తెలంగాణ రంగులు చూపిన కెమెరా కన్నుభరత్
By: నందిరాజు రాధాకృష్ణ
ఫొటోగ్రఫి, చిత్రకళలో నైపుణ్యం ప్రదర్శించి అనేక అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు పొందిన భరత్ ఒక అలసి సొలసిన జీవి. ఫొటో గ్రాఫర్‌గా జీవితాన్ని ప్రారంభించిన గుడిమల్ల భరత్ భూషణ్ అపురూప చిత్రాలను తీర్చిదిద్దే ఛాయా చిత్రకారుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. భరత్ తెలంగాణలో అరుదైన ఫొటో జర్నలిస్టు, చిత్రకారుడు. చిన్ననాటి నుంచి చిత్రకళ అంటే ఆసక్తి. కాల క్రమంలో ఫొటోగ్రఫీపై ఆసక్తిని పెంచుకుని అద్భుతమైన ఫోటోలతో గొప్ప ఫోటోగ్రాఫర్‌గా ప్రసిద్ధికెక్కారు. ప్రజల జీవన శైలిని, చారిత్రక ఘట్టాలను, సంస్కృతిని ఛాయా చిత్రాల్లో అద్భుతంగా చూపించారు. ఫోటోల ద్వారా బతుకమ్మ సంస్కృతి ప్రపంచానికి తెలియజేసి కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ తెలంగాణగా పేరొందారు. ఫోటోగ్రఫీ అనేది కొందరి వల్ల సిగ్నేచర్ స్టైల్‌గా పేరొందింది. తెలుగునాట సమకాలీన చరిత్రలో అలాంటి ఘనులలో ఒకే ఒక్కడు భరత్ భూషణ్.

ఛాయ చిత్రప్రపంచంలో అయన ప్రభావం బహు విస్తారం. అయనది నిశిత, తీక్షణ దృష్టి.. తక్షణ సాహిత్యం కాకుండా అవశ్య చరిత్రనే లిఖించడం ఆయన ముందు చూపు.. భరత్ భూషణ్‌లో అంతర్వీక్షణం ఎక్కువ. పరిశోధనా నేత్రం ఆయనది.. అందరు ఛాయాచిత్ర గ్రాహకుల మాదిరి పత్రికల్లో వార్తలకు ప్రాముఖ్యం ఇచ్చే ఫొటోలే కాకుండా తన ప్రాధాన్యత తాను బహిర్గతం చేసుకునే వస్తు శైలి అనుసరించారు. తాను చిత్రిస్తున్నది ఒక చరిత్ర అని గ్రహించారు.. తెలంగాణ పెద్ద దర్వాజా, మూసి ఉన్న తలుపులు… ఒక సంక్షోభ వర్తమానంగా ముందే గ్రహించారు… సాంస్కృతిక పునరుజ్జీవనం ధోరణి ఆయన భవిష్యత్ దృష్టి అయినదనడంలో సందేహం లేదు. ఆ, ఫలితమే ఛాయా చిత్ర సర్వస్వమయింది. రేపటి తరానికి అపార సంపదగా రూపుదిద్దుకుంది.
కరువు కాటకాలు, వలసలు, సమస్త విధాలా జీవన విధ్వంసం, వీటి తాలూకు పర్యవసానాలను అయన చిత్రాలు చెబుతాయి. అదే సమయంలో బతుకు పట్ల విశ్వాసాన్ని, జీవన వైవిధ్యాన్ని, అందలి ఈస్తటిక్స్ సహా ఆవిష్కరిస్తాయి. తాగునీరు, సాగునీరుకు కటకటలాడుతున్న ప్రజలు కాగితం బతుకమ్మలతో పండుగ చేసుకోవడం, అందులో తెలంగాణ ఆశ, విశ్వాసాన్ని ఆనాడే గ్రహించారు. బతుకమ్మ పాటను, పండుగను సంబరంగా చిత్రించి రేపటికి చరిత్ర అవుతుందన్న గ్రహింపుతో శ్రద్ధతో పనిచేశారు. మొత్తంగా తెలంగాణ పల్లె జీవితం చక్కగా ఆవిష్కృతమవుతుంది ఆయన చిత్రాల్లో. నిలువెత్తు తెలంగాణ జీవన వ్యాకరణాన్ని అయన గోడల మీది రాతలతో సహా సంక్షిప్తం చేశారు. చెరపలేని చరిత్రకు ఆనవాలు భరత్ భూషణ్ ఫొటోలు.
