బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

bathukammaబతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనది. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రంలో ఈ పండుగను అధికారికంగా జరుపుకోవడం విశేషం.

రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ మహిళలు వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు, ఆడే ఆటలు విని, చూసి ఆనందించాల్సిందే. ఈ బతుకమ్మ పండుగ వెనుక చాలా కథలు ఉన్నాయి.

చెరువు జీవన సర్వస్వం అయినప్పుడు దానిని రక్షించిన వాళ్లు దేవుళ్లను మించిన దేవుళ్లవుతారు. వాళ్లే బతుకమ్మలు. పంట నీటికోసం ప్రాణత్యాగాలు చేసిన ఆడబిడ్డలు, చెరువు, పూలు ఈ మూడింటి కలయికే బతుకమ్మ పండుగ. నీళ్లు, చెరువు, వాటి రక్షణ, వాటిని కాపాడుకోవాల్సిన సామాజిక బాధ్యత, తద్వారా ఊరంతా సంతోషంగా కలిసి బతికే సందర్భమే బతుకమ్మ. మొత్తంగా చెరువు లేని ఊరు చెదిరిన గూడుతో సమానం. చెరువు ఉన్న ఊరు సకలం కలిగిన లోగిలి లాంటిది. అందుకే తెలంగాణలో జరిగే చాలా ఉత్సవాలకు, ఉన్నతులకు చెరువు ఒక వేదిక. ప్రతి ఏడాది తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే బతుకమ్మ పుట్టుక కూడా చెరువేనంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. బతుకమ్మ పండుగపై ఎన్నో కథలు, గాథలు ప్రచారంలో ఉన్నాయి. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత చెరువులతో ముడిపడి ఉన్న కథాగానమే నిజమైందనే నిర్ధారణకు రావాల్సి వస్తుంది.

బతుకమ్మ పండుగకు కారణంగా చెబుతున్న ధర్మాంగద రాజు కథ ఎక్కువగా ప్రచారంలో ఉన్నది. దక్షిణ భారతదేశంలో చోళ వంశపు రాజైన ధర్మాంగదునికి వందమంది కుమారులు పుట్టి చనిపోయారు. ఆయన, ఆయన భార్య సత్యవతి తమ కడుపులో లక్ష్మీదేవి పుట్టాలని చేసిన ప్రార్థనతో లక్ష్మీదేవి వాళ్లింటిలో జన్మించింది. ఆమె పుట్టిన వెంటనే చాలా మంది మునులు వచ్చి నువ్వు చిరకాలం బతుకమ్మ అని దీవించినట్టు కథ ప్రచారంలో ఉంది.

మరొక కథ, మహిషాసుర మర్దనం. మహిషాసురుడిని యుద్ధంలో హతమార్చి అలసిపోయిన గౌరిశక్తి అశ్వయుజ పాడ్యమి రోజున నిద్రలోకి జారుకుంటుంది. అయితే భక్తులు తొమ్మిది రోజులు ప్రార్ధనలు, పూజలు చేసిన అనంతరం దశమి రోజున నిద్రలేచినట్టు కథ సారాంశం. దక్షయజ్ఞంలో భస్మమైపోయిన పార్వతీదేవి పునరుజ్జీవం పొందినట్లు, ఆమెనే బతుకమ్మ అని కొలుస్తూ, పండుగ చేసుకున్నట్టు ఇంకొక కథ.

అయితే ఈ దేవతలు పూలను ఇష్టపడతారని, అందుకే పూలను గోపురం లాగా పేర్చి, చివరన పసుపుతో గౌరమ్మను చేసి పెడతారనే సంప్రదాయం వచ్చినట్టు రకరకాల అభిప్రాయాలు వాడుకలో ఉన్నాయి. కానీ పల్లె ప్రజలు తాము ఈ పండుగ చేసుకోవడానికి కారణమైన కథను గానం చేస్తూ, పండుగ జరుపుకుంటారు. ఈ కథాగానాన్ని, దాని సారాంశాన్ని పరిశీలిస్తే తెలంగాణలో బతుకమ్మ పుట్టడానికి చెరువే కారణమనే విషయం మనకు స్పష్టమవుతుంది.

