|

నిజంగా నిజం…

By: యు. వెంకటేశ్వర్లు

2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పల్లెలను ఒకసారి యాదికి చేసుకొండ్రి ఎట్లుండేనో. ఊరు ముంగటనే కాలు పెడదామంటే సందు లేకుండా బాట పొంటి మురికి తుమ్మ సెట్లు. దానికి తోడు పెద్దోళ్ళు, ఆడోళ్ళు, మొగోళ్ళు బాట పొంటి (చెంబటుక) పోయి కంపు కంపు వాసన భరించేటందుకు చేతనయ్యేది కాకుండే. ఊరు ముంగటనే పెంట దిబ్బలు, చెత్త, చెదారం ఇగ చెప్పగూడదు.

ఎట్లనో ఒకలాగా ఊర్ల కాలు పెడితే పడిపోయిన కొంపలు, గుడిసెలు, కవేళలు, ఊరంతా కలిపి ఒకటి రెండు మట్టి మిద్దెలు. ఇంటి ముంగటనే పశుల కొట్టాలు వాటిలో పశులు, బర్రెలు, గొర్రెలు, మేకలు, రొచ్చు, పెండ, దోమలు, ఈగలు అంతా ఆగమాగం. యా ఇంట్ల జూసిన ముసిలోళ్లు, ముతకొల్లు, చిన్న పోరలు తప్ప ఎవరూ కనిపిచ్చేటోళ్లు కాదు. ఆడొల్లేమో పొద్దున పొద్దున్నే బిందె మీన బిందె పెట్టుకొని కిలోమీటర్లు, కిలోమీటర్లు పొయ్యి తాగనింకే నీళ్లు తెచ్చేటోళ్లు. మొగోళ్ళు ఎవుసం చేయడానికి బాయికాడికెళ్తే బాయికాడనే ఉండేటోళ్లు. కరెంటేప్పుడొస్తదో తెల్వక సేండ్లు ఎండిపోతుంటే పానం ఉగ్గబట్టుకుని బతికేటోళ్లు.

పెద్ద పోరాగాండ్లు ఊరిడిసిపెట్టి పట్నం పొయ్యి బతికొటేళ్లు. ఊర్ల ఎవుసం చేద్దామంటే నీళ్లు లేవు. కరెంటు ఉండది. అందుకే  పనికోసం పట్నం బాట పట్టేటోళ్లు. చిన్న పిల్లల చదువుల సంగతి దేవుడికే తెలియాలి. వాన వస్తే బడి ఇడిసి పెట్టుడాయే. టీచరొస్తే, బడి లేకుంటే లేదు.రోజు టీచర్‌ వచ్చేటందుకు బస్సులు లేవాయే.

ఫస్ట్‌ నుండి ఈ గోసంత చూసిన మన ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మా తెలంగాణ మాగ్గావాలె, మా ఉద్యోగాలు మాకే కావాలి, మా పైసలు మేమే ఖర్చు పెట్టుకుంటమని ఎప్పటినుండో కొట్లాడుతున్నాడు. తెలంగాణ వచ్చుడో సచ్చుడో  అని తెలంగాణ కోసం తెగించి పట్టుబడితే 2014 లో తెలంగాణ వచ్చిన విషయం మీ అందరికి ఎరుకనే ఆయే.

ఇగ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన ఊకుండలే. ఎందుకంటే అన్ని తెలిసిన ఆయన ఊకెట్ల ఉంటడు. రాంగ రాంగానే రైతులకు ఫ్రీ కరెంట్‌ ఇచ్చిండు.  ఆ తర్వాత ఎవుసం చేసుకొనింకే రైతులకు నీళ్లు కావాలని మేధావులని, ఇంజనీర్లను, పెద్ద పెద్ధోళ్ళందరిని కూసోబెట్టి ప్లాన్‌ చేసి రాష్ట్రం మొత్తానికి ఏవిధంగా నీళ్లు తేవాల్నో ఆలోచించి సాగునీటి ప్రాజెక్టులు కట్టిచ్చిండు.

