|

విజయాలను ప్రసాదించే విజయదశమి

శమీ శమయతే పాపం శమీశత్రు వినాశనమ్‌ |
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||

అన్న ఈ శ్లోకం విజయదశమి పర్వదినాన ప్రతి వ్యక్తి నోటా పరవళ్ళు తొక్కుతుంటుంది. ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు

శుద్ధ నవమి వరకున్న తొమ్మిది రోజులను దేవీ నవరాత్రులనీ, శరన్నవరాత్రులనీ భారతీయులు సంభావిస్తుంటారు. ఈ నవరాత్రుల తరువాతి రోజు వచ్చే శుద్ధ దశమి దినాన్ని ‘విజయ దశమి’గా మనదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పండుగ జరుపుకొనడం అనూచానంగా వస్తున్న సంప్రదాయం.

‘దసరా’ అనే పేరుతో బాగా ప్రసిద్ధి చెందిన ఈ విజయదశమీ పర్వదినం శరత్కాల ప్రారంభంతో మొదలై అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించే అపురూపమైన పండుగ. ప్రధానంగా అమ్మవారిని మహాశక్తిగా ఆరాధించే శాక్తేయులకు ఇది అత్యంత ముఖ్యమైన పర్వదినం. దేవీ ఆలయాల్లో ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగే పూజలు తొమ్మిది రోజులూ తొమ్మిది ప్రత్యేక రూపాల్లో ఆ తల్లిని సేవించుకుంటుంటారు. సాధారణంగా ఈ నవరాత్రులలో మొదటి మూడు రోజులు పార్వతీ దేవికి, తదుపరి మూడు రోజులు లక్ష్మీదేవికి, చివరి మూడు రోజులు సరస్వతీ మాతకు చెందినవిగా భావించినా, ప్రతి నిత్యం ఆ దేవిని వివిధ రూపాల్లో అలంకరించడం ఆనవాయితీగా వస్తున్నది. ఆ తొమ్మిది రోజులు…

ఒకటోరోజు శ్రీ బాలాత్రిపుర సుందరిగా
రెండోరోజు శ్రీ గాయత్రీ మాతగా
మూడోరోజు శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిగా
నాలుగోరోజు శ్రీ అన్నపూర్ణేశ్వరిగా
ఐదోరోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా
ఆరో రోజు శ్రీ మహా సరస్వతీ దేవిగా
ఏడో రోజు శ్రీ దుర్గా మాతగా
ఎనిమిదో రోజు శ్రీ మహిషాసుర మర్దనిగా
తొమ్మిదో రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా

అలంకరించి భక్తులు దేవిని కొలుచుకుంటుంటారు. అందుకే ఈ తొమ్మిది రోజులను దేవీ నవరాత్రులుగా పిలుచుకుంటారు. శరత్‌ కాలంలో వచ్చే నవరాత్రులు గనుక వీటిని శరన్నవరాత్రులు అని కూడా అంటారు. శాక్తేయులకు అత్యంత ప్రీతి పాత్రమైన ఈ రోజులలో లోక కల్యాణార్థం అమ్మవారిని ఆరాధిస్తుంటారు. కొన్ని ప్రాంతాలలో ఈ తొమ్మిది రోజులు బొమ్మల కొలువులు కూడా పెట్టి పూజిస్తుంటారు. అమ్మవారు పుట్టిన రోజుగా భావించి పూజించే ఆనవాయితీ. ఆయా రోజుల్లో ఆయా తల్లి జన్మించిన పవిత్ర దినంగా భావించి ఆయా రూపాల్లో ఆరాధిస్తుంటారన్నది పెద్దల మాట. వివిధ రూపాల్లో ఆమెను సేవించడం కారణంగా విశేష ఫలితాలు లభిస్తాయన్న బలమైన విశ్వాసం ఈ నవరాత్రులను శోభాయమానం చేస్తున్నాయి.

పదవ రోజును ‘విజయ దశమి’గా భావించడం వెనక అనేక గాథలు కనిపిస్తున్నాయి. రావణునిపై రాముడు విజయం సాధించిన రోజుగా దశకంఠుని సంహరించిన రోజు గనుక ‘దశహర’గా పిలువబడి క్రమంగా అదే ‘దసరా’గా మారిందని కొందరి విశ్వాసం. అందుకే నేటికీ అనేక ప్రాంతాలలో ఆ రోజున రావణ దహనం నిర్వహిస్తుంటారు.