అందులో కథానాయిక బతుకమ్మ చిన్నమ్మ. చిన్నమ్మ ఒక రాజు చిన్న కోడలు. ఆ రాజు ఉన్న ఊరికి ఒక చెరువు ఉంటుంది. అది ఎంతో విశాలమైనది. ఆ ఊరికి ఆధారం, జీవనాధారం అన్నీ ఆ చెరువే. అయితే బాగా వానలు పడి చెరువు నిండిపోతుంది. చెరువు కట్టకు గండిపడుతుంది. దానిని పూడ్చడానికి ఊరందరూ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆ కట్ట నిలబడాలంటే మైసమ్మ కోరిన కోర్కెను తీర్చాలని అందరూ భావిస్తారు. తెలంగాణలో గ్రామ దేవతలు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి రక్షణగా ఉంటారు. మైసమ్మ నిర్మాణాలన్నింటికీ రక్షణగా భావిస్తారు. అందువల్ల ఏ నిర్మాణాలు జరిగినా మైసమ్మకు మొక్కడం ఆనవాయితీ. అందుకే కోట దగ్గర కోట మైసమ్మ, గడీ దగ్గర గడీ మైసమ్మ, చెరువు దగ్గర కట్టమైసమ్మ గుడి, తెలంగాణలో తప్పనిసరిగా దర్శనమిస్తుంది. అందుకే కట్ట తెగిపోతే మైసమ్మకు మొక్కాలనేది. అప్పుడైతేనే చెరువు కట్ట నిబడుతుందని ప్రజల నమ్మకం. బలమైన విశ్వాసం. అయితే ఆ రోజుల్లో గ్రామ పెద్దలు, రాజు చెరువుకు అధిపతులుగా ఉండేవాళ్లు. ఆ రోజు మైసమ్మను శాంతింపజేయడానికి ప్రయత్నం మొదలు పెడతారు.

కట్టను నిలపడానికి నా బర్రెల మందను ఇస్తానంటాడు రాజు. ఆ బర్రెల మంద నాక్కూడా ఉన్నదని మైసమ్మ సమాధానం. ఆవు మంద, మేక మంద, గొర్రె మందను కూడా ఇస్తానంటే అవన్నీ నా దగ్గర ఉన్నాయని మైసమ్మ జవాబిస్తుంది. అయితే ఆ రాజు వెంటనే, తల్లిదండ్రులను, అత్తమామలను, అన్నా వదినలను, అక్కా బావలను, పెద్ద కొడుకు, పెద్ద కోడలిని అర్పిస్తానంటాడు. దానికి ఆ దేవత సంతృప్తి పడదు.

అయితే చిన్న కోడల్నిస్తె ఉయ్యాలో
కట్ట నిలుపే మైసు ఉయ్యాలో
అనగానే చెరువు స్పందిస్తుంది.
ముసి ముసి నవ్వుతూ ఉయ్యాలో
మూడడుగులాపే ఉయ్యాలో
ఎగిసిపడి నవ్వుతూ ఉయ్యాలో
ఏడడుగులాపే ఉయ్యాలో
పక పకా నవ్వుతూ ఉయ్యాలో
పదడుగులాపే ఉయ్యాలో

అట్లా కట్టమైసమ్మ కట్టను తెగకుండా ఆపుతుంది. అప్పుడు ఆ రాజు ఇంటికెళ్లి చిన్న కోడలుతో విషయమేమీ చెప్పకుండా తొట్టిలో ఉన్న ఆమె చిన్న కొడుకుని గురించి వివరాలడుగుతాడు.

చిన్న పిల్లవాడికి స్నానం పోసినవా? బట్టలేసినవా? ఉగ్గు తినిపించినవా? జోల పాడినవా?అని అడిగి అవన్నీ అయిపోయాయని చెబితే, చెరువుకు పోయినీళ్లు తేవాలి బిందె పట్టుకొని బయలు దేరాలని మామ కోడల్ని కోరతాడు.ఆమె మారు మాట్లాడకుండా మామవెంట చిన్నమ్మ చెరువుకు వెళుతుంది. చెరువు లోపలికి వెళ్లి నీళ్లు ముంచుకొని తెమ్మని మామ చెప్పిన వెంటనే, ఒక్క చేత్తో బిందె పట్టి చెరువులోపలికి దిగుతుంది. అయితే మోకాలి దాకా నీళ్లొచ్చినా దేవత మహిమ వలన బిందె మునగలేదు. తొడ దాకా నీళ్లొచ్చినా బిందె మునగలేదు. నడుము మునిగినా బిందె మునగలేదు. అప్పుడు ఆ మామ అసుంట బోయి బిందెను ముంచు అంటే ముందుకు వెళుతుంది. అప్పుడు బిందెతో పాటు, ఆమె కూడా మునిగిపోతున్నట్టు ఆమెకు అప్పుడు తొస్తుంది. అప్పుడు ఆ చిన్నమ్మ…
ఆకాశాన బోయేటి ఉయ్యాలో
అతిరామ చిలుక ఉయ్యాలో
నా తల్లిదండ్రికి ఉయ్యాలో
బిడ్డ లేదని చెప్పు ఉయ్యాలో
నాతోటి వాళ్లకు ఉయ్యాలో
అక్క లేదని చెప్పు ఉయ్యాలో

