భారీ బిలంలో ఆదిమ అడవి

By: దోర్బల బాలశేఖరశర్మ

ఆగ్నేయ చైనాలోని ‘గువాంగ్‌ జీ జువాంగ్‌ ఆటానమస్‌ రీజియన్‌’ (Guangxi Zhuang Autonomous Region) మారుమూల ప్రాంతానికి చెందిన సిచువాన్‌ (Sichuan) బేసిన్‌లో విశాలమైన ఓ భారీ నిక్షిప్త బిలం (Sink Hole) లోపల అత్యంత భద్రంగా వున్న ఆదిమకాలం నాటి అడవి వెలుగుచూసింది.

అక్కడి ‘లెయే కౌంటీ’ (Leye County)లో సుమారు 306 మీటర్ల (1,003 అడుగులు) పొడవు, 150 మీటర్ల (492 అడుగులు) వెడల్పు, 192 మీటర్ల (629 అడుగుల) లోతున ఈ ప్రాచీన అటవీ ప్రాంతాన్ని ‘చైనా జియాలజికల్‌ సర్వే’కు చెందిన ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కార్ట్స్‌ జియాలజీ’ పరిశోధకులు ఇటీవల కనుగొన్నారు. అత్యంత దట్టమైన ఈ పురాతన రహస్య బిలం (గుహ) గురించిన సమాచారాన్ని తొలుత వారు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తెలుసుకున్నారు. ‘జిహెచ్‌ఎఆర్‌’ (గువాంగ్‌ జీ జువాంగ్‌ ఆటౌనమస్‌ రీజియన్‌) పరిశోధకులు ఆ సుదూర ప్రదేశానికి కాలి నడకన వెళ్లి తమ కళ్లతో చూసి మరీ దీనిని నిర్ధారించారు. ఈ సాహసయాత్రలో భాగంగా వారు సుమారు 100 మీటర్ల (328 అడుగులు) లోతులోని ఆ బిలంలోకి దిగడమే కాక కొన్ని గంటలపాటు అక్కడ ప్రయాణించి సదరు ప్రాచీన అడవి ప్రదేశానికి చేరుకొన్నారు.

దట్టమైన పొదలతో ఆ ప్రాంతమంతా గుబురు గుబురుగా వుంది. అక్కడి ప్రాచీన చెట్లు, వృక్షాలైతే మనిషి భుజాల నుంచి 40 మీటర్ల (131 అడుగులు) వరకు ఎత్తును కలిగి వున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ‘‘ఆదిమకాలం నాటిదిగా భావిస్తున్న ఈ అడవిలోని గుహలలో మనకు తెలియని, సైన్సు గుర్తించని జాతుల మొక్కలు అనేకం వుండి వుంటాయంటే నాకెలాంటి ఆశ్చర్యం కలుగడం లేదు’’ అని ఆ అన్వేషణా యాత్ర బృందం నాయకుడు చెన్‌ లిక్సిన్‌ (Chen Lixin) అభిప్రాయ పడినట్టు ‘లైవ్‌ సైన్స్‌’ ఆన్‌ లైన్‌ పత్రిక తన కథనంలో పేర్కొన్నది. తమ యాత్ర విశేషాలతో కూడిన వీడియోను కూడా పరిశోధకులు మీడియాకు విడుదల చేశారు.

ఈ తరహా భారీ బిలాలను చైనా సంప్రదాయంలో ‘స్వర్గలోయలు’గా పిలుస్తారు. ఎంతో లోతైన ఇలాంటి భూగర్భ బిలాలు (సొరంగాలు లేదా గుహలు) స్వల్ప ఆమ్లవర్ష జల ప్రవాహాలతో భూమి కోతకు గురైన ఫలితంగా ఏర్పడి వుంటాయని భూశాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సహజసిద్ధమైన ఈ గుహలు కాలక్రమంలో మూసుకు పోతాయని, వాటి అడుగున నేలపై తిరిగి వృక్షజాలం వృద్ధి చెందుతుందని వారు నమ్ముతున్నారు. బిలం పైకప్పు ప్రదేశ భూభాగం కొంత పలుచబడిన దశలో గుహగర్భ నేలలు తిరిగి చెట్లు చేమలను సంతరించు కోగలవని వారంటున్నారు. కాగా, లెయే కౌంటీలోనే ఇలాంటి నిక్షిప్త బిలాలు కనీసం 29 వరకు ఉంటాయని చైనా పరిశోధకులు పేర్కొన్నారు.

నాలుగింతల నక్షత్ర వ్యవస్థ

ఆకాశంలో మరులు గొలిపే ‘నాలుగింతల నక్షత్ర వ్యవస్థ’ (Quadruple system) మరణదశలో అత్యంత

అరుదైన నవ్యోజ్వల తార (Supernovae)గా మారగలదని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు.