మన ముఖ్యమంత్రి సాబ్‌ అంతటితో ఆగలేదు. గాంధీ చెప్పినట్లు మన దేశానికి గ్రామాలే పట్టుకోమ్మలని, గ్రామాలు అభివృద్ధి అయినప్పుడే  దేశం బాగుపడుతుందని, గ్రామ స్వరాజ్యం వస్తదని బాగా నమ్మిన వ్యక్తి. అందుకే ఎట్లైన సరే ఈ తెలంగాణలో ఉన్న పల్లెలన్నిటినీ బాగు చేయాలని కంకణం కట్టుకున్నాడు. ముందుగాల అమ్మలక్కల తాగునీటి గోస తిర్చేటందుకు  ‘మిషన్‌ భగీరథ’ పేరు మీద ఇంటింటికి తాగునీరిచ్చిండు.  అంతేగాక ‘తెలంగాణకు హరితహారం’ పేరుతోన రోడ్ల పొంటి, వాగులు, వంకలు, చెరువు గట్లు, బడులు, గుడులు, ఇలా ఒకటేమిటి కనిపించిన ఖాళీ జాగలన్నింట్ల మొక్కలు నాటిపిచ్చిండు. అన్ని ఊర్లల్ల అద్దం లాగా సిసి రోడ్లు ఎయించిండు. ప్రతి ఊరి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ ఇచ్చిండు. ట్యాంకర్‌ ఇచ్చిండు. బడి ఇచ్చిండు. పల్లె ప్రకృతి వనాలు, ఊర్లో చెత్తంతా ఎక్కడబడితే అక్కడ వేయకుండా సెగ్రిగేషన్‌ షెడ్డులు, వైకుంఠ ధామాలు కట్టిచ్చిండు. 3,4 గ్రామాలకు కలిపి రైతు వేదిక కట్టించిండు. రైతులకు రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్‌ ఇచ్చిండు.

ఇప్పుడు మళ్ల ‘మన ఊరు – మన బడి’ కింద ఊర్లో ఉన్న పాడుబడిన సర్కారు బడులన్నీ  ప్రైవేట్‌  బళ్ల లాగా, కార్పొరేట్‌లాగా చేస్తున్నడు. ఇట్ల చెప్పుకుంటూ పోతే లిస్టు చానా పెద్దగనే ఉంది.

ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఏ  పల్లెటూరికి వెళ్ళిన  ఎండాకాలం గూడ  చెరువు నిండా నీళ్లు,చెరువులో చాపలు పట్టేటోళ్లు, గొర్లు, బర్రెలు కాసేటోళ్లు, ఊరు ముంగట కిలోమీటరు ముందు నుండే రోడ్డుకిరువైపులా హరితహారం మొక్కలు కనపడతాయి. ఎక్కడ చెత్తాచెదారం కనబడదు. ఊర్లో అద్దంలాగ కనపడే సిసి రోడ్లు, గ్రామపంచాయతీ ఆఫీసు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, పల్లె ప్రకృతి వనాలు, పార్కులు, వైకుంఠధామాలు,  ఇంటింటికి మరుగుదొడ్డి, నీళ్లు, ఊరు బయట పశువుల పాకలు, ప్రతి ఇంట్లో టీవీ, మోటార్‌ సైకిల్‌, దళిత బంధు కింద ట్రాక్టర్లు, కిరాణ షాపులు, ప్రతి ఇంట్లో పేపర్‌ అబ్బో పట్నంలో ఉండే సౌలత్లన్ని గిప్పుడు పల్లెటూర్లల్లో కనపడుతున్నాయి.

ఇంకేం కావాలే. ఇప్పుడు పట్నమోళ్ళు కూడా వారానికి ఒక తూరి పల్లెలకు వచ్చి రెండు రోజులు పట్నం మాదిరిగా గడిపి పోతున్నారంటే మీరే అర్థం చేసుకోవాలే. మన తెలంగాణ పల్లెలు ఎట్లున్నాయో ఉత్తగా ఇవన్నీ చెప్పుకోవడమే కాదు. తెలంగాణ రాష్ట్రంలో పల్లెలన్నీ పట్నాలలాగా స్వచ్ఛంగా తయారయ్యాయని, పైన చెప్పినవన్ని బాగా చేస్తున్నారని తారీఫ్‌ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వమోళ్ళు ఇటీవల మా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రాజాపూర్‌ మండలం గుండ్ల పొట్లపల్లి అనే ఒక ఊరికి దీన్‌ దయాల్‌ ఉపాద్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్‌ పురస్కార్‌ అనే అవార్డు కూడా ఇచ్చిండ్రు. ఒక్క గుండ్ల పొట్లపల్లి నే కాదు మా మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇంకా మస్తు గ్రామాలు ఇట్లనే ఉన్నయంటే మన తెలంగాణ రాష్ట్రంలో  పల్లెలు నిజంగా పట్నాలైనట్లే గదా!