ఈ రోజు ‘శమీపూజ’ను నిర్వహించడం ఒక ప్రత్యేకమైన అంశం. శమీవృక్షం (జమ్మి చెట్టు) పవిత్రమైన వృక్షంగా భావించి పూజించడమే గాక, దానికొక పౌరాణిక గాథ అనుసంధానమై ఉందని చెబుతారు. పాండవులు అరణ్య వాసానంతరం, అజ్ఞాతవాస కాల ప్రారంభంలో తమ తమ ఆయుధ సంపత్తిని విరాట నగర శివారు ప్రాంతాలలో గల ఒక జమ్మి చెట్టుమీద ఉంచినట్లు మహాభారతం చెబుతున్నది. వారి వనవాస కాలం ముగిసిన వెంటనే ఆ శమీవృక్షం మీది ఆయుధాలను తిరిగి గ్రహించిన రోజుగా, అర్జునుడు గోగ్రహణ సందర్భంలో విజయం సాధించి తిరిగి వచ్చిన రోజుగా ఈ విజయ దశమి రోజు ‘శమీ’ పూజ విధిగా చేసి, గ్రామంలోని దేవీ దేవతలను ఊరేగింపుగా ‘జమ్మికి’వెళ్ళి, ఆ శమీ పత్రాలను పరస్పర ప్రేమానురాగాలను వెలిబుచ్చుతూ ఇచ్చి పుచ్చుకుంటుంటారు. మరికొన్ని చోట్ల ఈ ‘శమీ శమయతే పాపం..’ అనే మంత్రాన్ని చిన్న చిన్న కాగితాలపై వ్రాసి, దాని క్రింద తమ తమ కోరికలను కూడా వ్రాసి, ఆ కాగితాలను శమీవృక్షానికి కట్టడం ఆచారంగా కనిపిస్తుంది. మొత్తానికి నవరాత్రులు, విజయ దశమి పండుగలు శోభాయమానంగా నిర్వహించుకోవడం మన భారతీయులకు పరంపరాగతంగా వచ్చిన సంప్రదాయం.

జగన్మాత దుర్గాదేవి మహిషాసురుని సంహరించి విజయం పొందిన రోజుగా దీన్ని గుర్తించారు కనుక, దుర్గాదేవి ఆలయాలలో దుర్గానవరాత్రులుగా ఈ పండుగను చేసికొని విజయ దశమి రోజు అమ్మవారిని ఘనమైన రీతిలో ఆరాధిస్తారు. రోజూ చేసే అలంకారాల్లో శరన్నవరాత్రులకు దుర్గానవరాత్రులకు, చిన్న చిన్న తేడాలున్నాయి. అవీ ఒక్కోరోజు ఒక్కో దేవతగా అలంకరించడంలో ముందు వెనకాల తప్ప మరేమీ కావు. దేవతలు మాత్రం వారే. ఈ నవరాత్రి దినములు విజయదశమికి ముందు అత్యంత వైభవోపేతంగా, శ్రద్ధా భక్తులతో భారతీయులు నిర్వర్తిస్తుంటారు.

యావద్భారత దేశంలో అత్యంత ప్రభావవంతంగా, అతి పవిత్రంగా నిర్వహించుకునే ఈ విజయ దశమీ పర్వదినం పలు ప్రాంతాలలో పలు విధాలుగా నిర్వహించుకుంటుంటారు. దేవీ పూజకు మిక్కిలి ప్రాముఖ్యమున్న ఈ పండుగను ఈశాన్య భారత దేశంలో హెచ్చుగా జరుపుకోవడం మనం చూడొచ్చు. అదే విధంగా కలకత్తా, మైసూరు, విజయవాడ మొదలైన ప్రాంతాలలో అక్కడి ప్రాంతీయ విశ్వాసాలతో ఈ పండుగను చేసుకోవడం అక్కడి ఆనవాయితీ.