అంటూ ముద్దబంతి వలె మునిగింది చిన్నమ్మ.
మునిగిపోతూ ఇంకేమంటుంది?

బొడ్డెనమ్మనయి ఉయ్యాలో
నీ బిడ్డనైత ఉయ్యాలో
తంగేడు పూలల్ల ఉయ్యాలో
తల్లినైవస్త ఉయ్యాలో
కలువ పూలల్ల ఉయ్యాలో
కలగలసి వస్త ఉయ్యాలో
అన్ని పూలతోటి ఉయ్యాలో
ఆడుకొనిపోతా ఉయ్యాలో

అంటూ పూర్తిగా కనపడకుండా పోతుంది. ఎక్కడైతే చిన్నమ్మ మునిగిందో అక్కడ పూలన్నీ నీళ్లల్లో తేలి కనిపిస్తాయి. తమ కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన చిన్నమ్మను ఊరు ఊరంతా కలకాలం పూలల్లో పూవులాగా బతుకమ్మ అని కొనియాడినట్టు ఈ పాట చెబుతుంది.

ఇంకొక కథలో చెరువు కట్ట తెగిపోతుంటే, ఎక్కడైతే గండి పడుతుందో ఆ గండిలో ఒక ఆడబిడ్డ కూచుండి తనను తాను అర్పించుకొని చెరువు కట్ట తెగిపోకుండా ఆపగలుగుతుంది. ఆ చెరువు సర్వస్వం అయినప్పుడు దానిని రక్షించిన వాళ్లు దేవుళ్లను మించిన దేవుళ్లవుతారు. బతుకమ్మ పండుగలో మూడు ప్రధానమైన అంశాలు. ఒకటి ఆడబిడ్డలు, రెండు చెరువు, మూడు పూలు. ఈ మూడు విషయాలు ఈ కథలో ప్రధానమైన విషయాలు. దసరా సమయం నాటికి పప్పు ధాన్యాలు, కొన్ని రకాల వరి ధాన్యాలు ఇంటికొస్తాయి. అయితే ఆ పప్పు ధాన్యాలన్నీ కలిపి ముద్దలు చేస్తారు. మక్క కంకులతో మక్కపిండి చేస్తారు. వాటితో పాటు ఆ సమయంలో వచ్చే పంటలన్నింటితో రకరకాల పిండితో సత్తు తయారు చేస్తారు. వీటినే సత్తు ముద్దలు, మలీద ముద్దలు అంటారు. వాటిని మొదటగా చెరువుకి ప్రసాదంగా అర్పిస్తారు. ఆ తరువాత అందరూ కలసి వాయినాలు ఇచ్చుకుంటారు. అంటే ఒకరు తయారు చేసిన పిండి వంటలు మరొకరితో పంచుకుంటారు. పండుగ సాంప్రదాయాన్ని మొత్తం గమనిస్తే పంటకు ప్రాణాధారమైన నీళ్లు, చెరువు, వాటి రక్షణ, వాటిని కాపాడుకోవాల్సిన సామాజిక బాద్యత, తద్వారా ఊరంతా సంతోషంగా కలసి బతికే సందర్భమే బతుకమ్మ. చెరువులో పూలను వదలడం అనేది ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకున్నా అన్నింటికీ మించి చెరువు కోసం ప్రాణత్యాగాలు చేసిన వారికి పూలనివాళి అర్పించడమనేది స్థూలంగా అర్థం అవుతుంది. అయితే ఇంకా బతుకమ్మ పండుగ నేపథ్యం గురించి విస్తృతమైన పరిశోధన జరగాలి.