2017లో ‘హెచ్‌ డి 74438’గా పిలిచే ‘రెండు జంటల నక్షత్ర వ్యవస్థ’ (Double- binary star system) ఎంతో ప్రత్యేకమైందిగా వారు భావించారు. అతి సమీప జంట నక్షత్రాలతో కూడిన రెండు జతల (నాలుగు) తారలు అసాధారణ రీతిలో ‘నాలుగింతల వ్యవస్థ’గా జంటగా ఒకదాని చుట్టూ మరొకటి పరిభ్రమిస్తుంటాయి. ఖగోళశాస్త్ర పరంగా ఇది ఒకింత నమ్మశక్యం కాని (మామూలు) విషయమే అయినా దీని వెనుక మరింత అనూహ్య విశేషమేదో తప్పనిసరిగా ఉండి ఉంటుందని వారు మొదట్నించీ నమ్ముతున్నారు. ఇప్పుడు ‘ఇది నిజమేనని’ అనుకరణ ప్రయోగాలు (సిమ్యులేషన్స్‌) నిరూపించాయి. రెండు జతల ‘నాలుగింతల వ్యవస్థ మరణ దశలో ఎంతో అరుదైన నవ్యోజ్వల తారగా పరిణామం చెందగలదనీ వారు నిర్ధారించారు.

‘నాలుగింతల నక్షత్ర వ్యవస్థ’లోని ఒక ‘ద్విభాగ జత’ (binary) నక్షత్రాలు (రెండు) 20 రోజులు లేదా అంతకు మించిన కాలపరిధితో ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతుంటాయి. మరో ద్విభాగ జత తారలు ప్రతి నాలుగు రోజులకు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రతీ జంట ఆరేండ్లకు ఒకసారి ఒకదాని చుట్టూ ఒకటి పరిభ్రమిస్తున్నాయి. ఈ రకంగా, అతి తక్కువ కాల పరిధిలోనే ఈ నాలుగు నక్షత్రాల (రెండు జంటలు) వ్యవస్థ (HD74438) పని చేస్తున్నట్టు వారు కనుగొన్నారు. సుమారు 43 మిలియన్‌ (430 లక్షల) సంవత్సరాల యుక్తవయసుతో కూడిందిగా వారు దీనిని అంచనా వేశారు. గతం మాటెలా వున్నా అనూహ్యమైన దీని భవిష్యత్తును వెల్లడిరచిన అనుకరణ ఫలితాలను ‘నేచర్‌ అస్ట్రానమీ’ పత్రిక ఇటీవల ప్రచురించింది.

‘‘మన సూర్యుని వంటి ఒక నక్షత్రం తన జీవితాన్ని ఒక చిన్న దట్టమైన ‘మృత తార’గా మారడం ద్వారా ముగుస్తుంది. దీనినే ‘తెల్ల కుబ్జతార’గా శాస్త్రవేత్తలు పిలుస్తారు. తెల్ల కుబ్జతారల ద్రవ్యరాశి ప్రసిద్ధ సిద్ధాంతమైన ‘చంద్రశేఖర్‌ పరిధి’ (సూర్యుని ద్రవ్యరాశికి సుమారు 1.4 రెట్లు)ని మించి వుండదు’’ అని పై పరిశోధన పత్రం సహ రచయిత, యూనివర్సిటీ ఆఫ్‌ క్యాంటెర్బరీ (న్యూజిలాండ్‌) అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కరేన్‌ పోలార్డ్‌ అభిప్రాయపడ్డారు. ‘‘ఇదే కనుక, సంభవమైతే ద్రవ్యరాశి బదిలీ లేదా సమ్మేళనాల వల్ల అది కుప్పకూలిపోయి, ‘ఉష్ణ పరమాణు నవ్యోజ్వల తార’ (థర్మోన్యూక్లియర్‌ సూపర్‌ నోవా)గా ఉద్భవిస్తుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ప్రస్తుత శాస్త్రలోకం అనుమానిస్తున్నట్టుగా 70 నుంచి 85 శాతం వరకు అన్ని ‘ఉష్ణ పరమాణు నవ్యోజ్వల తారల’ ఆవిర్భావాలన్నీ ‘ఉప-చంద్రశేఖర్‌ ద్రవ్యరాశుల’తో కూడిన తెల్ల కుబ్జ తారల విస్ఫోటనాలతోనే సంభవిస్తున్నాయి!’’ అని ఆమె అన్నారు.

‘ఉష్ణ పరమాణు నవ్యోజ్వల తారలు’ (Type la) ఖగోళశాస్త్ర అధ్యయనాలలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకొంటున్నాయి. ప్రకాశ (దీప్తి) (luminosity) పరంగా అన్ని ‘బహుళ నక్షత్ర వ్యవస్థ’లలోనూ ‘నాలుగింతల నక్షత్రాల’ కలయిక అత్యల్ప శాతాన్నే వున్నప్పటికీ అవన్నీ అంతటి సూపర్‌ నోవాలుగా విస్ఫోటనాలు చెందితే మాత్రం అది విశ్వంలోనే అతిపెద్ద మొత్తపు భారద్రవ్యరాశిని వెదజల్లగలదని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.