మైసూరులోని చాముండేశ్వరీ దేవి ఆరాధన అక్కడి ప్రజలు విశేషంగా విజయ దశమి రోజు జరుపుకుంటారు. ప్రత్యేకమైన ఏనుగు అంబారీపై అమ్మవారిని ఊరేగింపుగా వీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగిస్తారు. మైసూరు రాజకుటుంబంవారు ఆరోజు ప్రత్యేక దర్బారు నిర్వహిస్తారు. కన్నుల పండువుగా జరిగే మైసూరు దసరా ఉత్సవాలను చూచి తరించాలన్న కోరికతో దేశం నలుమూలల నుండి ప్రజలు అక్కడికి వెళ్ళి చాముండేశ్వరీ మాత అనుగ్రహానికి పాత్రులవుతుంటారు. ఆ ఉత్సవాలను చూడటానికి ఎందరెందరో విదేశీయులు సైతం రావడం మైసూరు దసరా ఉత్సవాల ప్రత్యేకత.

కలకత్తా కాళిక జగత్ప్రసిద్ధి దేవత ఇక్కడ నవరాత్రి ఉత్సవాలలో నిత్యం పూజాదికాలు జరిగినా సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో ప్రత్యేక పూజలు జరపడం ఇక్కడి ప్రత్యేకత. తొమ్మిదో రోజు ఆబాల గోపాలం అమ్మవారిని దర్శించుకుంటారు. వాడ వాడల్లో కాళీమాత విగ్రహ మండపాలను నెలకొల్పి ప్రజలు ఆ తల్లిని ఆరాధించి చివరి రోజు ‘హుగ్లీ’ నదిలో ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. కుమారీ పూజలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ నవరాత్రులలో పలుచోట్ల పురాణ శ్రవణాలు, హరికథలు వంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతూ నగరమంతా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంటుంది.

ఒడిషా రాష్ట్రంలోను దేవీ నవరాత్రుల్లో మండపాలు ప్రతిష్ఠిస్తుంటారు. కటక్‌ కళాకారులు రూపొందించిన విగ్రహాలు ఈ మండపాల్లో కొలువుదీరుతాయి. స్త్రీలు మానికల్లో వడ్లునింపి అమ్మవారిని లక్ష్మీదేవిగా ఆరాధిస్తుంటారు. సమస్త విజయాలకు దుర్గారాధనే కారణమన్న గాఢ విశ్వాసంతో విజయదశమి నాడు దుర్గాదేవిని కొలుచుకోవడం ఈ రాష్ట్రంలో ప్రత్యేకత.

విజయవాడలో కొలువై ఉన్న కనకదుర్గమ్మకు అత్యంత శోభాయమానంగా దుర్గానవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందిన బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధి భక్తులకు పరమ పుణ్య ప్రదేశం. నిత్యం జన సందోహంతో కిటకిటలాడే ఈ ఆలయం దసరా నవరాత్రులలో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల అలంకరణతో అత్యంత శోభాయమానంగా వెలిగి విజయ దశమి రోజు ప్రత్యేకంగా దర్శనమిచ్చి భక్తులను కరుణించే దేవత కనకదుర్గమ్మ. అనేక ప్రాంతాల నుండి అశేష భక్తజన వాహిని తరలివచ్చి అమ్మవారి కరుణకు పాత్రులై తరించిపోవడం ఇక్కడి ప్రత్యేకత. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం, విశాఖపట్టణం వంటి అనేక పట్టణాల్లో పైడితల్లి అమ్మవారు, కనక మహాలక్ష్మీ అమ్మవారు. తిరుపతమ్మ తల్లి మొదలైన చోట్ల విశేషరీతిలో నవరాత్రులు, విజయదశమి నిర్వహింపబడుతుంటాయి.

