన్‌కు రానుంది. కోర్డు ఆర్డర్‌ తెచ్చుకోవడానికి బందగి బస్‌స్టేజీకి చేరడానికి 10 గజాల దూరంలో ఉన్నాడు. హఠాత్తుగా ఒకడు కొడవలితో అతని మెడను వంచాడు. రెండవవాడు గొడ్డలితో నరికాడు. తల మొండెం వేరైనవి. బస్సులోని ప్రయాణికులు, చుట్టుపట్టువారు చూస్తుండగానే వారి హాహాకారాల మధ్యనే-బందగీ ప్రాణం బొందినుండి వేరయింది.

ఏ ప్రజా సంఘాలు ఏర్పడకముందే, బందగి సాహసం దౌర్జన్యాలను ఎదిరించే బడుగు వర్గాలలో ధైర్యం నూరిపోసింది. రాబోయే తెలంగాణా సాయుధ పోరాటోదయానికి 1940 జూలై 27నాటి ఈ ఘటన వేగుచుక్క, ప్రప్రథమ రక్త ప్రేరణ.

బందగీ మృత దేహానికి గోరీ కట్టడనికి ఎవరైనా రాళ్ళను ఇస్తే సహించేది లేదనే బెదిరింపులు వచ్చినవి. అయినా ప్రజలు తెగించి, తమ బండ్లలో తామే రాళ్ళు సేకరించి తోలి పెట్టినారు, ఆ తెగింపే, తర్వాత వచ్చిన సాయుధ పోరాటంలో సర్వవ్యాప్తం అయింది.

కామారెడ్డిగూడెం స్టేజివద్దగల బందగి సమాధికి నివాళులర్పించే దృశ్యంతోనే సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావులు రచించిన ‘మా భూమి’ నాటకం ప్రారంభం అవుతుంది.

‘మాభూమి’ నాటకం విసునూరు ప్రాంత భూస్వాముల దోపిడీని ప్రదర్శన యోగ్యంగా-1947లో రచింపబడింది. దానిని హైదరాబాద్‌ ప్రభుత్వం నిషేధించింది. కానీ సర్కార్‌ జిల్లాల్లోనూ, బొంబాయి, పూనా, షోలాపూర్‌, మద్రాసు మొదలైన పెద్ద పెద్ద నగరాలలో ప్రదర్శింపబడింది. దానిని 128 దళాలు, 980 ప్రదర్శనలివ్వగా దాదాపు 18 లక్షలమంది తిలకించారు. తన ‘నర్తనశాల’కంటే ఎక్కువ ప్రాముఖ్యత దీనికెలా వచ్చిందా అని చూడడానికి కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ స్వయంగా వచ్చారు. ‘సమాధి’తో మొదలై ‘సమాధి’తో ముగియడం-శిల్పంలోని నేర్పుగా ఆయన ప్రశంసించారు. నాటి పరిస్థితులను ఇతివృత్తంగా చేసుకొని వ్రాయబడ్డ మొట్టమొదటి నాటకం ఇది.

బందగీని చంపించిన అబ్బాస్‌ అలీని అక్కడ గుమిగూడి ఉన్నవారు చితకబాది, అతడు చనిపోయాడని భావించి వెడలిపోయినారు. కానీ అతడు బతికి, చచ్చిపోయేవరకు విరిగిన బొక్కలతో-నరాల బలహీనతతో బాధపడీ పడి తనువు చాలించాడు. చిన్నవాని నెత్తి పెద్దవాడు కొడితే, పెద్దవానినెత్తి పెరమాండ్లు కొడుతాడుగా!

బందగీ మృత దేహానికి గోరీ కట్టడానికి ఎవరైనా రాళ్ళను ఇస్తే సహించేది లేదనే బెదిరింపులు వచ్చినవి. అయినా ప్రజలు తెగించి, తమ బండ్లలో తామే రాళ్ళు సేకరించి తోలి పెట్టినారు, ఆ తెగింపే, తర్వాత వచ్చిన సాయుధ పోరాటంలో సర్వవ్యాప్తం అయింది.

బందగీ హత్య కేసు 2 సంవత్సరాలు నడిచింది. దేశ్‌ముఖ్‌ భయంవల్ల సాక్ష్యంలేదు. హంతకులు విడుదలైనారు. అమరుడయ్యే నాటికి బందగి వయస్సు 30 సంవత్సరాలు. అంటే ‘త్రిదశుడు’ అన్నమాట. త్రిదశులు ఎప్పుడూ అమరులే. బందగి తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ అమరుడే