|

భరత్‌ భూషణ్‌ రేఖా విన్యాసం

భరత్‌ భూషణ్‌ రేఖా విన్యాసంనగరం నడిబొడ్డున రవీంద్ర భారతి ప్రాంగణంలోని ఐసీసీ ఆర్ట్‌గ్యాలరీ తెలంగాణ చిత్రకళారంగానికి సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది.ఎన్నడూ, ఎవరూ ముట్టుకోని ఎవరి కుంచెకూ అందని లోకమది.మరో కోణంలో చెప్పుకోవాలంటే ‘అట్టడుగున పడి కన్పించని మనిషి వెతలవి. తెలంగాణ గ్రామీణ సమాజంలో గొప్ప గౌరవంతో బతికిన కళాకారుల జీవితాలను రేఖలతో నిక్షిప్తంచేసిన చిత్రకళా ప్రదర్శనను రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ అధికారికంగా నిర్వహించింది. మానిషి మాయపోతున్న డమ్మో అని తెలంగాణ ప్రజాకవి అందెశ్రీ వినిపించిన విలాపానికి గుర్తుగా ఈ భాగ్యనగరిలో కొలువు దీరిన ఈ చిత్ర ప్రదర్శన అక్టోబరు 15నుంచి 20వతేదీ వరకు కొనసాగింది. స్పీకర్‌ మధుసూదనాచారి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. సాంస్కృతిక శాఖ కమీషనర్‌ మామిడి హరికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నవతెలంగాణ ఆవిర్భవించిన చారిత్రక విభాతసంధ్యలో రంగులనూ, హంగులనూ కాదనీ ప్రముఖ ఫోటో జర్నలిస్టు, చిత్రకారుడు భరత్‌ భూషణ్‌ ఖరీదైన హైదరాబాద్‌ కళా ప్రపంచానికి భిన్నంగా పరిచయం చేసిన ఈ చిత్రాలు వినూత్నమైనవి.

ఫ్రెంచ్‌లో మాత్రమే ఈ తరహా రేఖాచిత్రకళా సంప్రదాయం ఉన్నది. కే బహుశా తెలంగాణలోనే ఇంకును మాధ్యంగా ఎంచుకుని సన్నని రేఖల మధ్య అట్టడుగు మనిషిని సజీవంగా పట్టుకునే ఈ ప్రయత్నం వినూత్నమైంది. ఇదే తొలిసారి.ఇది ఒక రకంగా నూతన ప్రయోగంగా చెప్పాలి.

యాబై ఏళ్ల క్రితం వరకు గొప్పగా కళాకారులుగా బతికి తెలంగాణ సంస్కృతికీ, భాషకు, జీవనరీతికి అంకితమై వెయ్యేళ్లుగా కొనసాగిన తెలంగాణ ఉపకులాల, కళాకారుల వ్యవస్థ వీరశైవ, వైష్ణవ సంప్రదాయాలకు చెందినది. ప్రస్తుతం అవసాన దశకు చేరుకున్నది. పట్టణీకరణ వల్ల, వలసలవల్ల, కరువు కాటకాల వల్ల అవసాన దశకు చేరుకున్న ఈ కళా ప్రపంచాన్ని నవతెలంగాణకు తనదైన రీతిలో పరచయం చేస్తూ మనల్నీ అప్రమత్తం చేస్తున్నాడు అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) తర్వాత తెలంగాణ సమాజం సాంస్కృతిక రంగంలో ఒక కొత్త మలుపును చవిచూసింది. ఆ కాలంలో పెల్లుబికిన రైతాంగ పోరాటాలు, ఇంద్రవెల్లి సంఘటన వల్ల స్థానిక సమాజం అనేక కుదుపులకు లోనైంది. ఆ క్రమంలో అనేక మంది రచయితలు, కళాకారులు స్థానికతను ఒక తాత్విక భూమికగా మలుచుకున్నారు. సరిగా ఈ సమయంలో తెలంగాణ సామాజిక సాంస్కృతిక రంగంలోకి ప్రవేశించిన రచయిత, చిత్రకారుడు, ఫోటో జర్నలిస్టు భరత్‌ భూషన్‌. ఆనాటి నుంచి ఆయన తెలంగాణ గ్రామీణ సంస్కృతిని, దానికి సంబంధించిన జీవన రీతులను ,కళారూపాలను తన కెమెరాలో బంధించిన కళాకారుడు భరత్‌ భూషన్‌. వృత్తి రిత్యా ఫోటో జర్నలిస్టు అయినా ప్రవృత్తి మాత్రం కళాసృజనే. చిన్న నాటినుంచి తెలంగాణ గ్రామీణ కళా ప్రపంచం మీద మక్కువ పెంచుకున్న భరత్‌భూషన్‌ వారి జీవితాలను అధ్యయనం చేయడాన్ని ఒక వ్యాపకంగా మలుచుకున్నారు. మొత్తం తెలంగాణలోనే వారికి సంబంధించిన కళా రూపాలపై సాధికారికంగా మాట్లాడగలిగే నలుగురైదురు వ్యక్తులలో ఆయన ఒరు. ఒక రకంగా ఆయన దశాబ్దాల అధ్యయనానికి నిదర్శనంగా ఈ రేఖా చిత్రాలు నిలుస్తాయి.