ప్రత్యేక రాష్ట్ర కాంక్ష, బతుకమ్మ, గ్రామీణుల బతుకు చిత్రాలను, కాళోజీ, చాకలి ఐలమ్మ, తెలంగాణ పల్లెల్లోని గడపలు, బతుకమ్మ ఆట, చారిత్రక ఘట్టాలను ఛాయా చిత్రాలుగా మలిచి ప్రత్యేకత చాటుకున్నారు. బొడ్డెమ్మ, బతుకమ్మ, తెలంగాణ చరిత్ర, మహిళలు ఫోటోలు సహా బతుకు చిత్రాన్ని తన ఫోటోలలో చిత్రీకరించిన ఘనుడు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటుతూ వేలాది ఛాయా చిత్రాలు రూపొందించారు. అందులో.. గొళ్లాలు, కూలిన గోడలు, దర్వాజాలు, ముగ్గులు, వంటింటి వస్తువుల సౌందర్యం కొన్ని మాత్రమే. మన కళ్ల ముందు తెలంగాణ పల్లె జీవితం ఆవిష్కరించిన తీరు అద్భుతం. దైనందిన జీవితమే కాదు, పండుగలు పబ్బాలు, జాతర వైభవాలు కూడా ఆయన కెమెరా కన్ను అద్భుతంగా మలిచింది.








సాంస్కృతిక రంగంలోనే కాదు, సాంఘికంగా, రాజకీయంగా కూడా తెలుగు ప్రజల జీవితాల్లో విడదీయరాని ముద్ర వేసిన ఎంతోమంది వ్యక్తిత్వా లను ఆయన ఎంతో హుందాగా చిత్రించారు. కవి శివసాగర్, నల్ల కలువ టీ.ఎన్.సదాలక్ష్మి, జానపద పితామహులు బిరుదురాజు రామరాజు వంటి వారిని అయన ఎంతో బాధ్యతగా ఫొటోలు తీసిపెట్టారు. సాంఫీుక, రాజకీయ రంగాలకు చెందిన తెలుగు ప్రజల జీవితాల్లో విడదీయరాని ముద్ర వేసిన ఎంతోమంది మూర్తిమత్వాన్ని భరత్ భూషణ్ ఎంతో హుందాగా చిత్రించారు.
తెలుగు జర్నలిజంలో జానపద కళలపై, కుల వృత్తులపై వ్యాసాలు రాశారు. ఒక ఫోటోగ్రాఫర్ పరిశీలన ఎంత నిశితంగా ఉంటుందో తెలియ డానికి మన కంటికి కానరాని ఎన్నో లోతైన అంశాలను వ్యాసాల్లో తడిమి రాయడం విశేషం. హరిజన్, కాంచన సీత, రంగులకల వంటి వెండితెర చిత్రాలకు భరత్ భూషణ్ స్టిల్ ఫోటో గ్రాఫర్‌గా పనిచేశారు. భూషణ్ తీసే ఫొటోలకు ప్రత్యేకంగా క్యాప్షన్లు అవసరం లేదు.. ఎందుకంటే ఆయన ఫొటోలు చూస్తే వాటి భావం మనకు తేలికగా అర్థమవుతుంది. గ్రామీణ నేపథ్యం ఫొటోలుగా కెమెరాలో బంధించారు 1970వ దశకంలో ఫొటోగ్రాఫిక్ వృత్తిలోకి అడుగుపెట్టి, మురళీకృష్ణ దగ్గర ఫొటోగ్రఫీ, పెయింటింగ్ నేర్చుకున్నారు. ‘‘ఉదయం’’ పత్రికలో ఎడిటర్ ఎ.బి.కె. ప్రసాద్‌కి అత్యంత ఆప్తుడై మరింత ప్రోత్సాహం పొందారు. వివిధ తెలుగు, ఇంగ్లీష్ దినపత్రికల్లో ఫొటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు
గుడిమల్ల భరత్ భూషణ్ 1954లో వరంగల్‌లోని ఓల్డ్ బీట్ బజార్లో, గుడిమల్ల అనుసూయ, లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించారు. ఆయనకు భార్య సుభద్ర, కూతురు అనుప్రియ, కుమారుడు అభినవ్ ఉన్నారు. నల్లకుంట పద్మకాలనీలో నివశించారు. భరత్ భూషణ్‌కు తెలుగు నేలయే ‘భారతం’. తెలంగాణయే ప్రపంచం.