తెలంగాణాలో దసరా వేడుకలకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మన బతుకమ్మ మన పాలపిట్ట దేశంలో ఎక్కడా కనిపించని ఒక విశేషం మనం ఇక్కడ పల్లెల్లో, పట్టణాల్లో చూడవచ్చు. అదే బతుకమ్మ పండుగ. ఇది పూల పండుగ, ఇది మన బ్రతుకును మాతృమూర్తిగా భావించి సేవించే పండుగ. ఇది ఆడపడుచులను అత్యంత ప్రేమాస్పదంగా చూచే పండుగ. అనేక విశిష్టతలు చోటు చేసుకున్న ఈ బతుకమ్మ పండుగ పెత్తరమాస  పండుగతో ప్రారంభమై, సద్దుల పండుగతో దసరాకు ముందు ముగియడం విశేషం. ప్రతి ఆడపిల్ల ప్రతి రోజు పలు విధాలైన పువ్వులతో బతుకమ్మను పేర్చి మిగతా స్త్రీలతో కలిసి ఆటపాటలతో అమ్మవారిని సేవించడం ఈ ప్రాంతంలో నవరాత్రులలో ప్రతి రోజూ కన్నుల పండువ చేసే దృశ్యం. చివరి రోజు అంటే తొమ్మిదో రోజు తమ తమ గ్రామాల్లోని చెరువుల్లోనో, కుంటలలోనో మహిళలందరూ పట్టు చీరలు కట్టుకొని, అలంకరించుకొని వెళ్ళి బతుకమ్మను నిమజ్జనం చేయడం ఒక ఆచారం. నిమజ్జనానికి ముందు అక్కడికి చేరిన మాతృమూర్తులు, పిల్లలు అందరూ కలిసి ఆనందంగా బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మను ఆడటం తెలంగాణా సంస్కృతికి ఒక ప్రత్యేక చిహ్నం. ఈ పండుగ సందర్భంగా ప్రతి యింటికీ ఆ యింటి ఆడపడచులు అత్తవారింటి నుంచి వచ్చి తంగేడు, గునుగు మొదలైన పూలతో బతుకమ్మల పేర్చి పూజించి, ఆటపాటలతో అమ్మవారిని సేవించడంలో ఒక ఆనందం ఉంది.

ఒకవైపు బతుకమ్మ వేడుకల సంరంభంతో తెలంగాణా ప్రాంతమంతా సంబరాలు జరుపుకుంటుంటే కొన్ని విశిష్టమైన ఆలయాలలో వరంగల్లులోని భద్రకాళీ మాత ఆలయం, హైదరాబాదులోని రేణుక ఎల్లమ్మ గుడి వంటిచోట్ల సంప్రదాయ బద్ద పూజలు, తొమ్మిది రోజులు తొమ్మిది రకాలైన రూపాల్లో అమ్మవారిని అలంకరించడం జరగుతూ వుంటుంది. దివ్యవైభవంతో ఆలయాలు శోభిస్తూనే ఉంటాయి.

విజయదశమి రోజు స్థానిక దేవతల ఊరేగింపుతో బాటు ప్రజలంతా జమ్మికి వెళ్ళి శమీవృక్ష పూజ నిర్వహించడం కూడా ఇక్కడి సంప్రదాయాల్లో ఒకటి. ఆ తరువాత జమ్మి ఆకును పరస్పరం ప్రేమానురాగాలతో పంచుకోవడం మనం చూడొచ్చు. తెలంగాణాలో మరొక ప్రత్యేక ఆచారం ఉంది. జమ్మికి పోవడం చాలా చోట్ల కనిపించే ఆచారమే అయినా ఇక్కడ ‘పాలపిట్ట’ను చూడటమనే మరో విశేషమైన ఆచారం ఉంది. దసరా రోజు విధిగా పాలపిట్టను చూచే ప్రాంతం మనకు మాత్రమే ప్రత్యేకం. మనకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మలో ప్రధానమైన ‘తంగేడు పువ్వు’ను, ‘పాలపిట్ట’ను ప్రభుత్వ చిహ్నాలుగా మన ప్రభుత్వం గుర్తించడం మన ప్రాంతపు విజయ దశమి విశిష్టతను తెలుపుచున్నది.

మహర్నవమి రోజు ఆయుధ పూజ నిర్వహించే సంప్రదాయం కూడా చాలా చోట్లలో ఉన్నట్లే తెలంగాణాలోనూ నేటికీ నిలిచి ఉంది. ఆనందాలు వెల్లివిరిసే శరత్కాలంలో తొలి నాళ్లలోనే మనకు ఆనందైశ్వర్యాలను పంచే యీ విజయదశమి అనబడే దసరా వేడుకలు నిత్యవసంతాలుగా మారి ఆహ్లాదాన్ని అందిస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

గన్నమరాజు గిరిజామనోహర బాబు