మనసు మాదిరి మనిషీ సౌమ్యుడు. నవ్వు చెదరనిగుండ్రటి వదనం, పొడవాటి ఒత్తైన నల్లని జుట్టు. మనిషిలో హడావిడి, ఆత్రం కనిపించవు. అజాత శత్రువే. భూషణ్‌తో నాకు 1984 చివరి నుంచీ ‘‘ఉదయం పాత్రికేయ సహచరుడు. నేను ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నప్పుడు ఇరువురం కలసి వార్తా కథనాల కోసం మైళ్ళకు మైళ్ళు ప్రయాణించాం.. ఆయనకు ఎరుపన్నా, చిక్కని నీలమన్నా, పసుపన్నా చాలా ఇష్టం. ఎందుకలా.. అని అడిగితే మనలో రక్తం ఎరుపు కదా అని, పసుపు మంగళప్రదం అంటారుగా మీలాంటి వారు.. అందుకే పసుపన్నా ఇష్టమే అనేవారు. నీలం చాలా ఇష్టం నింగీ, నేలా, నీరు.. చూడండి నీలం, మేఘం నీలం.. అదీ ఆయన సమాధానం. మా ఇరువురి ఇళ్ళూ దగ్గర కావడంతో అప్పు డప్పుడూ కలిసే వాళ్ళం. ఆయన ‘‘స్టూడియో’’ గదిలో పొడవు, విశాలమైన బల్ల కిరువైపులా కూర్చుని మాట్లాడు కుంటూ అనేక భంగిమల్లో, రంగుల్లో నన్నాయన కెమేరాలో బంధించారు. ప్రెస్ క్లబ్‌లో, ఇతర సాహితీ సభల్లో తరచూ తారసపడుతూ కొద్ది సేపు ముచ్చట్లాడుకున్నాం. అనారోగ్యంతో బాధపడుతూ కూడా దశాబ్దాల పాటు ఫోటోగ్రఫీ రంగంలో ఆయన చేసిన కృషి చెప్పలేనంత గొప్పది.
ప్రపంచంలో మోడ్రన్ ఫోటోగ్రఫీకి ఆద్యుడిగా భావించే ఫ్రెంచ్ హెన్రీ కార్టియర్ బ్రస్సెన్ శైలిని భరత్ అనుసరించారు. ఆయన నుంచే స్ఫూర్తి పొందారు. మూడు దశాబ్దాలుగా కేన్సర్ బారిన పడి కోలుకున్నప్పటికి దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత ఇటీవల క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టింది. దీనికి తోడు ఇతర ఆనారోగ్య సమస్యలు కూడా తీవ్ర మయ్యాయి క్యాన్సర్‌తో కదలలేని స్థితిలో కూడా తాను ఆర్టిస్టుగా నిరంతరం తీరికలేకుండా ఉంటూ వ్యాధిని జయించాలన్న తపనతో పనిచేశారు. కాళోజీ మాదిరి, సురవరం ప్రతాపరెడ్డి మాదిరి దీర్ఘ కాలిక ప్రభావం ఉండేలా చరిత్రను చాటే వారసత్వాన్ని నలుదిక్కులా వ్యాపింపజేశారు. తెలుగు సమాజం పరిణామ క్రమంలో సామా న్యుడి జీవనం కళ్ళకు కడుతుంది.. అనారోగ్యంతో బాధపడుతు భరత్ భూషణ్ (68) జనవరి 31 తెల్లవారుజామున నల్లకుంట పద్మ కాలనీలోని నివాసంలో తుదిశ్వాస విడిచి శాశ్వత సెలవు తీసుకున్నారు.